ఋష్యశృంగుడు పుత్రకామేష్టి చేశాడా, చేయించాడా?!
రామాయణంలో నిరుత్తరకాండ-8 : నేడు పండితులతోపాటు సాధారణ పాఠకులు కూడా పురాణాలను చదివే అవకాశం ఏర్పడినందున తికమకలకు ఆస్కారం లేకుండా సుబోధకంగా వాటిని వివరించడం అవసరం.
ఋష్యశృంగుడు పుత్రీయేష్టి(పుత్రకామేష్టి)ని చేశాడా, చేయించాడా?!
14వ సర్గ ముగుస్తూ, 15వ సర్గ ప్రారంభమవుతూనే రామాయణమూలకర్తా, తాత్పర్యరచయితా కూడా మన ముందు నిలబెట్టిన ఓ పెద్ద ప్రశ్నార్థకం ఇది.
అశ్వమేధం ముగిసిన తర్వాత దశరథుడు ఋష్యశృంగునితో మాట్లాడుతూ, “కులానికి వృద్ధి కలిగించడానికి నువ్వు అర్హుడి”వని అన్నట్టు 14వ సర్గలోని 56వ శ్లోకం చెబుతోంది( తతో Zబ్రవీత్ ఋష్యశృంగం రాజా దశరథస్తదా/కులస్య వర్ధనం త్వం తు కర్తుమర్హసి సువ్రత). “పిమ్మట దశరథుడు “ఓ మహామునీ! నా వంశము యొక్క వృద్ధికి హేతువగు కర్మను చేయుము” అని ఋష్యశృంగుని ప్రార్థించెను” అని - ఈ శ్లోకానికి పుల్లెల శ్రీరామచంద్రుడు గారి తాత్పర్యం. ఇందులో ఋష్యశృంగునితో దశరథుడు కర్మను ‘చేయ’మన్నాడు కానీ ‘చేయించ’మని అనలేదు.
దానికి ఋష్యశృంగుడు ఏమన్నాడో ఆ తర్వాతి శ్లోకం(57) ఇలా చెబుతుంది:
తథేతి చ స రాజాన మువాచ ద్విజసత్తమః
భవిష్యన్తి సుతా రాజాం శ్చత్వార స్తే కులోద్వహాః
“ఆ బ్రాహ్మణోత్తముడు అలాగే నని చెప్పి , నీకు కులాన్ని ఉద్ధరించే నలుగురు కొడుకులు పుట్టగల”రని రాజుతో అన్నాడని ఈ శ్లోకానికి అర్థం. దీనికి పుల్లెలవారి తాత్పర్యం ఇలా ఉంటుంది: “ఓ రాజా! అటులనే చేయించెదను. నీకు వంశోద్ధారకులైన నలుగురు కుమారులు పుట్టగలరు- అని ఋష్యశృంగుడు పలికెను”. ఇందులో ‘తథేతి’ అనే మాటకు ‘అట్లాగే’ ననో, లేదా ‘అట్లాగే జరుగుతుంద’నో అర్థం చెప్పుకుంటే ఇబ్బంది లేదు. కానీ పుల్లెలవారు ‘అటులనే చేయించెదను’ అని అర్థం చెప్పారు. వారి ప్రకారమే చూసినా, పైన దశరథుడు అడిగినదేమో ‘కర్మను చేయుము’ అని! దానికి ఋష్యశృంగుడు అన్నదేమో ‘అటులనే చేయించెదను’ అని! చేయడానికి, చేయించడానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకు, మన ఇళ్ళల్లో పెళ్ళో, సత్యనారాయణవ్రతమో తలపెట్టినప్పుడే చూడండి; పురోహితుడు మనచేత వాటిని చేయిస్తాడే తప్ప తను చేయడు. అంటే కర్తృత్వం మనదే కానీ పురోహితుడిది కాదు.
దీనితో 14వ సర్గ ముగిసి, 15వ సర్గ మొదలవుతుంది. మేధావీ, వేదవేత్త అయిన ఋష్యశృంగుడు కొంచెం ఆలోచించి, (ఏ కర్మ చేస్తే బాగుంటుందో)గుర్తుచేసుకుని దశరథునితో ఇలా అన్నాడు:
ఇష్టిం తేZహం కరిష్యామి పుత్రీయాం పుత్రకారణాత్
అథర్వశిరసి ప్రోక్తైర్మంత్రైః సిద్ధాం విధానతః
“నీకు పుత్రులు కలుగుటకై, పుత్రీయేష్టిని చేయించెదను. దీనిని అథర్వశిరస్సు అనెడి వేదభాగములలోనున్న మంత్రములచే చేయించవలెను” అని ఈ శ్లోకానికి పుల్లెలవారు ఇచ్చిన తాత్పర్యం. శ్లోకంలో లేకపోయినా ‘వేదభాగములోనున్న’ అనే మాటను అదనంగా చేర్చడం; శ్లోకంలో ఉన్న ‘విధానతః’ అనే మాటకు ‘శాస్త్రానుసారంగా’ అని ప్రతిపదార్థంలో అర్థం చెప్పి తాత్పర్యంలో వదిలేయడం పెద్ద అభ్యంతరాలు కావనుకుందాం. కానీ శ్లోకంలో ఉన్న ‘కరిష్యామి’ అనే మాటకు ప్రతిపదార్థంలో ‘చేయగలను’ అని అర్థమిచ్చి, మళ్ళీ తాత్పర్యంలో ‘చేయించెదను’ అనే అర్థం చెప్పడం మాత్రం అభ్యంతరకరంగానే కనిపిస్తుంది. దాంతో ఋష్యశృంగుడు యాగం చేశాడా, చేయించాడా అన్న ప్రశ్న మరింత బిగుసుకుంది.
ఆ తర్వాతి శ్లోకం ఋష్యశృంగుడే ‘చేశా’డని ఇలా చెబుతోంది:
తతః ప్రాకామ్య తామిష్టం పుత్రీయాం పుత్రకారణాత్
జుహావ చాగ్నౌ తేజస్వీ మంత్రదృష్టేన కర్మణా
తేజశ్శాలి అయిన ఋష్యశృంగుడు పుత్రులకోసం పుత్రీయేష్టిని ప్రారంభించి మంత్రోక్తవిధానంతో అగ్నిలో హోమం చేశాడని ఈ శ్లోకార్థం. దీనిప్రకారం, ఋష్యశృంగుడు పుత్రీయేష్టిని తనే ప్రారంభించి తనే అగ్నిలో హోమం చేశాడు. ఈసారి పుల్లెలవారి తాత్పర్యం కూడా అదే చెబుతోంది: “బ్రహ్మతేజోవంతుడగు ఋష్యశృంగుడు దశరథునికి పుత్రులు కలుగుటకై పుత్రీయేష్టిని ప్రారంభించి, మంత్రోక్తవిధానముతో అగ్నిలో హోమము చేసెను”.
ఆ తర్వాత, 16వ సర్గలోని 9, 11 శ్లోకాల దగ్గరికి వచ్చేసరికి అవి దశరథుడే యాగం ‘చేశా’డని చెబుతున్నాయి. 9వ శ్లోకానికి(స చాప్యపుత్రో నృపతిస్తస్మిన్ కాలే మహాద్యుతిః/అయజత్ పుత్రియామిష్టిం పుత్రేప్సు రరిసూదనః) “గొప్ప తేజస్సు కలవాడును, శత్రుసంహారకుడును అగు దశరథుడు పుత్రులు లేకపోవుటచే...పుత్రులను ఇచ్చు ఒక యాగము చేయుచుండెను” అని పుల్లెలవారి తాత్పర్యం. శ్లోకంలోని ‘అయజత్’ అనే మాటకు యజించెను, చేసెను అని ఆయన అర్థమిచ్చారు. 11వ శ్లోకానికి వస్తే(తతో వై యజమానస్య పావకాదతులప్రభమ్/ప్రాదుర్భూతం మహద్భూతమ్ మహావీర్యం మహాబలం), “దశరథుడు యజ్ఞము చేయుచుండగా ఆ అగ్నికుండమునుండి సాటిలేని కాంతిగల ఒక మహాభూతము ఆవిర్భవించెను. దాని బలపరాక్రమములు అసాధారణములు” అని దానికి పుల్లెలవారి తాత్పర్యం. ఇందులో ‘యజమానస్య’ అనే మాటకు ‘యాగము చేయుచున్న ఆ దశరథుని యొక్క’ అని ఆయన అర్థం చెప్పారు.
యజ్ఞం చేసే వ్యక్తికి ‘యజమాను’డని, చేయించే వ్యక్తికి ‘యాజకుడు’, లేదా ‘యాజ్ఞికు’డనే పేర్లు విడివిడిగా స్పష్టంగానే ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా యాగం చేసేది దశరథుడు, చేయించేది ఋష్యశృంగుడన్నదీ స్పష్టమే. మధ్యలో ‘చేయడం’, ‘చేయించడం’ గురించిన ఈ తికమక ఎందుకు రావాలనేది అసలు ప్రశ్న. ఈ ప్రశ్నను ముందుకు తేవడం వెనుక రంధ్రాన్వేషణదృష్టి కానీ, మహాపండితులైన పుల్లెలవారిలో పనిగట్టుకుని తప్పులెంచే ఉద్దేశం కానీ లేనేలేవని ప్రత్యేకించి మనవి. మన వేద, పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్రాల అధ్యయనమూ, వాటి గురించిన చర్చలూ గతంలో పండితులకు పరిమితం కావచ్చు కానీ, ఇప్పుడు సార్వత్రికమయ్యాయి. పండితులతోపాటు సాధారణపాఠకవర్గం కూడా వాటిని చదివే అవకాశం ఏర్పడింది. కనుక ఈ సాధారణపాఠకవర్గాన్ని దృష్టిలో పెట్టుకుని వాటిని తికమకలకు ఆస్కారం లేకుండా సుబోధకంగా వివరించవలసిన బాధ్యత ఈనాటి పండితులపై అదనంగా పడింది. ఇంతకుముందు ఒకసారి చెప్పినట్టు, పాఠకులకు రాగల సందేహాలను ముందే గమనించుకుని వివరణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా నేటి వ్యాఖ్యాతలకు ఉంది. అర్థబోధలో స్పష్టత కానీ, అవసరమైన సందర్భాలలో తగిన వివరణ కానీ ఎక్కడైనా లోపిస్తే వాటిని ఇక్కడ ఎత్తి చూపడం కేవలం పాఠకదృష్టితోనే!
***
ఋష్యశృంగుడు పుత్రీయేష్టిని ప్రారంభించి, అగ్నిలో హోమం చేయగానే రంగస్థలం భూలోకం నుంచి దేవలోకంలోకి మారిపోయింది. దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యథాశాస్త్రంగా యజ్ఞభాగాలను స్వీకరించడం కోసం సమావేశమయ్యారనీ, వారు బ్రహ్మదేవునితో గొప్పవైన కొన్ని విషయాలు మాట్లాడడం ప్రారంభించారనీ 15వ సర్గలోని 4,5 శ్లోకాలు చెబుతాయి(తతో దేవాః సగన్ధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః/భాగప్రతిగ్రహార్థం వై సమవేతా యథావిధి; తాః సమేత్య యథాన్యాయం తస్మిన్ సదసి దేవతాః/అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మాణమ్ వచనం మహత్).
ఇక్కడ కూడా చిన్న తికమక ఏర్పడింది. పై శ్లోకాలు దేవతల సమావేశమయ్యారని మాత్రమే సూటిగా స్పష్టంగా చెబుతున్నా, పుల్లెలవారు తాత్పర్యంలో మూలంలో లేని ‘అచట’ అనే మాటను అదనంగా చేర్చడంతో దేవతలు దశరథుని యాగం జరిగే ప్రదేశానికే వచ్చి అక్కడ కలసుకున్నారనే భావనకు తావిచ్చింది. దానికి కొనసాగింపుగా, పైన ఉదహరించిన రెండో శ్లోకం చెబుతున్న ‘ఆ సదస్సులో’ (తస్మిన్ సదసి) అనే మాటలు యాగసందర్భంలో జరిగే సదస్సును ఉద్దేశించాయా అనిపిస్తుంది.
దానినలా ఉంచి, ఇక్కడ కొన్ని విశేషాలను చెప్పుకోవాలి. ఒకటేమిటంటే, ఇంతవరకు వదులు వదులుగా పేలవంగా అనిపించే కథనం కాస్తా దేవతల రంగప్రవేశం దగ్గరినుంచి మంచి ఉరవడిని తెచ్చుకుంటుంది. అక్కడక్కడైనా మంచి బిగువు, ప్రౌఢత, ఆహా అనిపించే ఆలంకారికత కనిపిస్తాయి. ఇంకా చెప్పాలంటే, కథనం నాటకీయతను సంతరించుకుని ఇప్పటి పరిభాషలో అచ్చంగా సినిమాటిక్ దృశ్యీకరణను తలపిస్తుంది. నిజానికి ఈ సినిమాటిక్ లక్షణం ముందు ముందు రామాయణంలో చాలా చోట్ల కనిపిస్తుంది. కథనంలో హఠాత్తుగా వచ్చిన ఈ మార్పును బట్టి ఋష్యశృంగుని వృత్తాంతంతో సహా ఇంతవరకూ ఉన్న భాగాలను ఎవరో దుర్బల కథకులు చొప్పించారన్న భావన బలపడుతుంది. అలాగని ఆ తర్వాతి భాగాల్లోనూ దక్షత లోపించిన నాసిరకం కథకుల చేయి పడలేదని కాదు. ప్రస్తుత పుత్రీయేష్టి ఘట్టంలోనే పునరుక్తులు, వైరుధ్యాల రూపంలో అది కనిపిస్తూనే ఉంటుంది. పుల్లెలవారు తమ వివరణలో వాటిని ఎత్తిచూపకపోవడం మరో విస్మయం.
ప్రత్యేకించి, ఇప్పుడు మన మాట్లాడుకుంటున్న పుత్రీయేష్టి సందర్భంలో ఈ సినిమాటిక్ దృశ్యీకరణ ఒకవిధమైన ఉద్రిక్తతా, అద్భుతత్వాల అంచులు దాటుతూ, మహాభారతంలో ద్రోణుని చంపగల పుత్రసంతానం కోసం ద్రుపదుడు చేసిన క్రతువును గుర్తుచేస్తుంది. దశరథుడి పుత్రీయేష్టినీ, ద్రుపదుడి క్రతువునూ పోల్చి చెప్పుకోడానికి వేరే కారణాలు కూడా ఉన్నాయి కనుక వాటిలోకి తర్వాత వెడదాం.
ఇంకొక విశేషమేమిటంటే, ఇక్కడ భూలోకంలో పుత్రసంతానం కోసం దశరథుని యాగం జరుగుతూ ఉంటే; ఆ యాగంతో ముడిపడే, దానికి సమాంతరంగా అక్కడ దేవలోకంలో దేవతల మధ్య వేరేరకమైన మంతనాలు జరుగుతూ ఉంటాయి. క్రియ ఒకటే కానీ లక్ష్యాలు వేరన్నమాట. దశరథుడి లక్ష్యం కేవలం పుత్రసంతానమే కాగా; దేవతల లక్ష్యం రావణసంహారం. పైన పేర్కొన్న 5వ శ్లోకం బ్రహ్మదేవునితో దేవతలు మాట్లాడడం ప్రారంభించారని చెప్పిన గొప్పవైన విషయాలు (అబ్రువన్ లోకకర్తారం బ్రహ్మాణమ్ వచనం మహత్) రావణునికి సంబంధించినవే. ఆవిధంగా రావణుడు రామాయణంలో ఇంత ప్రారంభదశలోనే, బాలకాండలోనే, రాముడు ఇంకా పుట్టకుండానే చాలా ప్రముఖంగా అడుగుపెడతాడు. ఆ అడుగుపెట్టడం ఎలాంటి భావన కలిగిస్తుందంటే, రామాయణం ఆద్యంతం ప్రధానంగా రాముడి గురించీ, ఆయన పితృవాక్యపాలన గురించీ, ఆయన సద్గుణాల గురించీ, ఆయన పరాక్రమం గురించీ, పరిపాలన గురించి కాక; రావణసంహారం గురించి చెప్పడానికి ఉద్దేశించినదని! రామాయణ కథ మొత్తాన్ని వ్యాఖ్యానించడానికి ఇదొక ముఖ్యమైన కోణం; కాకపోతే కాలగతిలో మరుగునపడిన కోణం. రామాయణానికి ‘పౌలస్త్యవధ’, ‘సీతాచరితం’ అనే పేర్లు కూడా ఉన్న సంగతిని వాల్మీకి స్వయంగా చెప్పడాన్ని ఇక్కడ గుర్తుచేసుకోవాలి. పౌలస్త్యుడంటే రావణుడు.
మిగతా విషయాలు తర్వాత...