మంచు కొండలలో ఉన్న మత్తు ఏమిటో గాని...
చార్ ధాం ప్రయాణం చాలా ప్రమాదకరమని చిన్నప్పటి నుంచి కథలు కథలుగా విన్న విషయాలు, చూసిన వీడియోలు చార్ ధాం ప్రయాణం పట్ల ఆసక్తి పెంచాయి.
గత నెలలోనే నేపాల్ పోయి వచ్చిన నేను ఈ సారి ఉత్తరాఖండ్ ప్రయాణం అయ్యాను. మంచు కొండలలో ఉన్న మత్తు ఏమిటో గాని మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. అందుకే ఈ ప్రయాణం. భారత దేశంలో ఆధ్యాత్మికత ప్రకృతి రమణీయకత కలపోసుకున్న దర్శనీయ ప్రదేశాలే ఎక్కువ. యూత్ హాస్టల్స్ ఆసోసియేషన్ ఆఫ్ ఇండియా (YHAI) ప్రకటించినదే తడవుగా చార్ ధాం వెళ్లాలని ప్లాన్ చేశాము. ప్రయాణం చాలా ప్రమాదకరమని చిన్నప్పటి నుంచి కథలు కథలుగా విన్న విషయాలు, చూసిన వీడియోలు చార్ ధాం ప్రయాణం పట్ల ఆసక్తి పెంచాయి.
యుమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ లను కలిపి చార్ ధాం అని పిలుస్తారు. యమునోత్రి, గంగోత్రి, కేదార్ నాథ్ తోపాటు హరిద్వార్, రుషీకేశ్ లాంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉండడం వలన అది దేవ భూమిగా ప్రసిద్ధి. చార్ ధాం లోని నాలుగు క్షేత్రాలు హిమాలయాల రీజియన్ లో ఉండడం వలన సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే దర్శించడానికి అనువుగా ఉంటాయి. మరో ఆరు నెలలు మంచుతో కప్పబడి ఉంటాయి. ఆ సమయంలో పూజలకు అనుకూలంగా ఉండే మరో ప్రదేశంలోకి ఆయా విగ్రహాలను తరలిస్తారు.
ఆరు నెలల తరువాత ఆయా విగ్రహాలను యధాస్థానానికి తరలిస్తారు. ఆ క్షేత్రాల పురాణ కథలను ఇక్కడ ప్రస్తావించకుండా మా ప్రయాణం ఎలా జరిగిందో చెప్పడమే ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం. సాధారణంగా ఈ ప్రయాణం యమునోత్రితో మొదలై వరుసగా గంగోత్రి, కేదార్ నాథ్, బద్రీనాథ్ లతో ముగుస్తుంది. మా ప్రయాణం కూడా అలాగే సాగి చివరగా భారతదేశ సరిహద్దులో ఉన్న మన గ్రామ సందర్శనతో ముగిసింది.
చార్ ధాం వెళ్ళాలంటే ముందుగా ఉత్తరాఖండ్ రాష్ట్ర వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్పనిసరి. మనం వెళ్ళే తేదీల వారీగా నాలుగు ఆలయాలకు విడి విడిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆలయాలను తెరిచిన వెంటనే వెబ్ సైట్ అందుబాటులోకి వస్తుంది. వీలైనంత తొందరలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రద్దీ కారణంగా తొందరగానే వెబ్ సైట్ ను మూసివేస్తారు. ఒక రోజు ఆలస్యం కారణంగా మా మిత్రురాలికి యమునోత్రి రిజిస్ట్రేషన్ కాలేదు. ఆఫ్ లైన్ లో కూడా చేసుకునే సౌకర్యం ఉన్నది. దానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఆన్ లైన్ లో చేసుకోవడం మంచిది.
YHAI ప్రకటించిన మొదటి బ్యాచ్ లోనే మేము బుక్ చేసుకున్నాము. ఐదుగురు మిత్రులము మే ఆఖరు వారంలో హైదరాబాదు నుంచి విమానంలో ఢిల్లీ వెళ్లి అక్కడినుంచి టాక్సీలో రుషికేశ్ కు నిర్ణీత సమయానికి చేరుకొని వై హెచ్ ఏ ప్రతినిధికి రిపోర్టు చేశాము. వారు మాకు రెండు గదులు కేటాయించారు. దక్షిణ భారతం నుంచి మేము ఐదుగురమే. మొత్తం ముప్పయి మంది గుజరాత్, మహారాష్ట్ర, బెంగాల్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్ ఇలా ఉత్తర భారతం నుంచే ఉన్నారు. మొదటి రోజు సాయంత్రం ఐదు గంటలకు సమావేశపరిచి పరిచయాల అనంతరం మొత్తం ఆ ప్రయాణంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ట్రెక్కింగ్ సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, వెంటతీసుకువెళ్ళివలసిన వస్తువులు మొదలైన అంశాలు చర్చించారు. రుషికేశ్ లో మేము బస చేసిన ప్రాంతంలో ఎన్నో ఆశ్రమాలతో ఆధ్యాత్మికత ఉట్టి పడుతూ ఉంది. సాయంత్రం ఆరున్నర గంటలకు గంగాహారతి చూసుకొని రూం కి చేరుకొని భోజనం చేసి పడుకున్నాము.
మరుసటి రోజు ఉదయం అల్పాహారం ముగించుకొని బార్ కొట్ కు బయలుదేరాము. దాదాపు తొమ్మిది పది గంటల ప్రయాణం. మధ్యలో భోజన విరామం. గమ్యాన్ని చేరే సరికి సాయంత్రం ఐదు అయింది. మేము బస చేసిన హోటల్ చాలా అందమైన ప్రదేశంలో ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, పచ్చటి చెట్లు. 'టీ, స్నాక్స్ ముగించుకొని ఆ అందమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తూ సాయంత్రం నడక మొదలు పెట్టాము. అలా నడుస్తూ నడుస్తూ కొండల మాటున దోబూచులాడి అస్తమించిన సూర్యుడి లాగా మేమూ రూం కు చేరుకున్నాము. ఉదయం ఆరుగంటలకే అల్పాహారం ముగించి, లంచ్ ప్యాక్ చేసుకొని జానకీచెట్టి బయలుదేరాము. గంటన్నర ప్రయాణం. అక్కడి నుంచి యమునోత్రికి నడక మొదలు పెట్టాము. మా బృందంలో కొందరు గుర్రాల మీద కూడా వెళ్ళారు. డోలీలు, పాల్కీలు కూడా అందుబాటులో ఉన్నాయి.
యమునోత్రి 10,804 అడుగుల ఎత్తిన కొండ మీద యమునాదేవి ఆలయం ఉంటుంది. ఇరువైపులా గంగా సరస్వతి విగ్రహాలు కూడా ఉన్నాయి. యమునా దేవి విగ్రహం అందమైన పాప రూపంలో నీలం రంగులో ఉంది. యమునానది పు ట్టిన స్థలం కాబట్టి విగ్రహం బాలికా రూపంలో ఉండడం సమంజసంగా ఉంది. ఆరు నెలల తర్వాత దీపావళి రెండో రోజున విదియ నాడు ఆలయాన్ని మూసివేసి విగ్రహాన్ని ఖర్సాలి అనే గ్రామానికి తరలిస్తారు. వాతావరణ కారణాల వలన ప్రాచీన ఆలయం శిథిలావస్థకు చేరినప్పుడు జయపూర్ మహారాణి గులారియా 19.వ. శతాబ్దంలో ప్రస్తుత ఆలయాన్ని నిర్మించినట్లు చరిత్ర చెపుతోంది.
యమునోత్రికి నడిచి వెళ్ళడానికి మాకు ఎనిమిది గంటల సమయం పట్టింది. ఒకే దారిలో గుర్రాలు, డోలీలు, పల్లకీలు, నడిచి వెళ్ళే వాళ్ళు ఉండడం వలన రాళ్ళలో నడిచి వెళ్ళేవాళ్ళు అన్నింటినీ తప్పించుకుంటూ జాగ్రత్తగా వెళ్ళాలి. ఏ మాత్రం అప్రమత్తంగా లేకున్నా ప్రమాదం మన వెంటే పొంచి ఉంటుంది. కళ్ళనూ కాళ్ళనూ కట్టిపడేసే ప్రకృతి అందాల వల్ల కూడా నడక అల్లుగా సాగింది. అంత రద్దీలో కూడా ఆ ప్రకృతి అందాలను కెమెరాలలో బంధించకుండా ఉండలేము. మేము వెళ్తున్నప్పుడూ వస్తున్నప్పుడు ఐదారుగురు గుర్రాలపై నుంచి కిందపడిపోయారు. గుర్రాలు దారి మధ్యలోనుంచి వెళుతుంటాయి కాబట్టి ప్రాణాపాయం ఉండదు. గుర్రం తొక్కడం వలన నా స్నేహితురాలి బూటు చిరిగి కాలికి గాయం అయింది. దారి పొడుగుతా దుకాణాలలో ఆహారపదార్థాలు అమ్ముతూ ఉన్నారు.
మధ్య దారిలో ఒకచోట మనం రిజిస్ట్రేషన్ చేసిన పేపర్ స్కాన్ చేసి దర్శనం టోకెన్లు ఇచ్చారు. దారి పొడుగునా గుర్రాల మల మూత్రాల వాసన ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూనే ఉన్నారు. వారిని పలుకరించగా... ఆరునెలలు ఆ పనికి కాంట్రాక్టు పద్ధతిలో ఇస్తారట. ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పని చేస్తారు. నెలకు ఎనిమిది నుంచి పన్నెండు వేల వరకు వేతనం ఉంటుంది. వాళ్ళందరూ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే... తరువాత ఆరు నెలలు మరో చోట కూలి పనులకు పోతారట. విపరీతమైన రద్దీ కారణంగా పోలీసులు కొంత మందిని దారి మళ్లించారు. అందువల్ల నేను నా స్నేహితుల నుంచి విడిపోయాను. ఫోను కలవడం లేదు. పోలీసు వారిని ప్రకటన కొరకు సంప్రదించగా ప్రస్తుతం అందుబాటులో లేదని చెప్పి తన ఫోనులో ప్రయత్నించగా చాలా సేపటికి విజయ ఫోను కలిసింది. ఒక్క జియో ఫోను మాత్రమే అక్కడ పని చేస్తుంది. కాసేపటి తర్వాత మిత్రులందరం కలిసాము. పోలీసులు ఎంతో బాధ్యతగా విధులు నిర్వహించారు.
భక్తులు స్నానం చేయడానికి వీలుగా గోరువెచ్చటి నీటి గుండం ఒకటి, పొగలు గక్కుతున్న నీటి గుండం ఆలయం ప్రాంగణంలో ఉన్నాయి. దీనికి శాస్త్రీయ కారణాలు ఉన్నప్పటికీ దైవ మహిమనే కారణం అనే నమ్మకం అక్కడి జనాలలో కనిపించింది. అన్నీ చూసుకొని మా మిత్ర బృందం యమునా తీరానికి చేరుకున్నాము. లంచ్ గా తెచ్చుకున్న బెండకాయ కూర పూరీ తినేసి, కాసేపు నీళ్ళలో ఆడుకొని తిరుగుముఖం పట్టాము. రామ రేబాన్ చలువ కళ్లద్దాలు పడిపోయాయి. ఈరోజు మేము మొత్తం సుమారు పదహారు కిలోమీటర్లు ట్రెక్ చేసాము. కాబట్టి కేదార్ నాథ్ కూడా ట్రెక్ చేయగలమనే ఆత్మవిశ్వాసంతో కిందకు చేరేసరికి సాయంత్రం ఐదు అయింది. బార్ కోట్ చేరి టీ స్నాక్స్ ముగించి గది ఖాళీ చేసి ఉత్తర కాశీ ప్రయాణమయ్యాము. ఆ రాత్రి అక్కడే బస చేసాము. ఉదయమే ఉత్తర కాశీలోని పరిసర ప్రాంతాలు చూసుకొని గంగోత్రికి బయలుదేరాము.
ఏడు ఎనిమిది గంటల ప్రయాణం. వంద కిలోమీటర్ల దూరం. దారి పొడుగునా గంగానది వెంబడిస్తూనే ఉంది. లెక్కకు మించిన జలపాతాలు కనువిందు చేశాయి. దేవదారు, పైన్ వృక్షాలు ఇరువైపులా హరిత వర్ణాన్ని అద్దాయి. ప్రయాణ బడలిక అస్సలు తెలియలేదు. అక్కడికి చేరేసరికి మధ్యాహ్నం రెండు గంటలయింది. ముందుగా భోజనం ముగించుకొని సందర్శనకు బయలుదేరాము. మూడు కిలోమీటర్లు నడక. గంగోత్రి గంగానది జన్మస్థలం. ప్రధాన ఆలయం 18. వ శతాబ్దంలో తెల్లటి పాల రాయితో నిర్మించబడింది. ఇక్కడ కూడా దీపావళి తర్వాత గుడిని మూసేసి మూల విగ్రహాన్ని ముఖ్బా అనే గ్రామానికి తరలిస్తారు. ఈ ఆలయం భగీరథీ నదికి ఎడమ వైపున ఉన్నది. ప్రాంగణంలో చిన్నచిన్న ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి. అన్ని చూసుకొని గంగా ఘాట్ కు వెళ్లాము పరవళ్లు తొక్కుతున్న గంగా ప్రవాహాన్ని ఎంతసేపు చూసినా తనివి తీరదు. వంతెనbపైనుంచి ఆవలి ఒడ్డుకు వెళితే భగీరథ ఆలయంఉంది.
ఆ ప్రకృతిలో పరవశించి, అందాలను కెమెరాలలో చొప్పిస్తూ నిర్వాహకులు చెప్పిన సమయానికి బస్ వద్దకు చేరుకున్నాము. ఇక్కడ మా బృంద సభ్యులలో ఒకరైన ప్రహ్లాద్ గారికి శ్వాస సమస్య ఎదురైంది. ఆయన వయసు 54 సంవత్సరాలు. అక్కడ ఏర్పాటు చేసిన వైద్య శిబిరాలలో చికిత్స చేసుకొని బయలుదేరాము. తదుపరి ప్రయాణం కేదార్నాథ్ కాబట్టి ఖచ్చితంగా అక్కడ వైద్యపరీక్షలు చేయించుకోవాలి. దానికి తగినట్లుగా అక్కడ చాలా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక పరీక్షలతోపాటు సమస్యలున్నవారికి చికిత్స చేయడానికి సీనియర్ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. ఆధార్ కార్డు, రిజిస్ట్రేషన్ పత్రం, మెడికల్ సర్టిఫికేట్లను తనిఖీ చేసి, ప్రతి ఒక్కరికి ప్రాథమిక వైద్య పరీక్షలు (బి.పి లాంటివి) చేశారు. సమస్యలు ఉన్నవాళ్ళను కేదార్ నాథ్ వెళ్ళ వద్దని హెచ్చరించారు.
తెల్లవారి ఉదయం ఉత్తరకాశీ నుంచి గుప్త కాశీ ప్రయాణం దాదాపు పదకొండు పన్నెండు గంటల ప్రయాణం. 213 కిలోమీటర్ల దూరం. మార్గమధ్యలో భోజనవిరామం, ప్రాకృతిక అవసరాలు... హోటల్ గదికి చేరేసరికి రాత్రి అయింది. భోజనాల అనంతరం చిన్న సమావేశం ఏర్పాటు చేసి వివరాలు సేకరించారు నిర్వాహకులు. ఆరోగ్య సమస్యలతో హోటల్ గదిలోనే ఉండి పోయేవాళ్ళు, హెలికాఫ్టర్ లో వెళ్ళే వాళ్ళు, నడిచి వెళ్ళే వాళ్ళ వివరాలు తీసుకున్నారు. మా మిత్ర బృందం నడిచి వెళతామని చెప్పాము. వెళ్ళేప్పటికంటే వచ్చేటప్పుడు నడిచి రమ్మని సూచించారు నిర్వాహకులు. కారణం ఆలస్యమైతే ఆలయం మూసేస్తారట. శ్వాస సమస్యతో ప్రహ్లాద్ గారు ఆగి పోయారు కాబట్టి అతని భార్య అంజన మా బృందంలో చేరింది. మేమిప్పుడు ఆరుగురం అన్నమాట. అంజన గుజరాతీ మహిళ. స్నేహశీలి. డోలీయా, పాల్కీనా, గుర్రమా ఎలా వెళ్ళాలి? ఇలా తర్జన భర్జనల పిమ్మట మేము ఆరుగురం గుర్రాల మీద వెళ్లాలనే నిర్ణయం తీసుకున్నాం.
యమునోత్రి ట్రెక్ తో వచ్చిన అనుభవంతో లంచ్ ప్యాక్ వద్దని చెప్పాము. బస్ లో సీతాపూర్ వరకు వెళ్ళాము. గంటన్నర ప్రయాణం. మాది పెద్ద బస్ కావడం వల్ల అక్కడనే పార్క్ చేయాల్సి వచ్చింది. అక్కడినుంచి మూడు కిలోమీటర్లు నడిచి సోన్ ప్రయాగ చేరుకున్నాము. ఒక్కరికి యాభై రూపా యలు చెల్లించి జీపులో గౌరీకుండ్ వచ్చాము. సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రభుత్వ కౌంటర్లో ఒక్క గుర్రానికి ₹3200/ లు చెల్లించాము. సాధారణంగా YHAI ట్రిప్పుల్లో లంచ్ తో సహా అన్నీ వాళ్లే సమకూరుస్తారు కాబట్టి మనకు ఎక్కువ నగదు డబ్బుతో పని ఉండదు. అందులోనూ ఇప్పుడు అన్నీ ఆన్ లైన్ చెల్లించడమేనాయే.... అందువల్ల మేము పెద్దగా నగదు తీసుకు పోలేదు. అక్కడ ఎక్కడా ఆన్లైన్ చెల్లింపులు లేవు. మనదగ్గర కూరగాయల బండి దగ్గరనుంచి ఆటో వరకు ఆన్ లైన్ చెల్లింపులే కదా? దక్షిణ భారతదేశం నుంచే పన్నుల రూపంలో జాతీయ ప్రభుత్వానికి చేరడంలో ఇదీ ఒక కారణం కావొచ్చు. అనుకోకుండా మా బృందంలో చేరిన అంజన వలన మాకు వచ్చిన నగదు కష్టాన్ని గట్టెక్కాము. డోలీకి ₹7000/, పాల్కీ కి ₹14000/ ఉత్తరాఖండ్ ప్రభుత్వం నిర్ణయించిన ధరలు. వాళ్ళ భోజన ఖర్చులు అదనం.
అంజనాతోపాటు మేము ఐదుగురం గుర్రాలెక్కాము. యుమునోత్రి ట్రెక్ లో పడిపోయిన వారు గుర్తుకు వచ్చి ముందు కొంచెం భయం వేసింది. అదే విషయం మాగైడ్ తో చెప్పాను. పడిపోకుండా ఉండడానికి కొన్ని సూచనలు చేసాడు. గుర్రం పల్లం లోకి పరిగెడుతున్నప్పుడు మన శరీరాన్ని వెనక్కి ఉంచాలి. అది ఎత్తులోకి ఎక్కుతున్న ప్పుడు మనం ముందుకు వంగాలి. సమతుల్యంగా వెళుతున్నప్పుడు రెండు కాళ్ళు గట్టిగా పెట్టి నిటారుగా కూర్చోవాలి. అప్రమత్తంగా ఉండడం చాలా అవసరం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా పడిపోవడం ఖాయం. గుర్రాల గైడులందరూ ఇరవై ఏళ్ళ లోపు నేపాలీ పిల్లలే... పరుగులు పెట్టించి మమ్మల్ని నాలుగింటికల్లా గమ్యస్థానంలో దింపారు. గుర్రపు ప్రయాణం మాకు ఆరేడు గంటల సమయం పట్టింది. ఒక రకంగా థ్రిల్లింగ్ గానే ఉంది. అదొక అనుభవం. జాగరూకతతో దాని మీద కూర్చోవడం వల్ల ప్రాకృతిక సౌందర్యాని ఆస్వాదించ లేకపోయాను. డోలీలు, పాల్కీలు అయితే గుడి దాకా పోతాయి. గుర్రాలు రెండు మూడు కిలోమీటర్ల ముందరే ఆగిపోయాయి. అక్కడి నుంచి నడక మొదలు పెట్టాము. ఎవరి శక్తి మేరకు వాళ్ళ వేగం ఉంది.
నా స్నేహితురాలు రమ (సాక్షి పేపర్ విలేఖరి) ముందర దర్శనం టోకెన్ తీసుకుంది. దర్శనం సమయం ఏడు గంటలకని హోటలు గదికి వెళ్ళి పోయింది. నేనూ టోకెన్ తీసుకున్నాను. నాది కూడా ఏడు గంటల దర్శనమే అని హోటలుకు బయలుదేరాను. దర్శన సమయం ఏది వున్నా మిగిలిన నలుగురు మిత్రులు దర్శనం కోసం లైనులో ఉన్నారని ఫోన్ చేస్తే తెలిసింది. నన్ను హోటలుకు వెళ్ళకుండా దర్శనానికి వెళ్ళమని హెచ్చరించారు. నేను అయోమయంలో పడ్డాను. వాళ్ళ కోసం వెనక్కి వెళ్ళ లేను. లైను ఎక్కడుందో తెలియడం లేదు. నేను ఆలయం భాగంలో ఉన్నాను. గుర్రపు ప్రయాణంతో ఒళ్ళంతా నొప్పులు, నీరసం, ఒక్కదాన్నే ఉన్నాను. గుళ్ళోకి వెళ్ళక ముందే దేవుడు కనిపిస్తున్నాడు. ఏం చేయను? శక్తినంతా కూడదీసుకొని ఆచూకి తీస్తూ లైను దగ్గరికి చేరాను. నా మిత్రులు ఎక్కడా కనిపించలేదు. అదృష్టవశాత్తు మా బృందంలోని రంజన లైనులో కనిపించింది. తను హెలీకాఫ్టర్ లో వచ్చింది. మధ్యాహ్నం నుంచి లైనులో ఉందట. పోలీసుల అనుమతితో నేను తనతోబాటు లైనులో చేరి కాస్తా ఊపిరి పీల్చుకున్నాను. చెప్పుల బస్టాండులో మా బూట్లు ఉంచడానికి కూడా పెద్ద యుద్ధం చేయాల్సి వచ్చింది. ఇద్దరే ఉంటే టోకెన్ ఇవ్వడం లేదు షాపువాడు. కనీసం నలుగురు ఉండాలట. ఎంతో బతిమిలాడి టోకెన్ లేకుండానే ఒక అరలో మా బూట్లు పెట్టి ఫోటో తీసుకొని ముందుకు కదిలాము. రెండు డిగ్రీల చలిలో పాదాలు స్వాధీనం తప్పుతున్నాయి. ఎలాగైతేనేం? గుళ్ళోకి వెళ్ళాము. అక్కడ మాత్రం తోపులాట లేకుండా ప్రశాంతంగా దర్శనం చేసుకున్నాను.
గర్భగుడి అంతటా స్వర్ణకాంతితో మెరిసిపోతోంది. కేదార్ నాథుడు సర్వాలంకార శోభితుడుగా ఉన్నాడు. రంజన నేను బయటకు వచ్చాము. మళ్ళీ తాను ప్రత్యేక పూజ టోకెన్ కొరకు లైనులో నిలబడింది. నేను మాత్రం వెళతానని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చి, ముందుగా బూట్లు తీసుకొని వేసుకున్నాను. వేడి వేడి టీ తాగి, కుదుట పడి పరిసరాలను పరిశీలించాను. గుడి, పరిసర ప్రాంతాలు మాత్రమే హిమరహితంగా ఉన్నాయి. చుట్టూరా ఉన్నకొండలు వెండి కొండల్లా మెరిసి పోతున్నాయి. అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. 11,755 అడుగుల ఎత్తులో నేను ఉన్నాను అనే భావన నన్ను ఉద్వేగపరిచింది. ఆలయానికి ఎదురుగా ఉన్న ఒక పెద్ద రాయి అడ్డంకిగా ఉన్నందు వల్ల 2013 లోవచ్చిన వరదలు ఆలయాన్ని ముంచెత్త లేక పోయాయని చెప్పారు. ఆలయ గోడకు ఒకవైపు మాత్రం చిన్నచిన్న పగుళ్లు రెండు మూడు కనిపిస్తాయి. ఆలయానికి వెనక వైపు శంకరాచార్య విగ్రహం ఉంటుంది. శంకరాచార్యులు ఇక్కడే శివైక్యమొందినట్లు ప్రతీతి. కార్తీక పౌర్ణమి తరువాత ఆలయాన్ని మూసివేసి మూల విగ్రహాన్ని ఊఖి మఠానికి తరలిస్తారు.
ఇక ఆలయం నుంచి హోటలుగదికి చేరుకున్నాను. మిత్రులు దర్శనం చేసుకొని ఎనిమిది గంటలకు వచ్చారు. చలికిదగినట్లుగా ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. టెంట్లలో వసతి కల్పించినందుకు సంతోషించాము. తెల్లవారి ఉదయమే లేచి వ్యాయామము, ప్రాణాయామము చేసి మనసుని శరీరాన్ని ట్రెక్కుకు సంసిద్ధపరిచాను. పరోటా టీ అల్పాహారంగా తీసుకొని ఆలయ ప్రాంగణంలో ఫోటోలు తీసుకొని ఎవరి వీలునుబట్టి వాళ్లు తిరుగు ప్రయాణమయ్యాము. రమ, శివ, డోలీలో వెళ్ళి పోయారు. నేను, విజయ, అంజన నడక మొదలు పెట్టాము. అంత రద్దీలో కలసి నడవడం కూడా సాధ్యం కాలేదు.
ప్రకృతి అందాలకు పరవశిస్తూ పర్వత శిఖరాల అంచులను చూస్తూ జలపాతాల హోరును ఆస్వాదిస్తూ అక్కడక్కడా వేడి వేడి టీ తాగుతూ నడుస్తూ వచ్చాను. మార్గ మధ్యలో ఉన్నట్టుండి ఆకాశం మేఘావృతమైంది. వర్షంలో ఆ ప్రదేశంలో నడుస్తుంటే.... ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది. అక్కడక్కడా ఉచిత భోజన సౌకర్యం కూడా ఉంది. నేను మాత్రం టీ పళ్ళతో సరిపెట్టుకున్నాను. ఒక్క అరటిపండు ఇరవై రూపాయలు. మధ్యలో ఎప్పటికో విజయ కలిసింది. అప్పటినుంచి ఇద్దరం విడిపోకుండా చూసుకొని గౌరీకుండ్ చేరుకొని అక్కడ జీపు ఎక్కి సోన్ ప్రయాగలో దిగి మళ్ళీ నడుస్తూ సీతాపూర్లో మా వాహనం వద్దకు చేరుకున్నాము. మొత్తం ఇరవై ఐదు కిలోమీటర్లు నడక.... ఉదయం తొమ్మిది గంటలకు బయలుదేరిన మేము సాయంత్రం ఏడు గంటలకు బస్ లోకి చేరాము. గుప్తకాశి చేరేసరికి రాత్రి ఎనిమిది అయింది.
గుప్తకాశి నుంచి బద్రీనాథ్ 196 కి లోమీటర్లదూరం, సుమారు పదిగంటల ప్రయాణం. బద్రీనాథ్ చేరేసరికి సాయంత్రం నాలుగుయింది. యూత్ హాస్టల్ లో బేస్ ఏర్పాటుచేసారు. చుట్టూ కొండలు, ప్రశాంతమైన వాతావరణం. వేడి స్నాక్స్ టీ తీసుకొని దర్శనానికి బయలుదేరాము. ముందుగా రిజిస్ట్రేషన్ పేపర్ చూపించాలి. ఫోన్లో అయినా చూపించవచ్చు. స్కాన్ చేసి దర్శనం టోకెన్ ఇస్తారు. చాంతాడంత లైను. నాలుగు గంటల సమయం పట్టింది. టోకెన్ దొరికిన వాళ్లందరికీ దర్శనం ఉంటుందని నింపాదిగా ఉన్నారు జనం. హఠాత్తుగా ఆలయ ద్వారాన్ని ఒకదానిని మూసివేసారు నిర్వాహకులు అంతే భయంకరమైన తొక్కిసలాట మొదలైంది. ఆ తోపులాటలోనే మరో ద్వారం గుండా గర్భగుడిలోకి ప్రవేశించాము. దర్శనం అయింది కానీ కొన్ని క్షణాలే... బతుకు జీవుడా అంటూ బయట పడ్డాను.
బద్రీనాథ్ ఆలయం ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని చేయాలి జిల్లాలో 10,279 అడుగుల ఎత్తు లో ఉన్నది. ఆరునెలలు దేవతలూ ఆరునెలలు మానవులు దర్శించుకుంటారని నమ్మకం. ఆరునెలల తరువాత మూల విగ్రహాన్ని జోషీ మఠంలోని నరసింహ ఆలయానికి చేరుస్తారు. బద్రీనాథ్ ముందు వేడి నీటి గుండం ఉన్నది. ఆ పక్కనే అలకనందా నది ఉన్నది. ఈ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో బ్రహ్మ కపాలం ఉన్నది. ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రదానం చేయడం శ్రేష్ఠంగా భావిస్తారు.
తెల్లవారి ఉదయం పరిసర ప్రాంతాలు చూసుకొని భోజనం చేసుకొని మన గ్రామం చూడడానికి వెళ్ళాము. ఇది భారతచైనా టిబెట్ సరిహద్దులలో ఉన్న అతిచిన్న గ్రామం. సరిహద్దు ప్రాంతంలో ఉన్నందున భారతదేశం మొదటి గ్రామమని కొందరు చివరి గ్రామమని కొందరు చెపుతారు. 10,500 అడుగుల ఎత్తులో ప్రకృతి సౌందర్యంతో కూడి ఉంటుంది. పాండవులకు సంబంధించిన పురాణ కథ ఒకటి ప్రచారంలో ఉంది. వేదవ్యాస్ గుహ, సరస్వతి నది పుట్టిన ప్రదేశం ఇక్కడ చూడదగినవి. స్థానికుల ప్రధాన జీవనాధారం ఊలుతో రక రకాల దుస్తులు తయారు చేసి అమ్మటం.
మరునాడు బద్రీనాథ్ నుంచి రుషికేశ్ తిరుగు ప్రయాణం. మార్గమధ్యలో రుద్రప్రయాగ, విష్ణుప్రయాగ మొదలైన వాటిని చూస్తూ వెళ్ళాము. ఇది అలకనందా నది, గంగానది కలిసే చోటు. దీనితో YHAI వాళ్ళ ప్యాకేజీ ట్రిప్ ముగిసింది. మేము మరోరెండు రోజులు అదనంగా ఉండి హరిద్వార్, డెహ్రాడూన్ చూసాము.
హరిద్వార్ లో చండీదేవి, మానసాదేవి ఆలయాలకు రోప్ వే లో వెళ్ళాము. వైష్ణోదేవి ఆలయం కూడా చాలా బాగుంది. ఇది చూసాక అసలైన వైష్ణోదేవి ఆలయానికి ఖచ్చితంగా వెళ్లాలని నిర్ణయించుకున్నాను. భారత మందిర్ కూడా చూడదగింది... తెల్లారి డెహ్రాడూన్ వెళ్లాము. దాబార్జి ఉత్తరాఖండ్. తుపకేశ్వర్ మహాదేవ్ ఆలయం చూసాము. కొండ గుహలో తొలిచిన శివాలయం. చాలా పురాతన ఆలయం. ప్రాంగణంలో ఇతర దేవాలయాలు కూడా ఉన్నాయి.
రాబర్స్ కేవ్ (దీనినే స్థానికంగా గుచ్చిపాని అంటారు) మరో ఆకర్షణ. హిమాలయాల నీళ్ళతో సహజ సిద్ధంగా ఏర్పడిన గుహ. మోకాలి లోతు నీళ్ళతో అరకిలోమీటరు విస్తరించి ఉంటుంది. చివరగా రాతి గుహలోంచి జలపాతం ఉరకలు వేస్తూ ఉంటుంది. చిన్నపిల్లల తోపాటు పెద్దవాళ్లు కూడా చిన్నపిల్లలై ఆనందిస్తారు. దీనితో 13 రోజుల మా టూర్ ముగిసింది.