అపుడు సిగ్గుతో మాటలు రాలేదంటున్న ఆంధ్రా మాజీ ఐఎఎస్ అధికారి

చినవీరభద్రుడు తెలుగు నాట సీరియస్ రచయిత. ఇంత జరుగుతున్నా తాను ఎందుకు మాట్లాడలేదో ఇపుడు ఫేస్ బుక్ లోనైనా సంజాయిషీ ఇచ్చారు. అది మంచి పరిణామం. ఆయనేమన్నారంటే...

Update: 2024-01-16 05:04 GMT
రచయిత, తాత్వికుడు, కవి మాజీ ఐఎఎస్ అధికారి వాడ్రేవు చినవీరభద్రుడు


=

ప్రముఖ రచయిత, విమర్శకుడు, తాత్వికుడు, కవి, ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖలో కార్యదర్శి గా పనిచేసి రిటైర్ అయిన  ఐఏఎస్ (2013)అధికారి శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు ఇక ముందు మౌనంగా ఉండనంటున్నారు.

చట్టూరు జరుగుతున్న ఘోరాల మీద గొంతువిప్పుతానమంటున్నారు.

అయితే, ఆయన ఇంతవరకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, అహ్మదాబాద్ నుంచి మణిపూర్ దాకా లేచిన మంటల మీద ఆర్త నాదాల మీద ఒక్క మాటైనా మాట్లాడనేలేదు.

ఇది చాలా మందికి నిరుత్సాహం కలిగించింది. చాలా మంది తెలుగు ఐఎఎస్ అధికారుల తీరుకు భిన్నమయిందేమీ కాదు. తెలుగుఐఎఎస్ అధికారులు సమాజంలో వస్తున్న ఒడుదుడుకుల మీద, కల్లోలాల మీద మాట్లాడింది బాగా తక్కువ.

ఎక్కడైనా ఎపుడైనా ఒక నిరసన గొంతకు వినబడిందంటే అది ఆమూల విశాఖ నుంచి మాత్రమే. పర్యావరణానికి, రాజ్యంగ హక్కులకు, బిసి, దళిత హక్కులకు రాజ్యాంగ పరంగా భగ్నం జరిగినపుడల్లా నిరసన తెలిపేది ఒకే ఒక్క మాజీ అధికారి ఇఎస్ ఎస్ శర్మ. ఆయన మాత్రమే తన దృష్టికి వచ్చిన ప్రతి అన్యాయం మీద రాష్ట్రపతికి, ప్రధానికి, ముఖ్యమంత్రులకు సీనియర్ అధికారులకు ఉత్తరాలు రాసి అభ్యంతరం చెబుతూ ఉంటారు. అంతేకాదు, అవసరమయితే, కోర్టుకెళ్లుతూ ఉంటారు. ఇలా ప్రభుత్వాలను కోర్డుకీడ్చి ఆయన చాలా సార్లు విజయవంతమయ్యారు. దాదాపు ఎనభై సంవత్సరాల వయసులో ఆయన ప్రతిరోజు రెండు మూడు ఉత్తరాలైనా రాయకుండా నిద్రపోరు.

తెలుగు ప్రాంతం నుంచి గొప్ప అధికారులెందరో గతంలో వచ్చారు. అయితే, యాక్టివిస్టు ఐఎఎస్ అధికారులెవరూ రాలేదనే చెప్పాలి. ఇపుడు రాజకీయ పార్టీల్లో చేరి ఎమ్మెల్యేనో, ఎంపినో అయ్యేందుకు చాలా మంది అధికారులు తహతహ లాడుతూ ఉన్నారు. ఇది ఇప్పటి ట్రెండ్. అలాగే ముఖ్యమంత్రులకు సలహాదారులుగా ఉండాలనిమరికొందరు చూస్తున్నారు. అయితే, అన్యాయలను, అక్రమాలను, రాజ్యంగ హక్కుల ఉల్లంఘనను, కుంచించుకుపోతున్న ప్రజాస్వామిక హక్కులను కాపాడుకునేందుకు, హాని చేసే మతావేశాలకు నిరసన తెలిపే గొంతు ఐఎఎస్ అధికారులనుంచి వినిపించడం కష్టమయింది.

ఇపుడు చిన వీరభద్రుడు నేనున్నాంటున్నారు. ఎవరైనా ఇక మాట్లాడాల్సిందే.   మాట్లాడి తీరాల్సిందే నంటున్నారు. మాట్లాడే వాళ్లకు తోడుండాల్సిందే అంటున్నారు.  ఎవరో యుక్రెనియన్ కవి చెప్పిన "No one will remember you for your silence”మాటలను గుర్తుచేస్తున్నారు.

చినవీరభద్రుడు తెలుగు నాట అభ్యుదయ వాదులు సీరియస్ గా తీసుకునే రచయిత. అలాంటి వ్యక్తి నుంచి ఇక నేను మాట్లాడతాను అనే ప్రకటన ఫేస్ బుక్ లో రావడం ఒక మంచి పరిణామం.

ఆయనేమన్నారంటే...

“చాలాసార్లు మనం మాట్లాడుతున్న మాటలు పువ్వులు పూసినట్లుగా పక్షులు కూజితాలు వినిపించినట్టుగా, నదులు ప్రవహించినట్టుగా ఉండడం ఎంత అవసరమో, అట్లానే, భయంకరమైన నిశ్శబ్దాన్ని ఛేదించేవిగా ఉండడం కూడా అంతే అవసరం. ఆ నిశ్శబ్దం నీది కావచ్చు, నాది కావచ్చు, ఒక తరానిది కావచ్చు, ఒక యుగానిది కావచ్చు,” అని అన్నారు.

తానింతవరకు మాట్లాడలేదని అంగీకరించారు. అదే విధంగా ఏఏ సందర్భాలలో మాట్లాడాల్సిన అవసరం ఉన్నా మాట్లాడలేకపోయారో వివరించారు.

“ఒక స్త్రీని ఆమె మరొక మతానికి చెందిందన్న కారణం మీద నడిరోడ్డు మీద పదిమంది గ్యాంగ్ రేప్ చేసినప్పుడు మనం మాట్లాడలేదు. ఆమె మూడేళ్ల కన్నబిడ్డని ఆమె కట్టెదుట బండకేసి బాది చంపేసినప్పుడు కూడా మనం మాట్లాడలేదు. ఆమె న్యాయం కోసం అలుపెరగని పోరాటం చేసినప్పుడు కూడా మనం మాట్లాడలేదు. చివరికి ఆ నేరం చేసిన దోషుల్ని క్షమాభిక్ష పేరు మీద విడుదల చేసినప్పుడు కూడా మనం మాట్లాడలేదు. ఆ దుర్మార్గులు జైలునుంచి బయటికి రాగానే వారికి తిలకం దిద్ది, హారతి ఇచ్చి, పూలమాలలు వేసినప్పుడు కూడా మనం మాట్లాడలేదు,” అని చెప్పారు.

తానెందుకు మౌనంగా ఉన్నానో, ఆ మౌనం  మూగవేదన దాగి ఉందని చెప్పారు. ఆవిషయాన్నిఅంతా గమనించాలని చెప్పారు.

“మనం అంటే, బహుశా, నేను మాట్లాడలేదు. నేను మాట్లాడలేదు కాబట్టి నేను మౌనం వహించానని అనుకోకండి. నాకు మాటలు రాలేదు కాబట్టి మాట్లాడలేపోయాను. గొంతు పెగల్లేదు కాబట్టి మాట్లాడలేకపోయాను. నెత్తురు ఉడికిపోయింది కాబట్టి మాట్లాడలేకపోయాను. ఒళ్లంతా చచ్చిపోయింది కాబట్టి మాట్లాడలేకపోయాను. వాళ్లకి సన్మానం చేసిన వాళ్లదీ, నాదీ కూడా ఒక దేశమే, ఒక మతమే అనే దారుణమైన వాస్తవం వల్ల నేను కూడా ఆ నేరంలో భాగస్తుణ్ణేనేమో అనే వణుకుతో, భయంతో, అపరాధ భావంతో, సిగ్గుతో మాట్లాడలేకపోయాను,” అని వీరభద్రుడు అన్నారు.

ఇంత జరుగుతున్నపుడు, ఈ రంపపు కోత భరిస్తూ ఇపుడు కూడా మౌనం కొనసాగించలేనని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు.

“కానీ ఈరోజు నోరు విప్పగలుగుతున్నాను. అత్యంత హీనాతిహీనమైన, అమానుషమైన నేరం చేసిన ఆ దుర్మార్గుల్ని ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింద దాకా వెనకేసుకు వచ్చాయని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిన తర్వాతనైనా నేను మాట్లాడకపోతే నా అస్తిత్వానికి అర్థం లేదు,” అని ఆయన నిస్సంశయంగా చెప్పారు.

తను మౌనం వీడాల్సిన అవసరం ఎందుకొచ్చిందో ఆయన ఇలా చెప్పారు.

“తక్కిన సంస్థలు, పత్రికలు, మేధావులు అందరూ నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అన్యాయాన్ని సరిదిద్దవలసిన బాధ్యత ఎవరో ఒకరిద్దరు న్యాయమూర్తులది మాత్రమే అని ప్రతి ఒక్కరూ భావిస్తున్నప్పుడు, ధైర్యంగా నిర్భయంగా ఆ బాధ్యత నెరవేర్చిన ఆ న్యాయమూర్తులను అభినందించే వాళ్ళలో, వారికి మద్దతుగా నిలబడే వాళ్ళలో నేను కూడా ఉన్నాను అని చెప్పకపోతే నేను చదువుకున్న చదువుకి, నేను నమ్మిన విలువలకి, నా మానవత్వానికి అన్యాయం చేసుకున్న వాణ్ణవుతాను.”


చినవీరభద్రుడిని హృదయాన్ని కుదిపేసినది బిల్కిస్ బానో మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు


 


జర్మనీలో జరిగిన ఘోరాలు ఎలా వెలికి వచ్చాయో వీరభద్రుడు చెప్పారు.

“జర్మనీలో ఒకప్పుడు యూదుల్ని, సజీవంగా, తగలబెట్టినప్పుడు ఆ నేరం హిట్లర్ ఒకడిదే కాదు. తమ పొరుగు వాళ్ళు యూదులని ప్రభుత్వానికి నివేదికలు అందించిన వాళ్లు, రహస్యజాబితాలు తయారు చేసిన వాళ్లు, వాళ్ళ చిరునామాలు సేకరించిన వాళ్ళు, వాళ్ళని రాత్రికి రాత్రి ఇళ్లలోంచి బయటకు లాగి ట్రక్కుల్లోకెక్కించిన వాళ్ళు, ఆష్విజ్ లో ఫర్నేసులు ఆపరేట్ చేసినవాళ్లు, వాళ్లని తగలబెట్టిన వాళ్లు, మొత్తమంతా, ప్రతి ఒక్కరూ కూడా ఆ హత్యాకాండలో భాగం పంచుకున్నవాళ్లేనని గుర్తుపట్టడం కష్టం కాదు.”

ఇక మౌనంగా సాధ్యం కాదు అని ఆయన నిర్ద్వంద్వంగా చెప్పారు. మాట్లాడని నరరూప రాక్షసులు జాబితా తయారువుతున్నపుడుఅందులో తన పేరుండకుండా చూస్తానని కూడ ఆయన హామీ ఇచ్చారు.

“నా దేశంలో ఒక స్త్రీని, ఆమె అల్ప సంఖ్యాక వర్గానికి చెందిందన్న కారణం వల్ల, గ్యాంగ్ రేప్ చేసిన వాళ్లవెనక, ఒక రాష్ట్ర ప్రభుత్వం మొత్తం, తనకు లేని అధికారాన్ని వాడుకుని మరీ, మద్దతుగా నిలబడి ఉండవచ్చునేమో గాని ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా, నేను వారి పక్కన నిలబడి లేదని చెప్పనివ్వండి. నా సమకాలిక భారతదేశంలో నరరూప రాక్షసుల జాబితా తయారు చేస్తున్నప్పుడు అందులో నా పేరు పొరపాటున కూడా చేరకూడదని కనీసం ఇప్పుడైనా నన్ను ఎలుగెత్తి చెప్పనివ్వండి. అటువంటి వాళ్ళని ఎంతలా ద్వేషించాలో అంతలా ద్వేషిస్తే తప్ప, భగత్ సింగ్ చెప్పినట్లుగా, మనం ఎవరిని ఎంతలా ప్రేమించాలో వారిని అంతగా ప్రేమించలేమని నోరారా చెప్పనివ్వండి.”

టాల్ స్టాయ్ ఏమన్నారో చెబుతూ ఇక తాను అదే మార్గం అన్నారు.

“జార్ చక్రవర్తి నిరంకుశత్వాన్ని ఎండగడుతూ ఒకప్పుడు టాల్ స్టాయి తన గళం విప్పి I can't be silent అన్నాడు. ఆయన దారిలో నేనిప్పుడు I can't any longer be silent అంటున్నాను."

ఆయన మౌనం ఏ రూపం తీసుకుంటుందో ఈ చిన్నప్రకటనలో లేదు.  ఒకటి మాత్రం స్పష్టం ఆయన మౌనం వీడుతున్నాడు.


Tags:    

Similar News