‘నావంటి వారికి బుక్ ఫేర్ ఒక సమ్నక్క జాతర’
హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ విశేషం
నేను ఇరవై ఐదు ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫేర్ కు క్రమం తప్పకుండా వెల్తున్నాను. ఇరవై ఏళ్లుగా హైదరాబాద్ బుక్ ఫేర్ ఉన్నన్ని రోజులు వీలైన మేరకు ప్రతి రోజు సందర్శిస్తూ కనీసం నాలుగైదు గంటలు ఉంటున్నాను. వేలాది మంది పుస్తక ప్రియులను చూస్తే ఎంత ఆనందమో! కడుపు నిండి పోతుంది. ఆకలి అనే ధ్యాస ఉండదు.. ఈ బుక్ ఫేర్ లలో వేలాదిమంది రచయితలు కళాకారులు, ఉన్నతాధికారులు , ప్రొఫెసర్లు కలిసారు.
ఈ వేదికపై నేను అనేక పుస్తకాలు ఆవిష్కరించాను. గద్దర్ ను సి నారాయణ రెడ్డిని ఒకే వేదికపైకి తెచ్చి నేను రాసిన వ్యక్తిత్వ వికాసం , జీవితం అంటే ఏమిటి? పుస్తకాలు ఆవిష్కరింప జేసాను. సాహితీ మిత్రులు కలుస్తారని నాలాగే ఎంతోమంది రచయితలు రోజూ బుక్ ఫేర్ కు వచ్చేవారు.కలిసే వారు. నావంటి వారికి బుక్ ఫేర్ ఒక సమ్నక్క జాతర, గంగా గోదావరి కృష్ణా నది పుష్కరాల వంటివి. కొందరు ఏటా కాశీ, తిరుపతి దర్శిస్తుంటారు. నాకు
బుక్ ఫేర్ అంతకన్నా పవిత్రమైన విజ్ఞాన సందర్శన. . వేలాది పుస్తకాలు. రంగు రంగుల పుస్తకాలు. రకరకా పుస్తకాలు, రకరకాల మనుషులు , అభిరుచులు. మానవ సమాజంలోని వైవిధ్యమంతా బుక్ ఫేర్ లో పుస్తకాల రూపంలో, మనుషుల రూపంలో ఒక్కచోట కొలువుదీరి కనిపిస్తారు. బుక్ ఫేర్ లో మనుషులు నడుస్తుంటే ఒక్కొకరు నడుస్తున్న గ్రంథాలయాల్లా కనపడతారు. పలకరించేదాక వారు మహనీయులని తెలియదు. తెరవని పుస్తకంలా అలా బారులు బారులుగా నిశ్శబ్దంగా కదిలి పోతుంటారు.
భూమి పుట్టుక మొదలు, భూమిపై జీవం పుట్టుక, జలం జీవం ప్రకృతి, జంతుజాలం, మానవ పరిణామం మొదలు కొని వేల ఏళ్ల నాటి నాగరికతలు, సంస్కృతి చైతన్యం,ఆలోచలు, మనిషి బుర్రలో పుట్టిన దేవుళ్లు దయ్యాలు మహిమలు, మంత్రాలు, హరపా మొహొంజోదారో, సిందునాగరికతలు, అటు తరువాత వెలసిన వైదిక సంస్కృతి రామాయణ మహాభారత పురాణ ఇతిహాసాలు బౌద్దం జైనం క్రైస్తవం, ఇస్లాం, సిక్కు, బహాయీ, ఓషో, జెకె, యోగా ధ్యాన పతంజలి పంచ కోశ శుద్ది, సమ్రాట్ అశోకుడు అక్బర్ కబీర్ మొదలు కొని మహాత్మాజ్యోతి రావు ఫూలే, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, గాంధీ, నెహ్రూ, మోడీ, పీవీ, బిల్ గేట్ట్ , ఒబామా, మార్క్సు, ఎంగెల్స్ లెనిన్, స్టాలిన్, మావో, ప్రౌధాన్, నాగార్జున, ఆది శంకరాచార్య, హిందూ, మహమ్మదీయ, ఆంగ్లేయ ప్రభువులు, మను స్మృతి, అది దాటి ముందుకు సాగిన పవిత్ర భారత రాజ్యాంగం, వేలాది పక్షులు కిల కిలలు, సైన్సు ఆవిష్కరణలు, విజ్ఞాన సర్వస్వాలు ఒక్త చోట ఒద్దికగా కొలువుదీరిన బుక్ ఫేర్ ఒక మహా ప్రపంచం. స్వర్గం నరకం వైకుంఠం కైలాసం ఎన్ని ఖగోళ పరిశోధనలు చేసినా ఎక్కడా కనపడలేదని ఆ ఊహా ప్రపంచం కూడా మనిషి సృష్టించుకున్నదే అని తెలియజెప్పే మహా గ్ంథాలు, మేధావులు, సైంటిస్టులు కళాకారులు ఒక్కచోట కలువుదీరడం బుక్ ఫేర్ లోనే సాధ్య పడింది.
లక్షలాది ఊహలు ఆలోచనలు జీవితాలు ఒక్కచోట నిశ్శబ్దంగా మన కోసం కొలువు దీరిన హైదరాబాద్ బుక్ ఫేర్ సందర్శన జీవితంలో మరుపురాని, మరిచి పోని సుమధుర జ్ఞాపకాలు, సజీవ మానవ చిత్రాలు . మనను మలిచే పుస్తకాలు. పుస్తకాలు మనుషులను మార్చుతాయి. మలుపు తిప్పుతాయి. మహోన్నతులుగా ఎదిగిస్తాయి. పుస్తకం అంటే మానవ మేధస్సు సర్వస్వం . బుక్ ఫేర్ అంటే మానవ మేధస్సు అంతా ఒక్క చోట రాశి పోసిన
పంట!