‘ఇంటికొక్క మహా వికలాంగుడు’ అనే అవిటి పెనిమిటి కథ!

'ఇల్లు' గీతాజంలి రాజకీయ కవిత. ‘ఇల్లు‘ ఒక మాయాదర్పణం. ప్రతిమగవాడు ఎక్కడో ఒక చోట కనబడతాడు. మీరెక్కడ కనబడతారో వెదుక్కోండి.... అని సవాల్ విసిరిన కవితల సంపుటి;

Update: 2025-08-14 03:47 GMT

ఆమె నిండు గర్భిణి గా ఉన్నప్పుడూ,

ఒక్క తన వెన్నెముక్క బలంతో మాత్రమే ,

బిందెల కొద్దీ నీళ్లు వీధి బోరింగు నుంచో,

చేద బావి నుంచో

ఆయాస పడుతూ ఇంట్లోకి

మోసుకొస్తుంది!
పొత్తి కడుపులో
సుఖపు సంచీల తేలిక తనం తప్ప,
గర్భ సంచి బరువూ,
నొప్పీ తెలీని మొగుడి స్నానం కోసం
బాల్టీ నింపుతుంది.
అతనప్పుడు వెన్నెముకలో
బలం లేని జిరాఫీలా కనిపిస్తాడు.
*
నెలసరప్పటి నొప్పి సునామీలా
సుడులు సుడులుగా
మెలి తిప్పుతున్నప్పుడు కూడా
చేతులుండీ
సాయం అందివ్వని భర్త,పిల్లల కోసం
ఆమె ఒంటి చేత్తో వండి,
కిలోమీటర్ల కొద్దీ బస్సుల్లో
వేలాడుతూ ఆఫీసుకి వెళుతుంది.
అతనప్పుడు ఆమెకి
చేతుల్లేని వాడుగా కనిపిస్తాడు.
**
ఆమె మెనోపాజ్ కి చేరిపోయి
పెళుసు బారిపోయిన మోకాళ్ళతో
ఇల్లూ వాకిలీ సర్దుకుంటుంటుంది.
ఎక్కడా.. ఎప్పుడూ
నొప్పితో చిట్లిన మోోకాళ్ళ చప్పుడుని
అతనికి వినపడనివ్వనే లేదు.
కడ్డీలలాంటి
బలమైన కాళ్ళున్న భర్త
ఆరామ్ కుర్చీలో కాళ్ళు చచ్చుబడినట్లు
అంటుకుపోయినా..
చేతికి అన్నం కంచం
అందించిన మహాతల్లి ఆవిడ!
ఎన్నడూ అబ్బా అని మూలగ లేదు.
నడకా.. పనీ రెండూ ఆపలేదు.
ఆమెకి అతడు
పక్షవాత రోగిలా కనిపిస్తుంటాడు!
**
ఇక ఈ ఇల్లాలిని చూడండి!
రాళ్ళై పోయిన ఊపిరి తిత్తులనుంచి
అందని శ్వాశ కోసం
ముక్కుల్లోకి,
పొర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్ల
గొట్టాలు వేలాడదీసుకుని,
ఎగరొప్పుతూ , వేడి వేడి నూనె సెగల మధ్య,
వంటింటి నుంచి ఇల్లంతటికీ
భోజనం అందించే ఆమె,
మధ్య మధ్యలో నోట్లో కూడా
ఇన్హేలర్ గుప్పు గుప్పున
కొట్టుకుంటూ ఉంటుంది.
అప్పుడు, వంటింట్లోకి
తొంగి కూడా చూడని భర్త
కాళ్ళూ, చేతులే కాదు,
గుండె కూడా లేని వాడిగా కనిపిస్తాడు!
నవ నవలాడే ఎర్రని ద్రాక్ష గుత్తుల్లాంటి
ఆరోగ్యవంతమైన ఊపిరి తిత్తులున్న భర్తనే ,
ఆమెకి ఆస్తమా రోగిలా కనిపిస్తాడు!
ఆమె ఉక్కిరి బిక్కిరి తనాన్ని
మరింత పెంచుతాడు!
*
అలాంటి అనేకానేక రోజుల,
నెలల, సంవత్సరాల తర్వాత,
అనేక కాలాల,
ఋతువుల తరువాత
ఓనాడు..ఓ అపరాహ్నం వేళ,
ఒళ్ళంతా నొప్పులతో పులిసి,
అలిసిపోయిన ఆ మహా ఇల్లాలు ,
పక్కింటి పోలియో పెనిమిటికి
సేవలు చేస్తున్న ఆయన భార్యను చూస్తూ
జాలిపడే తన భర్త దొంగ ముఖాన్ని చూస్తూ,
లావాలా భగ్గుమని ఉడికుడికి పోయింది!
"నువ్వు కూడా సకలాంగాలూ ఉండీ లేని,
మహా వికలాంగుడివి!
నువ్వు నా సకల జీవశక్తిని పీల్చేసే పారసైట్ వి !
నువ్వు నా అవిటి పెనిమిటివి!"
అంటుంది ఆగ్రహంగా అతగాడి వైపు
చేతికర్రని విసిరేస్తూ,
యుగాల సహనం కోల్పోయిన ఆమె!


Tags:    

Similar News