కాన్గిరీ బడి ప్రారంభం, బోధన ఒక సంబురం

నా నుంచి నా వరకు :11 (నా నుంచి నా వరకు 10 (కవి, రచయిత జూకంటి జగన్నాథ జ్ఞాపకాలు);

Update: 2025-05-11 03:07 GMT

నేను అప్పటికే 10వ తరగతి పూర్తి చేసి ఉన్నాను. నేను రకరకాల పనుల కైకిలికి పోతుంటే ఊళ్ళో కొందరు రోజూ కూలి పనులకు పోయే బదులు, బడి పెట్టి పిల్లలకు చదువు చెప్పవచ్చు కదా అని సలహా ఇచ్చారు. నాకు కూడా ఆ సూచన సబబే సమ్మతమే అనిపించింది. మా పశువులు లేక ఖాళీగా ఉండేది కాబట్టి ఉన్న ఆరు గజాల పొడవు నాలుగు గజాల వెడల్పు ఉన్న కొట్టం కొంచెం విశాలంగా ఉండేది. చుట్టుపక్కల ఉన్న కుటుంబాల పిల్లలు రాగా నేను ఒక్కడినే అందులో ప్రైవేట్ బడిని ప్రారంభించాను. ఆ నోటా ఈ నోటా ఊరంతా తెలిసిపోయి చాలామంది పిల్లలను బడికి తోలించడం మొదలుపెట్టారు. ఆ రోజులలో శిశు నుండి ఏడవ తరగతి వరకు దాదాపు నూరు 120 మంది విద్యార్థులతో బడి నడిచేది.


నేను టేబుల్ కుర్చీ లేని సింగిల్ ఉపాధ్యాయుడిని . ఒక స్టూలు మీద కూర్చొని పిల్లలకు పాఠాలు చెప్పే వాడిని. ఒక మోస్తరు ఉన్న కుటుంబాల పిల్లలు జోర తట్లు కింద పర్చుకొని కూర్చునేవారు. ముందు వరసలో శిశు అనంతరం ఒకటో తరగతి ఇలా వరుసగా చివరన ఏడవ తరగతి విద్యార్థులను కూర్చోపెట్టి కుక్క కరేజ్ కి ఒక్కొక్క తరగతికి అన్ని సబ్జెక్టులు చెప్పేవాడిని. బడికి ఎక్కువగా చేనేత కార్మికుల మరియు ఇతర కుటుంబాల పిల్లలు వచ్చేవారు. నేత కార్మికులకు ఆ రోజుల్లో వారం రోజులు మగ్గం నేస్తే ఆదివారం సంత ఖర్చులకు సేట్లు కూలి డబ్బులు ఇచ్చేవారు. అంటే సోమవారం పిల్లలు ఫీజులు ఇచ్చేవారు. సకాలం‌లో ఫీజులు ఇయ్యని వారికోసం మా బాపు వాళ్ల ఇంటికి పోయి బతిమిలాడి బామాలి వసూలు చేసేది. మునుపటి కన్నా కొంచెం మెరుగుగా ఇప్పుడు మా కుటుంబ సభ్యులకు ఐదు వేళ్లు నోట్లోకి పోతుండేవి.

1975నుండి1979 ఫిబ్రవరి వరకు అంటే నేను ఉద్యోగంలో చేరే వరకు ప్రైవేట్ స్కూలు నడిచింది. ఈ మధ్యలో నాలో ఉన్న బలమైన సాహిత్య అభిలాషను గమనించి దయామయులైన ముగ్గురు టీచర్లు భూపతి సార్, భాస్కర్ శర్మ సార్, నారాయణరెడ్డి సార్ గారలు పరీక్ష ఫీజు ఇవ్వడం వలన 1977 సంవత్సరంలో ఎక్స్టర్నల్ గా ఇంటర్మీడియట్ పూర్తి చేశాను.

కాలం పెద్దగా ఆటుపోట్లు లేకుండా సాగుపొతుంది. అప్పటికే పరిచయం ఉన్న ఉమాశంకర్ వకీల్ గారి మేన బామ్మర్ది హద్దునూరి నాగేంద్రం ద్వారా పరిచయమైన మిత్రుడు దోర్నాల లక్ష్మారెడ్డి, బడి అయిపోయే సమయానికి సెలవులు ఉన్న రోజుల్లో ప్రతి దినం మా ఇంటికి వచ్చేవాడు. ఇద్దరం కలిసి మానేరు వాగులో నుంచి నడిచి పోయి సిరిసిల్లలోని గ్రంథాలయంలో దినపత్రికలను, వార పత్రికలను చదివుకునే వాళ్ళం. నేను ముఖ్యంగా వార్తాపత్రికలతో పాటు ఆదివారం సోమవారం రోజులలో వచ్చే సాహిత్య సంచికలను నాలో అంతర్గతంగా ఉన్న సాహిత్య జిజ్ఞాసతో చదువుకునేవాడిని.

ఆ రోజుల్లో సిరిసిల్లలో యువ సాహితీ సంస్థ నిర్వాహకులు నెల నెలా కార్యక్రమాలు కవి సమ్మేళనాలు, ఇతర సభలు ప్రముఖులను ఆహ్వానించి ఏర్పాటు చేసేవారు. అంతేకాక అప్పుడప్పుడు ఈ ప్రాంతానికి నివాసులు రాష్ట్రస్థాయిలో పేరు ప్రఖ్యాతి గాంచిన కవులు సినారె జె. బాపురెడ్డిలతో పాటు కాళోజీ లాంటి వారిని ముఖ్య అతిథులుగా పిలిచి సాహిత్య సభలును కొత్తవారికి ఉత్సాహం కలిగేలా నిర్వహించేవారు . వీటిలో నేను బెరుకు బెరుకుగా అప్పుడప్పుడు పాలు పంచుకునే వాడిని.

ఇకపోతే నా ప్రైవేట్ పాఠశాల విద్యార్థులకు నేను చదువు నేర్చుకుంటూనే, వారికి అనేక పాఠాలను భోధించేవాడిని. 5వ తరగతి పూర్తికాగానే పై తరగతికి ప్రభుత్వ పాఠశాలలో చేర్పిస్తే,ఆ ఉపాధ్యాయులు పెట్టే రాత మౌఖిక పరీక్షలలో నా విద్యార్థులు విశేషమైన ప్రతిభ కనబరిచేవారు . దానితో చదువు బాగా చెప్తున్నాను అనే పేరు నాకు వచ్చింది. ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య గవర్నమెంట్ బడిలో పై తరగతులలో చేర్పించే వారి కన్నా ఎక్కువగా నా పాఠశాలలో కొత్తగా పిల్లలు చేర సాగారు . నిజంగా నాకు పిల్లలకు పాఠాలు చెప్పడం అంటే ఒక విధమైన సంబురం కలిగేది. నాకు తెలియకుండానే నాలో ఉపాధ్యాయ వృత్తి పైన చెప్పలేని మక్కువ ఏర్పడినది.

నా విద్యార్థుల్లో కొందరు తర్వాత రోజులలో అడ్వకేట్లు అయితే మరికొందరు ప్రభుత్వ ఉపాధ్యాయులు అయ్యారు. నేను ఎప్పుడైనా ఎదురు పడితే సార్ మీ దగ్గర చిన్నప్పుడు చదువుకున్నాను అనగానే నాకు వెయ్యి ఏనుగుల బలం చేకూరినంతగా ఎంతో తృప్తిని ,చెప్పలేని ఆనందాన్ని ఇప్పటికీ కలిగిస్తుంది .

ఆదివారాలు సెలవు రోజులు వస్తే లక్ష్మారెడ్డి ఎర్రగుంటలో వారికి గల మక్క పెరడు దగ్గరికి పోయే వాళ్ళం. వాళ్ల జీతగాడు చిన్న చిన్న ఈత బొత్తలను కొట్టి అందులోంచి ఈత గుజ్జుతీసి మాకు తినడానికి పెట్టేవాడు. అంతేకాక బాయి గడ్డమీద మక్క కంకులు కాల్చి వేడివేడిగా ఆకలి ఆకలిగా ఇష్టంగా బుక్కేవాళ్లం . అలా ఆరోజు మాకు ఆడుతూ పాడుతూ హాయిగా గడిచిపోయేది. సిరిసిల్లలో కొత్త సినిమా వస్తే లక్ష్మారెడ్డి తన వంతు టికెట్ పైసలు తెచ్చుకుంటే, నేను పిల్లలు ఇచ్చిన ఫీజులో మా బాపుకు తెలవకుండా పదిలంగా జేబులో దాచుకునే వాడిని . అప్పట్లో 50 పైసలు బెంచి టికెట్ సిరిసిల్లలో సినిమా టాకీస్లకు ఉండేది. అట్టి మొత్తం సమకూరగానే మానేరు వాగులో నడిచిపోతూ ఒకటికి రెండుసార్లు జేబులో డబ్బులు సరిగా ఉన్నాయో పడిపోయయో ఏమో అని మళ్లీ మళ్లీ చూసుకొని ఫస్ట్ షో సినిమాకి పోయే వాళ్ళం.

కానీ నాకున్న పరిమిత వనరుల పరిస్థితులలో నేను సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్లలో 12. 2.1979 నాడు అత్యంత ఆత్మీయులైన సాహితి పెద్దల చేయూతతో గుమస్తాగా చేరవలసి వచ్చింది. ఒక్కొక్కసారి మన ఇష్టా ఇష్టాలకు సంబంధం లేకుండా పూర్తి వ్యతిరేకంగా అభిరుచి లేని ఉద్యోగంలో చేరవలసి వస్తుంది అంటే ఇదేనేమో మరి. అప్పటి నా నెల వేతనం 180 రూపాయలుగా ఉండేది. ఆ రోజులలో అదే మహాభాగ్యమని కళ్ళకు అద్దుకునే వాళ్లం


Tags:    

Similar News

మా అమ్మ