ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ‘సుభిక్ష’

పేదరైతు కుటుంబాల్లో ఆశాదీపం వెలిగిస్తున్న టెకీలు...;

Update: 2025-07-02 10:58 GMT
‘ ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి సాయం లేదు. వితంతు పించన్‌ లేదు. ఇందిరమ్మ ఇల్లు కూడా లేదు... అద్దె ఇంట్ల ఉంటున్న. ’ అంటున్న స్వరూప(పంజాగుట్ట తాండ, సిద్దిపేట జిల్లా )

గుగులోతు రాజు సన్నకారు రైతు. తన 2 ఎకరాల్లో వర్షాధారం మీద పత్తి పండిస్తున్నాడు. సకాలంలో వానలు లేక పెట్టిన పెట్టుబడి కూడా వచ్చేది కాదు. బోర్లు వేసినా నీళ్లు పడలేదు.

మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని నష్టాల నుండి బయటపడదామనుకున్నాడు. పంట పెట్టుబడి పెరిగి పోయింది. అప్పులు చేయడం మొదలు పెట్టాడు. తెలిసిన బంధువులు దగ్గర అప్పులు చేసినా పంటలు పండక నష్టం వచ్చింది. అప్పులిచ్చిన వారు వెంట పడ్డారు. అవమానాలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు.

‘అలా అప్పుల పాలై ఐదేళ్ల క్రితం నా భర్త మాకు దూరమయ్యాడు.

ఇంటికి పెద్దదిక్కు లేని బాధకు తోడు, ఇద్దరు పిల్లలు, ఆయన చేసిన అప్పులు భారం నా మీద పడిరది. ఈ కష్టాలు తట్టు కోలేక కొన్నిసార్లు సచ్చిపోవాలనిపించింది. బిడ్డలు గుర్తుకు వచ్చి ఆగిపోయాను. ప్రతీ రోజూ కూలీకి వెళ్లక పోతే పూట గడవదు. అలాగే పిల్లలను పోషించుకుంటున్నా... అన్నారు రాజు భార్య స్వరూప. సిద్ధిపేట జిల్లా, అక్కన్నపేట మండల్‌ , పంజాగుట్ట తాండలో ఆమెను కలిసినపుడు తన కష్టాలు చెప్పుకున్నారు.ఆమెనే కాదు, జనగామ జిల్లాలో మరో 40 మంది ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు జీవనోపాధులు లేక అనేక కష్టాలకు లోనవ్వడం చూశాం.

‘ తెలంగాణలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.6లక్షలు నష్టపరిహారం ఇస్తారు. దానిలో కొంత రైతులు చేసిన అప్పులు తీర్చడానికి కేటాయిస్తారు. అయితే ఈ నష్టపరిహారం పొందాలంటే చాలా నిబంధనలున్నాయి. దాని వల్ల ఎక్కువ శాతం కుటుంబాలకు ప్రభుత్వ సాయం అందడటం లేదు.’ అన్నారు సుభిక్ష అగ్రి ఫౌండేషన్‌ ప్రతిని ఉమేష్‌.

రైతు కుటుంబాలను కలిసి సమస్యలు తెలుసుకుంటున్న సుభిక్ష ప్రతినిధులు సాగరిక, ఉమేష్‌

సుభిక్ష తరుపున స్వరూపకు ఒక పాడి ఆవును అందచేశారు. దాని వల్ల ఆమె కొంత ఆదాయం పొందుతున్నారు. ఆమె బిడ్డల చదువుకు కూడా వీలైనంత సహాయం చేస్తున్నారు.

ఈ ‘ సుభిక్ష ’ ఎలా మొదలైంది 

రైతు ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం పరిస్ధితి ఏమిటి? వారికి సామాజిక భద్రత కల్పించి,ఆ రైతు కుటుంబాలకు సంపూర్ణ జీవనాధార మద్దతు అందించి, వారిని పేదరికం నుండి బయట పడేలా చేయడమే ప్రధాన లక్ష్యంగా 2016లో సుభిక్ష అగ్రి ఫౌండేషన్‌ ఏర్పాటు అయింది.

‘ఒక పేదరైతు ఆత్మహత్య వరకు వెళ్తున్నాడంటే ఎంత బలమైన కారణాలు ఉంటాయో తెలుసుకుంటాం. రైతు కుటుంబాల అభివృద్ధి కోసం ప్రభుత్వం అందించే పథకాలు వారికి అందేలా కార్యాచరణ , రైతు బిడ్డల విద్య, ఆరోగ్య పరిరక్షణ, నిరంతర పర్యవేక్షణకు మేము కట్టుబడి ఉన్నాం. రైతు ఆత్మహత్యల బారిన పడిన లేదా అత్యంత పేద కుటుంబాలకు మా సంస్ధ అండగా ఉంటుంది. వారికి తెలిసిన జీవనోపాధిని పొందడానికి మేం ఆర్ధిక సాయం చేస్తాం. వారికి మానసిక స్ధయిర్యం కలిగించడాని ప్రతీనెల సమావేశం నిర్వహించి వారి కష్టసుఖాలు తెలుసుకొని నైతిక మద్ధతు ఇస్తాం. 3 ఏండ్ల వరకు ఆ కుటుంబం స్థిరపడేలా సహకరిస్తాం. ’ అన్నారు సుభిక్ష అగ్రి ఫౌండేషన్‌ డైరెక్టర్‌ నరేందర్‌ గరిడి.

‘ రైతు కుటుంబాలకు సుస్ధిర జీవనోపాధులు కలిగించడం కోసమే మేం పని చేస్తాం’ - నరేందర్‌ సుభిక్ష డైరెక్టర్‌ ,తెలంగాణ

ఆయన మిత్రుడు, ఈ సంస్ధ వ్యవస్థాపకుడు రాంబాబు వర్జినేని కలిసి రైతుల కోసం పనిచేస్తున్నారు. వీరిద్దరు వ్యవసాయ కుటుంబాల నుండి వచ్చిన వారే . చిన్నప్పటి నుండీ సాగు కష్టాలను చూస్తూ ఎదిగారు. విదేశాల్లో సాఫ్ట్‌ వేర్‌ కంపెనీలలో పనిచేశారు. పదేళ్ల క్రితం నరేందర్‌ హైదరాబాద్‌ వచ్చేసి డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టుల మీద పనిచేస్తున్నారు.

రైతుల కుటుంబాల జీవనోపాధుల కోసం పశుపోషణకు, పిండిగిర్ని,కిరాణా షాపుల నిర్వహణకు ఆర్ధిక తోడ్పాటునివ్వడమే కాక, వారి బిడ్డల స్కూల్‌ ఫీజులకు సాయం, కెరీర్‌ కౌన్సిలింగ్‌ కి తోడ్పడుతున్నారు. వీలైనంత వరకు మహిళల నైపుణ్యాలు పెంచి వ్యాపార వేత్తలుగా తీర్చి దిద్దడానికి ప్రయత్నం చేస్తారు. దీనిలో భాగంగా ముగ్గురు మహిళలు జనగామలో మిల్లెట్‌ సెంటర్‌ ను నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.

‘ సుభిక్ష ’ సహకారంతో పశుపోషణలో జీవనోపాధులు పొందుతున్న నునావత్‌ అంబలి 'రాళ్ల బాయి తండాలో' (జనగామ) 

రైతుల ఆత్మ హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? 

గత 5 సంవత్సరాలో తెంగాణలో (2020-2025): సుమారుగా 2,000-2,500 రైతు ఆత్మహత్యలు జరిగినట్లు కొన్ని నివేదికల అంచనా.

ఆత్మహత్యలకు ప్రధాన కారణాలు అప్పుల భారం, పంట దిగుబడులు తగ్గిపోవడం,

సాగునీటి సమస్యలు, ముఖ్యంగా భూగర్భ జలాలు అడుగంటడం.

దీని వల్ల బోర్లు వేయడం కోసం ఎక్కువ మంది రైతులు అప్పులు భారిన పడాల్సి వస్తుంది.

సర్కారు సంక్షేమ పథకాలు సరిగ్గా అమలు కాకపోవడం, రుణమాఫీ స్కీమ్‌ పూర్తిగా నెరవేరకపోవడం వల్ల ఈ మరణాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

‘ దేశానికి అన్నం పెట్టే కష్టజీవి బలవంతంగా ప్రాణం తీసుకుంటున్నాడంటే, ఎంత దారుణమైన పరిస్థితులున్నట్టు?’ 'నీలిమ కోట, జర్నలిస్టు,పరిశోధకురాలు

ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యం

‘ దేశానికి అన్నం పెట్టే కష్టజీవి బలవంతంగా ప్రాణం తీసుకుంటున్నాడంటే, ఎంత దారుణమైన పరిస్థితులున్నట్టు! అలాంటి వారి కోసం విధానాలు రూపొందించే ప్రభుత్వ యంత్రాంగానికి అసలు కారణాలు మీద దృష్టి పెట్టరు. అప్పుల బాధలు, బాధ్యతలను వదిలేసి ఆత్మహత్యతో రైతులు సాంత్వన పొందితే వాటన్నిటినీ నెరవేర్చేది చనిపోయిన రైతుల భార్యలు, తల్లులే. రైతు చేసిన అప్పులు తీర్చి, పిల్లలకు చదువులు చెప్పించి, పెళ్లిళ్లు చేసి జీవనాన్ని వెళ్లదీస్తున్నారు. ’ అంటారు, స్వతంత్ర పరిశోధకురాలు, రచయిత్రి నీలిమ కోట. రైతుల ఆత్మహత్యల మీద ‘ విడోస్‌ ఆఫ్‌ విదర్భ’ అనేపుస్తకం ఆమె రాశారు..పద్దెనిమిది మంది రైతమ్మల జీవితం అది. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా జీవితాన్ని లీడ్‌ చేస్తు, ఎక్కడా ఆత్మగౌరవాన్ని కోల్పోకుండా ధైర్యంగా నిలబడ్డ వాళ్ల కథలు చాలా స్ఫూర్తివంతంగా ఉంటాయి.

ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకున్నాను, ఇపుడు జీవితం స్ధిర పడ్డాను 

జనగాం లో కిరాణా షాపు నిర్వహిస్తున్న మంగమ్మ కథ కూడా అందరు రైతుల కథ లాంటిదే... 8 ఏండ్ల క్రితం అప్పుల పాలైన భర్త హరిలాల్‌ దూరం అయ్యాక ఇద్దరు పిల్లలు , చుట్టూ అప్పులతో ఆమెకు భవిష్యత్‌ అంతా అంధకారంగా కనిపించింది.

‘ ఎన్నోసార్లు చచ్చిపోవాలనుకున్నాను. ‘సుభిక్ష’ ధైర్యాన్ని ఇచ్చింది’ - మంగమ్మ,జనగామ

అనేక సార్లు తను కూడా ఆత్మహత్య యత్నం చేసింది. ఒక సారి పురుగుల మందు, కూల్‌ డ్రిరక్‌ బాటిల్‌ తెచ్చుకొని ఇంట్లో దాచుకొంది . ఇది గమనించిన బంధువులు ఆమెకు ధైర్యం చెప్పి కాపాడారు. అయినప్పటికీ ఆమెకు ఇంట్లో పెద్ద దిక్కు లేక కుటుంబాన్ని ఎలా పోషించాలో సతమతమవుతున్నపుడు సుభిక్ష సంస్ధ వాలంటీర్‌ సాగరిక వచ్చి ఆమెకు భవిష్యత్‌ పట్ల ఆశను కలిగించింది. కిరాణా షాపు నిర్వహించుకోవడానికి సంస్ధ ద్వారా ఆర్ధిక సాయం అందించింది. దానికి తోడు పిండిగిర్ని కూడా సమకూర్చింది. వాటిని నిర్వహిస్తూ వచ్చిన ఆదాయంతో సొంతంగా చికెన్‌ దుకాణం కూడా నిర్వహిస్తోంది మంగమ్మ. తనే స్వయంగా చికెన్‌ కొట్టి విక్రయస్తుంది. అలా వచ్చిన ఆదాయంతో కూతురు వివాహం చేసింది. కొడుకు హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. జీవితంలో ఒక స్ధిరత్వం వచ్చింది. త్వరలో ఒక మిల్లెట్‌ స్టోర్‌ని ఓపెన్‌ చేసి వ్యాపార వేత్తగా మారబోతుంది. దీనికి కూడా సుభిక్ష వారు సహకరిస్తున్నారు. ఇదంతా ’ సుభిక్ష ’ సంస్ధ సభ్యులు ఇచ్చిన ఆత్మవిశ్వాసమే అంటుంది మంగమ్మ.

జనగామ ప్రాంతంలో మేం కలిసిన నిర్మల, మరో ఇద్దరు మహిళలు కష్టాల నుండి వెలుగుబాట వైపు అడుగులు వేయడం చూశాక, వాళ్లకున్నంత ఆత్మవిశ్వాసం నగరాల్లో ఉద్యోగాలు చేసే ఆధునిక స్త్రీలకు కూడా ఉండదనిపిస్తుంది.

‘ బ్యాంకులు మాకు రుణాలివ్వవు, విత్తనాలు, ఎరువుల కోసం వెతుక్కోవాలి. వ్యవసాయంలో భర్తకు ఉన్న అనుభవం మాకు ఉండదు, - నిర్మల, జనగామ

‘ వీరంతా అతి సామాన్య స్త్రీలు. పెద్దగా చదువు లేదు.. బయటి ప్రపంచం తెలియదు.. ఆర్థిక అండలేని వాళ్లు.. అయినా వాళ్లు జీవతాన్ని నెట్టుకొస్తున్నారు. వాళ్ల భర్తలు లాగే వారు కూడా బలవన్మరణాలు పాలైతే వారి బిడ్డల పరిస్ధితేంటి ? ఇపుడిలా ఉండేవారా.. ’ అని అంటోంది వాలంటీర్‌ సాగరిక. ఆమె రోజూ, జనగాం,సిద్ధిపేట జాల్లాలో రైతు కుటుంబాలను కలుస్తూ వారికి అవసరమైన సాయం వారి పిల్లల చదువుకు ఆర్ధిక తోడ్పాటును సుభిక్ష తరపున అందిస్తుంటుంది.

తెలంగాణలోనూ రైతుల ఆత్మహత్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ సమస్యలను సర్కారీ కోణం నుండి చూస్తే ఒకలా, జర్నలిస్టుగా చూస్తే మరోలా కనిపిస్తాయి. క్షేత్రస్ధాయిలో ప్రజలను కలుసుకున్నపుడే, అసలు వాస్తవాలు తెలుస్తాయి.

ఒకటి రెండు సమస్యలతో రైతు ఆత్మహత్య చేసుకోవచ్చు. కానీ భర్తను కోల్పోయిన ఆ భార్య వందల సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆమె పేరున భూమి ఉండదు. తన పేరున మార్చుకోవడానికి నిర్మల రెండేళ్లు అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చింది.

సిద్ధిపేట, జనగామలో రైతమ్మలను కలిసిన ఫెడరల్‌ తెలంగాణ ప్రతినిధి.

‘ బ్యాంకులు మాకు రుణాలివ్వవు, విత్తనాలు, ఎరువుల కోసం వెతుక్కోవాలి. వ్యవసాయంలో భర్తకు ఉన్న అనుభవం మాకు ఉండదు, ఇలాంటి సమస్యలను ఎదుర్కొంటూ బిడ్డలను చదివిస్తూ వారి భవిష్యత్‌ పట్ల ఆశతో బతుకుతున్నాం...’ అన్నారు నిర్మల, గేదెలకు గడ్డి వేసి పాలు పితుకుతూ ...

గత ఐదేళ్లలో సుభిక్ష ఫౌండేషన్‌ కృషి వల్ల 250 కి పైగా రైతు కుటుంబాలు లబ్ది పొందాయి. 600 సభ్యులు పరోక్షంగా లాభం పొందారు. 90 కుటుంబాలు స్ధిరమైన జీవనోపాధులు పొందాయి.

Tags:    

Similar News