కథను ఇట్లా గదా చదవవలసిందని చెప్పే ‘కథాసమయం’
భూమన్ ‘ఆర్ ఎం ఉమమహేశ్వర రావు పుస్తకం’ పరిచయం;
By : భూమన్
Update: 2024-08-16 01:50 GMT
సినిమా తీసేవారు తమ కోసం కాదు గదా తీస్తున్నది. చూపరుల కోసం, మనకోసం. ఆ సినిమాను చూసే పద్ధతి వొకటి ఉంటుంది. అర్థం చేసుకొని ఆనందించే కోణం వొకటి ఉంటుంది.
అట్లాగే కథను రాసేవాడు తన కోసం కాదు గదా రాస్తున్నది. చదువరుల కోసం, కథా పాటక ప్రియులకోసం, మనకోసం.
తెలుగు కథ చాలా దూరం ప్రయాణించింది. ఈ జర్నీలో ఉన్న మలుపులు, ఎత్తు పల్లాలు సమాజపు లోతుల్లోకి ప్రయాణించి కొత్త కొత్త సంగతులు చెబుతున్నది.
కథ చదువరికి చేరువయింది. ఆలోచింపజేస్తున్నది. ప్రేరణ కలిగిస్తున్నది. చైతన్య పరుస్తున్నది.
ఇప్పటి కథల్ని ఏరికోరి ఆర్. ఎం. ఉమా మహేశ్వరరావు ''కథా సమయం'' లో అద్భుతమయిన దారుల్ని చూపిస్తున్నాడు. కథను ఎలా చదవాలి. విషయాన్ని ఎలా పసిగట్టాలి. చదువురులంగా మనం ఎంత నేర్చుకోవాలి. సమాజాన్ని వొడుపుగా ఎట్లా అందిపుచ్చుకోవాలి అనీ అంశాల గురించి ఒక కథా గురువుగా, గైడుగా, ప్రచార కర్తగా విలక్షణమయిన రీతితో ఉమా ఈ పుస్తకాన్ని మనకందిస్తున్నాడు.
ఇట్టాంటిది ఇంతకుముందు నేన్నడూ వినలేదు. చదవలేదు. ఒక మంచి రాయని కథకుడిగా, ఉదాత్తమయిన పాఠకుడిగా ఉమా ఒక అపురూపమయిన పరామర్శ ఇది.
కథను ఇట్లా గదా చదవవలసిందని చెబుతున్న ఉమా కథకుల గురువుగా, చదువరుల గైడుగా ఈ కథా సమయంలో స్థిరపడుతున్నాడు. తప్పక విధిగా చదవవలసిన అద్భుత పుస్తక మీ కథా సమయం.