‘గ్రేట్ వాల్ ఎక్కలేని వారు సాహసవీరులు కాలేరు’

దశాబ్దం క్రితం నాటి చైనా పర్యటనానుభవాలు, జ్ఞాపకాలు

Update: 2025-12-23 07:21 GMT
చైనా గ్రేట్ వాల్

చైనా అనగానే ‘గ్రేట్ వాల్’ గుర్తుకు వస్తుంది. ‘డ్రాగన్ ’ గుర్తుకు వస్తుంది. ‘డ్రాగన్ ’ చైనా పౌరాణిక కాల్పనిక రూపం కాగా, ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ ప్రపంచ వింతల్లో ఒకటైన అద్బుత చారిత్రక కట్టడం! భారత్ - చైనాల మధ్య క్రీస్తు పూర్వం నుంచే వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలున్నాయి.

భారతదేశం లాగానే ఎంతో పురాతనమైన చరిత్ర, సంస్కృతి కల చైనాను సందర్శించే అవకాశం పదేళ్ళ క్రితం నాకు లభించింది. భారత- చైనా మిత్రమండలి తరపున, మా పన్నెండు మంది సభ్యుల బృందం చైనాలో పది రోజులు పర్యటించింది. ఈ పర్యటనలో బీజింగ్, షాంఘై, షియాంగ్ నగరాలతో పాటు జుజియా జియావో గ్రామాన్ని కూడా సందర్శించాం. ఢిల్లీ విమానాశ్రయంలో 2015 డిసెంబర్ 18 వ తేదీ శుక్రవారం అర్ధరాత్రి బీజింగ్ విమానం ఎక్కాం.

ఆ మర్నాడు 19వ తేదీ శనివారం మధ్యాహ్నం చైనా రాజధాని బీజింగ్ ఎయిర్ పోర్టులో అడుగిడే సరికి, శీతవాయువులు మాకు స్వాగతం పలికాయి. ఉష్ణోగ్రతలు మూడు నాలుగు డిగ్రీలకు పడిపోయాయి. సాయంత్రం చోయాంగ్ థియేటర్లో అక్రిబేటిక్ ప్రదర్శన (శరీర విన్యాసాలు)కు వెళ్ళాం. గ్రాఫిక్స్ కు కూడా అందని అద్భుతమైన మానవ విన్యాసాలు ఎన్నో, ఎన్నెన్నో! మేం వేసుకున్న ఉన్ని దుస్తులు చలిని ఆపలేకపోతున్నాయి. రాత్రి కుంతాయ్ హోటల్ రూంకి వచ్చేసరికి చైనాలో చలికి తట్టుకునే జర్కిన్ లను మాకు చైనా అధికారులు సిద్ధం చేశారు.

థియనాన్ మెన్ స్క్వేర్

థియనాన్ మెన్ స్క్వేర్

మర్నాడు ఆదివారం ఉదయం బీజింగ్ లో చరిత్రాత్మకమైన థియనాన్ మెన్ స్క్వేర్ కు వెళ్ళాం. చైనా భాషలో థియన్ అంటే స్వర్గం అని, యన్ అంటే శాంతి అని అర్థం. చైనా విముక్తి పొందిన అక్టోబర్ ఒకటవ తేదీన సమావేశమైన మూడు లక్షల మంది ప్రజలను ఉద్దేశించి మావో ఇక్కడి నుంచే గణతంత్ర చైనాను ప్రకటించాడు. విప్లవంలో వీరోచితంగా పోరాడిన యోధుల విగ్రహాలను జీవం ఉట్టిపడేలా చెక్కి ఉన్నాయక్కడ.

మావో 1976లో మరణించాడు. ఆ ప్రాంతంలోనే మావో పార్థివ దేహాన్ని రసాయనాల లేపనాలతో భద్రపరిచిన ముసోలియం ను సందర్శించాం. రోజుకు లక్షమంది దాన్ని సందర్శిస్తున్నా, ఎక్కడా తోపులాట ఉండదు. మావో పార్థివ దేహం వద్దకు వచ్చేసరికి సందర్శకులంతా గౌరవ సూచకంగా తలదించేస్తున్నారు. థియనాన్ మెన్ స్క్వేర్ కు సమీపంలోనే ఉన్న శత్రు దుర్బేధ్యమైన పురాతన ‘ఇన్నర్ సిటీ వాల్ గేట్’ ను సందర్శించాం. సాంస్కృతిక విప్లవ కాలంలో ఇలాంటి పురాతన కట్టడాలను ఒక మేరకు కూలగొట్టారు.

చైనా జాతీయ మ్యూజియం

థియనాన్ మెన్ స్క్వేర్ కు సమీపంలోనే ఉన్న చైనా జాతీయ మ్యూజియం ప్రపంచంలోనే రెండవ అతి పెద్ద మ్యూజియం. ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడి దాకా, వారిక సంబంధించిన వివిధ కాలాల వస్తువులను పదిలక్షల వరకు సేకరించి భద్ర పరిచారు. చైనా అంతటా 3,970 మ్యూజియంలున్నాయి. వీటిలో పాతిక లక్షల వరకు సామాగ్రి ఉంది. వీటిని జాతి సంపదగా వారు పరిరక్షిస్తున్నారు.

ఫర్బిడన్ సిటీ(నిషిద్ధ నగరం)

ఫొటో ఫర్బిడన్ సిటీ(నిషిద్ధ నగరం)

రాజవంశీకుల రక్షణ కోసం, శత్రు దుర్బేధ్యమైన ఎత్తైన కోటగోడల మధ్య నిర్మించిన పురాతన మహానిర్మాణం ‘ఫర్బిడన్ సిటీ’(నిషిద్ధ నగరం). ఆదివారం సాయంత్రం ఈ నగరాన్ని సందర్శించాం. ‘మనిషి, ప్రకృతి ఒక్కటే’ అనే చైనా తాత్విక చింతన నుంచి, ఫ్యూడల్ సంస్కృతి నుంచి, ఖగోళశాస్త్ర ఆలోచన నుంచి దీనికి నిషిద్ధనగరం అన్న పేరు వచ్చింది. దీన్ని నిర్మించడానికి 15 సంవత్సరాలు పట్టిందట. చైనా వాస్తు నిర్మాణ శైలిలో నిర్మించిన వాటిలో ఇది అతి పెద్దది.

 టెంపుల్ ఆఫ్ హెవెన్ ముందు భారత చైనా మిత్రమండలి బృందం

ఫర్బిడన్ సిటీ నిర్మాణం కోసం తవ్విన కందకంతో మట్టినంతా ఒక చోట పోస్తే ఒక పెద్ద కొండయ్యింది. దాన్ని మానవ నిర్మిత కొండ అంటారు. ఈ కొండ ఎక్కితే పక్షిలా ఫర్బిడన్ సిటీనంతా వీక్షించవచ్చు. బీజింగ్ లో మూడవ రోజు ఉదయం టెంపుల్ ఆఫ్ హెవెన్(స్వర్గ మందిరం)కు వెళ్ళాం. ఈ పురాతన ఆలయంలో దేవతా విగ్రహాలేమీ లేవు. పురాతన చైనా వాస్తు శైలిలో 1420లో దీన్ని నిర్మించారు. చైనా విదేశీ వ్యవహారాల శాఖలో ఆ రోజు రాత్రి మాకు అధికారిక విందు ఏర్పాటు చేశారు.

గ్రేట్ వాల్ ఆఫ్ చైనా పై భారత-చైనా మిత్రమండలి బృందం

‘ఎవరైతే గ్రేట్ వాల్ ఎక్కలేకపోతారో, వారు సాహస వీరులు కాలేరు’ అన్నది చైనాలో ఉన్న నానుడి. చైనా వెళ్ళి గ్రేట్ వాల్ చూడకపోవడమేమిటి? అలా ఎవరైనా అక్కడికెళ్ళి గ్రేట్ వాల్ చూడలేకపోతారో, వారిని చైనాలో వింతగా చూస్తారు. మూడవ రోజు సోమవారం మధ్యాహ్నం బీజింగ్ కు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేట్ వాల్ ఆఫ్ చైనాకు వెళ్ళాం. మ్యుటైన్యు వద్దనుంచి కేబుల్ కార్ ద్వారా ఆ పర్వతం పైకి ఎక్కాం.

ప్రపంచ వింతల్లో ఒకటైన ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ తూర్పు నుంచి పశ్చిమానికి వేలాది కిలోమీటర్లు విస్తరించింది. ఉత్తర దిశ నుంచి వచ్చే దాడులను ఎదుర్కోవడానికి క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దంలో మొదలు పెట్టిన ఈ గోడ నిర్మాణం క్రీస్తు శకం 17వ శతాబ్దంలో పూర్తయింది. చైనీయుల పురాతన యుద్ధ తంత్రాల్లో భాగంగా ఈ మహాకుడ్యాన్ని నిర్మించారు. మన యోగాను పోలిందే చైనా తాయ్ చీ. సోమవారం సాయంత్రం బీజింగ్ లో తాయ్ చీ వార్షిక కార్యక్రమంలో పాల్గొన్నాం. చైనాలో చాలా మంది మన యోగాను అనుసరిస్తున్నారు.

నాల్గవ రోజు మంగళ వారం చైనా సాంస్కృతిక కేంద్రం షియాంగ్ నగరం వెళ్ళాం. హాంగ్ సామ్రాజ్య నాల్గవ చక్రవర్తి జింగ్ ఉ సమాధిని సందర్శించాం. ఇతని కాలానికి చెందిన 81 సమాధులకు గాను, పది సమాధులు మాత్రమే బైటపడ్డాయి. స్త్రీ నేల అని, పురుషుడు నింగి అని, ఆ రెంటినీ సమన్వయం చేయడమే టాయిజమని వారి విశ్వాసం. వీటిని సందర్శిస్తున్న సమయంలోనే ఉష్టోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి.

టెర్రకోట మ్యూజియం

బయటపడ్డ టెర్రకోట బొ మ్మలు

క్విన్ సామ్రాజ్యం క్రీస్తు పూర్వం 221లో ఏర్పడింది. ఈ సామ్రాజ్య తొలి చక్రవర్తి క్విన్ షియాంగ్ చైనాను ఏకఛత్రం కిందకు తెచ్చాడు. చైనా చరిత్రలో ఏర్పాటు చేసిన ఈ బలమైన కేంద్రీకృత ఫ్యూడల్ రాజ్యం 1911 వరకు కొనసాగింది. క్విన్ షియాంగ్ మరణానంతరం సమాధుల నుంచి మళ్ళీ ప్రాణం పోసుకుని వస్తాడని ప్రజల విశ్వాసం. చక్రవర్తి సమాధితో పాటు, అతనికి కావలసిన సైన్యం, ఆహారం ఆనవాళ్ళను టెర్రకోట బొమ్మలతో చేసి, వాటిని సమాధి చేశారు. ఈ సమాధులు అయిదు దశాబ్దాల క్రితం బైటపడ్డాయి. ప్రపంచంలో ఉన్న 8వ వింతగా ఇవి గుర్తింపు పొందాయి.

షియాన్ మసీదు

షియాంగ్ నగర వీధుల్లో రాత్రి పూట నాట్యం చేస్తున్న చైనీయులతో మోహన్ రెడ్డి

చైనా పురాతన రాజధాని షియాంగ్ నగరంలో క్రీస్తు శకం 742లో నిర్మించిన పురాతన షియాన్ మసీదు ఇప్పటికీ ఉంది. చైనా పురాతన నిర్మాణ వాస్తు శైలిలో నిర్మించిన ఈ మసీదులోని నాలుగు విభాగాలకు రాతితో చెక్కిన ద్వారాలున్నాయి. పెద్ద పెద్ద చెక్కబోర్డులపై ఖురాన్ ను చెక్కారు. వాటిలో 30 చైనా భాషలో ఉండగా, మిగతావి అరబిక్ భాషలో ఉన్నాయి. చైనా జనాభాలో హుయ్, యుగుర్, కజక్, టటర్ వంటి నాలుగు మైనారిటీ జాతుల వారు చైనా జనాభాలో 8.98 శాతం వరకు ఉన్నారు. షియాంగ్ నగరంలో ముస్లింలు మిగతా చైనా ప్రజలకు వస్త్ర వేషధారణలో ఏ మాత్రం భిన్నంగా కనిపించరు.

షియాంగ్ నగర వీధుల్లో రాత్రి పూట నాట్యం చేస్తున్న చైనీయులతో మోహన్ రెడ్డి

ఆ రోజు రాత్రి షియాంగ్ నగర వీక్షణకు వెళ్ళాం. నగరంలో రోడ్డుకు ఇరువైపులా వెడల్పాటి ఖాళీ జాగాలో నడివయస్కులైన స్త్రీ పురుషులు జంటలు జంటలుగా నాట్యం చేస్తున్నారు. చైనీయుల పాటలతోపాటు, కొన్ని హిందీ సినిమా పాటలకు కూడా అభినయిస్తున్నారు. మర్నాడు గురువారం అయిదవ రోజు షాంక్సీ చరిత్ర మ్యూజియం సందర్శించాం. వివిధ రాజవంశాల కాలం నాటి వస్తు సమాగ్రిని ఇందులో ప్రదర్శించారు. వివిధ కాలాల్లో మానవుడు ఎలా జీవించాడో తెలిపే బొమ్మలను తయారుచేసి, ఆయా కాలాల్లో వారి జీవన విధానాన్ని కళ్ళకు కట్టినట్టు ప్రదర్శించారు. ఇదొక చరిత్ర పుస్తకం. అదే రోజు సాయంత్రం అక్కడి ఆర్ట్ మ్యూజియంను సందర్శించాం. చైనాలో పెద్దలను ఎలా గౌరవించాలో అక్కడి పాఠశాలల్లో చెప్పడమే కాకుండా, వారికి సేవ చేయడాన్ని కూడా నేర్పిస్తారు. పెద్ద వాళ్ళకు ఎలా సేవ చేయాలో చూపే చిత్రపటం ఈ మ్యూజియంలో కనిపిస్తుంది.

చైనాలో బీజింగ్, షియాంగ్ పురాతన నగరాలు. ఈ రెండు నగరాల్లో ప్రాచీన సంస్కృతి, సంప్రదాయాలు కనిపిస్తాయి. వీటికి భిన్నంగా పశ్చిమ దేశాల సంస్కృతి కనిపించే నగరం షాంఘై. చైనా భాషలో షాంగ్ అంటే దగ్గర అని, ఘై అంటే బాగుందని అర్థం. బీజింగ్ లోని అక్రిబేటెడ్ ప్రదర్శనకు కాస్త బిన్నమైన ఒక ప్రదర్శనకు వెళ్ళాం. రెండు గంటలపాటు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసే ఈ ప్రదర్శన అంతరించిపోతున్న సర్కస్ కు ఆధునిక రూపంలా ఉంది.

హంగ్పూ నది షాంఘై నగరాన్ని తూర్పు, పశ్చిమ నగరాలుగా విభజిస్తోంది. హంగ్పూ నది ఆవలికి వెళ్ళాలి. ఉన్నట్టుంది మా వాహనం భూగర్భంలోకి వెళ్ళిపోయింది. నది కింద నుంచి 1.2 కిలో మీటర్లు భూగర్భ రోడ్డును వేశారు. పైన నది ప్రవహిస్తోంది. దాని కింద భూగర్భ రోడ్డులో మేం ప్రయాణిస్తున్నాం.

ఓరియంటల్ టవర్

షాంఘైలో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ఓరియంటల్ టవర్ నాలుగు వందల పదిమీటర్ల ఎత్తు ఉంది. అంటే దాదాపు అరకిలోమీటరు ఎత్తు. లిఫ్ట్ లోంచి పైకి ఎక్కడానికి 45 సెకండ్లు పట్టింది. హంగ్పూ నది సముద్రంలో సంగమించే ద్వీపం లాంటి ప్రాంతంలో ఈ టవర్ ను నిర్మించారు. ఈ ఓరియంటల్ టవర్ నుంచి షాంఘై నగరాన్ని విహంగంలా వీక్షించవచ్చు. టవర్ చుట్టూ అద్దాలు. ఆ అద్దాల పైన నడుస్తూ, కిందకు చూస్తే పెద్ద పెద్ద వాహనాలు కూడా చీమల్లా కనిపిస్తాయి.

షాంఘై నది ఒడ్డునే ‘ద వాటర్ ఫ్రంట్ హోటల్’ కు వెళ్ళాం. భారతీయులు నడిపే ఈ హోటల్ లో ఉత్తర, దక్షిణ భారతీయ వంటకాలన్నీ దొరుకుతాయి. ఒక భారతీయ సర్వర్ ను హిందీలో పలకరిస్తే, అతను తెలుగులో సమాధానం చెప్పాడు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఆ కుర్రవాడు హోటల్ మేనేజ్ మెంట్ లో డిప్లొమా చేశాడు. ఇతనికి అన్ని ఖర్చులూ యాజమాన్యమే భరించి, నెలకు నాలుగు వేల యువాన్లు, అంటే 40 వేల రూపాయల జీతం ఇస్తుంది.

యుగార్డెన్

పురాతన కట్టడాల మధ్య, నీటి ప్రవాహాలతో, నీటి మడుగులు, వాటిలో అందమైన రంగురంగుల చేపలు, రంగురంగుల శిలలతో యుగార్డెన్ కనువిందు చేస్తోంది. చైనీయుల ప్రాచీన నిర్మాణ శైలిలో మింగ్ రాజవంశ చక్రవర్తి జియాజియాంగ్ కాలంలో, 1559లో పెన్ యుడుయాన్ ఈ యూగార్డెన్ ను నిర్మించాడు. ఇది చైనీయుల వారసత్వ సంపద.

హంగ్పూ లో పడవ ప్రయాణం

హంగ్పూ నది లోంచి చూస్తే విద్యుత్ దీపాలతో వెలిగిపోతున్న ఓరియంటల్ టవర్, ఇతర భవనాలు

శనివారం సాయంత్రం హంగ్పూ నదిపై మా పడవ ప్రయాణం మరో అద్భుతం. పశ్చిమ షాంఘైలోని పాత నగరంలో పశ్చిమ దేశాలు కట్టుకున్న పెద్ద పెద్ద భవనాలున్నాయి. నల్లమందు యుద్ధసమయంలో బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా, ఇటలీ, స్పెయిన్, రష్యాలు చైనాను ఆక్రమించి కట్టుకున్న భవనాలివి. సన్ యట్ సేన్ నాయకత్వంలో జరిగిన జాతీయోద్యమంలో పశ్చిమ దేశాలన్నిటినీ తరిమేసి, వాటని చైనా జాతీయ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. దేదీప్యమానంగా వెలిగిపోతున్న షాంఘై నగర అందాలను వీక్షించాలంటే రాత్రి పూట హంగ్పూ నదిపై పడవలో ప్రయాణించాల్సిందే.

కాలువల మధ్య జుజియా జియావో గ్రామం

 కాలువల మధ్య జుజియా జియావో గ్రామం

కాలువ గట్లకు ఇరువైపులా పురాతనమైన ఇళ్ళతో జుజియో జియావో గ్రామం వెనిస్ నగరాన్ని తలపిస్తోంది. ఈ గ్రామ సందర్శన మా పర్యటనలో లేకపోయినప్పటికీ, గైడ్ పై వత్తిడి చేసి, మా వాహనాన్ని అటు వైపుగా మళ్ళించాం. ఈ గ్రామానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. కాలువలపై చిన్న చిన్న వంతెనలను దాటవచ్చు. ఆ గ్రామ హోటల్ లోనే ఆ మధ్యాహ్నం భోజనం చేశాం. నగరాల్లో ఉండే హోటళ్ళకు ఏ మాత్రం తీసి పోని విధంగా ఉంది. ఆ గ్రామంలో ఉండే పబ్లిక్ టాయిలెట్లు కూడా స్టార్ హోటళ్ళలో టాయిటెట్లకు తీసిపోని విధంగా శుభ్రంగా ఉన్నాయి.

షాంఘై బుక్ సిటీ

షాంఘై బుక్ సిటీలో రవీంద్ర టాగూర్ చిత్రపటం

షాంఘై బుక్ సిటీ చాలా పెద్దది. ఏడంతస్తుల ఈ బుక్ సిటీలో ఒక్కో అంతస్తులో ఒక్కో విభాగానికి చెందిన పుస్తకాలున్నాయి. అయితే 95 శాతం పుస్తకాలు చైనీయుల భాషలోనే ఉన్నాయి. షాంఘై బుక్ సిటీలో లూషన్, గోర్కీ వంటి మహా రచయితల ఫొటోల సరసన మన రవీంద్రనాథ్ టాగూర్ చిత్రపటం, ఆయన రచనలు కూడా పెట్టారు.

ఆ రోజు సాయంత్రం మా బృందం సభ్యులంతా షాపింగ్ చేశారు. నేను, నిఖిలేశ్వర్ గారు మాత్రం ఆచలిలో రోడ్డు పక్కన వారి రాకకోసం ఎదురుచూస్తూ ఉండిపోయాం. ఆ రాత్రి ఉష్ణోగ్రతలు మైనస్ డిగ్రీలకు పడిపోయాయి. చైనా వాళ్ళిచ్చిన జెర్కిన్ లు కూడా ఆ చలిని ఆపలేకపోయాయి. సోమవారం షాంఘై నుంచి బీజింగ్ వెళ్ళాలి. షాంఘై మెట్రో రైలు ఎక్కాం. ఎక్కడ ఎక్కి, ఎక్కడ దిగినా నాలుగు యువాన్లే.

బీజింగ్ లో డేవిడ్, షియాంగ్ లో హాంగ్ జాంగ్, షాంఘైలో యాంగ్ మాకు గైడ్ లుగా వ్యవహరించారు. చైనాలో ఎక్కడికెళ్ళినా మాండరిన్ (చైనా) భాషలోనే వ్యవహారాలు నడపాలి. ఇంగ్లీషు వచ్చిన ఈ ముగ్గురు గైడ్ లు చైనాలో మాకు నోరు చెవులయ్యారు. చైనాలో ఒక్కరంటే ఒక్కరు కూడా డొక్కలెండుకుపోయిన మనుషులు కనిపించలేదు. యాచకులేకాదు, స్థూల కాయులూ కనిపించలేదు. ఒక ఆరోగ్యకరమైన జాతిని చూడగలిగాం. ఆ రోజు మధ్యాహ్నమే షాంఘై నుంచి మళ్ళీ బీజింగ్ కు వచ్చి, అక్కడి నుంచి విమానమెక్కి ఢిల్లీకి, అక్కడి నుంచి హైదరాబాదుకు చేరుకున్నాం.

చైనా పర్యటన ఎలా సాధ్యమైంది?

చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ నుంచి భారత-చైనా మిత్రమండలి జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ రెడ్డి పంచశీల అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా 12 మందికి చైనాను సందర్శించే అవకాశం కల్పించారు. భారత చైనా మిత్రమండలి జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మోహన్ రెడ్డి నాయకత్వంలో చైనా సందర్శించిన మా బృందంలో నాతోపాటు నిఖిలేశ్వర్, ఎర్రయ్య, ప్రొఫెసర్ చక్రధర్, సత్యనారాయణ, సుబ్బారెడ్డి చిన్న వెంకటేశర్లు, తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News

ఇక చాలు!

మేల్కొలుపు