ఇల్లోక పుస్తకం !

ఇల్లు-సీక్వెల్ 21 : పుస్తకప్రేమికుల దినోత్సవం సందర్బంగా గీతాంజలి ప్రత్యేక కవిత

Update: 2024-08-09 14:56 GMT


పుస్తకమా ..నువ్వంటే మరణం వరకు చెరగని ప్రేమ !

నీలో ఏ పేజీ తిప్పినా కమ్మటి కాగితపు పరిమళం వెన్నంటి
మానవ దుఃఖానందాల తడి అంటిన అక్షరాల వర్షం కురుస్తుంది లోపల !
ఇంటి గోడల్లోని అలమారాల్లో..నిశ్శబ్దంగా ..ఠీవీగా..
రంగు రంగుల్లో కొలువైన నువ్వు !
నీలో ఒక రాగం..ఒక విలయం .. ఒక సముద్రం..
చుక్కల అక్షరాలని మెరిపించే నువ్వో ఆకాశం !
****
ఇల్లు నిన్ను మనిషిని మోస్తున్నట్లే భరిస్తుంది..
హటాత్తుగా.. ఇల్లే అనేక పుస్తకాలుగా మారిపోయి గది గదిలో దేహం లోపలి గుండెలా..
గోడల్లోపలి అలమరల్లో ఒదిగి పోతుంది.
మూసుకున్న గది తలుపుని... పుస్తకం అట్టలా తెరిచి... జరిగే కథని చూస్తూ ఇల్లే పుస్తకం రాస్తుంది..
ఇల్లే కవితలల్లేస్తుంది.
మనుషుల్ని మరణం వరకూ చదివిన ఇల్లు తానే .,ఒక సాక్షి పుస్తకం గా మారిపోతుంది.
***
అమ్మ నాన్నలు వాళ్ళంతట వాళ్ళే
ఒకరినొకరు పుస్తకాలు గా చదివే మనుషులుగా మారిపోతారు .
చాలా సార్లు పుస్తకాలు
మనుషుల వాసన వేస్తాయి.
నానమ్మ చెప్పే కథల పుస్తకం మాగిన పండులాంటి పరిమళం తో..
రాలబోయే వృద్ధ పుష్పం లోని ఎండిన తనంలా
అచ్చం నానమ్మలా ఉంటుంది !
అమ్మ చెప్పే/రాసే కథల పుస్తకం ఒక సముద్రంలా...
విరిగిన రెక్కల్లాంటి కాగితాల రెప రెపలతో అలజడి పుట్టిస్తాయి.
ఇక నాన్న అమ్మను పుస్తకంలా చదవాలను కున్నప్పుడు ..
అమ్మ సముద్రమై నాన్నని ముంచెత్తు తుంది..
సముద్ర మంతా అమ్మ కన్నీటి వేడి...
నాన్న భయంతో పారిపోతాడు.
నాన్న చాలా సార్లు అప్పుల భారం మోయలేని
వేదనల కథల పుస్తకం అయిపోతాడు.
***
ఆడ పిల్లవని నాన్న గడప దాటవద్దన్నప్పుడు....
ఇల్లు అలమర తెరిచి ..
చలాన్ని.. టోనీ మార్రిస న్,మాయ ఏంజిలోని..
సైమన్ డి బీవాయిర్ ని, కమలా దాస్ ని నీ దోసిట్లో పోస్తుంది..
పరిగెత్తే కాళ్ళు మొలవడం కోసం !
ఇంట్లో..బయటా అదనపు గంటల శ్రమ దోపిడీని ఎదిరించడానికి..
నాన్నకి..అమ్మకి మార్క్స్ కాపిటల్ పుస్తకాలని ఒడిలో నింపుతుంది.
ప్రేమలో ఊపిరాడక ..
ప్రేమలేఖ రాయడం రాక..
తల్లడిల్లే ప్రేమికులతో చలం ప్రేమలేఖల్ని మైమరుపుతో చదివిస్తుంది.
***
అవే ఇంటి గోడల అలమారలు పసిపిల్లల సుగంధంతో పసివాడుతాయి
చందమామల్ని..భూగోళాన్ని,అరణ్యాలను పక్షుల పాటల్ని..
పూల తోటలని ,ఇసుక దిబ్బల్ని ..
చిన్ని చిన్ని ఇళ్ళని..బొమ్మలని నింపుకునే కథల్ని..
పిల్లల మీదికి వెదజల్లుతాయి .
ఇల్లప్పుడు పిల్లల గల గల నవ్వులతో మ్రోగే ఒక తబలా అయిపోతుంది.
***
మనుషులే పుస్తకాలైన ఇల్లు ఒక లైబ్రరీ గా మారిపోతుంది.
గోడలు పుస్తకాలని మోసే మేస్రీలు .
మంచాన పడ్డ నానమ్మకో..తాతయ్య కో పుస్తకాన్ని చదివి పెట్టటం..
అది ఖురానో..బైబిలో ..భగవద్గీతో ..
ఏదైతేనేం...అదొక హృదయ బంధం !
***
ఎలా వస్తాయో పుస్తకాలు ఇంట్లోకి...అధితుల్లా వచ్చి ఇంటికే యజమానులవుతాయి.
నీకు నీ బాల్యపు టీచర్లవుతాయి.. గద్దిస్తాయి...
నిను కన్న అమ్మ..నాన్నలు ఎక్కడ అని
ఇల్లంతా మూల మూలల్లో వెతుకుతాయి !
నీ ఇల్లాలితో నీ తీరు తెన్నులను ప్రశ్నిస్తాయి !
నీ రంగు రూపాల్ని మార్చేస్తాయి.
నీలోని చీకటి నీడలకు సూర్యచ్చాయలను అద్దుతాయి.
నిన్ను మానవీకరిస్తాయి.
*****
ఇల్లు గది గది లో తొంగి చూస్తూ మనుషులనే పాత్రలుగా మలిచి
పుస్తకాల్లోకి పంపిస్తుంది... ఏడిపిస్తుంది.. నవ్విస్తుంది ...
పాత్రలు మూర్ఛనలు పోయే ముగింపు కూడా ఇస్తుంది.
ఇల్లే పుస్తకం రాసే కథయిత్రిగా..స్టోరీ టెల్లర్ గా మారిపోతుంది.
ఏ పేజీని కూడా చింప నివ్వదు.
****
పుస్తకం విరిగిన ఆడపిల్ల రెక్కలని కలిపి కుట్టి ఆకాశంలో కి ఎగరేస్తుంది.
చందమామని దగ్గర చేస్తుంది.
పుస్తకం యంత్రం కాదు !
పుస్తకంలో., ఇంట్లోలా గదులు,తలుపులు,కిటికీలు,తెరలూ,మెరిసే నేలా.,
అలజడిగానో..ఆనందం గానో తిరగాడే మనుషులు ఉంటారు.
చీకటి వెలుగులు.. తుఫానులు..భూ కంపాలు ఉంటాయి.
పుస్తకంలో ఇంటి మూలనో..పెరట్లోనో..డాబా మీదో ఏడిచే మనుషులు ఉంటారు
మౌనంగా ప్రేమించే మనుషులు ఉంటారు.
మనో దేహాలను యుగాలుగా త్యాగం చేసే అమ్మ నాన్నలుంటారు.
*****
అందుకే...
యంత్రాలను పక్కన పెట్టి ., పుస్తకాలను నీ దగ్గర పెట్టుకో !
కాగితాల లోని పదాలను చూసావా ..తోటలో పూలలా గుబాళిస్తాయి.
కోయిలల్లా పాడుతాయి.
పాత్రలు..వృద్ధ అమ్మా నాన్నలో..నిన్ను మరువలేని ప్రేమికుడో ఎవరో...
ఏమో..కానీ నిన్ను పట్టుకొని వల వల ఏడుస్తాయి..
విల విల లాడతాయి ! నిన్ను కౌగలించుకుంటాయి..నీతో తమ రహస్యాన్ని.,
గుస గుసగా చెబుతాయి.
నీ చేతికి పుస్తకం ఇచ్చిన ఇల్లు పుస్తకంలో...నీకు ఏం చూపిస్తుందో తెలుసా..
నువ్వు మర్చిపోయిన నీ ములాల్ని..నీ ఊరుని..
నీ పెంకుటింటిని..నీ ఊరి వాగుని..పొలాన్ని.. ముడుతలు పడ్డ దేహంతో ..
శుష్కించిన కళ్ళతో ..రెండు ఎడారులుగా మారిన నీ అమ్మ నాయనలను...
నీ ఊరి కరువును ..వలసెళ్లిన ఆకలిని చూపిస్తుంది.
పుస్తకం..ఏకంగా వంటరైన వాళ్ళ ఉనికిని నీ కళ్ళల్లోకి సముద్రాలుగా ఒంపుతుంది..
నీ హృదయపు తడి నీకు తెలిసేలా చేస్తుంది
*****
పుస్తకాలను అలా ఒంటరిగా వదిలెయ్యకు !
పుస్తకాలకీ మానవ స్పర్శ కావాలి.
వాలి పోవడానికి మనిషి హృదయం కావాలి !
ఎప్పుడైనా.. పుస్తకాన్ని చదువుతూ ..చదువుతూ గుండెల మీద వాల్చుకున్నావా..చేసి
చూడోసారలా...
నీ హృదయం మీద ఒక తోట ఒకటి వెచ్చగా నిదుర లేస్తుంది.
నీ చెవుల్లో ఒక వీణా నాదం మ్రోగుతుంది
పుస్తకం నీ నిదురలో కలగా వస్తుంది !
పుస్తకం నీ ప్రేయసిగా మారిపోతుంది.
నిను కన్న తల్లి అయిపోయి నీ తల నిమురుతుంది !
****
అందుకే పుస్తకాన్ని అందుకో !
చూడు ..హృదయానికి హత్తుకోక పోతే...
రెండు అరచేతుల మధ్య భద్రంగా ఇముడ్చుకోక పోతే.,
నీ కళ్ళల్లోంచి తనని చూడకపోతే..పుస్తకాలు అలుగుతాయి !
అలమరలో అనాథలైన .,ఒంటరై ఊపిరాడని పుస్తకాలు చచ్చి పోతాయి !
*****
నువ్వు పోగొట్టుకున్న పుస్తకం అచ్చం రక్తమాంసాలున్న మనిషి లాంటిది !
పుస్తకాలు ఔషధం లాంటివి ! నువ్వు మనిషిగా మరణించడాన్ని ఆపుతాయి
పుస్తకాన్ని వదిలేయకు..
తప్పి పోనియ్యకు
అనాథ కానీయకు !!
పుస్తకాన్ని అందుకొని హృదయానికి హత్తుకో..
ఎడబాయనీకు !


Tags:    

Similar News