పచ్చదనాల ఈశాన్య సోయగం త్రిపుర
కొండంతా అద్భుతమైన శిల్పసంపద. కాలభైరవుని జుట్టులో నుండి నది ప్రవహిస్తున్నట్లు రమణీయమైన ప్రకృతి అందాలు.. క్రాంతి నల్లూరి త్రిపుర టూర్ విశేషాల్లో...
-కాంతి నల్లూరి
త్రిపుర కరీంగంజ్ (అస్సాంలోని ఓ జిల్లా) నుండి జోరు వానలో బయలుదేరాం. రోడ్డుమీద మా వాహనం తప్ప మరొకటి కనిపించడం లేదు. డ్రైవర్సు బిజీట్, బిస్సు (బెంగాలీవాళ్ళు)లు మహా జోరుగా ఉన్నారు. త్రిపుర చెక్ పోస్టు లో (చురబరి మోడర్నైజ్డ్ బార్డర్) ఇన్నరు లైన్ పాస్ అడిగితే అక్కర్లేదన్నారు.
ఫణిసాగర్, ఉన్ కోటి జిల్లాల గుండా ఉన్ కోటి కి వెళ్ళాం. మనో నది నిండుగా ప్రవహిస్తుంది. ఈ నది బంగాళాఖాతంలో ల్లో కలుస్తుంది. ఉన్ కోటి అంటే ఒకటి తక్కువ కోటి అని అర్థం. 13వ శతాబ్దంలో కొండ కొండని విగ్రహాలు, శిల్పాలు, బొమ్మలతో చెక్కేశారు. దీనికి అంగకోర్ వాట్ ఆప్ నార్త్ ఈస్ట్ (Angkor Wat of North East) అని పేరట. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ గా గుర్తించింది.
కొండంతా అద్భుతమైన శిల్పసంపదతో ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నట్లుగా ఉంది. కాలభైరవుని జుట్టులో నుండి నది ప్రవహిస్తున్నట్లుగా ఉంది. కాలభైరవుని, శివుని విగ్రహాల తలల పైభాగమే 10 అడుగుల పైన ఉంటుందట. ఆ తలలో కూడా మరికొన్ని బొమ్మలు ఉన్నాయి. స్త్రీమూర్తుల విగ్రహాలు, వినాయకుడు, ఆయన వాహనమైన మూషికం, నంది, క్రొకోడైల్స్ విగ్రహాలు, ప్రతి శిల్పము భలే స్పష్టంగా 700 సంవత్సరాల నాడు చెక్కటం భలే ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది. పై నుండి జలపాతం ఉరకలెత్తుతుంది. పకృతి అంతా ఆహ్లాదంగా మనోహరంగా, నయన, హృదయానందంగా ఉంది. మా యాత్రలో ఇది అత్యద్భుతంగా నచ్చింది. ఈ ఉనుకోటి వలన మా యాత్ర వృధా కాలేదనుకున్నాం.
ఎన్. హెచ్ 8 మార్గమంతా పనస, అరటి, కొబ్బరి, పోక, వరి, వెదురు, రోడ్డుకి ఇరువైపులా తోటలు... ఆ తోటలలో ఇళ్ళు బొమ్మరిళ్ళులా కనిపిస్తున్నాయి. త్రిపుర సుందరి అమ్మవారి గుడి చూసాం. గుడిలో ఒక పాతికదాకా చిన్న నల్ల మేక పిల్లలు పూలు పెట్టి పూజ చేసి ఉన్నాయి. బలివ్వరట, దేవతకు వదిలేస్తారట. పావురాలను కూడా. త్రిపుర అనే పురాతన రాజు పేరు మీద ఈ ప్రాంతానికి త్రిపురగా పేరొచ్చింది. వారి దేవత త్రిపుర సుందరిగా పిలవబడుతుంది.
భారత్ లో ఇది మూడవ అతి చిన్న రాష్ట్రం. వెదురు, అరటి పిలకల కూర, చేపలు ఇష్టంగా తింటారట. భారతదశంలోని అగర్బత్తీల తయారీకి కావలసిన వెదురును అరవై శాతం ఈ రాష్ట్రం తీర్చుతోందట. రంగు పోలికలు, కట్టు బొట్టు, పద్ధతులు, కట్టుబాట్లు, వ్యవసాయం లో మనకి దగ్గరగా ఉన్నారు. రోడ్లు కూడా అతుకులు, గుంతలు. రుద్రసాగర్ లేక్ మధ్యలో ఉన్న నీర్ మహాల్ కు బోట్లో వెళ్ళాం. బాల్కనీలు, వంతెనలు మీనార్లు మొత్తం పాలరాతి తో ఉంది. ప్యాలెస్ చుట్టూ వాటరే. రాజు రాణుల కోసం ప్యాలస్ అంతర్భాగంలోకి బోటు వచ్చేటట్లుగా నిర్మించడం భలే ఉంది. తోటలతో అందంగా, నీట్ గా ఉంది. రాత్రిపూట లైటింగ్ వెలుగులో నీటిలో మరీ అందంగా కనపడుతుందని గైడ్ చెప్పాడు. హిందూ మొగల్ వాస్తు శిల్పాలతో నిర్మించబడింది.
ఈ కోటలో రెండు రౌండ్ గా ఉన్న (మీనార్లు) గోపురాలు ఉన్నాయి. వీటిలో ఎంత ఎండాకాలంలో ఎంత ఎండకాసిన చల్లగా ఉంటుందట. ఈ తేడా మాకు తెలిసింది. ఈ కోట ప్రత్యేకత ఇది. ఇక్కడనుండి మొత్తం లేక్ కనిపిస్తుంది. మహల్ లో 24 గదులున్నాయి. రాజు ఉండేది. రాణి ఉండేది. సైనిక విభాగమని మూడు భాగాలుగా చెప్పవచ్చు. రాణి కంచన్ దేవి దీనిలో పార్ట్ కావాలందట. ఇక్కడ ప్రత్యేకంగా ఒకటి చెప్పాలి. వాష్రూమ్స్ కి జెంట్స్ కి 10 లేడీస్ కు 5 రూపాయలు. భలే నచ్చింది. రాణుల పేరుతో చాలా పాఠశాలలు ఉన్నాయి త్రిపురలో. మహిళలకు గౌరవం ఉందనుకున్నాం. బీర్ విక్రమ్ కిషోర్ మాణిక్య (1930-38) నిర్మింప చేశారు. నీర్ మహల్ చాలా బాగుంది. కోట కింద బాగాలేదు. పేడలు పెంటలు చెత్త. లేక్ లో తామర లాంటి ముళ్ళ ఆకులు, గుర్రపు డెక్క నీరు ఆవిరి కాకుండా ఆపుతోందట.
కమలసాగర్ కాళీబరి కాళికామాత ఆలయం చూసాం. ఓ పర్లాంగ్ దూరం నడిచి బాంగ్లాదేశ్ సరిహద్దుకు వెళ్ళాం. బాంగ్లాదేశ్ కు వచ్చేసామని ఆనందంతో అరుపులు. కర్ణాటకకు చెందిన ఓ సైనికుడు కాపలా కాస్తున్నాడు. మన సరిహద్దుగా పెద్ద పెద్ద ఇనుప పోల్స్ వాటికి తీగ. బాంగ్లాదేశ్ వైపు ఐదు ఆరు అడుగుల ఎత్తు సిమెంట్ దిమ్మెలు,తీగ. స్థానికులకు పాస్ ఇస్తారట. పొలాలకు, బంధువుల దగ్గరకు, పంటలమ్ముకోవడానికి. స్మగ్లింగ్ కూడా బాగానే జరిగిందని చెప్పారు.
త్రిపుర హెరిటేజ్ గార్డెన్ లో పనస చెట్లు భలే ఉన్నాయి. రాష్ట్ర పువ్వుల చెట్టు కూడా చూసాం. ఉజయంత (Ujayantha) ప్యాలెస్ లో అన్ని ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక ఫోటోలు. వెదురు (తాట, నార) తో చేసిన విగ్రహాలు వస్తువులలో త్రిపుర కళాత్మక, సృజనాత్మకత ఉట్టిపడుతుంది. జగన్నాథ గుడిలో (త్రిమూర్తులు) ప్రసాదం అని నాలుగు రకాల కూరలతో వద్దన్నంతగా పెట్టారు. జీడిపప్పు, కిస్మిస్, గుమ్మడిలతో కూరలు చాలా చాలా బాగున్నాయి. చాలామంది బాక్సులలో ప్లేటులలో తీసుకెళుతున్నారు ప్రసాదం.
అగర్తల వైపుకు, గ్రామాల గుండా... కట్టుబొట్టు రంగు రూపులే కాదు, రోడ్డు అక్యుపైయింగ్, హారన్స్, తొలగకపోవటాలు, పైన ఏమీ లేకుండా టవల్స్ చుట్టుకొని తిరుగుతున్న మగ జీవులు, ఎద్దులు, ఆవులు, కుక్కలు, యదేచ్ఛగా తిరుగుతున్నాయి. చెత్త ధర్మకోల్ మురికి వాసన గ్రామం వస్తున్నట్లుగా. కాని ప్రతి గ్రామం మొక్కలు, చెట్లతో, చిన్న చిన్న నీటి కుంటలుతో, చేల పచ్చదనాలతో (ఈ ఆహ్లాదం ముందు చెత్తాచెదారం లెక్కలోకి రాకుండా) మన కళ్ళు, హృదయాలను లాక్కున్నాయి. మన కొబ్బరి, ఈత, తాటి, ఆముదపు మొక్కలు. లిచీ, పైనాపిల్స్, బియ్యం, కూరగాయలు చాలా చౌక. పనస అయితే చెట్ల మీదే మిగలపండి ఉన్నాయి. కొండలు లోయలు ఉన్న మైదాన ప్రాంతం ఎక్కువగా కనిపిస్తుంది.
శాభిమూరా లో, అమెజాన్ ఫారెస్ట్ లో గౌతమి నదిలో, నదికి ఇరుప్రక్కల ఆకాశాన్ని అంటేటట్లు చెట్లు, పచ్చటి ప్రకృతిలో మూడు కిలోమీటర్ల ప్రయాణం. సోప్ గా ఉన్న కొండపైన, ఇరవై అడుగుల పైనే ఉన్న దుర్గాదేవి ప్రతిమను, దేవుళ్ళ విగ్రహాలను చెక్కారు. వర్షాలకు కొద్దిగా పాచిపట్టినట్టుంది. ఇక్కడ, ఉన్కోటలో కొండలపై విగ్రహాలు చెక్కిన వారికి నమో! నమో!. గౌతమి జిల్లాలోనే దంబోరి లేక్ లో నార్కేల్ కుంజ్ కు వెళ్ళాం.
వాళ్ళు చెప్పినంతగా లేకపోయినా, వుడ్ కాటేజీలు, పకృతిరమణీయత, పచ్చదనం, గిరిజన గ్రామాలు దంభోరి బాగానే ఉంది మన కోనసీమలా. ఇక్కడ పుట్టగొడుగులు (చిన్న కట్ట 150 రూ.లు) అమ్మటం చూసి ఆశ్చర్యపోయాం. త్రిపుర నుండి గౌహతికి, గౌహతి నుండి చెన్నైకు, చెన్నై నుండి గన్నవరం ఎయిర్పోర్టుకు, గన్నవరం నుండి ఒంగోలు కు పదిహేను రోజుల ప్రయాణం.