హోటల్ వర్కర్ నుంచి రచయితగా: జ్ఞాపకాల్లో ఆలూరి భుజంగరావు జీవనప్రస్థానం

నేడు 11వ వర్ధంతి

Update: 2024-06-20 07:16 GMT


తిండి కూడా దొరకని కటిక దారిద్ర్యాన్ని అనుభవించి, హోటల్ వర్కర్ గా బాల్యాన్ని, యవ్వనపు తొలిరోజులను గడిపిన ఆలూరి భుజంగరావు అరుదైన రచయిత. ఇరవై మూడేళ్ళు వచ్చే వరకు హోటల్ వంట గదుల్లో మగ్గిపోయాడు. అక్కడే ‘శారద’ ప్రోత్సాహంతో పుస్తకాలు చదవడం నేర్చుకున్నాడు. అక్కడి నుంచే రచనలు మొదలు పెట్టి, రచయితగా, అనువాదకుడిగా నిలదొక్కుకున్నాడు.

ఉపాధ్యాయుడిగా చాలీ చాలని జీతంలో, బండెడు సంసారాన్ని ఈదుకొచ్చాడు. తాను నమ్మిన ఆదర్శాలకు కట్టుబడిన విప్లవ నిబద్దుడు ఆలూరి భుజంగరావు.

పదకొండేళ్ళ క్రితం, 2013 జూన్ 20న గుంటూరులో ఆలూరు భుజంగరావు కన్ను మూశారు. భుజంగరావు మానాన్నకు పెదనాన్న కొడుకు. మా పెద్ద తాత కొడుకు. నాకు వరుసకు బాబాయి అయినా, బంధుత్వం కంటే ఆయనతో ఆలోచనాపరమైన బంధమే ఎక్కువ.

మా భుజంగరావు బాయికి మానాన్నతో కంటే నాతోనే స్నేహం ఎక్కువ. గురువారం ఆయన 11వ వర్దంతి సందర్భంగా మా భుజంగరావు బాబాయి గురించిన కొన్ని జ్ఞాపకాలు.

మా భుజంగరావు బాబాయి ప్రేమ్ చంద్ , రాహుల్ సాంకృత్యాయన్, యశ్ పాల్ వంటి మహామహుల రచనలను తెలుగులోకి అనువాదం చేశాడు. ప్రేమ్ చంద్ గబన్ ఆయన తొలి అనువాదం. ప్రేమ్ చంద్ నోరా నవలను అనువాదం చేశాడు. రంగ భూమిని కౌముది(అఫ్సర్ తండ్రి), సుంకరతో కలిసి అనువాదం చేశాడు.

మహాపండితుడు రాహుల్ సాంకృత్యాయన్ జయయౌధేయ, విస్మృత యాత్రికుడు, మధుర స్వప్నం,లోక సంచారి, దివోదాసు, వంటి అనేక నవలలను అనువాదం చేశాడు. తత్వ శాస్త్రానికి చెందిన దర్శన్ దిగ్ దర్శన్ ను, భారతీయ దర్శనం, ప్రాక్ పశ్చిమ దర్శనాలు పేరుతో అనువాదం చేశాడు. వైజ్ఞానికి దర్శన్ ను కూడా పాక్షికంగా అనువాదం చేశాడు. తన జీవిత గమనాన్ని గమ్యం దిశగా గమనం, గమనా గమనం పేరుతో రాశాడు. యశపాల్ సింహావలోక నాన్ని అనువాదం చేశాడు. ఇవే కాకుండ అనేక స్వీయ రచనలు కూడా వచ్చాయి.

మా భుజంగరావు బాబాయి తన ఇరవై మూడవ ఏట, తెనాలిలో హోటల్ వర్కర్ గా పనిచేస్తున్న కాలంలోనే ప్రేమ్ చంద్ ‘గబన్’ను అనువాదం చేస్తే విశాలాంద్ర వారు ఆయన ఇంటి పేరు ఆలూరు బదులు ఆలూరి అని అచ్చేయడంతో మా బాబాయి తన ఇంటి పేరును చివరి వరకు ‘ఆలూరి’ గానే కొనసాగించాడు.

దాయాదులైనప్పటికీ, మిగతా మా ఆలూరు కుటుంబాలకు, మా భుజంగరావు బాబాయి కుటుంబానికి పెద్దగా రాకపోకలు లేవు. మా బాబాయి అక్క శేషమ్మ నాటకాలు వేసేది. సంప్రదాయ కుటుంబాల్లో మహిళలు నాటకాలాడడాన్ని సహించలేకపోయారు. దాంతో మా దాయాదులంతా మా బాబాయి కుటుంబానికి దూరమయ్యారు. మా పెద్ద తాత, అంటే భుజంగరావు బాబాయి తండ్రి వారసత్వంగా వచ్చిన పంట పొలాలను నిలబెట్టుకోలేకపోయాడు. కుటుంబం గడవడం కష్టమై ఆలూరు నుంచి పొన్నూరుకు, అక్కడి నుంచి తెనాలికి వలస వచ్చారు.

మా బాబాయికి, ఆయన అన్న ప్రకాశానికి స్కూలు కెళ్ళి చదువుకునే అవకాశం లేకుండా పోయింది. చిన్నవయసులోనే హోటల్ వర్కర్లుగా చేరారు. హోటల్ లోనే సహ వర్కర్ గా పనిచేస్తున్న శారద(నటరాజన్)తో స్నేహం ఏర్పడడం, ఆ స్నేహం చదువు పైకి మళ్ళడం జరిగిపోయాయి. శారదతో పాటు మా భుజంగరావు బాబాయి, వాళ్ళ అన్న ప్రకాశం కథలు రాయడం మొదలు పెట్టారు. అనేక పత్రికల్లో అవి అచ్చయ్యాయి.

హోటల్ వర్కర్ గా రోజుకు పదహారు గంటలు పనిచేస్తూనే మా బాబాయి హిందీ చదువుకుంటూ పరీక్షలు రాశాడు. హోటల్ వర్కర్ గా ఉంటూనే తొలి నవల ప్రేమ్ చంద్ గబన్ ను అనువాదం చేశాడు. అప్పటికే శారద రాసిన ‘మంచి-చెడు’ తో పాటు మరికొన్ని నవలలు భారతిలో అచ్చయ్యాయి. శారద, ప్రకాశం చాలా రచనలు చేశారు. వాళ్లిద్దరూ హొటల్ వర్కర్లుగానే జీవితాలను గడిపారు. తరువాత మా బాబాయికి కర్నూల్లో ప్రైవేటు స్కూల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత గుడివాడలో ఎయిడెడ్ స్కూల్లో హిందీ టీచర్ గా చేరాడు.

మేం వనపర్తిలో ఉన్న రోజుల్లోనే మా నాన్న తొలిసారిగా గుడివాడలో మా బాబాయి ఇంటికి వెళ్ళి వచ్చాడు. వస్తూ వస్తూ తెలుగు ‘గబన్’ తీసుకొచ్చాడు. ఆలూరు భుజంగరావు అన్న పేరు వినడమే తప్ప వాళ్ళ కుటుంబం నాకు తెలియదు. గుంటూరు జిల్లా జువ్వల పాలెంలో జనసాహితీ సాంస్కృతిక సమాఖ్య సాహిత్య పాఠశాల 1980లో జరిగింది. పది రోజులు జరిగిన ఆ పాఠశాలకు నేను విద్యార్థిగా హాజరయ్యాను. అనువాదం పైన మా భుజంగరావు బాబాయి మాట్లాడాడు. మా బాబాయిని చూడడం అదే తొలిసారి.

పది రోజుల పాఠశాల అయిపోయాక నేను కృష్ణా నదిని దాటి చల్లపల్లి మీదుగా గుడివాడ వెళ్ళాను. అదే మా బాబాయి కుటుంబాన్ని తొలిసారిగా చూడడడం. అప్పటి నుంచి మా మధ్య రాకపోకలు మొదలయ్యాయి. మా బాబాయి విరసంలో చేరడం, నలుగురు కూతుళ్ళకు పార్టీలో పనిచేసే వారి నిచ్చి ఆదర్శ పెళ్ళిళ్ళు చేయడం, వారిలో ముగ్గురికి కులాంతర వివాహాలు కావడం; అన్నీ చకచకా జరిగిపోయాయి. నలుగురు అల్లుళ్ళు రహస్య జీవితంలో ఉండడం వల్ల వాళ్ళ పెళ్ళిళ్ళు చాలా కాలం తరువాత తెలిసింది. నెమలూరి భాస్కరావు కూతురిని తన కొడుకుకు చేసుకున్నాడు. 

అజ్ఞాతంలోకి వెళ్లే ముందు భుజంగరావు సతీమణి లలిత ( ఎడమ) తో రచయిత రాఘవ , తల్లి విమలాదేవి


టీచర్ గా సర్వీసు ఇంకో అయిదేళ్ళు ఉందనగానే వాలంటరీ రిటైర్ మెంట్ తీసుకుని అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. మా పిన్ని కూడా మా బాబాయితోనే అజ్ఞాతం లోకి వెళ్ళిపోయింది. మా భుజంగరావు బాబాయి, పిన్ని ఇద్దరూ కలిసి తరుచూ మా ఇంటికి వచ్చేవారు. అజ్ఞాతంలోకి వెళ్ళాక ఇద్దరూ ఒక సారి మా ఇంటికి వచ్చారు. ‘‘అమ్మా, నువ్వు, నేను కలిసి ఫొటో తీయించుకుందాం. మీ బాబాయి వద్దులే’’ అంది పిన్ని. మేం ముగ్గురం ఫొటో తీయించుకున్నాం. ‘‘ఫొటో ఎందుకు పిన్ని’’ అంటే చెప్పలేదు. ఆ రహస్యం ఆమెతోనే ముగిసింది. అర్ధ రాత్రి, తెల్లవారు జామునే కాకుండా ఎప్పుడు వచ్చేవారో, ఎప్పుడు వెళ్ళేవారో తెలియదు. మా ఇంటికి రావడానికి కాస్త మొహమాట పడినా, మీరు ఎప్పుడొచ్చినా మాకు అభ్యంతరం లేదని చెప్పాను.


ఒక చలికాలం తెల్ల వారు జామున 3 గంట సమయంలో ఇద్దరూ మా ఇంటికి వచ్చేసరికి మా కంపౌండ్ వాల్ గేట్ వేసి ఉంది. ఇంటి నుంచి గేటు వరకు అరవై అడుగులు ఉంటుంది. ఆ రోజుల్లో సెల్ ఫోన్లు లేవు. ఎంత పిలిచినా లోపల ఉన్న మాకు వినిపించదు. దాదాపు మూడు గంటల పాటు పాపం ఆచలిలో తెల్లారే వరకు గేటు దగ్గరే ఉండిపోయారు. మాకు చాలా బాధనిపించింది. తరువాత వాళ్ళ కోసం మేం గేటుకు తాళం వేయడం మానేశాం.


మా పెంకుటింట్లో పెద్ద హాలును రెండుగా విభజిస్తూ మధ్యలో ఒక గోడ ఉండేది. ఆ గోడపైన ఏవైనా వస్తువులు పెట్టేవాళ్ళం. మా బాబాయి పిన్ని ఒక సారి ఆ గోడ పైన రెండు సూట్కేసులు పెట్టారు. కొన్ని నెలలకు వచ్చారు. సూట్కేసులు దుమ్ము పట్టి ఉన్నాయి. ‘‘నాయనా మా సూట్కేసుల్లో చాలా విలువైనవి ఉన్నాయి. వాటిని మీరు తాకనుకూడా తాకలేదు. ’’ అని ఆశ్చర్యపోయారు. ‘‘మీ వస్తువులు ఎందుకు తాకుతాం బాబాయ్’’ అన్నాను. అలా అజ్ఞాతం లో ఉన్నంత కాలం మా ఇల్లు వారికి ఒక మజిలీగా ఉపయోగపడింది.

భార్యతో భుజంగరావు


 అజ్ఞాతం వీడాక మా ఇంటికి రావడం ఆపేశారు. ఇది పాతికేళ్ళ నాటి మాట. ఒక రోజు పొద్దున్నే మా బాబాయి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘నాయనా..మీ జిల్లాలో నిన్న ఒక ఎన్ కౌంటర్ జరిగింది నిజమేనా?’’ అన్నాడు. ‘‘ఔను బాబాయ్ నిజమే. ఈ రోజు వార్త లో నేను ఇంచార్జిని. జిల్లా పేజీలో అయిదు కాలాలు ‘‘సిరా ఎన్ కౌంటర్’’ అన్నబ్యానర్ గా పెట్టాను’’ అని చెప్పాను. ‘‘సిరా ఎవరో కాదు నాయనా నా పెద్దల్లుడు’’ అన్నాడు. నా గుండెలో రాయిపడ్డట్టయింది.


చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న సిరా మాపార్వతి భర్తన్న విషయం అప్పటి వరకు నాకు తెలియదు. మర్నాడు మా భుజంగరావు బాబాయి, పిన్ని, పార్వతి, పార్వతి కొడుకు అయేదేళ్ళ అజయ్ మా ఇంటికి వచ్చారు. నేను, మరొక పాత్రికేయ మిత్రడు నాగరాజు, పార్వతి కలిసి వేలూరులో ఉన్న వాళ్ళింటిని ఖాళీ చేసి వచ్చాం. వాళ్ళింట్లో ఉన్న సామాన్ల కంటే పుస్తకాలే ఎక్కువగా ఉన్నాయి. పుస్తకాలన్నిటినీ గొనె సంచుల్లో వేసుకుని లారీ సామాను మా ఇంటికి తరలించాం.

నిజానికి సిరా ఆయుధాలు పట్టిన వాడు కాదు. పూర్తిగా రచనలు చేసిన వాడు. సిరా పేరుతో అనేక రచనలు వచ్చాయి. సిరా ఎవరో కాదు, యూనివర్సిటీలో చదివే రోజుల్లో చంద్ర బాబు నాయుడికి స్నేహితుడు. సహ విద్యార్థి. చదువు అయిపోయాక ఇద్దరి రాజకీయ దారులు వేరైపోయాయి. చంద్రబాబు అధికార రాజకీయల లవైపు వెళ్ళాడు. సిరా విప్లవ రాజకీయాల వైపు మళ్ళాడు.  

భార్య లలిత, కూతుళ్లు, కో డలిలో ఆలూరు భుజంగరావు


ఆ రావడమే బా బాయి, పిన్ని మళ్ళీ మా ఇంటికి రాలేదు. మా బాబాయికి నలుగురు కూతుర్లు, ఒక కొడుకు. మా పిన్ని ఒక రోజు పిల్లల్ని అందరినీ పిలిచి ‘‘మీ లో ఒకరు నా కడుపున పుట్టిన వాళ్ళు కాదు’’ అంది. అయదుగురు పిల్లలు బిక్క ముఖం వేసుకున్నారు. ‘‘మా లో ఎవరమ్మా..? నేనా..నేనా..’’ అని అందరూ ఏడ్చేశారు. ‘‘పెద్దది పార్వతి మీ నాన్నగారి మొదటి భార్య కూతురు. ఆమె చనిపోవడంతో నన్ను చేసుకున్నారు’’ అంది. పిల్లలంతా ఘొల్లున ఏడ్చేశారు. మా పిన్ని అప్పుడైనా చెప్పేది కాదు. పార్వతి పెళ్ళి సిరాతో నిశ్చయమైంది. కనీసం ఇప్పుటికైనా పార్వతి జన్మ రహస్యం చెప్పకపోవడం అన్యాయమని మా బాబాయి పిన్ని కూడబలుక్కోవడంతో చెప్పేసింది.


మళ్ళీ చాలా కాలానికి మా బాబాయి నుంచి ఫోన్ వచ్చింది. ‘‘యాదగిరి గుట్ట దగ్గర ఎన్ కౌంటర్ జరిగింది చూశావా నాయనా. ఆ ఎన్ కౌంటర్ లో చనిపోయింది నా చిన్నల్లుడే’’ అన్నాడు.. ఏం మాట్లాడాలి? మా బాబాయి, పిన్నికి ఏం చెప్పాలి? ఎలా ఓదార్చాలి? అర్థం కాని సందిగ్ధం. అజ్ఞాతంలో పదేళ్ళు పనిచేశాక మా భుజంగరావు బాబాయికి జ్ఞాపక శక్తి తగ్గింది. చదవలేని, రాయలేని స్థితి ఏర్పడింది.

మా బాబాయి అజ్ఞాతం నుంచి బైటికొచ్చేశాడు. ఆ వయసులో అజ్ఞాతం లో ఉండి తుపాకులు పుచ్చుకోలేదు, ఆయుధాలు పట్టుకోలేదు. చేసింది కూడా రాత పనే. సొంత ఇల్లు సంపాదించుకోలేదు. రచయితగా పేరు సంపాదించుకున్నాడు. గుంటూరులో ఇల్లు అద్దెకు తీసుకుని వచ్చే పెన్షన్లో బతుకుతున్నారు. చదవడం, రాయడం తగ్గిపోయింది. బాబాయ్ పోయాడని 2013 రాత్రి బాగా పొద్దుపోయాక ఫోన్ వచ్చింది. మర్నాడు పొద్దున్నే కృష్ణా కు బయలు దేరి వెళ్ళాను. నిర్జీవంగా పడుకుని ఉన్న మా బాబాయి అదే నవ్వు ముఖంతో ‘‘నాయనా..’’ అని నన్ను పిలుస్తున్నట్టే ఉంది.


Tags:    

Similar News