‘గాలి వాన’ పద్మరాజు సంస్మరణ

గాలివాన కథ పద్మరాజు జీవితంలో ఎదురయిన ఒక వాస్తవ సంఘటనకు కథారూపం. ఈ రోజు పాలగుమ్మి పద్మరాజు జయంతి.

Update: 2024-06-24 03:35 GMT

-డాక్టర్ జి.  ధనంజయ


ప్రముఖ తెలుగు రచయిత, ప్రపంచ కథానికల పోటీలో రెండో బహుమతి గెలుపొందిన "గాలివాన" కథారచయిత అయిన పాలగుమ్మి పద్మరాజు (జూన్ 24, 1915 - ఫిబ్రవరి 17, 1983) జన్మదినాన్ని చరిత్రలో జూన్ 24వ తేదీ ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, హేతువాది, ఎం.ఎన్.రాయ్ భావ ప్రచారకుడూ అయిన పాలగుమ్మి తన జీవితకాలమంతా రచనలతోనే జీవనం సాగించారు.


పద్మరాజు 23 ఏళ్ల వయస్సులో తన మొదటి కథ ‘సుబ్బి’ని రచించారు. ఈయన ఎన్నో కథలు రాసినప్పటికీ వాటిలో ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చిన కథ "గాలివాన" మాత్రమే. ఈ కథ 1952వ సంవత్సరంలో న్యూయార్క్‌లోని "హెరాల్డ్ ట్రిబ్యూన్"వారు నిర్వహించిన ప్రపంచ కథల పోటీలలో రెండవ బహుమతిని గెలుచుకుంది. మొత్తం 23 దేశాల నుండి 59 కథలు ఎన్నికైన ఈ పోటీలో, మన దేశము నుండి మూడు కథలు ఎన్నికయినాయి. అందులో ‘గాలివాన’కు బహుమతి లభించటమే కాకుండా, పలువురి ప్రశంసలు లభించాయి.

పాలగుమ్మి పద్మరాజు తన సాహిత్య జీవనయానంలో 60 కథలు, ఎనిమిది నవలలు, 30 కవితలు ఇంకా లెక్కలేనన్ని నాటికలు, నాటకాలను రచించారు. ఈయన రాసిన 60 కథలలో గాలివాన, పడవ ప్రయాణం, ఎదురుచూసిన ముహూర్తం అనే మూడు సంపుటాలుగా వెలువడ్డాయి.


గాలివాన"తో ప్రపంచ ఖ్యాతి


తెలుగు కథను ప్రపంచ సాహితీ చరిత్రలో సగౌరవంగా నిలబెట్టిన ఘనత పాలగుమ్మి పద్మరాజుకే చెందుతుంది. ఈ కథను ప్రపంచంలోని అనేక బాషలలోకి అనువదించారంటే ఆ నవల సాహితీ ప్రపంచంలో ఎంతగా పేరుతెచ్చుకుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

పాలగుమ్మి నవల ‘నల్లరేగడి’ని ‘మాఊరి కథ’ అనే పేరుతోనూ, ‘పడవ ప్రయాణం’ అనే కథను ‘స్త్రీ’ పేరుతోనూ సినిమాలుగా తీశారు. అదలా ఉంచితే, దర్శకుడు దాసరి నారాయణరావు సినిమాలకు చాలా వాటికి పాలగుమ్మి ఘోస్ట్ రైటర్‌గా కూడా పనిచేసినట్లు అప్పట్లో చెప్పుకునేవారు అట. పద్మరాజు1939 నుంచి 1952 వరకు కాకినాడలోని పి.ఆర్‌. కళాశాలలో సైన్స్‌ అధ్యాపకుడిగా పనిచేశారు.

గాలివాన కథ నేపథ్యం

గాలివాన ఒక వాస్తవ సంఘటనకు కథారూపమే. ఆయన లెక్చరర్ గా పనిచేస్తున్న రోజుల్లో, లెక్చరర్లు ఉద్యోగాన్ని వదిలేసి వెళ్లకుండా ఉండటానికి యాజమాన్యం వారు, లెక్చరర్లకు నివాస స్థలాలను ఉచితంగా ఇచ్చి, ఇళ్లు కట్టించు కోవటానికి ప్రోత్సహించేవారు. ఇదే కాకినాడ పిఆర్ కాలేజీలో పనిచేస్తున్న లెక్చరర్లకు ఇలాంటి అవకాశం దొరికింది.

పద్మరాజు గారి ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రమే అవటం చేత, ఆయన పక్కాగా ఇంటిని నిర్మించుకోలేక పోయారు. పక్కా ఇల్లు నిర్మిచుకోలేదు, పాల గుమ్మి వారు. నాలుగైదు ఆడుగులఇటుకల గోడ కట్టుకుని పైన తాటాకుల పాక వేసుకుని దానిని హాలు, వంటిల్లుగా విభజించుకున్నారు.

ఒక రోజు భయంకరమైన గాలివాన వచ్చింది. ఇంటి కప్పులు ఎగిరిపోయాయి. కరెంటూపోయింది. ఇటుక గోడలు కూలి పోతున్నాయి. ఒక్కసారిగా ఇంటి కప్పు మొత్తం కూలిపడింది. ఆ శిధిలాల క్రింద ఆయన భార్య చిక్కుకొని పోయింది. చిమ్మచీకటి. బయట ఎవరూ కనబడటం లేదు. ఎన్ని కేకలు పెట్టినా, ఆ గాలివాన హోరులో ఎవరికీ వినబడలేదు. అలా ఆవేదనతో ఆయనొక్కడే భార్య బతికుందా లేక మరణించిందా అనే ఆందోళనతో బిక్కచచ్చి నిర్జీవుడిలాగా ఎంతో ఆవేదనను అనుభవించారు.

కాని, కొంతమంది విద్యార్ధులకు వారి ఆర్తనాదాలు వినపడ్డాయి. వెంటనే వచ్చి శిధిలాల క్రింద ఉన్న పద్మరాజుగారి భార్య శరీరాన్ని బయటకు తీశారు. అయితే ఆవిడ బతికుందా లేక మరణించిందా తెలియాలంటే, తెల్లవారవలసిందే!ఈ సమయంలో అనుక్షణం ఆయన పడిన ఆవేదనే ‘గాలివాన’ కథకు ప్రేరణ! ఒక వాస్తవ సంఘటన ఆధారంగా ఆయన అనుభవించిన మనో వ్యధకు చక్కగా అక్షరరూపం ఇవ్వబట్టే, ఆ కథకు అంత విశిష్టత లభించింది.

సాహితీ వినీలాకాశంలో ఓ వెలుగువెలిగిన తెలుగు రచయిత పాలగుమ్మి పద్మరాజు 1983లో తుదిశ్వాస విడిచారు.

(డాక్టర్ ధనంజయ వృత్తి రీత్యా డాక్టర్. ప్రవృత్తి రీత్యా రచయిత. సాహిత్య రచనలతో పాటు  వైద్య సంబంధ వ్యాసాలు కూడా రాస్తూ ఉంటారు)

Tags:    

Similar News