మూడు రోజుల తెలంగాణ గ్రామ జీవనం
జగిత్యాల జిల్లా కొండగట్టు నుంచి మల్యాల దాకా గ్రామీణ విజ్ఞానయాత్ర;
జీవితాన్ని ఆనందంగా, సంతృప్తిగా గడపడమనేది ప్రయాణాల వల్ల వస్తుంది. ఒకసారి విశాల ప్రపంచంలోకి ప్రయాణించాక ఈ విశాల విశ్వంలో మనం అణువంత అనే జ్ఞానోదయం కలుగుతుంది. దానితో జీవితం పట్ల ఒక సానుకూల ( పాజిటివ్ ) దృక్పథం ఏర్పడుతుంది. ప్రయాణాలు పలు రకాలు. ఆధ్యాత్మికం అంటే పుణ్యక్షేత్రాలు దర్శించడం, చారిత్రకం అంటే అంటే చారిత్రక ప్రదేశాలను చూడడం, ప్రాకృతికం అంటే నేను చెప్పే అర్థం ప్రకృతిలో పరవశించడం. కొండలు, కోనలు, నదులు, జలపాతాలు, సముద్రాలు, అడవుల్లోకి పోయి అమాయకులైన ఆదివాసీలను కలవడం, గ్రామాల్లోకి పోయి స్వచ్ఛమైన గ్రామీణులతో గడపడం లాంటివి మరచిపోలేని అనుభూతులను మిగిలిస్తాయి.
గ్రామాల్లోకి కాలినడకన పోయి, గ్రామీణులను కలిసి వారితో ముచ్చటించే అవకాశం నాకు "పల్లె సృజన సంస్థ" వల్ల కలిగింది. చాలారోజుల కిందట ఆ కార్యక్రమాల గురించి పేపర్లో చదివినప్పుడే నాకు చాలా ఆసక్తి కలిగింది. రెండేళ్ళ కిందట అనుకుంటాను వాళ్ళ కార్యక్రమ బ్రోచర్ ను వాట్సాప్ గ్రూప్ లో చూసి వాళ్ళకు ఫోన్ చేసి నేనూ వస్తానని చెప్పాను. కానీ అప్పుడు ఆ కార్యక్రమం వాయిదా పడిందని, తర్వాత మళ్ళీ తెలియజేస్తామని చెప్పారు. ఆ తర్వాత నాకు వెళ్ళడానికి వీలుకాలేదు. ఈ మధ్య వాళ్ళ కార్యక్రమానికి సంబంధించిన బ్రోచర్ నా కళ్ళలో పడింది. "మీకు ఆసక్తి వుందన్నారు కదా? వస్తారా?"అంటూ లక్ష్మీ కావుల ఫోన్ చేసి అడిగారు.
గ్రామంలో వృద్ధుడిని సన్మానించిన బ్రిగేడియర్ గణేషం గారు.
బ్రిగేడియర్ పోగుల గణేశం గారు" పల్లె సృజన" స్వచ్ఛంద సేవా సంస్థను 2005లో స్థాపించారు. గ్రామాలలో వున్న సృజనాత్మకతను వెతికి, వెలికి తీసి సమాజానికి తెలియజేయడమే సంస్థ ప్రధాన లక్ష్యం. మరుగున పడుతున్న గ్రామాల్లోకి కాలినడకన వెళ్ళి వాళ్ళతో మమేకమై వాళ్ళలోని సృజనాత్మకతను కనిపెట్టి, అలాంటి సృజనకారులను (innovators) గౌరవించి, వాళ్ళ శ్రమ వృథా కాకుండా వాళ్ళకు అన్నివిధాలుగా బాసటగా వుండి, వాళ్ళు కనిపెట్టిన ఆవిష్కరణలను సమాజానికి తెలియజేస్తున్నారు. తల్లి కష్టాన్ని చూడలేక మల్లేశం ఆవిష్కరణ అయిన ఆసు యంత్రాన్ని పేటెంట్ హక్కులు ఇప్పించి ప్రజలకు ముఖ్యంగా చేనేత వృత్తికారులకు అందుబాటులోకి తెచ్చింది పల్లె సృజననే.. ఇది మచ్చుకు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివెన్నో వున్నాయి.అందులో భాగంగా ఏడాదికి రెండు శోధయాత్రలు, నాలుగు చిన్నశోధనయాత్రలు నిర్వహిస్తారు. నేను వెళ్ళింది 53 వ. చిన్నశోధయాత్రకు.
53వ పల్లె సృజన చిన్న శోధయాత్ర
జూన్ 27, 28, 29 మూడు రోజులు చిన్నశోధయాత్ర. మొదటి రోజు ఉదయం 8 గంటలకు కొండగట్టు గ్రామంలో రిపోర్టు చేయాలి. మొదటిరోజు కొండగట్టు నుంచి మొదలై మూడో రోజు సాయంత్రం మల్యాల క్రాస్ రోడ్డు వద్ద యాత్ర ముగుస్తుంది.మూడు రోజుల్లో మొత్తం పన్నెండు గ్రామాలు సందర్శించాలి. సుమారు 40 కిమీ నడక. నేను, లక్ష్మి ముందు రోజు రాత్రి JBS లో బస్ ఎక్కి సరైన సమాచారం లేకపోవడం వల్ల మేము మల్యాల క్రాస్ రోడ్డులో దిగాం. అక్కడ టీ కొట్టు దగ్గర ఒక అమ్మాయి ఫోనులో మాట్లాడుతూ కనిపించింది. ఆమె మాటలను బట్టి ఆమె ఏదో బాధలో వున్నట్లు నాకర్థమైంది.
స్త్రీల గురించి పనిచేస్తున్న అనుభవంతో మెల్లగా మాట కలిపాను. ముగ్గురం కలిసి టీ తాగాం. చాలా మంది ఆడపిల్లలకు లాగానే ఆమెకూ భర్తతో బాధలు ఉన్నాయి. తన పేరు వైష్ణవి. అత్తగారి వూరు కొండగట్టు. తల్లిగారి వూరు మల్యాల.అక్కడ బస చేయడానికి ఏ సదుపాయాలు ఉండవని తెలిసి మేం ముగ్గురం మరో బస్ లో కొండగట్టు చేరుకున్నాం. అక్కడినుంచి వైష్ణవి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మేం కొండగట్టులో బస చేసాము. ఆర్గనైజర్ అఖిల, శ్రీవల్లి, పూజిత, భాను అనే అమ్మాయిలు, కొందరు అబ్బాయిలు కూడా అక్కడ కలిసారు.
కొండగట్టు గ్రామంలో మొదటి రోజు ఉదయం అల్పాహారం తర్వాత తొమ్మిదిగంటలకు పరిచయాల అనంతరం నడక మొదలైంది. దాదాపు 30 మంది దాకా పాల్గొన్నారు. అందులో తొమ్మిదేళ్ళ పిల్లల నుంచి
70 యేళ్ళ వయసు వాళ్లు ఉన్నారు. యువతీయువకులు పాల్గొనడం శుభపరిణామం. మొత్తం ఏడుగురు మహిళలున్నారు. ముందుగా మేము వడ్డెర వృత్తి ( రాళ్ళు కొట్టే పనిచేసే వాళ్ళు ) వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. ఒక ఖాళీ స్థలంలో ఒకచోట పెద్దపెద్ద బండరాళ్ళు పోగేసి వున్నాయి. ఒక వ్యక్తి ఒక మోస్తరు రాయిని పగులకొడుతూ కనిపించాడు. అతనిపేరు హనుమంతు. భవన నిర్మాణ పునాదులకు అవసరమయ్యే గ్రానైట్ రాళ్ళను ఎలా పగులగొట్టాలో మాకు వివరించాడు. ఆయన చెస్సిన సూచనల మేరకు మాలో కొంతమందిమి ప్రయత్నించాము. ఐదారుగురు ప్రయత్నిస్తే గానీ రాయి పగలడానికి సిద్ధం కాలేదు. అంటే పట్న వాసులు ఏడెనిమిది మంది కలిసి చేసే పనిని హనుమంతు ఒక్కడే చేస్తున్నాడని అర్థమై ఆశ్చర్యపోయాను. స్లాబ్ కు ఉపయోగించే కంకరను (చిన్నచిన్న రాళ్ళు ) మహిళలు పగులకొడతారట. పక్కన వున్న క్వారీలో చాలామంది పనిచేస్తున్నారని చెప్పాడు. ఒక్కరికి రోజుకు ₹ 250/ కూలీ. క్వారీలో 15 మంది పనిచేస్తున్నారని చెప్పాడు. హనుమంతు మామ వృద్ధుడు కావడం వల్ల ఆయన పని చేసుకోవడానికి వీలుగా కొన్ని బండరాళ్ళను ఆ గ్రౌండ్లో వుంచారట.
35 బర్లకు యజమాని బక్కన్న
మళ్ళీ మేం నడక మొదలు పెట్టాం. కోటిపల్లి దరిదాపుల్లో ప్రత్యేకమైన డ్రెస్ తో ఒక వ్యక్తి బర్లను తోలుకుంటూ వస్తున్నాడు. ఆయనను ఆపి కాసేపు ముచ్చటించాము. ఆయన పేరు బక్కన్న. 70 ప్రాంతంలో మస్కట్ పోయి కొన్నేళ్లు అక్కడ పనిచేసాడు. అతడు ప్రస్తుతం వేసు కున్న డ్రెస్ అక్కడి పని యూనిఫాం. ఆయన పంపిన డబ్బుతో అతని భార్య రెండు బర్లను కొన్నది. అవి ఈనాడు 35 పైగా అయ్యాయి. మగవి పుడితే అమ్మేస్తారట. వయసు మీదపడటంతో సాంతూరికి వచ్చేసాడు. భార్య వద్దని వారించినా కష్టపడ్డ కాయం కనుక ఊరికే వుండలేక బర్లను కాస్తున్నానని చెప్పాడు. అలా నడుస్తూ ముత్యంపేట గ్రామానికి చేరుకున్నాం. ముందుగా కనిపించిన రజితతో మాట్లాడాను. ఆమె బీడి కార్మికురాలు. బీడీలు చేయడంలోని సాధక బాధకాలు చెప్పింది. అయినా ఆ పని చేయకుంటే యిల్లు గడవని పరిస్థితి. తన ఫోన్ నంబర్ కూడా యిచ్చి మళ్ళీ రమ్మని చెప్పింది.
ఆ వూరిలో పచ్చళ్లు చేసే ప్రావీణ్యం సరస్వతికి వుంది. ఆ వూరి వాళ్ళ వల్ల మాకు ఈ విషయం తెలిసి ఆమె యింటికి వెళ్ళాం. ఆమె సంతోషంగా మాకు మామిడి, నిమ్మకాయ పచ్చళ్లు యిచ్చింది. ఆ అమోఘమైన రుచిని, ఆమె ప్రావీణ్యాన్ని తలచుకుంటూ మూడు రోజులు భోజనం ఎంజాయ్ చేసాం. మల్లవ్వ చేతిమీద తమ ముగ్గురి అక్కాచెల్లెళ్ల పచ్చబొట్టు నన్ను ఆకర్షించింది. ముగ్గురిలో ఆమె ఒక్కతే బతికి వుందట. ఆప్యాయతలు, అనుబంధాలు పట్టణాల్లో అంతగా కనిపించవు. రామారావు అనే వ్యక్తితో మాట్లాడాను. ఆయన వృత్తి వ్యవసాయం. చెట్లతో వున్న అనుబంధం, వాటి ఉపయోగాలు చెప్పాడు. ఇంకొంచెం ముందుకు పోతే మండల ఆఫీసు పక్కన శివాజీ విగ్రహం కనిపించింది.
బీడీ కార్మికురాలు రజితతో..
దానిమీద హిందూసేన, హిందూ ధర్మం అని రాసి వుంది. రెండేళ్ళ కిందట పెట్టారు. ఆ ప్రాంతమంతా కాషాయ రంగు జెండాలు. హిందుత్వ శక్తులు తెలంగాణా గ్రామాల్లోకి కూడా వేగంగా దూసు కొస్తున్నాయి. అదే విషయం అప్పుడే భోజన విరామానికి యింటికి వచ్చిన హిందీ టీచర్ ను అడిగాను. ముందు సందేహంచినా నేనూ ప్రభుత్వ టీచర్ ను అని ముచ్చట పెట్టాక హిందూసేన కార్యకలాపాలు చెప్పి, పోరుగడ్డ తెలంగాశాలో మతశక్తులు దూసుకు రావడం పట్ల బాధను వ్యక్తం చేసాడు.
పల్లె అందాలు
ఆ గ్రామంలో అతి వృద్ధుడైన మల్లయ్య యింటికి వెళ్ళాం. ఆయన వయసు తొంభై యేళ్ళకు పైనే వుంది. ఎంతో ఓపికతో ఆనాటి విషయాలను చెప్పుకొచ్చాడు. ఇంటికి పెద్దవాడు కావడం వలన సౌదీకి వెళ్ళి ఆ సంపాదనతో కుటుంబాన్ని పోషించాడు. ఇప్పటి యువతరం గురించి తన అభిప్రాయం చెప్పమంటే .." ఏముందీ! ఫారం కోళ్ళు" అని ఒక్కమాటతో అర్థవంతమైన నిర్వచనం ఇచ్చాడు. అది కదా .. అనుభవమంటే అనిపించింది. ఆ పెద్దాయనను బ్రిగేడియర్ గణేశం గారు శాలువాతో సత్కరించారు. దారిలో ఈత కమ్మల మోపుతో వస్తూ నాకు నర్సయ్య కనిపించాడు.
ఆయన ఈత కమ్మలు తెస్తే ఆయన భార్య వాటిని చీరి, చీపుర్లు తయారు చేసి అమ్ముకొని వస్తుందట. వాళ్ళను చూసి ఎలా కష్టపడాలో నేర్చుకోవాలి. అలా మేం గుడిపేట చేరుకున్నాము. పత్తిచేలో కలుపుతీస్తున్న రాజేశ్వరి బృందాన్ని కలిసాను. రోజుకు ₹250 కూలీ. ఆ చేను యజమాని మల్లయ్య. సౌదీలో సంపాదించిన డబ్బుతో రెండెకరాలు కొనుక్కున్నడట. అలా అందరినీ పలుకరిస్తూ సర్వాపురం, తాటిపల్లి మీదుగా లంబాడి పల్లి చేరుకున్నాం. ఆ రో జు సుమారు 16 నుంచి 18 కిమీ నడిచాను. రాత్రి తొమ్మిదయింది. భోజనం సిద్ధంగా వుంది. ఆరోజు రివ్యూ మీటింగ్ లో ప్రతి ఒక్కరూ ఆనాటి తమ అనుభవాలను పంచుకోవాలి. నేను చాలా అలసిపోయి వుండడం వల్ల ఏమీ మాట్లాడలేక పోయాను. My Village show యూట్యూబ్ ఛానెల్ స్టూడియో లో డిన్నరు ముగించి శ్రీకాంత్ ఇంట్లో మహిళలు, స్టూడియోలో మగవాళ్ళు పడుకున్నారు. అప్పటికి రాత్రి పదకొండు దాటింది.
ఇంకావుంది.