జైల్లో మసక బారిన అద్దం నుంచే ‘ములాఖత్’ ఉండేది...

చాలా మంది ఆదివాసీలకు తమ బిడ్డలు జైల్లో ఉన్నారని కూడా తెలియదు. తెలిసిన కొద్దిమందీ ములాఖత్ కు వచ్చేవారు కాదు. కారణం వాళ్ళ ఆర్థిక పరిస్థితి. మరొకటి భాషా సమస్య. .

Update: 2024-09-08 11:56 GMT

ప్రొఫెసర్ జిఎన్  సాయిబాబా జైలు నుంచి విడుదల కావడం చాలా సంతోషకరం. కానీ ఈ పదేళ్ళ కాలంలో ఆయన కుటుంబుం  మానసికంగా ఆరోగ్యపరంగా సామాజికంగా ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఈ పది సంవత్సరాలలో వాళ్ళకు జరిగిన నష్టం ఎవరూ పూడ్చలేనిది. ఆరోగ్యరీత్యా సాయిబాబాగారు జైల్లో ఎదుర్కొన్న సమస్యలతోపాటు బాహ్య సమాజంలో ఆయన సహచరి వసంతకుమారి గారు, తల్లి పడిన ఘర్షణ తక్కువేమీ కాదు. సాయిబాబాగారిని ఉద్యోగం నుంచి తొలగించడం, పలుమార్లు బెయిల్ తిరస్కరించడం, కోవిడ్ సమయంలో ఆయన తల్లి మరణించడం, తన తల్లి చివరి చూపుకు కూడా రాలేని పరిస్థితి, సాయిబాబా మిత్రుడొకరు జైల్లోనే మరణించడం .... ఇలా ఎన్నో విపత్కర సంఘటనలు ఒకదాని వెనుక ఒకటి జరిగి పోయాయి. వీటన్నింటిని సాయిబాబాగారి సహచరిగా వసంతకుమారిగారు ఎలా తట్టుకొని ధైర్యంగా నిలబడ్డారో ఆమె మాటలలోనే వినాలనే ప్రయత్నమే లామకాన్ (Lamkaan) సమావేశం. వసంత కుమారికి వేదిక పైన మాట్లాడడం ఇదే తొలి అనుభవం అట. అయినప్పటికీ సంఘర్షణాత్మక అనుభవం లోనుంచి వచ్చిన మాటలు ప్రవాహం లాగా సాగిపోయాయి. జైలు నుంచి విడుదలై బయటకు వచ్చాక సాయిబాబా హైదరాబాద్ వచ్చారు. ఈసందర్భంగా ఆయన మిత్రులు  శ్రేయోభిలాషులు ఇక ఇష్టోగోష్టి ఏర్పాటు చేశారు. అందులో వసంత,సాయిబాబ మాట్లాడారు. 

కార్యక్రమాన్ని ప్రొఫెసర్ సూరేపల్లి సుజాత, అపర్ణతోట నిర్వహించారు. వసంత మాటలను అపర్ణ అప్పటికప్పుడు ఆంగ్లంలోకి అనువాదం చేశారు. వర్షాన్నికూడా లెక్కచేయకుండా సమావేశం ఆసాంతం కొనసాగడంతో ప్రజాస్వామిక ఆకాంక్షలకు భరోసా వచ్చినట్లయింది.

ఈ సందర్భంగా వసంతతో కొద్ది సేపు మాట్లాడేందుకు అవకాశం దొరికింది, సమావేశం విశేషాలు, వసంతనాతో పంచుకున్న అనుభావాలే ఈ వ్యాసం.





వసంతకుమారి సాయిబాబా చిన్నప్పటినుంచి స్నేహితులని, పదవ తరగతిలో ట్యూషన్ మేట్స్ అని, ఆ స్నేహం క్రమంగా ప్రేమగా మారి 1991 మార్చిలో లో సహచరులుగా కలిసి జీవించాలని నిర్ణయించుకున్నట్లు  వనంత  చెప్పింది. ఆశయం, సాహిత్యమే వాళ్ళిద్దరినీ కలిపింది. అప్పటినుంచి తాను సాయిబాబా తోనే కలిసి ఉన్నానని చెప్పింది. ప్రేమ వ్యక్తిగతమా? సామాజికమా ? శారీరకమా ? మానసికమా? అనే మౌలికమైన ప్రశ్నలకు వసంత, సాయిబాబాల జీవితాలను అర్థం చేసుకుంటే సమాధానం దొరుకుతుంది.


ఈ జైలు జీవితం పదేళ్ల కారణంగా తన సహచర జీవితంలో ఎక్కువ కాలం సాయిబాబా లేకుండా ఎన్నో సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చింది. సాయిబాబాని జైలు నుంచి బయటకు తీసుక రావడానికి తాను చేసిన పోరాటానికి ఎందరో మేధావులు, న్యాయవాదులు, విద్యార్థులు, ప్రజాసంఘాలు, ప్రజలు తనకు బాసటగా నిలిచారని వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పింది. తన ఈ పోరాటం కూడా సాయిబాబా గారితో పాటు అన్యాయంగా అరెస్టు అయిన వారందరి విడుదల కోసం అని స్పష్టం చేసింది. చాలా మంది ఆదిసీలకు తమ బిడ్డలు జైల్లో ఉన్నారనే విషయం కూడా తెలియదు. తెలిసిన కొద్దిమంది కూడా ములాఖత్ కు వచ్చేవారు కాదు. కారణం వాళ్ళ ఆర్థిక పరిస్థితి. మరొకటి భాషా సమస్య. ఎన్నో వ్యయప్రయాసలకోర్చి ములాఖాత్ కొరకు వెళితే చాలా సేపు వేచి ఉండవలసి వచ్చేదట.


సాయిబాబాతో భార్య వసంత, ఈ వ్యాసరచయిత్రి గిరిజ, ప్రముఖ రచయిత్రి శివలక్ష్మి


 అది కూడా మిగతా ఖైదీలతో వారి వారి బంధువుల మూలాఖత్ అయి పోయిన తరువాతనే పది నిమిషాలు తనకు కేటాయించేవారని, ఇద్దరి మధ్యలో మసకగా ఉండే ఒక అద్దం అడ్డుగా ఉండేదని దాని వల్ల సాయి తనకు మసకగా కనిపించేవారని ఆవేదన వ్యక్తం చేసింది. ములాఖత్ సమయంలో సాయితో హిందీలో మాట్లాడమని కట్టడి చేసేవారట. కానీ తనకు హిందీ రాదని, తన మాతృభాష తెలుగు అని, తెలుగులోనే మాట్లాడుతానని, మిగతా వారికి తమ తమ మాతృభాషలో మాట్లాడడానికి అనుమతి ఇచ్చినప్పుడు " నాకెందుకివ్వరు " అని అడి గానని చెప్పింది. చివరకు జైలు అధికారులు ఒక మెట్టు దిగివచ్చి తాను తెలుగులో మాట్లాడినా సాయిబాబాగారు మాత్రం ఆమెతో హిందీలో కాని ఇంగ్లీషులో కాని మాట్లాడాలనే నిబంధనతో తనకు తెలుగులో మాట్లాడడానికి అనుమతి ఇచ్చారట. దీని వలన అక్కడి అధికారుల పిరికితనం బట్టబయలు అయింది.

మరో మారు ములాఖత్ కు వెళ్ళినప్పుడు తనను లోపలికి వెళ్ళ నివ్వకుండా అడ్డుకున్నారని, ఎందుకు వెళ్ళనివ్వడం లేదని గట్టిగా ప్రశ్నిస్తే.... సాయిబాబాగారిని బయటికి తీసుకుని పోతున్నట్లు చెప్పారట. దానితో తాను ఆందోళనకు గురయ్యానని, బాగా ఆలోచించి సాయిని బయటకు తీసుకొని వచ్చినప్పుడు చూడడానికి వీలుగా నిలబడి వీల్ చైర్ కనబడగానే ఒక్క ఉదుటున పరుగెత్తగా చాలా మంది మహిళా పోలీసులు తనను అడ్డుకున్నారని, " నేను ఆయన సహచరిని, నన్ను ఆయనతో మాట్లాడనివ్వండి " అంటూ ఏడుస్తూ పరుగెత్తానని, అప్పుడు సాయి "నన్ను హాస్పిటలుకు తీసుకొని పోతున్నారు. నువ్వు అక్కడికి రా " అని చెప్పారట. అప్పుడు ఆమె ఆటో మాట్లాడుకొని హాస్పిటలుకు వెళ్ళేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. మళ్ళీ ఖంగారు... అయినా ధైర్యం కోల్పోకుండా ప్రయత్నించింది. సాయి వాష్ రూం లోకి వెళ్ళడం గమనించి తానూ వాష్ రూం లోకి దూరిందట. అక్కడ కూడా ఆమెను మహిళాపోలీసులు అడ్డుకున్నారు. " సాయి నేను వచ్చాను " అని పక్క గదిలోకి వినిపించేటట్లుగా గట్టిగా అరిచిందట. అప్పుడు పక్క గదిలో నుంచి సాయిబాబాగారు కూడా బదులిచ్చారట.

అంత ఎస్కార్ట్ తో, పోలీసులతో తీసుకొస్తున్న ఖైదీని చూడాలని అక్కడి జనం ఆసక్తిగా ఎదురు చూసారు. ఏ బడా రౌడీయో అనుకొని ఉంటారు. వచ్చింది వీల్ చైర్ లో సాయిబాబాగారు. వసంతను ఆరా తీయగా ఏ నేరం లేకుండానే అరెస్టు చేసారని తెలిసి," వీల్ చైర్ లో ఉన్న ఈ సారు ఏం చేయగలరు? అధికారులకు ప్రభుత్వానికి కళ్లు లేవా? " అని వాపోయారట.

" ఇన్ని కష్టాలు ఎదుర్కొని సాయిబాబా గారి విడుదలకు పోరాటం చేయడానికి మీకు స్ఫూర్తి ఏమిటీ? " అనే ప్రశ్నకు..... ఇంట్లో ఎప్పుడూ సాహితీ చర్చలు, హక్కుల పోరాట వాతావరణం ఉండేది. గతంలో మహిళా చేతన అనే సంస్థను స్థాపించి, వరకట్న హత్యలు, గృహహింస, మద్యనిషేధం లాంటి సమస్యలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. ఆదివాసీ మహిళా ఉద్యమాలలో పాల్గొన్నారు. ఆ పోరాటాల స్ఫూర్తే తనకు ధైర్యం ఇచ్చిందని తెలిపారు.

భవిష్యత్ కార్యాచరణ గురించి ప్రస్తావించగా... హెచ్చు తగ్గులు లేని సమాజమే తమ లక్ష్యమని, ఇదే ఆశయంతో సాయి తాను దగ్గరయ్యామని, పదేళ్ళు జైలులోని అండాసెల్ లో ఉండి విడుదలైన సాయిబాబాగారి ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ఆరోగ్యం కొంచం కుదురుకొన్నాక పని మొదలవుతుంది. ఆదివాసీలను, అడవులను, కొండలను మనం కాపాడుకోలేకపోతే మన దేశాన్ని మనం రక్షించుకోలేము. అంటూ ముగించింది.

ఒక ఆశయం కోసం కలిసి జీవించడం, ఆశయ సాధనలో ఎదురైన కష్టసుఖాలు, నిర్భందాలను నిబ్బరంగా ఎదుర్కోవడం..... ఇదే కదా....విశ్వమానవ ప్రేమ అంటే.... ఈ విశ్వమానవ ప్రేమ జంట తమ ఆశయ సాధన కోసం ఆరోగ్యంతో కలిసే ఉండాలని మనస్పూర్తిగా కోరుకుందాం.



Tags:    

Similar News