అమాయకపు ‘జూలై 1’ చీకటి రోజుగా మారిపోతున్నది

ఇఫ్టూ ప్రసాద్ విశ్లేషణ: ఏడేండ్ల క్రితం GST వచ్చింది. ఇపుడు న్యాయ చట్టాలు వస్తున్నాయి. లక్ష్యం ప్రజాపీడనే. అదీ జులై ఫస్ట్. ఇదీ జులై ఫస్ట్.

Update: 2024-07-01 05:42 GMT

ఇఫ్టూ ప్రసాద్ (పిపి)


పన్నుల వసూళ్ల ప్రక్రియలో "విప్లవాత్మక" సంస్కరణ పేరిట మోడీ సర్కారు GST చట్టాన్ని తెచ్చింది. ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అసమానతలు పెరిగే విషయాన్ని అమర్త్యసేన్ నుండి పికెట్టి వరకూ పదేపదే వెల్లడిస్తున్నదే! బడా కార్పొరేట్ల నుండి పన్నువసూళ్లు క్రమంగా తగ్గుతూ; మధ్యతరగతి, ఉద్యోగ, అల్పాదాయ వర్గాల నుండి పెరుగుతోంది. దీనిని వ్యవస్థీకృత విధానంగా GST చట్టం మార్చింది. సాంప్రదాయ వర్తక, వ్యాపార, వాణిజ్య వర్గాల దివాళాకు కూడా GST చట్టం కారణమౌతోంది. ఓకే ఒక్కమాటలో చెప్పాలంటే, నేడు మనదేశ ఆర్ధికవ్యవస్థలో అసమానతల్ని వ్యవస్థీకృత రూపంలో పెంచే లక్ష్యంతో తెచ్చిందే GST చట్టం.


ఆర్ధిక అసమానతలు పెరిగీ కొద్దీ, సామాజిక అస్థిరతలు పెరుగుతాయి. సహజంగానే తనుగుణంగా రాజకీయ అస్థిరతలు పెరుగుతాయి. దాని నుండి ప్రభుత్వాల మనుగడ కోసం నూతన పాలనా విధానాల అవసరం ఏర్పడుతుంది. అనివార్యంగా తదనుగుణమైన కొత్త న్యాయ చట్టాల అవసరం ఏర్పడిన ఫలితమే క్రిమినల్ చట్టాలు. ఏడేండ్ల క్రితం ఆర్ధిక రంగంలో ప్రజావ్యతిరేక విధానాల్ని ప్రవేశపెట్టే లక్ష్యంలో భాగమే GST చట్టం. అది 2017 జూలై 1 నుంచి అమలులోకి వచ్చింది.

న్యాయవ్యవస్థలో అణచివేత విధానం ప్రవేశపెట్టే లక్ష్యంలో భాగమే కొత్త న్యాయ చట్టాలు. అదీ జులై ఫస్ట్. ఇదీ జులై ఫస్ట్.

చరిత్రలో ఏ ఒక్క చట్టమూ శాశ్వతం కాదు. ఏ సంస్కరణ కూడా సుస్థిరం కాదు. సమాజ గమనంలో ప్రజాశక్తి ఎదుట ఇలాంటి నిరంకుశ చట్టాలేవీ నిలబడవు. వాటివల్ల తమకు మున్ముందు జరగబోవు కష్ట నష్టాలను ప్రజలు గుర్తించలేని కాలాల్లో నిరంకుశ పాలకులు ఆమోదించి అమలు చేస్తే చేయొచ్చు. వాటి ప్రమాదాన్ని తమ చేదు అనుభవాలతో పీడిత ప్రజలు గుర్తించిన రోజు ఇవేవీ నిలబడవని చరిత్ర నిరూపించింది. పార్లమెంటు బ్రూట్ మెజార్టీతో ఆమోదించి, రాష్ట్రపతి సంతకం చేశాక కూడా మూడు వ్యవసాయ చట్టాల్ని మోడీ ప్రభుత్వం వెనక్కి తీసుకున్న చరిత్ర మన కళ్లెదుటే ఉంది. తాజా మూడు క్రిమినల్ చట్టాలు అంతకంటే భిన్నమైనవో అతీతమైనవో కాదు. అంతెందుకు, కెన్యా సర్కార్ వారం క్రితం పన్నులు పెంచుతూ తెచ్చిన ఫైనాన్స్ బిల్లుకు వ్యతిరేకంగా జనం రాజధాని నైరోబికి తరలివచ్చి పార్లమెంటు భవన్ ని ముట్టడి చేశాక తలవంచక తప్పలేదు. చరిత్రలో ఇలాంటివి ఎన్నో!

ఊరవతల కొండలోకి తోడేలు చేరిందనే వార్త ఊరిజనాన్ని వెంటనే కర్రలు, కత్తుల్ని చేత పట్టించదు. తమ పెరటిదొడ్లో పుట్టలోకి పాము దూరిందనే వార్త పరిసరాల ఇళ్ల జనంతో వెంటనే పలుగులూ, పారల్ని పట్టించదు. దానర్థం తోడేళ్లు పాముల్ని సహిస్తారని కాదు. అదే ప్రజలు తమ పశువుల్ని తోడేళ్ళు తిన్నరోజు, పాము కాటుకు ఓ వ్యక్తి గురైనరోజు ఎలా తిరగబడతారో మనకు తెలియనిది కాదు. ఈ చట్టాల ప్రమాదాన్ని ప్రజలు గుర్తించిన రోజు చరిత్ర చెత్తబుట్టలోకి విసిరేస్తారు. ఐతే చరిత్ర ఓ షరతునైతే విదిస్తుంది. తమ రాజకీయ విప్లవ కార్యాచరణ తో ప్రజల్ని చైతన్యపరచాల్సిన శక్తులు తమ బాధ్యతని విధిగా చేపట్టే ప్రాతిపదికన మాత్రమే. తమ కోసం నిలబడ్డ తమ ముద్దుబిడ్డల్ని "న్యాయ" చట్టాల క్రింద అరెస్టు చేస్తున్న వాస్తవాన్ని ప్రజలు గుర్తించే ప్రాతిపదికనే. ప్రజలకోసం పని చేసే రాజకీయ శక్తులు ప్రజా విశ్వాసాన్ని పొందితేనే! కొన్ని కష్టనష్టాల తర్వాతనైనా వారు గుర్తించి తిరగబడతారు.

"న్యాయ" చట్టాలు నేటి నుండి అమలు జరిగితే చేయగలిగేది లేదనే నిరాశకు గురి కావడం కాదు. తమ భుజస్కంధాల పై మరింత బాధ్యత పెరిగినట్లు పీడిత ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు గుర్తించాలి. ఈ ఆశా విశ్వాసాలతో ప్రజల్ని మేల్కొలపగలిగితే సమీప భవిష్యత్తులో అసాధారణ విజయాల్ని సాధించవచ్చు.

ఈ  పాలకులు జూలై 1ని ప్రజలకు కష్టాలను మిగిల్చే చీకటి దినంగా మార్చితే, ప్రజలకి ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తులు దాన్ని దీక్షా దినంగా మార్చాల్సి వుంది.'జులై ఫస్ట్' ప్రజావ్యతిరేక పాలకులకి చరిత్రలో క్రింది విధంగా చేదు దినంగా గుర్తుండి పోవాలి.

మేము అధికార సౌధాల్లో కూర్చొని చట్టాల్ని తేలిగ్గానే చేయగలిగాం. వాస్తవ ప్రజా క్షేత్రంలో అమలు కోసం పూనుకుంటే మా రాజకీయ మనుగడకొక ముప్పుగా మారుతున్నది. అత్యాశతో చట్టాల్ని చేసినా నిరాశయే మాకు మిగిలింది. ఈ స్థితిని ముందుగా మేము అంచనా వేయలేకపోయాము. ప్రజలకు ప్రాతినిధ్యం వహించే రాజకీయ శక్తులకు చరిత్రలో జులై ఫస్ట్ ఇలా సగర్వమైన ఘటనగా గుర్తుండి పోవాలి.

మీ అధికార సౌధాలలో చట్టాలు చేసుకొని ఎదురు లేదని మురిసి పోతే చెల్లదు. ఈ క్రూర నేర చట్టాల పేరిట రేపు మా ప్రజల ప్రియతమ ముద్దుబిడ్డల్లో నిర్బందించిన ప్రతిసంఘటన సందర్భంలో ప్రజలతో ప్రతిఘటన మీకు ఎదురయ్యే విధంగా కీలక పాత్ర పోషిస్తాం. మిమ్మల్ని నడిబజారుల్లో రాజకీయ దిగంబరుల్ని చేయడానికి నేటి కంటే పదిరెట్లు చురుగ్గా పని చేస్తాం. ఈ జులై ఫస్ట్ ని దీక్షాదినంగా మారుస్తామని సవాల్ విసురుతున్నాం. ఇల్లు అలికితే పండగైనట్లు మురిసిపోకండి ఓ ప్రజావ్యతిరేక పాలకుల్లారా, ప్రజాక్షేత్రంలో రాజకీయంగా మిమ్మల్ని ఓడించడానికి ఈరోజు మేం కర్తవ్యోన్ముఖులౌతున్నాం.

సుమారు 3 వారాల క్రితం యూరోయియన్ యూనియన్ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజావ్యతిరేక అనుకూల మితవాద పక్షాల బలం పెరుగుదల ప్రమాదకర ప్రపంచ గమనానికో సంకేతం. ఇదిలావుంటే నిన్నటి ఫ్రెంచ్ పార్లమెంటు మొదటి రౌండ్ ఎన్నికల్లో లీపెన్ కి చెందిన తీవ్ర మితవాద పక్షమైన 'నేషనల్ ర్యాలీ' పార్టీ 34% ఓట్లతో సింగిల్ మెజార్టీ వస్తున్నట్లు IST ప్రకారం గతరాత్రి ఎగ్జిట్ పోల్స్ తెలిపాయి. రెండో రౌండ్ జులై 7న జరుగుతాయి. ఇది ఓ విధంగా ప్రమాదకరమైనా రెండో రౌండ్ ఎన్నికల్లో లెఫ్ట్ కూటమికి విజయావకాశాలు కూడా లేకపోలేదు. 2027 వరకు కొనసాగే అవకాశం గల పార్లమెంటును హఠాత్తుగా మాక్రాన్ రద్దు చేసిన చర్య 1933 లో జర్మన్ హిండెన్ బర్గ్ ని గుర్తు చేస్తున్నది. వారు తలచింది ఒకటైతే మరొకటి జరుగుతుందనే అవకాశం ఉంది. మాక్రాన్ కి చెందిన సెంట్రిస్టు రాజకీయ పునాది అనివార్యంగా రెండో రౌండ్ ఎన్నికల్లో నయా నాజీ పార్టీకి వ్యతిరేకంగా లెఫ్ట్ వెనక్కి చేరి తీరాల్సిన పరిస్థితి వస్తోంది. అది మరోసారి సమాలోచన చేద్దాం. ఈ సంక్లిష్ట ప్రాపంచిక పరిస్థితుల్లో మోడీ ప్రభుత్వం తెచ్చిన నేర చట్టాల వ్యతిరేక పోరాటాన్ని మరింత తీవ్రతరం చేయాల్సి ఉంది. అది ప్రజావ్యతిరేకవ్యతిరేక శక్తుల మీద బాధ్యత.

జులై ఫస్ట్ తేదీని మోడీ ప్రభుత్వం చీకటి దినంగా మార్చితే, ప్రజల కోసం పని చేసే సంస్థలు దీక్షా దినంగా మారుస్తాయని ఆశిద్దాం.



Tags:    

Similar News

ఆమె ఒక తోట