ఒక మఖ్దూమ్ మొహియుద్దీన్ కవిత

ఈ రోజు, స్వాతంత్య్ర సమర యోధుడు, ఉర్దూ కవి, కార్మిక నాయకుడు, హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత మఖ్దూమ్ మొహియుద్దీన్ పుట్టినరోజు.

Update: 2024-02-04 09:17 GMT
మఖ్దూమ్ మొహియుద్ధీన్


ఇది యుద్ధం...స్వాతంత్య్ర సమరం !


-మఖ్ధూమ్ మొహియుద్దీన్

(‘ఏ జంగ్ హై ..జంగ్ ఏ ఆజాది’ కి అనుసృజన: గీతాంజలి)

******

అవును ఇది యుద్ధం… ఇది సమరం! స్వాతంత్య్రపు జండా నీడలో జరుగుతున్న యుద్ధం !

మేం భారత దేశ ప్రజలం

నిరంకుశ పాలనలో నలిగిపోయే నిస్సహాయులం..

స్వాతంత్య్ర కాంక్షాపరులం

ఇరుకిరుకు ఊపిరాడని అద్దె ఇళ్లల్లో..దారిద్య్రంలో మగ్గిపోతున్నవాళ్ళం !

ఇది యుద్ధం.. స్వాతంత్య్రం కోసం జరుగుతున్న యుద్ధం !

ఈ భూగోళం అంతా మాదే ..

తూర్పు పడమర,ఉత్తరం, దక్షిణం…అన్ని దిక్కులు మావే !

మేం ఆఫ్రికన్లం..అమెరికన్లం...చైనీయులమూ మేమే !

మేం భారత దేశపౌరులం.. సాహసవంతులం.. మాదేశంలోనే అణిచివేయబడుతున్న  సైనికులం !

మేం...దృఢమైన ఉక్కు శరీరపు ముడుతలం !

అవునిది మా యుద్ధం! స్వాతంత్ర్యపు జండా నీడలో జరుగుతున్న యుద్ధం !

అసలు యుద్ధం పేరుతో జరిగిన యుద్ధం...

ఒక యుద్ధమేనా ?

శాంతినివ్వని యుద్ధం ?

శత్రువుని ఆకాశంలో నక్షత్రం గా చూపని యుద్ధం ఒక యుధ్ధమేనా అసలు ?

పౌరులకు స్వరాజ్యమే లేని స్వరాజ్యం ఏమిటి...ఎందుకు ?

కార్మికుడు  రాజ్య పాలన చేయలేని స్వాతంత్య్రం ఎందుకు?

అందుకే ఇది మా యుద్ధం...స్వాతంత్య్రం కోసం జరిగే యుద్ధం !

మాకు తెలుసు, ఏదో ఒక రోజు అరుణోదయం తప్పక వస్తుంది ! ఇక అప్పుడు వినండి ..

స్వాతంత్య్రమే స్వతంత్య్ర గీతం పాడుతుంది !

ఎర్రెర్రని స్వాతంత్య్రపు జెండా రెప రెప లాడుతుంది !

కళ్లారా చూడండి ..

ఈ స్వాతంత్య్రపు ..స్వాతంత్య్రాన్ని !!

అవును .. మాదే నిజమైన యుద్ధం !

స్వాతంత్య్రపు జండా నీడలో..

స్వాతంత్య్రం కోసం జరిగే యుద్ధం !


(ఈ రోజు,  స్వాతంత్య్ర సమర యోధుడు,ఉర్దూ కవి,కార్మిక నాయకుడు,హైదరాబాద్ సంస్థానంలో కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత మగ్దుమ్ మొహియుద్దీన్ పుట్టినరోజు. మఖ్దూమ్ ఫిబ్రవరి 4,1908 లో తెలంగాణా రాష్ట్రం మెదక్ జిల్లాలో పుట్టారు. బతుకు తెరువు కోసం పెయింటింగ్స్ అమ్మడం..పత్రికలు అమ్మడం చేసినా తరువాత ఎం.ఏ చేశారు.యవ్వనంలో కార్మిక ఉద్యమాల వైపు,సాహిత్య సృజన వైపు ఆకర్షితులైనారు.

మఖ్దూమ్ కార్మిక నాయకుడు.శాసనమండలి సభ్యడు. ఫాసిసానికి వ్యతిరేకంగా క్రియాశీలంగా రాజకీయాల్లో పాల్గొన్నారు. సమాజంలో అన్ని కులాల,మతాల ,వర్గాల ప్రజలు కలిసి ఒకే దస్తర్ ఖానా (భోజన శాల) కోసం కల గంటూ ప్రగతి శీల భావాలతో పీడితుల పక్షాన గళ మెత్తి కవిత్వం రాసారు.
మఖ్దూమ్ హైదరాబాద్ రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ శాఖకు తొలి కార్యదర్శి .నిజాం పాలనకు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్య పాత్రను పోషించారు.జైలు పాలవడమే కాదు..అజ్ఞాతంలో జీవితాన్ని గడిపారు.భారత కార్మిక విప్లవ చరిత్రలో ముఖ్యమైన పాత్ర పోషించారు.నాగపూర్ కామ్రేడ్ ల సహాయంతో 1930-40 లలో హైదరాబాద్ లో స్టూడెంట్స్ యూనియన్ స్థాపించారు. 1940 లో కమ్యూనిస్ట్ పార్టీలో చేరి, చంద్ర రాజేశ్వర రావు,గులాం హైదర్,రాజ్ బహదూర్ గౌర్,హమదలి ఖాద్రి.లాంటి నాయకులతో కలిసి పని చేసారు.అక్తర్ హుస్సేన్రాయ్ పురి,సిబితే హసన్ లతో కలిసి హైదరాబాద్ లో "అభ్యుదయ రచయితల సంఘం" స్థాపించారు. ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కార్పొరేషన్ కి (ఏఐటీయూసీ )కి జాయింట్ సెక్రటరీ గా చేశారు. చార్మినార్ సిగరెట్ ఫాక్టరీ,బట్టల గిర్నీ,ఆల్విన్,షాబాద్ సిమెంట్,ఏనెస్సార్ రైల్వే ఉద్యోగ సంఘం,ఎలక్ట్రిసిటీ, సిడబ్ల్యూసి,మున్సిపాలిటీ లాంటి  కంపెనీ లోని కార్మిక సంఘాలకుమఖ్దూమ్ అధ్యక్షులు అయ్యి దినరాత్రులు కార్మికుల హక్కుల కోసం పోరాడారు.1952 లో హైదరాబాద్ రాష్ట్ర శాసన సభ్యడు గా,1956-1969 ప్రతి పక్ష నేతగా ఉన్నారు.1952-55 మధ్య చైనా,సోవియట్ యూనియన్ ,తూర్పు యూరప్ దేశాలు ,ఆఫ్రికన్ దేశాలు పర్యటించారు.
మఖ్దూమ్ కి 'షాయరే ఇంక్వి లాబ్'(ఉద్యమ కవి,విప్లవ రచయిత) బిరుదు ఉంది మగ్ధుమ్ కవే కాదు నాటకకర్త, గాయకుడు,నటుడు కూడా.మగ్ధుమ్ గజల్స్ పాఠ్యంసాలు గా నే కాదు సినిమాలలో కూడా వాడారు. ఆయన రాసిన "ఏ జంగ్ హై..జంగ్ ఏ ఆజాది", "ఏ క్ చంబే లీ కే మండవే తలే","ఫిర్ చిడీ బాత్ ఫులో కి" అనే గీతాలు/గజల్స్ ప్రసిద్ధ మైనవి.)


Tags:    

Similar News