జీవితంలో, రాజకీయాల్లో, సాహిత్యంలో ‘విద్రోహి’
కాజీ నజ్రుల్ ఇస్లాం
“నా నుంచి వేణువులు తీసుకున్నంత మాత్రాన దాని మధుర స్వరం ఆగదు. నేను మరొక వేణువుకు ఈ మధుర స్వరాన్ని అందించగలను. ఇది వేణువులోని మధుర స్వరం కాదు. నా మనసులోనిది. నేను సృష్టించిన వేణువు లోనిది. కనుక తప్పు వేణువుది కాదు. మధుర స్వరానిది కాదు. వేణువు నాలో వున్నది. నేను స్వరాన్ని ఆలపిస్తున్నాను. నా కంఠంలో నుంచి వచ్చిన మాటల వల్ల నేను నిందార్హుణ్ణి కాను” అని చెప్పిన మహాకవి, తిరుగుబాటు దారుడూ కాజీ నజ్రుల్ ఇస్లాం (Kazi Nazrul Islam).
“నా రచనలు సత్యాన్నీ, ఆత్మభావావేశాన్ని ఆవిష్కరిస్తాయి. ఎందుకంటే, ఏక్ తార అనే సంగీత సాధనానికి ఒకటే తీగ వుంటుంది” అని అన్నదీ ఆ మహానుభావుడే!
నజ్రుల్ ఇస్లాం అంటే కవిత్వం, పొంగిపొర్లే సంగీతం. ధిక్కారం. అగ్నిలాంటి ఆవేశం! బంగ్లాకి చెందిన ప్రపంచ ప్రఖ్యాత కవి నజ్రుల్ ఇస్లాం. మరో తిరుగుబాటు కవి వరవరరావు, జైల్లోనే నజ్రుల్ కవితలను అనువదించారు. కవుల్నీ సాహితీవేత్తల్నీ కదిలించిన ఆయన ప్రసిద్ధ కవిత ‘విద్రోహి’ పేరుతో ఈ కొత్త పుస్తకం విడుదల అవుతోంది. నిర్బంధంలో జైలు గోడల మధ్య మగ్గుతూనే వరవరరావు ఈ మహత్తరమైన కృషి చేశారు. ఎంతో శ్రద్ధతో, నిబద్ధతతో, ప్రేమతో! నజ్రుల్ ‘విద్రోహి’ నుంచి కొన్ని నిప్పు రవ్వలు:
నేను శివుణ్ణి నా జడలు కట్టిన శిరోజాల్లో గంగోత్రి దగ్గర
ఉన్మాద జలపాత ధారను బంధించినవాణ్ణి
నిర్భయుడా చెప్పు నా శిరసెపుడూ వున్నతంగా నిలుస్తుందని,
నేను బెతూన్ ను, నేను చెంఘీజ్ ను
నాకు నేను తప్ప ఎవరికీ నమస్కరించను
నేను పిడుగు గర్జనను-శివుని శంఖ ఓంకార స్వరాన్ని
నేను శివుని ఢమరుకాన్ని, త్రిశూలాన్ని,
నేను యముని మహత్తరన్యాయాన్ని అమలు చేసే యమదండాన్ని!
ఆదిమ ఓంకార భయంకర కోలాహలాన్ని !
నేను విష్ణు మహత్తర చక్రాన్ని, శంకాన్ని,
నేను ఉన్మాద సన్యాసులు దూర్వాస , విశ్వామిత్రుల శిష్యుణ్ణి !
నేను దావానలాన్ని, విశ్వాన్నంతా దహనం చేస్తాను!
నేనుగుండెలు విప్పి నవ్వుతాను... నిర్దయ స్వీయ నిశ్చయాన్ని
నేను అరుణ రక్త యువతను,
దేవుణ్ణి విధేయుణ్ణి చేసుకునేవాణ్ణి-
170 లైన్ల సుదీర్ఘ కవితలో ఇవి కొన్ని పంక్తులు మాత్రమే ! అల్లాని గాఢంగా ప్రేమిచిన ఒక ముస్లిం కవి యిలా రాస్తాడని మనమెరమైనా వూహించగలమా ! రంగం ఏదైతేనేం... త్రికరణ శుద్ధిగా నజ్రుల్ ఇస్లాం తిరుగుబాటుదారుడు.
ప్రసిద్ధ కవయిత్రి మౌమితా ఆలం , ఈ ' విద్రోహ ' కవిత్వానికి ముందు మాట రాస్తూ, "మా వంటి కవులకు ఈ సంపుటం శక్తినిస్తుంది. ఇది కేవలం అనువాదం కాదు. ఇది తమ తమ కాలాల్లో పీడక రాజ్యాన్ని ధిక్కరించిన, ధిక్కరిస్తున్న ఇద్దరు మహాకవుల సంగమం. ఈ ఇద్దరు కవులూ ప్రజాగళంగా నిలిచారు. ఈ అనువాదం, రాజీ పడడానికి నిరాకరిస్తున్న మన యువతరం కవులకు, స్వాప్నికులకు , ఆలోచనా పరులకు అందిస్తున్న గత తరాల వారసత్వ సంపద కానుక. ఇందుకు మనం వరవరరావుకు కృతజ్ఞులమై ఉండాలి," అన్నారు.
1922లో నజ్రుల్ ఇస్లాం రాసిన ‘విద్రోహి’ కవితలో, "నేను ఆర్పియస్ (రాత్రి అంధకార దేవత) వేణువును. జ్వరపడిన ప్రపంచానికి నేను నిద్ర తెప్పిస్తాను. ఆయాస పడుతున్న నరకదేవాయలం భయంతో మరణించేలా చేస్తాను. నేను భూమికి , ఆకాశానికి విప్లవ సందేశం తెస్తాను. నేను సదా విద్రోహిని. నేను ఈ ప్రపంచానికతీతంగాశిరస్సు ఎత్తుతాను. చాలా ఉన్నతంగా ఒక్కణ్ణే , స్థిరంగా ” అన్నారు.
"జైలు ద్వారాలు బద్దలు కొట్టండి " అని మరో ఉద్రేకపూరిత కవితలో.. " ఓ తిరుగుబాటు యువతా, జైలు ఇనుప ద్వారాలు బద్దలు కొట్టండి. విధ్వంస దినం భేరి మోగించండి. ప్రాచీ ద్వారం మీద విధ్వంస పతాక ఎగరేయండి. ఎవరు శాసకుడో , ఎవరు బానిసలో ఎవరు నిర్ణయిస్తారు ? మీ శిక్షను ఎవరు నిర్ణయిస్తారు ? జైలు చీకట్ల కటకటాలకు నిప్పంటించండి. స్వేచ్ఛా ఉత్సవం జరుపుకోండి, అని పిలుపు యిచ్చారు."
భీమా కోరెగావ్ ఎల్గార్ పరిషత్ కేసులో కోర్టు వరవరరావుకి రెండు నెలలు హౌస్ అరెస్ట్ విధించినపుడు, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నడుపుతున్న రచయిత్రి గీతా రామస్వామి , సుభాస్ చంద్రబోస్ లేదా నజ్రూల్ ఇస్లాంపై రాయమని కోరారు. నజ్రూల్ పై రాస్తానని వరవరరావు ఒప్పుకున్నారు. ఏకంగా 65 కవితల్ని అనువదించారు. వరవరరావు ముందు మాట రాస్తూ, "మత సామరస్యం కోసం నజ్రూల్ సాహిత్యం, సంగీతం, రాజకీయాల్లో చేసిన కృషి రవీంద్రునికి , గాంధీకి తీసిపోనిది. మత సామరస్యం కోసం ఆయన ద్వేషంస్థానంలో ప్రేమని నిలపాలని ఎన్నో ప్రయోగాలు చేశాడు. ఈ ప్రేమ తత్వాన్ని స్థాపించడంలో రూమీ, హఫీజుల నుంచి కాశ్మీర్ సూఫీ కవిత్వం నుంచి తన కన్నా ముందున్న బాంగ్లా సూఫీ కవుల దాకా అందర్ని ఆకళింపు చేసుకుని, బాంగ్లా భక్తి వుద్యమంలోని సారాన్నంతా గ్రహించి చివరికి వేణువు విరిగిపోయినా, పాట ఆగకూడదనే సందేశంతో ఒక ప్రేమ భావనతో తన వ్యక్తినే రద్దు చేసుకున్నాడు," అన్నారు.
ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియలేదు. ఆరు వేల పాటలు రాశాడు. హెచ్ఎంవీ ( హిజ్ మాస్టర్స్ వాయిస్ ) అనే సుప్రసిద్ద గ్రామ్ ఫోన్ కంపెనీ ఆయన పాటలతో సంగీతంతో దేశమంతా ప్రచారాన్ని, ప్రసిద్ధిని పొందింది. ఇవాళ మనకి రవీంద్ర సంగీతం , కలకత్తా మెట్రో స్టేషన్లలో కూడా వినవస్తుంది కానీ, నజ్రూల్ ఇస్లాం ఎక్కడా వినిపించడు.
రెండో ప్రపంచ యుద్ధకాలపు చారిత్రక నవల , ఉణుదుర్తి సుధాకర్, “ చెదిరిన పాద ముద్రలు " లో మాత్రం కలకత్తా మహా నగరంలో రవీంద్ర సంగీత్ తో పాటు నజ్రుల్ గీతి పాడేవారి ప్రస్తావన వుంది. 2001 లోనే కవి ఆవంత్స సోమసుందర, ' కాజీ నజ్రూల్ ఇస్లాం’ అనే వంద పేజీల పుస్తకం తెచ్చారు. బాంగ్లా బాషలోనే నజ్రుల్ని చదివి , ఆ మహత్తర విప్లవ కవిని జీవితకాలమంతా స్తుతిస్తూ, వారి కవితలను వినిపిస్తూ, ఆయన రాసిన కవితల్లాంటివే రాయాలని తలపోస్తూ జీవించిన మహనీయుడు పురిపండా అప్పలస్వామి,’’ అని సోమసుందర్ రాశారు.’’ ‘‘నజ్రుల్ కవితల అనువాదం అంటే నేనొక సాహసమే చేశాను,’’ అన్నారు వరవరరావు.
నజ్రూల్ జర్నలిస్టు. సంపాదకుడు. 1922 లో ఆయన తూర్పు బంగ్లాలోని కొమిల్లా లో వున్నప్పుడు, రష్యన్ విప్లవం గురించి 'ప్రళయోల్లాస్ ' అనే కవిత రాశారు. 1922 ఆగస్ట్ 12 న నజ్రూల్ ' ధూమకేతు ' అనే రాజకీయవార పత్రిక ప్రారంభించారు. ఈ పత్రికను ఆహ్వానిస్తూ రవీంద్రనాధ్ ఠాగూర్ ఒక కవిత రాశారు.
"రా, ధూమకేతు రా... వేగంగా రా
చీకటి మీద నిప్పుల వంతెన నిర్మించు
ఈ దుర్భర దినాల శిఖారాగ్రాన నీ విజయాన్ని ఎగరేయ్
నీ సాహసం గురించి ఇంకా కళ్ళు తెరవని
వాళ్ళ గుండెల్ని విశ్రాంతి పరుచు "
ఇది నిశ్చయంగా నజ్రూల్ మీద రవీంద్రునికున్న అభిప్రాయం.
నజ్రుల్ కి విప్లవం , సాహిత్య కృషి, జీవితాన్వేషణ , ప్రేమ, స్నేహం, దేశం , చివరికి జైలు జీవితం కూడా మహా సౌందర్యంగానే కనిపించాయి. ఆయన కళా జీవితాన్ని, కర్తవ్య జీవితాన్ని యీ సౌందర్యాన్వేషణ ముడివేసింది. అందువల్లే కవి అయ్యారు. ఉద్యమ నాయకుడు అయ్యారు. బంగ్లా విప్లవోద్యమంలో పాల్గొని ప్రాణాలు అర్పించిన మొట్టమొదటి యువకుడు ఖుదీరామ్ బోస్. ఆ 19 ఏళ్ళ కుర్రవాడు చనిపోతూ , తన చిన్నమ్మ కడుపున మళ్ళీ పుడతానని అన్నట్టు బంగ్లాలో ఒక సుప్రసిద్ధ జానపద గీతం వుంది. దాన్ని ప్రస్తావిస్తూ నజ్రుల్ , పుట్టిన ప్రతి పిల్లవాడు ఖుదీరామేననీ , వాళ్ళని యుద్ధ రంగానికి పంపవలసినదనీ తల్లులకు పిలుపుయిస్తాడు. ‘మందిర్ , మస్జీద్’ అనే వ్యాసంలో మత కలహాల గురించి ఆవేదనతో, ఈ ఇటుకలతో కట్టిన పీఠాల కోసం వందల మందిని బలి ఇవ్వడం మూర్ఖత్వం అని అన్నారు నజ్రుల్.
రవీంద్రుడు నజ్రుల్ ని శాంతినికేతన్ కు వచ్చివిద్యార్థులకు పాటలు నేర్పమన్నాడు. నజ్రుల్ వంటి కళా కారుడు రాజకీయాల్లో తలమునకలు కావడం రవీంద్రునికి నచ్చలేదు. కానీ, నజ్రుల్ దృష్టి వేరు. చుట్టూ ఉన్న జీవితాలనుంచి వేరుపడి తన సాహిత్యం ద్వారా ఏకాంతంలోకి పోదలుచుకోలేదు. 1930 నజ్రుల్ సాహిత్య జీవితంలో పాటల యుగం. వరుసగా తొమ్మిది పాటల పుస్తకాలు ప్రచురించాడు. ఆయన రాజకీయాలు గిట్టని బ్రిటిష్ వాళ్ల గ్రామఫోన్ కంపెనీ, పాటలు కావాలని ఆయన్ని అడగలేదు. ప్రజల్లో నజ్రుల్ పాటలకు ఉన్న విపరీతమయిన ఆదరణకు తల వొగ్గి, ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ కలకత్తా, ఆయన్ని కంపోజర్ గా నియమించింది. నాటకాలకు, సినిమాలకు కూడా నజ్రుల్ పాటలు రాశాడు. ‘ధృవ’ అనే పాపులర్ బంగ్లా సినిమాకు ఆయనే సంగీత దర్శకుడు. 1952లో విడుదలయిన ‘బుల్ బుల్’ రెండో సంపుటిలో ఈ పాటలన్నీ ఉన్నాయి. శాస్త్రీయమైన, జానపద శృతులయినా ఆయన అలవోకగా బాణీలు కట్టేవాడు. అరబిక్, పర్షియన్ రాగాలనూ ఎంతో సహజంగా పలికించేవాడు. బాంగ్లా కవిత్వంలోకి గజల్ ని ప్రవేశపెట్టిందే నజ్రులే.
అంధకారం అలుముకున్న రోజు...
అది 1942 జూలై 9... కలకత్తా రేడియో స్టేషన్ లో నజ్రుల్ తన రచన రికార్డు చేస్తుండగా నాలుక పిడుచకట్టుకుపోయింది.మాటలు రాలేదు. అదే ఆఖరు. త్వరలోనే ఆయన మేధస్సు కూడా స్వాదీనం తప్పింది. మతి స్థిమితం లేదు. పిచ్చాసుపత్రిలోనూ జాయిన్ చేశారు. ఫలితం లేదు. 1953లో ఆయన్ని వైద్యం కోసం యూరోప్ పంపించారు. లాభం లేకపోయింది. హిందువులూ ముస్లింలూ ప్రజలుగా, మనుషులుగా ఒకే కొమ్మకు పూచిన పువ్వులు అన్నారాయన.
"మనం ఒకే నేల గాలిని పీలుస్తున్నాం
అదేనేల నీళ్ళు తాగుతున్నాం
ఒకే భూమి స్థలంపై మనం విశ్రమిస్తాం.
ఒకరం ఖనన స్థలంలో ఒకరం దహన వాటిక
మనం మన తల్లిని ఒకే భాషలో పిలుస్తాం
మనం దుఃఖిస్తూ ఒకరినొకరు ఆలింగన చేసుకుంటాం
మనం పరస్పరం క్షమాపణలు చెప్పుకుంటాం
ఆ రోజు ఈ దేశం గర్వంతో దరహాసం చేస్తుంది."
అని రాసిన గొప్ప భావుకుడు ఆస్పత్రి బెడ్ మీద సృహ లేకుడా పడి వున్నాడు. రెండో కొడుకు బుల్ బుల్ మరణం ఆయన్ను కలిచి వేసింది. చివరికి ఏమీ తెలియని స్థితిలోనే 1976 ఆగస్ట్ 29 న నజ్రూల్ తుది శ్వాస విడిచారు.
మతోన్మాద నృత్యంతో ప్రజల్ని అంధుల్ని చేసే వంచకులు వాళ్ళు... బాంగ్లా యువకులారా ! భయమెరుగని నా సోదరులారా రండి ! నిప్పులతో చెలగాటమాడడానికి వెరవని వాళ్ళు మీరు... అకాలంలో మరణించిన లక్షల మంది మృత దేహాలు మీ తలుపులు ముందు నిరీక్షిస్తున్నాయి. అవి ప్రతీకారం కోరుతున్నాయి. మీరు జ్వాలా కాంతి.. మీకు జాతి లేదు అన్నవాడు కాజీ నజ్రూల్ ఇస్లాం. నేను , ఈర్ష్య , మతతత్వం , వివక్ష , నిరాశ అనే సౌందర్య రహితమైన అంశాలను తొలగించి సౌందర్యాన్ని ఆవిస్కరిస్తాను అన్నారాయన. ఏ చట్రంలోనూ ఇమడని రెబెల్ నజ్రుల్ , ఆయన తర్వాత 40 ఏళ్ళకు పుట్టిన వరవరరావు కూడా నజ్రుల్ లాగే స్వేచ్ఛ, సమానత్వం, మానవ హక్కుల బలమైన ప్రతినిధిగా నిలిచారు. ఇక వరవరరావు కలం చూపు నుంచి నజ్రుల్ ఇస్లాంను చదవండి.
ఈ అరుదైన, అద్భుతమైన పుస్తకాన్ని తేవడంలో పరోక్షంగా కృషి చేసిన సాహితీవేత్త ఎన్ వేణుగోపాల్, రచయిత్రి గీతారామస్వామికి హృదయపూర్వక అభినందనలు. నవంబర్ 23 సాయంత్రం హైద్రాబాద్ ‘విద్రోహి’ పుస్తకావిష్కరణ జరుగుతుంది. హౌస్ అరెస్టులో ముంబైలో వున్న వరవరరావు ఆన్లైన్లో మాట్లాడతారు. ప్రజాదరణ పొందిన తెలంగాణా కళాకారుడు లెల్లే సురేష్ బృందం ఆడియో విజువల్ ప్రజెంటేషన్ ఈ సభకి పెద్ద ఆకర్షణ. 'విద్రోహి' లో పీటర్ కస్టర్స్ , మోమితా ఆలం, వరవరరావులు రాసిన అమూల్యమైన మాటల కోసం, నజ్రుల్ మహా కవిత్వం కోసం ప్రతి ఒక్కరూ కొని, చదివి, దాచి, ముందుతరాలకి కానుకగా యివ్వవలసిన మత సామరస్యామృతం ఈ గ్రంధం.
చదివితే హృదయం రోదిస్తుంది. ఆత్మ చెమ్మగిల్లుతుంది.