బోడికొండలు హరిత దీవులుగా ఎలా మారాయి?

ఇది ఎక్కడ? ఇది ఎలా సుసాధ్యమైందంటే;

Update: 2025-05-14 08:13 GMT
గురువాజీ పేట బోడికొండ

ఊర్లో... తాగు నీరు, సేద్యానికి సాగునీరు కావాలన్నా ఆ కొండ చుట్టూ పచ్చదనం ఉంటేనే సాధ్యం అని గ్రామస్తులంతా నిర్ణయించుకున్నారు . వారి సంకల్పానికి డ్వామా (District Water Management Agency ) అధికారులు తోడుగా నిలిచారు. ప్రజల సంకల్పం, అధికారుల అండతో వాతావరణ మార్పులను ఎదుర్కొనే ఒక అరుదైన గ్రీన్‌ బెల్ట్‌ని కొండల చుట్టూ నిర్మించారు.

ఫలితంగా వారి లక్ష్యం నెరవేరింది . భూమికి తేమ పొలాలకు పచ్చదనం వచ్చింది. ఇది ఎక్కడ? ఎలా ఇది ఎలా సుసాధ్యమైందంటే , ప్రకాశం జిల్లాకు వెళ్లాల్సిందే.

నీళ్లు ఉంటేనే ఊళ్లు కళకళలాడతాయి. నీరులేని చోట... అభివృద్ధి కనిపించదు. గురవాజీపేట పరిస్థితి కూడా ఒకప్పుడు అంతే.

ఆంధ్రప్రదేశ్‌లో వర్షపాతం తక్కువగా నమోదయ్యే ప్రాంతాల్లో ప్రకాశం జిల్లా ఒకటి. ఇక్కడి కనిగిరి మండలం, గురవాజీపేటలో అయితే ఏడాదికి వర్షం పడేది అతి తక్కువ సార్లే. అందుకే అక్కడ నీటికి కొరత. వేసవి వచ్చిందంటే నీళ్లకోసం 3 కిలోమీటర్ల దూరంలోని గ్రామాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో

2014లో ఈ గ్రామస్తులు అంతా ఏకమై గ్రామసభ పెట్టి నీటి వనరులు అభివృద్ధి చేసుకోవాలని తీర్మానం చేశారు. జిల్లా నీటి యాజమాన్య సంస్థ ( డ్వామా) అధికారులు వారి సమస్యలను గుర్తించి గురవాజీ పేట మీద ప్రత్యేక దృష్టిపెట్టారు . ఉపాధి హామీ పథకం పనుల ద్వారా వర్షాకాలంలో పడే నాలుగు చినుకుల్నీ గ్రామం సమీపంలోని బోడిగుట్ట కొండ వాలులో ఇంకేలా చేస్తే పరిస్థితిలో మార్పు వస్తుందని ప్రణాళికలు సిద్ధం చేశారు.

ఇదే విషయాన్ని గ్రామస్థులకు చెప్పారు. ఉపాధి హామీ పనుల్లో భాగంగా అక్కడ పనిచేయాలన్నారు. రాళ్లు రప్పలతో ఉండే ఆ కొండవాలులో మండుటెండల్లో పని చేయడం అంత సులభం కాదు. అయినా గ్రామం అభివృద్ధి కోసం , దూరదృష్టితో ఆలోచించి అందరూ ముందుకు వచ్చారు.

 కొండల వాలులో చెక్‌ డ్యామ్స్‌.

వాన చినుకులను ఒడిసి పట్టి...

బోడిగుట్ట మాటవరసకి ఒక గుట్టే కానీ అది మూడుకొండల సమూహం. కొండవాలు నుంచి దిగువ పొలాల వరకూ కందకాలు, ఊటకుంటలు తవ్వడం తో పాటు అక్కడక్కడా రాతిచప్పిళ్లు, చెక్‌వాల్‌, గ్యాబియన్లు (ఇనుపచువ్వలతో బంధించి కట్టే రాతి గోడలు) లాంటి 15 రకాల వాననీటి సంరక్షణ పనుల్ని చేపట్టారు.

 వాన నీటిని ఇంకింప చేసే కందకాలు

ఆపైన కందకాలు, ఊటకుంటలు ఒడ్డున మొక్కలు నాటారు. కొండవాలులో ఎక్కడ ఏది నిర్మించాలన్న విషయంలో నీటి యాజమాన్య సంస్థ పక్కా ప్రణాళికను సిద్ధం చేసింది. 250 ఎకరాల విస్తీర్ణంలో మూడేళ్లపాటు సాగిన పనుల్లో భాగంగా 27 రాళ్లకట్టలూ, 15 రాతి చెక్‌డ్యామ్‌లూ, ఆరు గ్యాబియన్లు, ఒక సిమెంటు చెక్‌డ్యామ్‌, ఏడు చిన్న ఊటకుంటలు, తొమ్మిది పెద్ద ఊటకుంటలు, 26 కందకాలు నిర్మించారు.

గుట్టల్లో మొక్కల సంరక్షణకు కాపాలాకు పెట్టిన వన సేవకుడు

ఆ తర్వాత రెండున్నర లక్షల కలబంద మొక్కలతోపాటు నేరేడు, ఉసిరి, సీతాఫలం, కానుగ, వేప, చింత, కుంకుడు, గోరింటాకు, మద్ది, టేకు మొదలైన ఎన్నో రకాల మొక్కల్ని 45వేల వరకూ నాటారు. మొక్కల్ని నాటడం కోసం ట్యాంకర్లతో నీటిని తెప్పించారు. మొత్తం బోడిగుట్ట కనుమలపైన జల సంరక్షణ, భూసార పరిరక్షణ, పచ్చదనం పెంపు, ఇతర పనులకు రూ.కోటి వరకు వ్యయం చేశారు.

బోర్లు నిండాయి, పంట పండుతోంది!

అధికారుల నిబద్ధత, గ్రామస్థుల కష్టం వృధా పోలేదు. బోడిగుట్టమీద వర్షం నీరు ఇంకడంతోపాటు కొండవాలులో నాటిన మొక్కలు ఏపుగా పెరిగాయి. నాలుగేళ్లలో బోడికొండ నీటికుండగా మారింది. పచ్చదనాన్ని అలుముకుంది.

గ్రామస్తులంతా కలిసి నిర్యించిన నీటి కుంటలు

‘బోడిగుట్ట మెగా వాటర్‌షెడ్‌ పథకం’తో భూగర్భ జలాలు పెరిగి గ్రామంలోని బోర్లు చేతిపంపుల్లో నీరు చేరింది. వేసవిలోనూ నీటికి కొరత లేదిప్పుడు.

మనసుకు హాయి

‘ ఎండల్ని కూడా లెక్క చేయక మా గ్రామస్తులంతా బోడి కొండల చుట్టూ కందకాలు, రాతికట్టలు నిర్మించుకున్నాం ,ఒకపుడు ఎండిపోయినట్టు కళావిహీనంగా ఉండే కొండలు ఇపుడు ఆకుపచ్చగా మారి పోయాయి.

వాననీటి సంరక్షణకు కందకాలు తవ్వడంతో ఆకుపచ్చగామారిన కొండ

ఆ కొండల దగ్గరకు వెళ్తే మనసుకు ఎంతో హాయిగా ఉంటుంది. ఇప్పుడు మా సాగు నీళ్లకు లోటులేదు కంది,వరి పండిస్తున్నాం. ఇతర ప్రాంతాల నుండి కూడా ఈ కొండల అందాలు చూడడానికి ఎందరో వస్తుంటారు.’ అన్నారు గురవాజీ పేట గ్రామంలో స్వయం సహాయక గ్రూప్‌ సభ్యురాలు జ్యోతి.

నీటివనరులు పెరిగాయి

‘ గతంలో ఎంత లోతుగా బోర్లు వేసినా నీరు పడని పరిస్థితి. గ్రామస్తుల ఐకమత్యం,పట్టుదలే ఈ విజయం. మా ప్రణాళికలను వారు పాటించి గుట్ట చుట్టూ కందకాలు తవ్వడం వల్ల ఇప్పుడు 100 మీటర్ల లోతులోనే నీరు పడుతోంది. కొండవాలులో ఓ చేతిపంపు ఏర్పాటుచేశాం కూడా. ఒకరిని వనసేవకుడిగా పెట్టి ఉపాధి కల్పిస్తున్నాం. పచ్చదనం రాకముందు వర్షాలు లేక దాదాపు అయిదారేళ్లపాటు వరి సాగుచేయని రైతులు రెండేళ్లనుంచి 200 ఎకరాల్లో వరి, మరో 500 ఎకరాల్లో కంది, పత్తి, మిరప తదితర పంటల్ని సాగుచేస్తున్నారు. మునుపటితో పోలిస్తే వలసలు తగ్గాయి. గురవాజీపేటలో ఏర్పాటుచేసిన నీటికుంటలూ చెరువులూ మూగజీవాల దాహార్తిని తీరుస్తున్నాయి. ’ అన్నారు డ్వామా పిఓ నజీముద్దీన్‌.


వాటర్‌షెడ్‌ పథకంలో భాగంగా గురవాజీపేటకు రెండు ఆర్వోప్లాంట్లు వచ్చాయి. రైతులకు వ్యవసాయ పనిముట్లు అందాయి. ఈ మార్పులతో గ్రామం అభివృద్ధి వైపు అడుగులు వేస్తోంది. మరిన్ని గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఈ విజయగాథను తెలుసుకోవడానికి ఇప్పటికీ దేశం నలుమూలల నుండి అధ్యయన బృందాలు ఇక్కడకు వస్తున్నారు.

Tags:    

Similar News

మా అమ్మ