మగువల మనసు దోచే లక్కగాజులు!
చుడీ బజార్‌లో గాజుల గల గల;
హైదరాబాద్ అంటే ఎవరికైనా గుర్తొచ్చేది 400 యేళ్ల నాటి చార్మినార్. హైదరాబాద్ మహిళలకు మాత్రం చార్ మినార్ అనే మాట వినపడగానే గుర్తొచ్చేది ఆ పక్కనే ఉండే లాడ్ బజార్. పండగలకు,పబ్బాలకేకాదు,పెళ్లి సందర్భాలొచ్చినా కులమతాలతో నిమిత్తం లేకుండా హైదరాబాద్ మహిళలంతా తప్పని సరిగ్గా సందర్శించే బజార్ లాడ్ బజార్. లాడ్ బజార్ ముస్లిం పండలకు కిటకిట లాడుతుంది. హిందూ ఫెస్టివల్స్ కిటకిటలాడుతుంది. కారణం ఈ బజార్ మహిళలకు ఇష్టమయిన గాజుల బజార్ కావడమే. ఏ రంగు చీరకు ఆ రంగు గాజులను కొనేవారు చాలా మందే ఉన్నారు. అందుకే మనసుకు నచ్చిన గాజులను కొనేస్తుంటారు. చుడీ బజార్‌లో గాజులను చూడగానే చేతులకు వేసుకోవాలని అన్నంతగా మురిపిస్తాయి. మహిళలకు గాజులను విడదీయలేని సంబంధం ఉంటుంది. పెళ్లైన వారే కాదు.. పెళ్లి కాని అమ్మాయిలు సైతం రంగు రంగుల్లో ఉండే మనసైన గాజులను డజన్లకు డజన్లు కొనేస్తుంటారు. పెళ్లిళ్లు. ఫంక్షన్లు వచ్చినప్పుడు.. ఆ చీరకు లేదా డ్రెస్ కు మ్యాచ్ అయ్యే గాజులను వేసుకుని మురిసిపోతుంటారు. స్త్రీలు ఆభరణాలపై, పట్టుచీరెలపై ఎంత మక్కువ చూపిస్తారో, గాజులపై అంతే మక్కువ చూపిస్తారు.
లాడ్ బజార్ చరిత్రపై ప్రజలకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. హైదరాబాద్ స్థాపకుడు సుల్తాన్ ముహమ్మద్ కులీ కుతుబ్ షా తన కుమార్తె వివాహానికి మార్కెట్‌ను స్థాపించాడని స్థానికులు చెబుతుంటారు. కులీ కుతుబ్ షా తన ప్రేయసీ భాగమతికి లాడ్ బజార్ గాజుల్నే గిఫ్ట్ గా ఇచ్చేవాడని చెప్పుకుంటారు. కుతుబ్‌షాహీల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గాజులను అప్పట్లో కేవలం మహారాణులు మాత్రమే ధరించేవారు. నేడు సామాన్యులకు కూడా చేరువయ్యాయి. ప్రత్యేకించి హైదరాబాద్ సందర్శించే పర్యాటకులు వీటిని కొనకుండా వెళ్లలేరు. పెళ్లైనా, పేరంటమైనా ఇక్కడికి వచ్చే గాజులను కొనుగోలు చేస్తామని కొనుగోలుదారులు అంటున్నారు. ఇంతటి ఖ్యాతి పొందటం వెనక ఇక్కడ పని చేసే హస్త కళాకారుల పాత్ర ఎంతో ఉంది. లక్క గాజులు తయారీపై ఆధారపడి 10 వేల కుటుంబాలు బతుకుతున్నాయి. ఈ పురాతన లాడ్ బజార్ కిలోమీటరు పొడవున్నమార్కెట్. కుతుబ్ షాహీల కాలం నుండే జనాదరణ పొందింది.
ప్రస్తుతం 300 కి పైగా షాపులు ఉన్నాయి. లాడ్ బజార్ లోకి కొత్త కొత్త మోడల్స్ లల్లో గాజులు వస్తున్నాయి. ఇక పండగొస్తే మహిళల చేతులకు పక్కాగా గాజులుండాల్సిందే. మరి మగువల సున్నితమైన చేతులకు చక్కగా ఉండే గాజులకు కేరాఫ్ అడ్రస్ లాడ్ బజారే. ఇక్కడ దొరికే ‘లక్క గాజులంటే’ అమ్మాయిలకు తెగ ఇష్టం. ఏరికోరి ఎంత డబ్బైనా సరే వీటినే కొంటుంటారు. ఈ గాజులను లక్కతో తయారు చేస్తారు. ఈ లక్కను లాడ్ అని కూడా అంటారు. అందుకే ఈ గాజులను లాడ్ బజార్ గాజులు అని కూడా పిలుస్తారు.ఈ గాజులు చార్ మినార్ పరిసర ప్రాంతాల్లో అమ్ముతారు కాబట్టి దానికి లాడ్ బజార్ అనే పేరు కూడా వచ్చింది. హైదరాబాద్‌లో మొదటగా హలీమ్‌కు భౌగోళిక గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత లక్క గాజులకు ఆ ఘనత దక్కింది. ఈ ప్రాంతానికి గాజుల జీఐ ట్యాగ్ రావటం వల్ల వీరందరికీ గుర్తింపు వచ్చినట్లయింది. ఇక్కడి నుంచే దేశ విదేశాలకు లక్క గాజులను ఎగుమతి చేస్తున్నామని చార్మినార్ గాజులు ఇంతటి ప్రసిద్ధి చెందటం సంతోషంగా ఉందని వ్యాపారులు అంటున్నారు.
ఒక్కో దుకాణాదారు నెలకు 50 వేల నుంచి ఐదు లక్ష రూపాయలకు పైగా సంపాదిస్తారట.ఈ గాజులను సమీపంలోని వర్క్‌షాప్‌లలోని కళాకారులు చేతితో తయారు చేస్తారు. లక్క రెసిన్ నుండి వస్తుంది, దీనిని కొలిమిపై కరిగించి వృత్తాకారంలో అచ్చు వేస్తారు, తరువాత స్ఫటికాలు, పూసలు లేదా అద్దాలతో అలంకరిస్తారు. లెపాక్స్ ఆర్, లెపాక్స్ ఎక్స్ రసాయనాల్ని వెల్‍కమ్ పౌడర్‍లో కలిపి చపాతీల పిండిలా తయారు చేస్తారు. ఆ మిశ్రమాలను అల్యూమినియం రింగుకు అతికిస్తే గాజు తయారవుతుంది. గాజు మీద కావల్సిన డిజైన్లలో రాళ్లు, కుందన్లు, చమ్కీలు, చైన్లు అతికిస్తున్నారు. కుందన్స్ అతికించడం వంటి అలంకరణ అంతా అయిన తర్వాత గాజుల స్టాండుకు తగిలించి ఆరు గంటల సేపు ఆరనివ్వాలి. లక్క గట్టి పడి రాయిలా మారుతుంది. ఇక ఆ గాజు పగలదు, విరగదు. ‘ఫర్నెస్’లో ముడి గాజును బాగా కరిగే వరకు వేడిచేసి అందులో ఒక గొట్టంను ముంచి బయటకు తీస్తారు.
గొట్టం చుట్టు కరిగిన గాజు స్తూపాకరంగా ఏర్పడుతుంది. ఇలా ఏర్పడిన స్తూపాకారవలయ గాజును గొట్టం మీద వుండగానే, గాజు గట్టిపడకముందే నెమ్మదిగా కొట్టి సమ ఆకారంగా, తిమ మందంగా, వుండేటట్లు చేస్తారు.అంచులను దగ్గరిగా చేర్చీ అతికించిన గాజుల జాయింట్లను మరియొక సారి వేడిచేసి, ఏమైన తేడాలుంటే సరిచేసి, గాజు అన్ని వైపుల నుండి సమానంగా కన్పించేలా చెస్తారు. ఈ పనికూడా ఎక్కువగా మహిళ కార్మికులే చేస్తారు.)హైదరాబాద్ లోని ప్రసిద్ధ బ్యాంగిల్ మార్కెట్ ఇది. మెరిసే లక్క గాజులకు ప్రసిద్ధి చెందింది.లాడ్ అంటే లక్క అని అర్థం. దీనిని గాజులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. దానిపై కృత్రిమ వజ్రాలు పొదిగిస్తారు. స్టోన్స్, ముత్యాలు, ఆభరణాలు మరియు వెండి సామాగ్రి, నిర్మల్ , కలంకారి పెయింటింగ్స్, బిద్రి సామాగ్రి , రాళ్ళతో పొదిగిన లక్క గాజులు, చీరలు మరియు పట్టు మరియు పత్తితో తయారు చేసిన చేతితో నేసిన వస్త్రాలు వంటి ఉత్పత్తులకు ప్రసిద్ధి చెందింది.
బేరసారాలు ఈ మార్కెట్‌లో ఒక భాగం. దుకాణదారులు దుకాణం ప్రవేశద్వారం వద్ద ఒక ఉద్యోగిని ఉంచి, బాటసారులను తమ దుకాణంలోకి ప్రవేశించమని సైగ చేస్తారు.చుడీ బజార్ లో మట్టిగాజుల నుంచి, మెటల్ గాజుల వరకు వెరైటీ రంగుల్లో లభిస్తాయి. అందులోనూ ఇవి మరీ ఎంత ఖరీదైనవో అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇక్కడ గాజులు కేవలం 5 రూపాలయ నుంచి 15 వేల రూపాయల ఖరీదైన గాజులు కూడా అందుబాటులో ఉంటాయి. లక్క గాజులకున్న డిమాండ్ మరే గాజులకు ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే లక్క గాజులు ఎన్నటికీ వన్నె తగ్గవు. మెరుపును కోల్పోవు. అవి పగిలిపోయేంత వరకు కొత్తవిగానే కనిపిస్తాయి. అందుకే ఈ గాజులంటే ఆడవారికి తెగ ఇష్టం. ఇలాంటి గాజులు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ కూడా దొరకవు.