కాకులు వాలని కోటప్పకొండ.. కరెంటు ప్రభలకు నెలవంట!
ఫిబ్రవరి 26.. మహా శివరాత్రి. రాష్ట్రంలో అతిపెద్ద జాతర జరిగే ప్రాంతం కోటప్పకొండ. కరెంటు ప్రభలు ఈ తిరునాళ్ల ప్రత్యేకత. ఓసారి చూసొద్దాం రండి..;
By : The Federal
Update: 2025-02-26 01:20 GMT
కోటప్పకొండ.. ఛంగిజ్ ఖాన్ నవల్లోని యెక్కామంగోల్ తండాలో మాదిరి దుమ్మురేగుతోంది. చిన్నా చితక నెగళ్లు, గాడిపొయ్యిల నుంచి తెల్లటి పొగలు మబ్బుల్ని కమ్ముతున్నాయి. కొండ పైన సన్నటి మెరుపులు మెలిదిరిగిపోతున్నాయి. రంగురంగుల కరెంటు బల్బులు వయ్యారంగా కాంతులీనుతున్నాయి. చేదుకో కోటయ్యా అనే కేకలు మిన్నంటుతున్నాయి. ఉస్సమ్మా, ఉస్సబ్బా అంటూ నేలకు చారిగిలబడే వాళ్లూ లేకపోలేదు..
చేతిలో చెరకుగడ.. పైపంచ చివర్న కొబ్బరి చిప్ప.. కావూరి ప్రభపై శివకుమారి డాన్స్.. పురుషోతపట్నం ప్రభపై సీనియర్ శివకుమారి.. నరసరావుపేట ప్రభపై జ్యోతిలక్ష్మీ.. అర్థరాత్రి దాటిన తర్వాత శివాలెత్తే కుర్రకారు.. హరహరో అంటూ ఈ కెరటం విరుచుకుపడితే ఎంతటి వాళ్లవైనా పక్కటెముకలు విరగాల్సిందే.. తెల్లవారు జామున ఇక చూస్కో.. చెల్లియో చెల్లకో పద్యం పాడతారా లేదా అని మీసం మెలేసి నిలేసేవాళ్లు కొందరు.. జయమాలిని డాన్స్ ఆడాలని ఊగేవాళ్లు ఇంకొందరు..
ఒక్కసారి గతంలోకి...
కోటప్పకొండ.. నరసరావుపేటకు కూతవేటు దూరం.. చాలామంది నడిచే పోతుంటారు. ఉప్పలపాడు మీదుగా వెళ్తే 12, 13 కిలోమీటర్లు.. శివరాత్రి నాడు ఇక్కడ జరిగే జాతర రాష్ట్రంలోనే ప్రసిద్ధిగాంచింది.
కోటప్పకొండ తిరునాళ్ల వచ్చిందంటే గుంటూరు జిల్లాలో ప్రత్యేకించి పల్నాడు ప్రాంతంలో ఉండే హడావిడి అంతాఇంత కాదు. నాగార్జున సాగర్ కుడి కాలువ ఎంత దూరం ప్రవహిస్తుందో అంతదూరంలో పంటలు చేతికొచ్చేవి. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో మాదిరి కాకుండా ఈ ప్రాంతంలో ఒక్కటే పంట సాగయ్యేది. అది కూడా వరి పంటే. చాలా చోట్ల కోతలు పూర్తవుతాయి. కుప్పలు కొడతారు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చేది.
అరిశల పండగంటే ఇదే..
ఇప్పుడంటే ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ అరిశలు (నిప్పట్లు, అధిరసం) దొరుకుతున్నాయి గాని గతంలో శివరాత్రికి మాత్రమే ఈ ప్రాంతంలో అరిశలు చేసేవారు. అవి కూడా కాసిని కూసిని కాకుండా పాతకాలపు ఇనప్పెట్టే నిండా వచ్చేన్ని చేసి మచ్చు (అటక) మీద పెడితే పిల్లలు వాటి కోసం పిల్లుల్లా ఎదురుచూసేవారు. పెద్దోళ్లు పొలం పనికెళ్లి తిరిగొచ్చిన తర్వాత ఏ చీకటి పడే వేళకో పిల్లల్ని పిలిచి తలా రెండో మూడో ఇస్తే ఇంకా కావాలని మారాం చేసే వాళ్లు కొందరు, ఇచ్చినవి తీసుకుని బజార్లోకి వెళ్లి గుటుక్కున తినేసి.. ఇందాక అక్కకి మూడిచ్చి నాకు రెండే ఇచ్చావని పేచీ పెట్టి సంపాయించే గడుగ్గాయిలు కొందరు.. ఇలా ఈ అరిశలు గోల కనీసం 15 నుంచి నెల రోజుల పాటు సాగేది.
తలకబోసుకుని కొత్త చొక్కా వేసుకుని...
ఇక శివరాత్రి రోజైతే పొద్దున్నే లేచి తలకలు పోసుకుని (తలంటు) కొత్త బట్టలేసుకుని బజార్లోకి పోయి తమ డాబుదర్పం చూపించని వారు చాలా అరుదు. ఊళ్లల్లో పిల్లలు ఎక్కువ మంది పిల్లలు పొద్దుటి పూట టైలర్ల ఇళ్ల చుట్టూ తిరగడమే సరిపోయేది. ఊళ్లలో కొందరు రైతులు తెల్లవారుజామునే కోటప్పకొండకు పశువుల్ని తోలుకెళ్లి అక్కడున్న వాగులో వాటిని కడిగి కొమ్ములకు పసుపు కుంకుమలు రాసి కొండచుట్టూ ఓ మూడు చుట్లు తిప్పుకుని ఇళ్లకు వచ్చేవాళ్లు. పెద్ద ముత్తయిదువలు ఇళ్ల నుంచి బుట్టల్లో బియ్యం, పాలు, కొబ్బరికాయ, పసుపు, కుంకుమలు తీసుకుపోయి కోటప్పకొండ దగ్గర పొంగళ్ళు పెట్టి ఏ మధ్యాహ్నం తర్వాతో ఇళ్లకు చేరేవాళ్లు. వాళ్లు వచ్చి ఆ ప్రసాదం (బెల్లపుబువ్వ) పెట్టిన తర్వాత మధ్యాహ్న భోజనం చేసేవారు.
ఊరూరా చలివేంద్రాలు, మజ్జిగ కేంద్రాలు...
ఇప్పుడంటే ఇంటికో టూ వీలర్ ఉంది గాని పదేళ్ల కిందట కూడా కాలినడకనే కోటప్పకొండకు పోయి రావడం జరిగేది. కొండకు చుట్టుపక్కల పది మైళ్ల దూరంలోని ఊళ్ల నుంచి కోటప్పకొండకు బయలుదేరే వారి కోసం దారిపొడవునా ప్రతి ఊరి చివరా ఓ చలివేంద్రమో, మజ్జిగ కేంద్రమో ఉండేది. ఎండకు దారినపడి పోయే వారికి పిలిచి మరీ మజ్జిగ ఇచ్చేవారు. కొందరు వడపప్పు పెట్టేవాళ్లు. కొన్ని ఊళ్లలో గుడికాడ భోజనం కూడా పెట్టే వాళ్లు. సాయంత్రమైతే పెద్ద పెద్ద సెంటర్లలో ఎడ్ల పందాలు జరిగేవి. అక్కడ కూడా దావాద్రి తీర్చే వెసులుబాటు ఉండేది. ఇలా.. మొత్తం మీద చీకటి పడే వేళకి తిరునాళ్ల జరిగే ప్రాంతానికి చేరుకునే వారు. కొందరు కొండపైకి ఎక్కేవాళ్లు. మరికొందరైతే కొండపైన ఉండే బొచ్చు కోటయ్య స్వామి దాకా వెళ్లి వచ్చేవారు. భక్తి ఉన్న వాళ్లు పూజలు చేసేవారు. కొబ్బరికాయ కొట్టి వచ్చేవాళ్లు. లేని వాళ్లు సరదా చేసేవారు.
కాళ్లకు బెత్తడు మందాన దుమ్ముకొట్టుకుని ఇంకెంతదూరంరా బాబు అనుకుంటూ.. చేదుకో కోటయ్యా అని అరుస్తూ ముందుకు సాగేవాళ్లు. కొండకు దగ్గర్లోని ఏదో ఒక వాగులోనో, పిల్లకాల్వలోనో కాళ్లు మొహాలు కడుక్కునే వారు. కొండ కింద అన్నదాన సత్రాలు కిటకిటలాడేవి. కొన్ని కులాలకు సత్రాలు ఉన్నాయి. అక్కడ ఆయా కులాల వారికి వండివారుస్తుంటారు. అన్నమే తినాలనుకునే వారికి కొండవద్ద ఢోకా ఉండదు.
చీకటి పడే కొద్ది జన ప్రవాహం పెరుగుతుంతోంది. కొండ చుట్టూ దుమ్మురేగుతుంటోంది. పీచుమిఠాయిలు, రంగుల రాట్నాలు, చెరకుగడలు, నిమ్మ రసాలు, గోలీసోడాలు, రంగు నీళ్లు, నిమ్మతొనలు, చాక్లెట్లు, బిస్కెట్లు, అబ్రకదబ్రా అంటూ గాల్లోంచి మీసాలు మెలేసేవాళ్లు, 'ఇందులో మాయా లేదు, మర్మం లేదు బాబు అంటూ' ఓగట్టున గబుక్కున పట్టా పరిచి మూడుముక్కల ఆటలు ఆడేవాళ్లు, పెద్ద పెద్ద ఉయ్యాలలు, తీర్థంలో ఊసులాడదామని వచ్చే నవయవ్వనపు జంటలు... ఇలా ఒకటేమిటీ.. ఇప్పుడు నగరాల్లో ఏర్పాటు చేస్తున్న కార్నివాల్స్ ను మించిపోయేవి.
మాకు అసలైన పండగ శివరాత్రే..
మునిమాపు వేళ ఎద్దులుండే రైతులు బళ్లు కట్టే వాళ్లు. బండికి ఎంత మంది పడితే అంతమంది ఎక్కేవాళ్లు. చుట్టూ నాట్లు ఉండేవి. వాటికి పట్టా కట్టి ఏ రాత్రి 8, 9 గంటలకో ఇవి చేరేవి. కోటయ్య సందర్శించుకున్న తర్వాత ఏదైనా ఒక ఊరి ప్రభ దగ్గర సెటిల్ అయ్యేవాళ్లు. రాత్రంతా తిరనాళ్ల జాగారం చేసిన తర్వాత తెల్లవారుజామున తలా ఒకటో రెండో చెరకుగడలు ఆకులతో సహా ఉండేవి కొనుక్కుని బయల్దేరేవారు. జాతరలో పిల్లల కోసం కొన్న మిఠాయిలు, ఆటబొమ్మలు, బూరలు, పిల్లనగ్రోవి లాంటివి అపురూపంగా సంచుల్లో పెట్టుకుని ఇళ్లకు తెస్తే వాటిని కాపాడుకోలేక పిల్లలు సతమతం అయ్యేవారు.
పోయేటప్పుడే సరదా...
తిరనాళ పోయేటప్పుడు ఉండే హుషారు, సరదా తిరిగొచ్చేటపుడు ఉండవు కదా.. గాలి తీసిన బెలూన్ల మాదిరి ఉసూరుమంటూ.. అబ్బా ఇంకా మనూరు రాదేమిట్రా అనుకుంటూ ఇళ్లకు చేరతారు. కళ్లు మూసుకుపోతుంటాయి.. కడుపు కాలుతుంటుంది. భుజం మీది పైపంచ కూడా బరువు అవుతుంది. అలా ఇంటి కొచ్చీ రావడంతోనే ఇలా మంచం మీద వాలితే ఏ మధ్యాహ్నానికో సాయంత్రానికో తెలవారుతుంది. అప్పుడు వంటి మీద కాసిని నీళ్లు పోసుకుని తిని మళ్లీ పడుకుంటే ఆ మర్నాడు సాయంత్రానికి మనుషులవుతారు. అప్పుడు మొదలు పెడతారు తిరనాళ్లలో జరిగిన ముచ్చట్లు. కథలు కథలుగా చెప్పుకుంటూ పోతుంటారు.
14,15 ప్రభలు గ్యారంటీ...
కోటప్పకొండ రాష్ట్రంలోని ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం. త్రికోటేశ్వర స్వామి ఆలయం ఇక్కడి ప్రత్యేకత. కోటప్పకొండ నరసరావుపేటకు 12 కిలోమీటర్లు, చిలకలూరిపేటకు 18 కిలోమీటర్లు. ఈ మధ్యలోని ప్రతి ఊరి నుంచి ఏదో ఒక ఏడాది ఓ కరెంటు ప్రభ వచ్చి ఉంటుంది. ఈ ప్రాంతంలోని అనేక గ్రామాలకు అసలైన పండుగ శివరాత్రే. ఆ రోజు గుంటూరు నుంచి వచ్చే ఏరైలూ ఖాళీ ఉండదు. కిందా పైనా జనం ఎక్కే వస్తారు. అధికారులు కూడా ఏమీ చేయలేరు. కోటప్పకొండకు శివరాత్రి నాడు కనీసం మూడు నుంచి నాలుగు లక్షల మంది వస్తారని అంచనా.
కోటప్పకొండకున్న మరో ప్రత్యేకత కరెంటు ప్రభలు. కరవు కాటకాలున్న సమయాల్లో కూడా కనీసం పది,15 ప్రభలు ఈ తీర్థానికి వస్తుంటాయి. 90 నుంచి 100 అడుగుల ఎత్తైన భారీ విద్యుత్ ప్రభలు కట్టుకుని వస్తారు.
కరెంటు ప్రభ చాలా వ్యయాభరితం...
లక్షల రూపాయల వ్యయం ఒక ఎత్తయితే మానవ శారీరక శ్రమ మరో ఎత్తు. పగ్గాలు పట్టడానికే కనీసం వంద మంది కావాలి. గాలి వాటాన్ని బట్టి ప్రభను నడపాలి. పోయేటపుడు ఉండే ఊపు తిరిగివచ్చేటపుడు ఉండదు. అందువల్ల ప్రభును తిరిగి సొంతూరికి చేర్చడం మరో ఖరీదైన వ్యవహారం. పైగా ఈ ప్రభలు కులాలు, పార్టీలు, ఊళ్లోని బజార్లను బట్టి ఉంటాయి. అందరూ ఏకమై ఎన్ని వ్యయ ప్రయాసలున్నా లెక్క చేయక దాదాపు నెలరోజులు కష్టపడి సిద్ధం చేసిన ప్రభలను కొండకు తరలిస్తారు. శివరాత్రి రోజున కొండ కింద రాత్రంతా జాగరం చేస్తారు. శివరాత్రి సందర్భంగా విద్యుత్ ప్రభల నడుమ వెలిగిపోయే ఆ శివయ్య వైభవం కచ్చితంగా చూసి తీరాల్సిందే. ఈ ఏడాది కనీసం 17 కరెంటు ప్రభలు తీర్థానికి రానున్నట్టు నరసరావుపేటకు చెందిన మీడియా ప్రతినిధి ప్రసాద్ తెలిపారు. కొండకావూరు, యల్లమంద, కమ్మవారిపాలెం, కావూరు, కట్టుబడిపాలెం, గురవాయపాలెం, పెట్లూరివారిపాలెం, పురుషోదపట్నం.. ఇలా చాలా ఊళ్ల నుంచి క్రమం తప్పకుండా ప్రభలు వస్తుంటాయి. గతంలో నరసరావుపేట టౌన్ నుంచే రెండు మూడు కరెంటు ప్రభలు వచ్చేవి. ఇప్పుడు విద్యుత్ లైన్ల మూలంగా రవాణా కష్టం కావడంతో నరసరావుపేట నుంచి కరెంటు ప్రభలు కట్టడం లేదు.
ఎలా వెళ్లవచ్చునంటే...
కాకులు వాలని ఈ కోటప్ప కొండ ఒకప్పుడు నిజంగానే ఎడారిగానే ఉండేదట. మంచినీళ్లు కూడా దొరకడం గగనమయ్యేది. ఇప్పుడా పరిస్థితి లేదు. బాగా అభివృద్ధి చేశారు. పచ్చదనం కూడా బాగా పెరిగింది. రవాణా సదుపాయమూ పెరిగింది. కోటప్ప కొండ గుంటూరుకు 60 కిలోమీటర్ల దూరం. నరసరావు పేట నుంచి ఒక మార్గంలో వెళితే 12, మరోమార్గంలో వెళితే 15 కిలోమీటర్ల దూరం. కారు, బస్సు మార్గాల ద్వారా పర్యాటకులు సులభంగా చేరుకోవచ్చు. గుంతకల్ నుంచి, గుంటూరు నుంచి రైళ్లు ఉన్నాయి. నేరుగా నరసరావుపేటలో దిగి కొండకు పోవచ్చు. తీర్థం ఎలా ఉన్నా ఓ కొత్త ప్రదేశాన్ని చూడాలనుకునే వారు కచ్చితంగా సందర్శించదగ్గ ప్రాంతం ఇది.