మనుషులు కూలుతున్న దృశ్యాలు

ఆహ్లదాన్ని పంచే చినుకు హాహాకారాలను కూడా సృష్టిస్తుంది

Update: 2024-09-10 10:58 GMT


-డా.తండ హరీష్


వర్షం కురుస్తుంటే
మునుపెన్నడు లేని విధంగా
చినుకుల మధ్యలోంచి
కఠిన బండరాళ్ళ స్పర్శ

వాన తుంపరలకు
పూలు విచ్చుకున్న సంఘటనలను
ఎన్నింటినో చూసిన నేను
ఇప్పుడు
వర్ష తాకిడికి రాలిపోతున్న
పూలను లెక్కిస్తున్నాను

దారిపొడుగూత
పంటపొలాల మీదుగా
నదులు ప్రవహించటం
ఎంత భయానకం
రైతుల కళ్ళల్లో
కన్నీటిప్రవాహాలను నింపటం
ఎంత విచారకరం

ఇన్నాళ్ళు
నా దేహాన్ని మాత్రమే
తడిపిన వాన
మా ఇండ్లను ముంచేస్తుందని
ఊహల చివరంచున పుట్టే
ఏ సరికొత్త ఊహకు అందనే లేదు

వాన ప్రాణం పోస్తుందని విన్నాను కానీ
కోపమొస్తే
జీవితాలను
చెత్తకుప్పలుగా మార్చగలదని
ఇప్పుడిప్పుడే తెలుసుకున్నాను

ఆకాశం ఎందుకు అడ్డు చెప్పలేదో
ఇంత వరకు అర్థం కాలేదు
సూర్యుడెందుకు మౌనంగా దాక్కున్నాడో
అంతుచిక్కటం లేదు

మొన్న మొన్నటిదాకా
బయట వర్షం కురుస్తుంటే
లోపల కాగితపు పడవలు
తయారు చేసేవాడిని

వానపడబోతుందన్న వాసనొస్తే చాలు
ఇప్పటినుంచిక
నాటు పడవలను
సిద్ధం చేసుకోవాలని
తెలిసొచ్చింది

ఈ వారం రోజుల నుంచి కురుస్తున్న
వర్షాన్ని చూసినంక
'వాన' అనే పదం వింటేనే
వెన్నులో
వణుకు పుడుతుంది

కురుస్తున్న
వానవైపుగా చూస్తే
మనుషులు కూలుతున్న దృశ్యాలే
కంటబడుతున్నాయి.




Tags:    

Similar News