అరచేతిలో హండ్రెడ్ నవలలు : కలైడో స్కోప్

ఈ 100లను చదవలేక పోవచ్చు... ఈ పరిచయాలను చదివినా చాలు ఫలితం అనంతం.

Update: 2024-10-04 05:53 GMT

- అలజంగి మురళీధర్ రావు

ఈ మధ్య చదివిన మంచి పుస్తకాలలో “కెలైడో స్కోప్: దేశ విదేశ ప్రసిద్ధ రచనల పరిచయం” ఒకటి . డిల్లీకి చెందిన కృష్ణవేణిచారి వారం వారం సాక్షి పత్రికలో “ కొత్త బంగారం” శీర్షికన చేసిన నవలా పరిచయాలు ఇప్పుడు ఇలా పుస్తక రూపములో రావడం ఎంతో సంతోషం కలిగించిన అంశం.

ఒక సాహిత్యాభిలాషిగా నన్నెప్పుడూ ఒక ఉత్సుకత వెంటాడేది. అదేమిటంటే 1990 నాటి ఆర్థిక సంస్కరణలైన సరళీకరణ, ప్రైవేటికరణ , ప్రపంచీకరణ (Liberalization, Privatization, and Globalization: LPG) ప్రపంచాన్ని ముంచెత్తుతున్న సందర్భాన 90ల తరువాత అధమ పక్షం 2000 మిలీనియం సంవత్సరం నుండి నేటి వరకు వచ్చిన ప్రపంచ నవలా సాహిత్యమేమిటి?

ఎటువంటి ఇతి వృత్తాలతో అది వచ్చింది? అని దీని కోసం ఎప్పటి నుండో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. కొంతమంది సాహిత్య మిత్రుల వద్ద కూడా ఈ ప్రశ్నను ప్రస్తావించాను కూడా. ఆధునిక ప్రపంచ ఆర్థిక సామాజిక, గతిశీలతలో పారిశ్రామిక విప్లవం నుంచి 1929 ప్రపంచ ఆర్థిక మాంధ్యం వరకు మొదటి దశ అనుకుంటే ఈ దశకు సమాంతరంగా వచ్చిన సాహిత్యంతో మనకు కొంత పరిచయం వుంది.

అట్లాగే 1929 మాంద్యం నుంచి 1990 LPG నమూనా అమలు వరకు గల దశ రెండవది అనుకుంటే ఇందులో రెండవ ప్రపంచ యుద్దం దాని పరిణామాలు, చేసిన గాయాలు, వలస దేశాల స్వాతంత్ర్య కాంక్ష ఇత్యాది సంఘటనలు మిగిల్చిన సామాజిక పరిణామాల్ని ప్రతిబింబిస్తూ వచ్చిన సాహిత్యం అపారం.1990 నుండి LPG నమూనా అమలవుతున్న నేటి వరకు అంటే రమారమి మూడు దశాబ్దాల కాలములో చోటు చేసుకున్న సామాజిక చలనం, మానవ సంబంధాలు , వ్యక్తి - సమాజ సంబంధాలు, కుటుంబ సంబంధాలు, ప్రేమ ఇత్యాది సాంస్కృతిక నిర్మితులు, వ్యక్తి - మార్కెట్ ఆధారిత చట్రాలు, సంస్థాగత నిర్మితుల్లో సంభవించిన కుదుపులు, ఇంటర్ సెక్సువల్, ఇంటర్ పర్సనల్ సంబంధాలు, వైవాహిక సంబంధాలు, సంస్థాగతంగా చోటు చేసుకున్న నూతన ఆవిష్కరణలు, కుల, మత, భాష ఆధారిత వర్గ వైషమ్యాలు, ఇంకా ఇత్యాదివి అన్నింటిని ప్రతిబింబిస్తూ ఏదైన కొత్త ప్రపంచ సాహిత్యం, ముఖ్యంగా నవలా సాహిత్యం వచ్చిందా? వస్తే ఆదేమిటన్నది తెలుసుకోవాలన్నది నా ఉత్సుహకత.

ఈ ఉత్సాహానికి, ఉత్సుకతకు పూర్తిగా కాక పోయిన చాల వరకు సమాధానమా అన్నట్టుగా ఇప్పడే ఈ “ కలైడో స్కోప్ “ అన్న పుస్తకం నా చేతికి వచ్చింది. ఇందులో అన్ని కొత్త కథలే, కొత్త గళములే. ఒకటో రెండో మినహాయిస్తే అన్నీ కూడా 2000 నుంచి 2021 మధ్య వచ్చిన నవలలే.

ఈ నవలల మీద సంక్షిప్త పరిచయాలతో ఆకర్షణీయంగా వచ్చిన పుస్తకమే ఈ “కలైడో స్కోప్”. రెండు పేజీలలో మాత్రమే పరుచుకున్న ఈ పరిచయాలలో పరిచయ కర్త కృష్ణవేణి చారి క్లుప్తంగా కథను వివరిస్తూ, చివరలో ఆయా రచయితల రచనలు ఏ నెలలో, ఏ సంవత్సరములో ప్రచురితమైనది, వచ్చిన అవార్డులు ఏమిటి ఇత్యాదివి కూడా చెబుతారు.

పరిచయాలు పారదర్శకంగాను , నిష్పక్ష పాతంగాను సాగేయి. ఆంగ్ల సాహిత్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కృష్ణవేణి చారి “ సాహిత్య విమర్శ “ బాగా ఎరిగినదే అయినందున ఆ ప్రమాణాలతోనే పరిచయాలు ఉంటాయి. జర్మన్, అరబిక్, ఫ్రెంచి, జపనీస్, స్పానిష్, పోలిష్, ఇంగ్లిష్, అమెరికన్, అమెరికన్-ఆఫ్రికన్, అమెరికన్- ఇండియన్, పాకిస్తానీ, అఫ్ఘానిస్తానీ, ఇండియన్- ఇంగ్లీష్, డచ్, ఆఫ్రికన్, ఐరిష్, ఇండోనేషియన్, కొరియన్, స్వీడిష్ భాషా నవలలే కాక ఇంగ్లీష్ లోకి అనువాదమైన కన్నడ, మరాఠీ , తెలుగు, ఉర్దూ, మలయాళం, పార్శీ లాంటి ప్రాంతీయ భాషా నవలల పైన కూడా రమారమి 100 పరిచయాలు చోటు చేసుకున్నాయి.

ఈ పుస్తకములో 90ల తరువాత వచ్చిన ప్రపంచీకరణ పోకడలు, వ్యక్తులు, సంస్థలు, సంబంధాలు, సమాజాన్నీ ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఆ సంక్షుభిత మానవ ఆత్మ ఈ నవలల పరిచయాలలో స్పష్టా స్పష్టంగా దృశ్యమానమౌతూ వుంటుంది. రేవనిక్ ఒమ్మి రాసిన “Beside the sea” ఫ్రెంచి నవలలో “లోకం చీకటితో నిండి ఉందని, జీవించేందుకు అనువైనది కాదని, కొడుకులు పెద్దైతే తనకు ఎదురైననిరాశ, ఒంటరి తనమే వారూ అనుభవిస్తారు”ఆని అనుకుంటుంది ప్రధాన పాత్ర. నయానో మురాటో రాసిన జాపనీష్ నవల “Convenience Store Woman” లో “ఒక వ్యక్తి సమాజంలో ఇమిడే తీరాలా ? ప్రతి ఒక్కరికీ సంతోషం కలిగించేది ఒకటే అయ్యి ఉండాలా ? అని రచయిత్రి పెద్ద ప్రశ్నను లేవనెత్తుతుంది. “Die my love”అనే స్పానిష్ నవలలో రచయిత్రి ఆరియాన హారచిక్స్ “ తల్లి తనం ఒకరమైన జైలు, ఉచ్చు లాంటిది” అంటూ తల్లి తనం, స్త్రీత్వం, యాంత్రికమైన ప్రేమలని గాఢమైన స్వరంతో ప్రశ్నిస్తుంది. రచయిత్రి ఒక రకమైన ఫెమినిస్ట్ స్వరములో. “Elinar Oliphant is Completely Flied” నవలలో “ అర్థ వంతమైన సంబంధాలను ఏర్పరుచుకోవడానికి ఒక వయస్సంటూ ఉండదు అంటారు రచయిత్రి గెయిల్ హానీమన్. “ఘాచర్ ఘోచర్” కన్నడ ఆంగ్లాను వాద నవలలో ప్రధాన పాత్ర “ డబ్బులు అదుపులో ఉంచేది మనము కాదు. డబ్బే మనల్ని నీయంత్రిస్తుంది” అని అంటూ “పేదరికం అనుభవిస్తున్నప్పుడు పూర్తి కుటుంబం అంతా కలిసే భోజనం చేసేది, ఇప్పుడు మేము భోజనాలప్పుడు కలుసుకున్నాగాని, ధ్యాస మరి ఎక్కడో ఉంటుంది”. చికా ఉనుగ్వే రాసిన “On block sisters street “ అనే డచ్ నవల లైంగిక దాడుల బాధితురాల్లే వేశ్యలుగా మారడానికి ప్రధాన అభ్యర్తులు అన్న సంగతిని నొక్కి చెబుతుంది. ఏడీ మరియు లూయిస్ 70 ల్లో ఉన్నవారు ఎదురు బొదురు ఇళ్ళల్లో ఉంటారు. ఏడి కొడుకు , లూయిస్ కూతురు వేరే ఊళ్ళల్లో ఉంటారు. ఒక రోజు ఏడి లూయిస్ ఇంటికి వచ్చి “ మనిద్దరం ఎంతో కాలంగా ఒంటరిగానే గడుపుతున్నాము . రోజయితే ఎలాగో గడిచి పోతుంది. కాని రాత్రి గడవడమే కష్టం. మనం పక్క పక్కన పడుకుని కబుర్లు చెప్పుకుంటుంటే నిద్ర పడుతుంది. భౌతిక సంబంధం కోసం అడగడం లేదు. నా లైంగికేచ్ఛ ఎప్పుడో పోయింది.” అంటుంది. ఆమె కేవలం తోడు కోసమే చూస్తుందని అర్థం చేసుకున్న లూయిస్ ఆశ్చర్య పడినప్పటకి ఆ ప్రతిపాదనను అంగీకరిస్తాడు. ఇలా “Our souls at night” నవలా రచయిత కెంట్ హారుస్ వృద్ధాప్యంలో కూడా మనకు ఇష్టమైన విధంగా జీవించే హక్కు ఉండదా ? లాంటి ప్రశ్నలు లేవనెత్తుతుంది.

“Room” నవలలో పిల్లాడు జాక్ తను, తన అమ్మ ఇరువురు అనుకోని పరిస్థితులలో ఒక సీలు చేయబడ్డ గదీలో ఏడేళ్ళు ఉండి పోతారు. తర్వాత బయటి ప్రపంచానికి వచ్చిన జాక్ కొన్నాళ్ళు ఉండిన తరివాత ఏమంటాడో తెలుసా!? “ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూసేను. చాలు, అలసిపోయాను, గదికి వెళ్ళి పోదాం. గదిలో మాకు అన్ని పనులూ చేసే టైముండేది. ఈ బయటి ప్రపంచంలో కాలం ఒక చోట నిలువ కుండా వెన్న లాగా ప్రపంచమంతటా పాకి పోవడం వల్లమనేమో అందరికీ పరిమితమైన సమయమే ఉంది.” అంటాడు. ఇది ఎమ్మా డోనాగ్వే “Room”నవలలో చెప్పిన సత్యం. లౌరెన్ గ్రాహం రాసిన “Someday, Someday, maybe” నవలలో యువత దేన్నైనా పిచ్చిగా గాఢంగా కోరుకోవడం, తమను తాము అర్థం చేసుకోకపోవడం గురించినది.

భయం జీవితాల్లో ఎంత పెద్ద పాత్ర పోషిస్తుందో జీవితాలని అడ్డగించి, నిర్వచించి, మలుపులు తిప్పగలదో చెప్పే నవల రాకేష్ సత్యాల్ రాసిన “ No one can pronounce my name”. దొర్టే నాయర్స్ రాసిన డానీష్ నవల “Mirror, Shoulder ,Signal”లో “పాశ్చాత్య సంస్కృతి యొక్క బ్రహ్మాండమైన శవం మీద నేనొక పరాన్న జీవిని” అంటూ ఒక 41 ఏళ్ళ సోనియా పలికే మాటలు కళ్ళు తెరిపిస్తాయి. “ఉన్న దానికన్నా ఎక్కువ కావాలనుకోవడం పాపమా?” అంటూ ప్రశ్నిస్తూ ప్రపంచీకరణపు మరో పోకడను చూపిస్తుంది. అరవింద్ అడిగ “ Last man in the tower” నవల. అమీర్ టాగ్ విల్సిర్ అరబిక్ నవల “French Perfume” లో సాంకేతితకు, సాంకేతిక పరికరాలకు బానిసైన మన సమాజాన్ని వ్యంగ్యంగా విమర్శిస్తుంది. బిల్ కలెగ్ రాసిన “Did You Ever Have a Family” లో జీవితం కఠోరమైనదైనప్పటికి మనం చేయగలిగిందల్లా మన పాత్రలను మనం పోషించి, ఒకరితో ఒకరు కలిసి ఉండటమే అన్న మోటెల్ వెయిటరేస్ సిస్సీ అన్న మాటలు ఎంతటి నగ్న సత్యమో మనకు తెలుస్తుంది.

డిల్లీ లోని గుర్గామ్ ధనికుల గేటెడ్ ఇళ్ళకి అందె నిరంతర నీరు, విద్యుత్ సరఫరా గురించి, వారికి సామాజిక హోదా కల్పించే గోల్ఫ్ ఆట గురించి చెబుతూ “ఇంత అసామనత్వాన్ని సమాజం ఎంత కాలం సహించగలదు?” అని పేదలపైన ప్రైవేటీకరణ ప్రభావం గురించిన రచయిత పరిశీలనలే సారనాథ్ బెనర్జీ రాసిన “All Quiet in Vikaspuri” నవలా ఇతివృత్తం. ఇలా “కలైడొ స్కోప్” అనే పుస్తకం ముగించే సరికి బహు రూపాల ప్రపంచీకరణ అనంతర జీవన సమ్మేళనం ఓ పీడకలై నిలిచి మన హృదయాలను మెలిపెడుతుంది. నవలలన్నీ చదవలేక పోయినా , ఈ 100 నవలల పరిచయాలను చదివినా చాలు ఫలితం అనంతం.

Tags:    

Similar News