భూమంతా చుట్టి రావాలి: మహిళా యాత్రికులు చెప్పే కథలు...

'ఇంతియానం 2.0' పుస్తక సమీక్ష;

Update: 2025-08-14 05:24 GMT

ఇంతి యానం (Inthiyanam), స్త్రీల యాత్ర కథనాల కోసం ఏదన్నా పంపండి అని సంపాదకత్వం వహించిన స్వర్ణ కిలారి  అడగగానే నాకు ' పోతం జానకమ్మ 1873లో చేసిన ఇంగ్లాండ్ యాత్ర, ఆమె రచించిన "జానకమ్మ ఇంగ్లాండ్ యాత్ర" గుర్తొచ్చాయి. ఆ పుస్తకంలోనే కాశీ యాత్ర కూడా చెప్పబడింది.ఇది స్త్రీల యాత్రల గురించి రాసిన మొదటి పుస్తకం అనుకోవాలి.

ఇంతియానం లో ఏముంది!? అంటే "పుడమినెల్ల లవలేశం విడువక తిరగాలి.

అడుగడుగునా ఆగిఆగి అరసి అరచి చూడాలి" అనుకునే స్త్రీ పురుషులందరూ లింగభేదం లేకుండా ఈ పుస్తకం చదివితే మన పక్క ఊరి నుంచి మొదలుపెట్టి, మన రాష్ట్రం నుంచి హిమాలయాల గుండా మంచు పర్వతాలలో విహరిస్తూ, కొండలు, అడవులు, లోయల పచ్చదనాలను ఆస్వాదిస్తూ, నదులు, సముద్రాలులో మునిగితేలుతూ సూర్యో, చంద్రోదయ, సూర్యాస్తమయాలను కళ్ళతో పీల్చుకుంటూ గుండెల్లో నింపుకుంటూ ప్రపంచ దేశాలను చుట్టేయవచ్చు.

ప్రయాణాలు, యాత్రలు పేరు ఏదైతేనేం. చదువు నేర్పే పాఠశాలలు, విద్యాలయాలు చదవడం నేర్పితే, జీవితానికి సరిపడే వాస్తవ అనుభవాన్ని ఇచ్చేది యాత్రలు, ప్రయాణాలే. యాత్రలంటే గుడులు గోపురాలు, ప్రకృతి సౌందర్యాలే కాదు. అక్కడి ప్రజల సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, కళలు, సంస్కృతి, సాహిత్యం, ఆచార వ్యవహారాలు, ఆహార పద్ధతులు, భౌగోళిక పరిసరాలు, మొక్కలు ,చెట్లు చేమలు, పసుపక్షాదుల జీవనం అంతటినీ తెలుసుకోవడం. అణువు అణువు అరిచి అరిచి అందరము చూడలేము. చూడటం సాధ్యం కూడా కాకపోవచ్చు. అందుకే, ఆనంద హేలలో డోలలూపిన 55 మంది ఇంతులు, 55 జతల కళ్ళతో చూసి,రాసిన 55 ప్రాంతాలను వాళ్ళతో పాటు చుట్టొద్దాం రండి.




మనకు తెలియకుండానే నాన్న ఊరితో మొదలైన ఇంతియానం తల్లి యానంతో ముగుస్తుంది చిత్రంగా.

1. అంజలి గారి "అమ్మ కడుపు నుంచి మొదలై భూమాత కడుపున చేరేవరకు నిత్యం ప్రయాణమే కదా". ఈ వాక్యమే ఎంత ఆకర్షించిందో! అంజలి 'పకృతి ఒడిలోకి' చదువుతున్నంతసేపు నేను మా ఊరు వెళుతున్నప్పుడు పచ్చని చేల మధ్య, పంట కాలువలలో పారుతున్న నీటిని, కాలువలో చేప పిల్లలను చూస్తూ వెళ్లిన రోజుల్లోకి తీసుకెళ్ళింది.

2. అఖిల ధనుష్కోడి దారంతా అద్భుతం, కుడివైపు హిందూ మహాసముద్రం, ఎడమవైపు బంగాళాఖాతం ఎదురుగా జాప్న- శ్రీలంక. రెండు సముద్రాల నీటి రంగులు వేరు వేరు అంటూ మనల్ని ఊరించేశారు.

3 అరుణ క్వీన్ "కుమారి మాయావతి" గారితో డైరెక్ట్ గా మాట్లాడటం. పార్లమెంటు, సుప్రీమ్ కోర్ట్ ఇండియా గేట్ చూసిన ఉత్సాహం కనిపిస్తుంది.

4. ఆచార్య పి. కుసుమకుమారి  తిరుపతి కొండలు మొదలుపెట్టి, దుబాయ్, రష్యా, చైనా వియత్నాం, కంబోడియా, శ్రీలంక దేశాలన్నీ తనతో పాటు మనల్ని తీసుకెళ్లారు.

5. తనని తను వెతుక్కుంటూ వెళ్లిన 'కడలి రౌతు' నలుగురు స్నేహితులను సంపాదించుకుని సముద్రంలో తనకు తాను దొరికింది అని సంబరపడటం భలే నచ్చింది.

6. కవిత నెల్లుట్ల 'వాషింగ్టన్' లో రెడ్ ఇండియన్స్ కు అవకాశాలు తక్కువ, వివక్ష ఎక్కువ. నగర్ మేయర్ గా 'రూట్ బఫెలో' అన్నింటికీ ఎదురీది విజయం సాధించిన తీరు ఒక ఇన్స్పైరింగ్ స్టొరీ అంటారు. 


7. కాంతి నల్లూరి నాగపూర్ లో అంబేద్కర్ దీక్షభూమి, జీరో మైల్ స్టోన్ నుంచి సాంచి విశ్వవిద్యాలయం గుండా బుద్ధిని జన్మస్థానమైన లుంబిని, బుద్ధుడు మహానిర్యాణం పొందిన ఖుషి నగరం వరకు వివరించారు.

8. ఆకాశమే హద్దుగా ప్రయాణించే గిరిజ పైడిమర్రి ఉజ్బెకిస్తాన్ సిల్క్ రూట్ అంతా చూపిస్తూ అలెగ్జాండర్, చెంఘీజ్ ఖాన్, తైమూర్ లను గుర్తు చేయడం భలే నచ్చింది.

9. గోపరాజు సుధ "ఏనుగు మల్లమ్మ" ఊరు గురించి చెప్తూ ఎన్ని ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నా నా మనసుని దోచుకున్న ఊర్లు చిత్తూరు జిల్లాలోని పల్లెటూళ్లే అంటారు.

10. చంద్రలత 'ఘంటసాల' లోని బౌద్ధ కళాఖండాల గురించి, వినాయక, సుబ్రమణ్య స్వామి ధ్వజ స్తంభాల గురించి వర్ణిస్తుంటే అరే మన పక్కనే (తేనాలి, రేపల్లె) ఉన్న పురాతన ఘంటసాలను కూడా చూడలేదన్న బాధ కలుగుతుంది.

11. జయంతి లోహితాక్షణ్ తపసివనాల, దారపల్లి అడవుల్లోకి మనలను వేలుపట్టి తీసుకెళ్తూ సమస్త పక్షిలోకాన్ని ప్రతిరాత్రి వచ్చే కలల్లో చూస్తాను అంటారు.

12. ఊడుగుల జరీనా తన కళ్ళతో తాజ్ అందాలను చూపిస్తూనే అనేక కొత్త విషయాలను, చరిత్రను చెప్పడం బాగుంది. తాజ్ మహల్ రోజు మూడుసార్లు తన రంగును మార్చుకోవటం అద్భుతం కదా.

13. జ్యోతి వలబోజు 'ఎగిరిపోతే ఎంత బాగుంటుంది' అంటూ హ్యూస్టన్ లోని ఫోర్ట్ బెండ్ మ్యూజియం, నాసా గురించి వివరించారు.

14"ఏంజెల్ ద్వీపయాత్ర"లో శాన్ ఫ్రాన్సిస్కో, గోల్డెన్ గ్రేట్ బ్రిడ్జి అందాల కన్నా గీత  అన్నట్లు ఈ ద్వీప గాథలు విన్నాక అక్కడ కన్నీళ్ళన్నీ మన కంట్లోకి ప్రవహిస్తాయి. చెక్క గోడలపై చెక్కిన కవితలలో చివరి లైను 'ఈ ప్రదేశంలో ఖైదు కావడానికి తప్ప ఎందుకు వచ్చాం ఇక్కడికి' చదివి ఐ హేట్ అమెరికా అనుకున్న.

15. అరవై దేశాల, మూడువేల ప్రజలున్న, స్వంత ఆస్తిలేని ప్రయోగాత్మక పట్టణం "ఆరోవిల్లీ". డాక్టర్, టీచర్, కార్పెంటర్ ఎవరికైనా 12,000 జీతమే. ఉచిత విద్య, వైద్యం. ఆర్థిక పోటీలేని దిశగా సాగుతున్న డా. విజయలక్ష్మి  చెప్పిన ఆరోవిల్లికి ఒక్కసారి రండి.

16. అమెరికా 'అరిజోనా' లోని గ్రాండ్ క్యానియన్ లో వెతికిన విష్ణు శిఖరం,446 కి.మీ పొడవు, 29కి. మీ వెడల్పు,1.1/2 లోతున్న ఎన్నో రకాల రంగుల రాతి పొరల కొలరాడో నదిని డి.పి అనురాధ రాతల్లో చూద్దాం.

17. మలేషియా దాచుకున్న టియోమన్ ద్వీపాలు, నీలి సంద్రాలు గురించి వారణాసి నాగలక్ష్మి  విపులంగా చెప్పారు. చదివి ఆనందించాల్సిందే.

18. నాగభట్ల సంధ్యాదేవి అతిరపల్లి జలపాతం దారిలో ఎదురైన పక్షుల గురించి ఎన్నో విషయాలు చెప్పారు.

19. మంచిర్యాల లో 'క్షీర జలపాతం' వెళ్లి గాంధారి అడవిలో దారి తప్పితే ఎలా ఉంటుందో నిర్మల తిరుమణి చదువుతున్నంత సేపు భయపెట్టేరు. అడవులు కొండల్లోకి వెళ్ళేటప్పుడు గైడ్ లేకుండా వెళ్లకూడదనేది అర్థమైంది.

20. నీలిమా రావు  అరుణాచలం గుడిని, ఆధ్యాత్మికతను బహు చక్కగా చెప్పారు.

21. పద్మశ్రీ.డి 'ప్రయాణంలో పాఠాలు' అంటూ కోయంబత్తూర్ ఐద్వాసభలకు వెళ్లి, ఆ సభలనే కాక ఐదు రోజులలో డజనుపైగా స్టోరీలు చేయడం అబ్బురంకదా!

22. పద్మావతి వడ్లమూడి "రాజస్థాన్ లు" లో టూర్ ప్లానింగ్ లో చెప్పిన వివిధ కమిటీల గురించి భలే ముచ్చటేసింది. కోటలు వర్ణించిన తీరు బావుంది.

23. పి.జ్యోతి సాహసయాత్ర "భువికిదిగిన భగీరధి సన్నిధికి" టెన్షన్ గా చదివించింది. సరదాగా అరాచకటూర్ పిల్ల అనాలనిపించినా, హిమాలయ యాత్రను కళ్ళకు, హృదయానికి కట్టింది.

24. పి.రాజ్యలక్ష్మి "మలేషియా అనుభవం" ను నిజాయితీగా, అందాలతో పాటు అఘాదాలు ఉంటాయని చెప్పటం బాగా నచ్చింది.

25.ఓ.పి-116 అంటూ ప్రగతి 'సిమ్లా ప్రయాణం' అంధాలతోపాటు హిందీ భాష డామినేట్ను చెప్పటం బాగుంది.

26. ప్రతిమ సాహి "రేప్లికా ఆఫ్ ది హెవెన్ ఇన్ హిమాలయాస్" అంటూ భూటాన్ దేశాన్ని మన కళ్ళ ముందుoచారు. ఆసియా ఖండంలోనే అత్యంత సంతోషకరమైన దేశంగా భూటాన్ ర్యాంకింగ్ పొందడం, పకృతి పట్ల వారికున్న ఆరాధనను చదువుతుంటే అబ్బురం అనిపించింది.

27. 'తూర్పుమ్యూజింగ్స్'లో మణి వడ్లమాని కలకత్తా నుండి నాగాలాండ్, అస్సాం, మేఘాలయ ప్రజల జీవన విధానం చెప్పడం భలే ఉంది.

28. మనోజ్ఞ ఆలమూరు జంటగా బైక్ మీద లేహు నుండి లడక్ వరకు చేసిన భయ, సాహస యాత్రను మనం చేయలేం కాబట్టి చదివి ఆనందించాల్సిందే.

29. మమత కొణిదల "రోమ్" లో 'వియోలెత'గారి "జీవితానికే జీవితమీచ్చిన అన్నింటికీ ధన్యవాదాలు" పాటలు వినడం. ఇటలీ కమ్యూనిస్టు పార్టీ స్థాపకుడు ' ఆంటోనీయోగ్రాంసీ' సమాధిపై ఎర్రగులాబి ఉంచటం. మన 'ఫాదర్ స్టాన్ స్వామి'ని తలుచుకోవడం ఎన్నిసార్లు చదివానో! అయినా తనివి తీరలేదు.

30. మానస చామర్తి, త్రిసూర్, అతిరపల్లి జలపాతాలను మనం వెళ్లకుండానే మనకు చూపించారు.

31. మాలతి నేమని మారుథాన్ కోసం "బెర్లిన్" వెళ్లడం. బ్రాండెన్స్ ర్గ్ గేట్, టుసాడ్స్ మ్యూజియం, మన నంబర్స్ ఆటలాగే అక్కడ జరిగే మోసపు ఆట గురించి వివరించారు.

32. ముదునూరు పద్మశ్రీ ఆస్ట్రేలియా న్యూజిలాండ్ సందర్శనం, మెల్బోర్న్ లో పద్మశ్రీ లాగే నన్ను, మహిళా కాంస్య విగ్రహం చేతిలోని "నో మోర్ మేల్ అండ్ ఫిమేల్ రేట్స్ వన్ రేట్ ఓన్లీ" ఆకర్షించింది.

33. నాలుగు రోజుల్లో భూటాన్, ఈశాన్య రాష్ట్రాల అందాలు, కొండలు, లోయలు, బ్రహ్మపుత్రానది కింగ్ ఫిషర్ విలాసాల వెంట రజిని నెల్లుట్ల తిప్పేశారు.

34. కలలోకి వచ్చిన చోటు 'మేల్కోటె' ను మన వేలు పట్టి లాక్కుపోయి తన కళ్ళతో చూపించారు రేఖ జ్యోతి.

35. లావణ్య కిలారు గారి జంట నిజంగానే హంపి నుండి ముక్తేశ్వర్ వరకు సాగర తీరాల వెంట సాహస యాత్ర చేశారు.

36. లావణ్య చెరుకుపల్లి "పంత్ నుండి కౌసాని" వరకు అద్భుతమైన అడవిని చూపించారు.

37. వరలక్ష్మి కళా గ్లోబ్ స్క్రీన్ మీద స్పేస్ షటిల్ టైనింగ్, ఆస్ట్రోనాట్స్ స్పేస్ వాక్ ను, శాంటాక్రూజ్ లో మిస్టరీ స్పాట్ భలే వర్ణించారు.

38. బండారు విజయ "సంద్రం దాచుకున్న నిష్కలంకుడు" చదువుతుంటే ఇప్పటికిప్పుడు ఎగిరెళ్ళి దాగుడుమూతలు ఆడుతున్న ఆ అరేబియా సంద్రాన్ని చూడాలనిపిస్తుంది.

39. 'దివ్యదక్షిణయాత్ర' లో విద్యారాణి దక్షిణాదిన ఉన్న ఏడు పుణ్యక్షేత్రాలను, సముద్రాన్ని సమానంగా వర్ణించారు. ఇండియన్ రైల్వేస్ వేసే యాత్రల గురించి తెలిపారు.

40. 'అడివిలోకి అనంత ప్రయాణం' లో శాంతి ఇషాన్ ఊటీ, పాపికొండలు, అహోబిలం, అనంతగిరి కొండలలోకి తనతో పాటు మనల్ని ప్రయాణం చేయించారు.

41. "ఈ దేశం" లో శారదా కావూరి క్యాబ్ డ్రైవర్ గా వచ్చిన పాకిస్తానీయుడైన ఇర్ఫాన్ కుటుంబం గురించి చెప్పటం హృదయాన్ని కుదిపేసింది.

42. "ఆనందమయ దేశంలో" శీలాసుభద్రాదేవి భూటాన్, బౌద్ధవిగ్రహాలతో పాటు రచయిత్రిగాకూడా కనిపిస్తారు. 43. శైలజా చందు కైరో కథలు భలే వినిపించారు.

44. శోభరాజు 'గుర్రంకొండ కోట' కథ, చరిత్ర, శిల్పం గురించి చెబుతూ చారిత్రక కట్టడాల పట్ల

మన నిర్లక్ష్య వైఖరి తెలియజేచారు.

45. శ్రీ ఊహ హంపిలో అష్టభుజమండపం, కోటిలింగాల, విరూపాక్ష ఆలయం నిలిచి ఉండడానికి గల కిట్టుకును తెప్ప డ్రైవర్ అండ్ గైడ్ చెప్పడం భలే ఉంది.

46. సజయ కాకర్ల 1995 లో బీజింగ్ లో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం ముచ్చట్లతోపాటు, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా, బీజింగ్ లోని కోటలు గురించి గొప్పగా చెప్పారు.

47. సజల "దేవభూమి"లోని లోహార్ జంగ్, డిడ్నా, ఆలీబుగ్యాల్, పటార్ నౌబాని, రూప్ కుండ్ వరకు సాగినది సాహసయాత్రే.

48.సత్యగౌరీ తిరువళ్లూర్, కడలూరు, చిదంబర, కుంభకోణ ఆలయాల మహత్యాలతోపాటు చరిత్రను కూడా చెప్పారు.

49. సమ్మెట ఉమాదేవి జర్మనీ అనుభవాలతో జర్మనీ వారి జీవన విధానంను తెలుసుకోవచ్చు.

50. ఆస్ట్రేలియాలోని బీచ్ లు, జూలుగార్డెన్స్, సిడ్నీ హార్బర్, ఒపేరా హౌస్, ఐదు రోజుల సముద్రయానం గురించి సమ్మెట విజయ అనుభవాలలో చదవాలి.

51. సరళ కర్ణాటకలోని మడికేరి, మందలపట్ట, అబ్బే ఫాల్స్, ఇరుప్పాఫాల్స్, మల్లాలిపాల్స్ గురించి చదువుతుంటే ఇవి మన పక్కనే ఉన్నాయా! అనిపించింది.

52. బోటుహౌస్ లో స్టే, కాశ్మీరీలా జీవన విధానం, శాలువలు, గుల్మార్గ్ గురించి సరిత"కన్యాకుమారి"లో చదవాల్సిందే.

53. సునీత హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాల, బౌద్ధ ఆలయం, జ్వాలాముఖి దర్శనం, దాయిన్ శిఖరం టెక్కింగు బాగుంది.

54. సునీల ' సక్కగున్న సిక్కిం' లో సొంగోలేక్, నాథులపాస్, డార్జిలింగ్ ల గురించిన ముచ్చట్లు చెప్పేరు.

55. స్వపoతి పాపకోసం చేసిన ప్లే జోన్ల నుండి జూలు, పార్కులు, కేబుల్ బ్రిడ్జి, గోల్కొండ, చార్మినార్ల వరకు "తల్లియానం"లో చూపించారు.

అమ్మయ్య! ఆగిఆగి అరిచి అరచి చూశారు కదా? ఇంతియానం2.0 బాగుంది కదూ! మన వయస్సులను,ఆర్థికాన్ని మర్చిపోయి వీలన్నపుడు, వీలున్న చోట్లకలా వెళదాం. చూద్దాం అనిపిస్తుంది ఈ ఇంతియానం 2.0 చదివితే.కొని,చదువుతారు కదూ.

ఇంత మంచి పుస్తకం చదువుతున్నప్పుడు రచయితల ఫోన్ నెంబర్ ఉంటే, వాళ్ళ తో మాట్లాడొచ్చు అనిపించింది. ఇద్దరు ముగ్గురు ప్రాంతాల కన్నా కవిత్వం కు ప్రాధాన్యత ఇచ్చారనిపించింది.



Tags:    

Similar News