మెదక్ కోటకి వెళ్తే... ఎంచక్కా సెక్యులర్ టూర్ చుట్టేయొచ్చు
కాకతీయ వంశంలో రెండో ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెపుతున్నది. కోట నిర్మించిన ప్రదేశమే శత్రుదుర్భేద్యంగా ఉన్నది.
నేను పుట్టింది, పెరిగింది పాత మెదక్ జిల్లా. మెదక్ అంటే ప్రత్యేకమైన అభిమానం. చిన్నప్పటినుంచి మెదక్ కోట చూడాలనే కుతూహలం ఉండేది. కానీ అప్పట్లో వెళ్ళడానికి అనుమతి లేదు. కారణం అసాంఘిక శక్తుల కార్యకలాపాలు ఎక్కువ జరగడం. దొంగల భయం కూడా ఉండేది. వెళ్ళే దారి కూడా సరిగ్గా ఉండేది కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ చరిత్ర, సంస్కృతులను మరింత బలంగా పునర్నిమించుకోవలసిన అవసరం, బాధ్యత ఏర్పడ్డాయి. అందులో భాగంగా ప్రభుత్వం మెదక్ కోటను పునరుద్దరించింది. పరిస్థితులు వెళ్ళడానికి అనుకూలంగా మారడంతో చారిత్రక ప్రదేశాల పట్ల ఆసక్తి ఉన్నవారు సందర్శిస్తున్నారు. ఇటీవల నాకు కూడా ఆ అవకాశం వచ్చింది. మెదక్ కోటతోపాటు చుట్టు పక్కల ఉన్న పురాతన ఆలయాలను కూడా చూడాలని ప్రణాళిక వేసుకున్నాము.
ఉదయం ఏడుగంటలకు హైదరాబాద్ నుంచి కారులో బయలుదేరాము. మార్గమధ్యంలో అల్పాహారం ముగించుకుని కోట దగ్గరకు చేరుకున్నాము. హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ల దూరం. మూడు వందల అడుగుల ఎత్తులో ఉన్నది. సుమారు ఐదు వందల మెట్లు ఉన్నాయి. దాదాపు నాలుగు వందల ఎకరాలలో విస్తరించి ఉన్నది. మార్గమధ్యంలో పర్యాటకులు విశ్రాంతి తీసుకోవడానికి అనువుగా సిమెంటు బెంచీలు ఏర్పాటు చేశారు.
కాకతీయ వంశంలో రెండో ప్రతాపరుద్రుడు ఈ కోటను నిర్మించినట్లు చరిత్ర చెపుతున్నది. కోట నిర్మించిన ప్రదేశమే శత్రుదుర్భేద్యంగా ఉన్నది. కోట చుట్టూ బురుజులతో కూడిన ఎత్తైన ప్రాకారం, మలుపులు తిరిగే కొండదారి. కోట పై నుంచే శత్రువుల రాకను పసిగట్టడానికి వీలుగా నిర్మాణం జరిగింది. కోట లోపల ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కాదు. విషం పూసిన బాణాలను శత్రువు మీద ప్రయోగించడానికి వీలుగా ఎత్తైన కోట గోడకు రంధ్రాలు ఉన్నాయి. పొరపాటున శత్రువు లోపలికి ప్రవేశిస్తే... మరుగుతున్న నూనెను శత్రువు మీద కుమ్మరించడానికి అనుగుణంగా రంధ్రాల ఏర్పాటు ఉన్నది. కోట లోపల జలాశయాలు, బావులు ఉన్నాయి. సొరంగ మార్గాలు ఉండేవట. ఇప్పుడు అవి కనిపించలేదు. పూడుకపోయి ఉన్నాయి కాబోలు.
కోట పైకి వెళ్ళడానికి ఐదు ద్వారాలు ఉన్నాయి. వీటిలో సింహద్వారం, గజ ద్వారం ప్రధానమైనవి. మొదటి ద్వారం పైన రెండువైపులా సింహాలు ఉన్నాయి. మూడో ద్వారానికి ఇరువైపులా ఏనుగులు ఉన్నాయి. కోట పైన మసీదు ఉన్నది. మసీదు పై దాకా వెళ్ళడానికి అనుమతి లేదు. కాకతీయుల తరువాత ఢిల్లీ సుల్తానులు, ఆ తరువాత బహుమనీ సుల్తానులు మెదక్ కోటను స్వాధీనపరచుకున్నారు. పద్దెనిమిదో శతాబ్దంలో ఈ కోట నైజాం నవాబుల హస్తగతంమైంది. పైన ఉన్న మసీదు దీనికి సాక్ష్యం. కోట పైవరకు పోయి అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించి, ఫోటోలు తీసుకుని కిందకు రావడానికి మాకు దాదాపు మూడు గంటల సమయం పట్టింది. కోట పైనుంచి మెదక్ నగరమంతా అద్భుతంగా కనిపిస్తుంది. పరీక్షగా చూస్తే నిజాంసాగర్ డ్యాం, మెదక్ చర్చి కనిపిస్తాయి.
కోట పై నుంచి చర్చిని చూసి ప్రత్యక్షంగా కూడా చూడాలని వెళ్ళాము. మెదక్ చర్చి ఆసియా ఖండంలోనే పెద్దది. ప్రపంచంలో వాటికన్ చర్చి తరువాత ఇది రెండోది. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత మెదక్ ప్రాంతంలో కరువు ఏర్పడినప్పుడు అప్పటి మిషనరీ పెద్ద రెవరెండ్ చార్లెస్ వాకర్ ఫాస్నెట్ ఈ చర్చి నిర్మాణం చేపట్టారు. చర్చి నిర్మాణంలో పాల్గొన్న గ్రామస్తులకు ఆహారం ఇవ్వడం ప్రధాన ఉద్దేశం. ఆ విధంగా ప్రజలను ఆదుకున్నట్టు అయింది. వాళ్ళకు ఒక అద్భుతమైన ప్రార్ధనా మందిరం నిర్మాణమైంది. చర్చి నిర్మాణానికి సుమారు పది సంవత్సరాలు పట్టింది.
దీని ఎత్తు సుమారు రెండువందల అడుగులు. (ప్రధాన హాలులో ఒకేసారి దాదాపు ఐదు వేల మంది ప్రార్ధన చేయవచ్చు. లోపల రంగుటద్దాలతో, బయట పాలరాతి పలకలతో చర్చి నిర్మాణం కళాత్మకంగా ఉంటుంది. సుమారు ఐదు ఎకరాలలో ఆ ప్రదేశమంతా పచ్చని చెట్లతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆహారం అంటే అన్నం. అన్నం అంటే మెతుకు. క్రమంగా మెతుకు మెదక్ గా మారిందని మెదక్ జిల్లా గ్రామ నామాల మీద పరిశోధన చేసిన డా. పైడిమర్రి మాణిక్ ప్రభు చెప్పారు. సోనామసూరి వరి పంట దిగుబడి అధికంగా ఉండడం వలన ఈ ప్రాంతానికి మెతుకు సీమ అనే పేరు వచ్చిందని మెతుకు క్రమంగా ప్రజల నోళ్లలో నాని మెదక్ గా మారిందని మరో భాష్యం చెప్పారు.
అక్కడి నుంచి మేము ఏడుపాయలకు వెళ్ళాము. మంజీరానది ఇక్కడ ఏడు పాయలుగా విడిపోతుంది అంటారు. చుట్టూ మంజీరానదితో, పచ్చని చెట్లలో పెద్ద పెద్ద బండరాళ్ళమధ్యలో దుర్గమ్మ తల్లి వెలిసిందని ప్రజల విశ్వాసం. నా చిన్నప్పుడు ఈ ప్రాంతమంతా అందంగా ఆహ్లాదకరంగా ఎంతో ప్రశాంతంగా ఉండేది. అభివృద్ధి పేరుతో గుడి ముందు నిర్మాణాలు చేపట్టడం వలన ప్రకృతికి విఘాతం కలిగి ఆ ప్రశాంతత పోయింది. భక్తిపేరుతో, వ్యాపారం పేరుతో ప్రకృతికి కలిగిన నష్టానికి బాధ కలిగింది.
అక్కడి నుంచి అతి పురాతనమైన కూచనపల్లి గుడికి వెళ్లాము. రెండు బండ రాళ్ళ మధ్య గుహలో సాక్షాత్తు వెంకటేశ్వరస్వామి స్వయంభూగా వెలిశాడని ఆ ప్రాంత వాసుల నమ్మకం. అడుగున్నర ఎత్తులో ఉండే ఈ గుహలోకి భక్తులు దొర్లుతూ వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకోవాలి. చాలా మంది లోపలికి వెళ్ళడానికి సాహసించలేక బయటనుంచే దండం పెట్టుకుంటారు. నేనూ ఇంతకు మునుపు చాలా సార్లు వెళ్ళాను. కానీ లోపలికి ఎప్పుడూ వెళ్ళలేదు. కానీ ఈసారి వెళ్ళాను. ఆ రెండు బండ రాళ్ళ మధ్య అడుగున్నర నిడివిలో దొర్లుతూ లోపలికి వెళ్ళడం చాలా థ్రిల్లింగ్ గా ఉంది.
తరువాత ముత్తాయికోటలో ఉన్న శివాలయానికి వెళ్లాము. ఇది సుమారు వెయ్యి సంవత్సరాల నాటిది. ప్రశాంతమైన ప్రాంగణంలో చేద బావి, కోనేరు ఉన్నాయి. వెయ్యి తామర పూలతో శివలింగం అలంకరించబడి చూడడానికి ఎంతో అందంగా ఉంది. అక్కడి నుంచి చిట్కూల్ చాముండేశ్వరి దేవాలయానికి వెళ్ళాము. దీనిని అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా చెపుతారు. మంజీరా నదికి సమీపంలో ఉంటుంది. పలు హస్తాలతో నల్లరాతి విగ్రహం చూపరులను ఆకర్షిస్తుంది. సాధారణంగా ఆలయ నిర్మాణం జరిగాక దేవతా విగ్రహాలను స్థాపించడం జరుగుతుంది. దానికి భిన్నంగా ముందర విగ్రహ ప్రతిష్ఠాపన జరిగింది. క్రమ క్రమంగా ఆలయ నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఆలయ ప్రాంగణానికి ప్రహరీగోడ ఎత్తైన నాలుగు గోపురాలతో నిర్మాణంలో ఉన్నది. ఈవిధంగా ఒక మసీదు, ఒక చర్చి, మూడు పురాతన దేవాలయాల సందర్శనతో మా ఒక రోజు సెక్యులర్ టూరు ముగిసింది. రాత్రి పది గంటలకు ఇల్లు చేరాము.