ఇస్రో లాంచ్ చేసిన అమెరికా బ్లూబర్డ్ బ్లాక్-2 ఏంటో తెలుసా?

దాదాపు 6 వేల కిలోల బ్లూబర్డ్ బ్లాక్-2 లాంచ్‌.. ఇస్రో చరిత్రలోనే ఒక రికార్డ్‌గా మారింది.

Update: 2025-12-24 09:16 GMT

శ్రీహరి కోట నుంచి LVM3-M6ను ఇస్రో విజయవంతంగా లాంచ్ చేసింది. ఈ మిషన్‌లో అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ శాటిలైట్ బ్లూబర్డ్ బ్లాక్-2(BlueBird Block-2)ను భూకక్షలోకి ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఈ బ్లూబర్డ్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అసలేంటీ బ్లూబర్డ్ బ్లాక్-2? దీని వల్ల ఉపయోగాలేంటి? దీనికెందుకు ఇంత ఇంపార్టెన్స్? ఇలా అనేక సందేహాలు కలుగుతున్నాయి.

అమెరికాకు చెందిన ప్రముఖ అంతరిక్ష కమ్యూనికేషన్ సంస్థ ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్(AST SpaceMobile) అభివృద్ధి చేసిన అత్యాధునిక బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహాన్ని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ISRO) విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది. ఈ ప్రయోగం ఇస్రో వాణిజ్య విభాగమైన న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ (NSIL)కు ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్‌తో కుదిరిన అంతర్జాతీయ వాణిజ్య ఒప్పందం కింద నిర్వహించబడింది.

 

ఇక నేరుగా ఫోన్‌లకే నెట్వర్క్

బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, ఇది ప్రత్యేక పరికరాలు లేకుండానే సాధారణ 4G, 5G స్మార్ట్‌ఫోన్‌లకు నేరుగా అంతరిక్షం నుంచి కనెక్టివిటీ అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇప్పటివరకు శాటిలైట్ కమ్యూనికేషన్ అంటే ప్రత్యేక శాటిలైట్ ఫోన్‌లు లేదా గ్రౌండ్ టెర్మినల్స్‌పై ఆధారపడి పనిచేసేవి. కానీ ఈ ఉపగ్రహం ద్వారా వాయిస్ కాల్స్, వీడియో కాల్స్, టెక్స్ట్ మెసేజింగ్, వీడియో స్ట్రీమింగ్, మొబైల్ డేటా సేవలు అన్నీ సాధారణంగా మనం ఉపయోగించే ఫోన్‌లకు నేరుగా అందనున్నాయి. దీంతో మనం ప్రపంచంలో ఏ మూలన ఉన్నా కూడా నెట్‌వర్క్ సమస్య రాదు.

అతిపెద్ద కమర్షియల్ యాంటెనా

ఈ శాటిలైట్‌లో అత్యంత కీలక సాంకేతిక అంశం ఏదైనా ఉందంటే అది అందులో బ్లూబర్డ్ బ్లాక్2 అమర్చిన విశాలమైన ఫేజ్‌డ్-అరే యాంటెనా. యాంటెనా విస్తీర్ణం 223 చదరపు మీటర్లు (సుమారు 2,400 చదరపు అడుగులు), ఇది లో ఎర్త్ ఆర్బిట్ (LEO) లో ఇప్పటివరకు ప్రయోగించిన ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య కమ్యూనికేషన్ యాంటెనా. ఈ యాంటెనా ద్వారా ఒకేసారి వేలాది మొబైల్ ఫోన్‌లను ట్రాక్ చేసి, డైనమిక్‌గా బీమ్స్‌ను మార్చుకుంటూ కనెక్టివిటీని అందించవచ్చు. ఈ భారీ యాంటెనా వల్లే భూమి మీద ఉన్న చిన్న మొబైల్ ఫోన్ యాంటెనాలకు కూడా అంతరిక్షం నుంచి స్పష్టమైన సిగ్నల్ చేరే అవకాశం కలుగుతోంది.

 

భారీ బరువు, ఇస్రో చరిత్రలో రికార్డు

బ్లూబర్డ్ బ్లాక్-2 బరువు చాలా ఎక్కువ. సుమారు 6,100 కిలోగ్రాములు (దాదాపు 6.5 టన్నులు) ఉంటుంది. దీనిని లాంచ్ చేయడం ఇస్రో చరిత్రలోనే ఒక రికార్డ్‌గా మారింది. ఇస్రో.. ఎల్‌వీఎం3 రాకెట్ ద్వారా ప్రయోగించిన అత్యంత బరువైన కమర్షియల్ శాటిలైట్ ఇదే కావడం విశేషం. అంతేకాక, లో ఎర్త్ ఆర్బిట్‌లోకి పంపిన అతిపెద్ద కమర్షియల్ కమ్యూనికేషన్ శాటిలైట్‌గా కూడా బ్లూబర్డ్ బ్లాక్-2 నిలిచింది. ఈ శాటిలైట్‌ను విజయవంతంగా భూకక్షలోకి ప్రవేశపెట్టడం ఇస్రో హెవీ-లిఫ్ట్ సామర్థ్యాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరింత బలంగా నిరూపించింది.

గ్లోబల్ కన్స్‌టెల్లేషన్‌లో కీలక భాగం

బ్లూబర్డ్ బ్లాక్-2 ఉపగ్రహం ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ నిర్మిస్తున్న గ్లోబల్ బ్లూబర్డ్ కన్స్‌టెల్లేషన్‌లో కీలక భాగం. ఇప్పటికే బ్లూబర్డ్ బ్లాక్-1 నుంచి 5 ఉపగ్రహాలు ప్రయోగించబడ్డాయి. బ్లూబర్డ్ బ్లాక్-2 అనేది ఫ్యూచరిస్టిక్ జనరేషన్ సామర్థ్యాలతో రూపొందించబడింది. భవిష్యత్తులో డజన్ల కొద్దీ ఉపగ్రహాలను రోధసిలోకి పంపాలని సదరు సంస్థ ప్లాన్ చేస్తోంది. తద్వారా 24/7 గ్లోబల్ కవరేజ్ చేయాలన్న లక్ష్యంగా ముందడుగు వేస్తోంది. ప్రారంభ దశలో అమెరికా అంతటా దాదాపు 100 శాతం కవరేజ్ లక్ష్యంగా పెట్టారు. ఈ నెట్‌వర్క్ పూర్తయితే భూమిపై ఎక్కడ ఉన్నా సెల్ టవర్ అవసరం లేకుండానే మొబైల్ నెట్‌వర్క్ అందుబాటులోకి రానుంది.

 

అత్యవసర కమ్యూనికేషన్ సామర్థ్యం

ఈ ఉపగ్రహ వ్యవస్థ మరో ముఖ్య ప్రయోజనం అత్యవసర కమ్యూనికేషన్. భూకంపాలు, తుఫానులు, వరదలు, యుద్ధాలు లేదా నెట్‌వర్క్ వైఫల్యాలు వంటి సందర్భాల్లో భూమిపై సెల్యులార్ టవర్లు పనిచేయకపోయినా, అంతరిక్షం నుంచి నేరుగా కమ్యూనికేషన్ కొనసాగుతుంది. ఇది ప్రభుత్వాలు, రక్షణ సంస్థలు, సహాయక బృందాలకు అత్యంత కీలకం.

డిజిటల్ డివైడ్‌ను తగ్గించే అడుగు

బ్లూబర్డ్ బ్లాక్-2 లక్ష్యం కేవలం టెక్నాలజీ మాత్రమే కాదు, డిజిటల్ సమానత్వం సాధించడం కూడా. గ్రామీణ ప్రాంతాలు, అరణ్యాలు, ఎడారులు, పర్వత ప్రాంతాలు, సముద్ర మధ్య ప్రాంతాలు వంటి ప్రాంతాల్లో ఇప్పటివరకు మొబైల్ నెట్‌వర్క్ చాలా పరిమిత స్థాయిలోనే అందుబాటులో ఉంది. ఆ సమస్యను అధిగమించడమే బ్లూబర్డ్ బ్లాక్-2 లక్ష్యం. ఈ ఉపగ్రహాలతో ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల మందికి ఇంటర్నెట్, కమ్యూనికేషన్ సౌకర్యాలు చేరే అవకాశం ఉంది.

ఇస్రోకి అంతర్జాతీయ గుర్తింపు

ఈ ప్రయోగం ఇస్రోకి మరోసారి ప్రపంచ వాణిజ్య అంతరిక్ష రంగంలో విశ్వసనీయతను తీసుకొచ్చింది. తక్కువ ఖర్చుతో, అధిక విశ్వసనీయతతో, భారీ ఉపగ్రహాలను ప్రయోగించే సామర్థ్యం అన్నింటిలో ISRO ముందున్నదని ఈ మిషన్ నిరూపించింది. భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ వాణిజ్య ప్రయోగాలు భారత్ వైపు వచ్చే అవకాశాలు మరింత పెరిగాయి.

Tags:    

Similar News

ఇక చాలు!

మేల్కొలుపు