చిన్ననాటి దుర్గ ఇంకా కళ్ల ముందు కదులుతూనే ఉంది...

బడి వొడిలో... ఒక టీచరమ్మ ‘యథానికలు' : 7

Update: 2024-10-15 04:55 GMT
ఎర్ర సర్కిల్ లో ఉన్న అమ్మాయే దుర్గ


మా విద్యార్థిని  దుర్గ ది ఓ విషాద గాథ అయితే దుర్గ  కజిన్ సుబ్బరామమ్మ ది మరొక గాధ. ( సుబ్బరావమ్మ ,దుర్గ పెద్ద నాయనమ్మ మనవరాలు. దుర్గ అమ్మమ్మ, సుబ్బారావమ్మ అమ్మమ్మ ఇద్దరు తోడుకోడళ్ళు). సుబ్బారావమ్మ అమ్మ నాన్న అంత సయోధ్యలో లేరు. సుబ్బారావమ్మ తమ్ముడు, చెల్లెలు, అమ్మ పక్క ఊర్లో ఉండేవాళ్లు. సుబ్బారావమ్మకు గ్రహణం మొర్రి వలన (మొర్రి, గ్నానం పోవటం క్లెఫ్ట్ లిప్ ( Cleft lip ) ముక్కు చప్పిడిగా (అంటే ముక్కు అణిచినట్టుగా) ఉండేది.

ముక్కు కింది నోటిభాగం ముక్కు చివరి వరకు ఉండేది కాదు. అంగిలి వరకు కనిపించేది. చీమిడి ఉమ్మి ఏకమై ఉండేది. బయటికి వెళ్లి దూరంగా కంప మండల్లో ఉమ్మి నీటితో కడుక్కొని శుభ్రంగా రమ్మని తరసు పంపిస్తూ ఉండేదాన్ని. పిల్లలు పైకి అనకపోయినా ముఖం చిట్లిస్తూ ఉండేవాళ్లు. అది సుబ్బారావమ్మ తప్పు కాదు, పుట్టుకలోనే అలా వచ్చింది అని, పిల్లలకు అలా అనకూడదని కొంత ఎడ్యుకేట్ చేయడం జరిగింది. సుబ్బారావమ్మ ఏమి చెప్తున్నా అర్థమయ్యేది కాదు.ఏమీ చెప్తున్నావు అని మళ్ళీ మళ్ళీ అడగేవాళ్ళం. దుర్గ కొంత చెప్పేది. చదువు అంతంత మాత్రమే ఉండేది.పై పెదవి లేకపోవటంతో నోటి లోపం వలన.

సుబ్బారావమ్మ అమ్మమ్మ తాతయ్యలతో అలాంటి వాటికి ఆపరేషన్లు ఉంటాయని, డాక్టర్లకు చూపించండి, మాకు తెలిసిన అమ్మాయికి పై పెదవికి ఆపరేషన్ చేయించారని చెబితే వారికి నమ్మకం ఉండేది కాదు. మా వల్ల కాదమ్మా, వాళ్ళ అమ్మ అయ్యా సరిగ్గా చూడటం లేదని చిన్నప్పటినుంచి మా దగ్గరే ఉంది. మాతో పాటే బ్రతుకుతుంది అనేవాళ్ళు. మాకు ఆ డాక్టర్లు అంతగా తెలియదు, ఖర్చు కూడా పెట్టలేము అనేవాళ్ళు. సుబ్బరామ్మను బాగా చూసేవాళ్ళు. సుబ్బారావమ్మ పని మాత్రం బాగా చేసేది. ఏ పని అయినా శుభ్రంగా, నీట్ గా చేసేది. నీట్ గా ఉండేది. బట్టలు ఎక్కువగా ఉన్నప్పుడు, సెలవు రోజుల్లో వాళ్లతో పాటు సుబ్బారావమ్మను కూడా సాకిరేవుకు తీసుకెళ్లేవాళ్లు.

ఆడపిల్ల కదా, మీ తర్వాత పిల్ల పరిస్థితి ఏమిటి? పెళ్లి చేయరా? పెళ్లి చేయడం కష్టం. ఎవరు చేసుకుంటారు అని, వాళ్ళ అమ్మను కొంత సహాయం అడగండి అనేవాళ్ళం. పెళ్లి అనుకోవడం లేదమ్మా ,ఎవరు చేసుకుంటారు. మేము ఉన్నంత కాలం పర్లేదు. మా తదనంతరము ఉండటానికి మా ఇల్లు ఉంది. ఊరు ఉంది. నలుగురు ఆసాములున్నారు. గుడ్డలుతుకుంటూ, కూలినాలి చేసుకుంటూ బ్రతికిద్దిలేమ్మా అనేవాళ్లు. నేను చెప్పిన పెళ్లి మంత్రం కూడా పారలేదు. ఆలోచనల్లో మా కన్నా అభివృద్ధిలో ఉన్నారనుకున్నాం.

ఇప్పట్లో లాగా అప్పుడు అమ్మ ఒడులు, అయ్యఒడులు, వృద్ధాప్య పెన్షన్లు, ఒంటరి మహిళల పెన్షన్లు, ఉచిత వైద్యాలు, ఆరోగ్యశ్రీ కార్డులు, సామాజిక పెన్షన్లు ఏమీ లేవు. విద్య, వైద్యం, పోషక ఆహారం పిల్లల సామాజిక హక్కు అనేది ఇప్పటికీ మన ప్రభుత్వాలకు పట్టడం లేదు. దుర్గ పదేపదే విభూతి భూషణ్ బందోపాధ్యాయ దుర్గను గుర్తు చేస్తే, సుబ్బారావమ్మ అవిభక్త కవలలు వీణ వాణిలను గుర్తు చేస్తూ మనసు కలయపరిచేవాళ్లు. మేము ఏమీ చేయలేని నిస్సహాయతలో, తెలియనితనంతో, అయ్యో పాపం అనుకుంటూ ఉండేవాళ్ళం. ఒక్కొక్క రోజు ఇంటికి వచ్చినా, ఆ పిల్లల జ్ఞాపకాలతో మనసంతా భారంగా ఉండేది. ఇంట్లో వారికి కూడా మానసికంగా ఆ పిల్లలు పరిచయం అయ్యారు.

అదిగో అట్లాంటి సమయంలో పేపర్ లో ఆకాశంలో మిణుక్కుమనేతార లాగా హైదరాబాదులో (మెడ్విన్ హాస్పటల్ అనుకుంటా పేరు గుర్తు రావటం లేదు)ని ఆసుపత్రిలో గ్రహణం, మొర్రి పిల్లలకు ఉచితంగా వైద్యం చేస్తామని, ముందుగా ఒంగోలులో ఉన్న హాస్పిటల్లో పేర్లు నమోదు చేయించుకోమని ఓ ప్రకటన వచ్చింది. ఆ పేపర్ తీసుకెళ్లి సుబ్బారావమ్మ అవ్వ తాతలకు చూపించాను. తీసుకెళ్లమని ఎంత నచ్చజెప్పినా మాకు హైదరాబాదు తెలియదు. మేము వెళ్లలేము అన్నారు. వాళ్ళ అమ్మానాన్నను పిలిపించమంటే అయ్య త్రాగుడు ఎక్కడున్నాడో తెలియదు, తల్లి పనికి వెళుతూ ఇద్దరు చిన్న పిల్లల్ని సాకుతుందన్నారు.

సరే ముందు ఒంగోలు తీసుకురండి. తర్వాత సంగతి చూద్దాం అన్నాను. దానికి కూడా వాళ్ళు ఇష్టపడలేదు. నా బలహీనతేంటో వారికి అర్థమైంది. ఏవో సెలవు వచ్చింది. ఒంగోలు హాస్పిటల్లో పేరు నమోదు చేయించడానికి నా దగ్గర విద్యా వాలంటీర్ గా పనిచేస్తున్న గంటా శ్రీనివాసరావును (నాకు రైట్ హ్యాండ్ గా ఉండేవాడు) ఫోన్ చేసి బ్రతిమలాడి సుబ్బరావమ్మకు, అవ్వ తాతలకు ట్రైన్ టికెట్లు కొని దగ్గరుండి రైలు ఎక్కించమన్నాను.

ఒంగోల్ రైల్వే స్టేషన్కు నేను వచ్చి రిసీవ్ చేసుకుంటానని, భయం లేదని, నేనుంటానని చెప్పమన్నాను వారితో. పాపం పొద్దున్నే వాళ్ళింటికి వెళ్లి నచ్చచెప్పినా వినకపోతే గట్టిగా కోప్పడి, నలుగురి చేత చెప్పించి 9 గంటల ట్రైన్ కు ఎక్కించాడు. రైల్వే స్టేషన్ కెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుని హాస్పిటల్ కి వెళ్లి పేరు నమోదు చేయించాను. ఆ డాక్టర్ గారు కూడా ఆపరేషన్  చేయకముందు, చేసిన తర్వాత ఫోటోలు చూపించి మీ టీచర్ గారు ఇంత చెప్తున్నా ఎందుకు వినరు అని కోప్పడ్డాడు. అమ్మమ్మ తీసుకెళ్తామయ్యా అన్నది. మళ్లీ రైల్వే స్టేషన్కు తీసుకొచ్చి టిక్కెట్లు కొని దగ్గరండి ట్రైన్ ఎక్కించి జాగ్రత్తగా వెళ్ళమని పదే పదే చెప్పి పంపించాను. దీనితో మొదటి ఘట్టం పూర్తయింది.

ఒంగోలు హాస్పిటల్ వాళ్ళు మూడు డేట్లు ఇచ్చారు. అవ్వ తాతలను ఎవరో ఒకరిని తోడు తీసుకుని హైదరాబాదు హాస్పిటల్కు వెళ్ళమన్నాను. సుబ్బారావమ్మ తల్లిని పిలిపించమన్నాను. ఆమె నాకు తెలియదమ్మ, ఇంత చేస్తున్నారు కదా, మీరు రండిమ్మా అని మొండికేసింది. ఇక తప్పలేదు. స్కూల్ ని విద్యా వలంటర్ కి అప్పజెప్పి, మూడు రోజులు సెలవు పెట్టి, రెండు రోజులు సెలవులు కలిసి వచ్చేటట్టు బయలుదేరాo నేను, సుబ్బరావమ్మ, ఆమె తల్లి, వరుసకు మేనమామ. హైదరాబాదులో దిగి లోయర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న హాస్పిటల్ కు కనుక్కుంటూ వెళ్ళాం. అక్కడినుండి వాళ్ళు ఏర్పాటు చేసిన బస్సులో 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న హాస్పిటలకు వెళ్ళాం.

మరుసటి రోజు ఉదయం నుండి బ్లడ్ టెస్ట్ లు, ఎక్స్ రేలు, ముక్కు, నోరు అలా చాలాటెస్టులు చేశారు. ఒక్కొక్కదానికివారిని తీసుకుని తిరిగాను. మరుసటి రోజు అన్ని రిజల్ట్స్ వచ్చాయి. ఆ మరసటి రోజు ఆపరేషన్లు చేయటం మొదలుపెట్టారు. కడప, కర్నూలు, రాజమండ్రి, నెల్లూరు వైపు నుంచి కూడా చాలా మంది వచ్చారు. సుబ్బారావమ్మ ఆపరేషన్ సక్సెస్ గా అయిపోయింది. అందరివీ కూడా. థియేటర్ పక్క రూములో, పెద్ద కారిడార్ గుండా వెళ్ళి, ఆ ముందు హాలులో గోడకు తగిలించి ఉన్న తెల్ల కోట్లు వేసుకొని పేషెంట్లను చూసి రమ్మన్నారు. ఎవరు ఇంకా సృహలోకి రాలేదు.

సుబ్బారావమ్మా అమ్మ ఎట్ట ఉంటుందో ఎమోనని ఏడుస్తూ కూర్చుని వంట కూడా చేయలేదు. హాస్పిటల్ చుట్టూ పొలాలు, ఎడారిగా ఉంది. అక్కడున్న కంపలు కట్టెలు వేరుకొచ్చుకొని మూడు రాళ్లు పెట్టుకొని వంట చేసుకోవాలి. అక్కడ ఓ చిన్న హోటల్ ఉంది కాని చాలా ఖరీదుగా ఉన్నాయి అన్ని. ఆ పొయ్యి మీద నేనే వంట చేశాను. చిలకలూరిపేట నుంచి వచ్చిన పేషెంట్లు ఇట్లాంటి టీచర్లు కూడా ఉంటారా అని ఆశ్చర్యపోతున్నారు. నాలుగో రోజు సుబ్బరావమ్మ కు బాగా ఉండటంతో నెల్లూరు, చిలకలూరిపేట పేషెంట్ల వారికి, వాళ్లు వచ్చేటప్పుడు ఈ ముగ్గురిని కూడా తీసుకొనివచ్చి ట్రైన్ ఎక్కించండి అని చెప్పి నేను వచ్చేసాను.

కుట్లు విప్పిన తర్వాత సుబ్బారావమ్మ పై పెదవి చాలావరకు కవర్ అయింది. కానీ అంగిలి , ముందు చిగురు కోసం మరో రెండు ఆపరేషన్లు చేయాలన్నారు. పోరగా పోరగా హాస్పిటల్ వారి మూడో డేట్ కి ఓ ఏడాదికి రెండోసారి ఆపరేషన్కు వెళ్లారు. మొదటిసారి 2000 ఖర్చుతో వస్తే, రెండవసారి నాలుగు వేలు ఖర్చు చేసుకొని వచ్చారు. మూడోసారి ఆపరేషన్కు వెళ్లనే లేదు. నాకు తృప్తిని ఆనందాన్ని ఇచ్చింది నేను ఆ స్కూల్లో ఉండగానే సుబ్బారావమ్మకు పక్కన ఊర్లో ఉన్నా ఓ అతనికి ఇచ్చి పెళ్లి చేశారు. సుబ్బరావమ్మకు ఓపాప, ఓ బాబు. ఇద్దరు పిల్లలు,భర్త తో హ్యాపీగా ఉంది. ఇంతకన్నా ఆనందం సంతోషం ఏముంటుంది నాకు.

అయితే బాధ కలిగించిన అంశం ఏంటంటే పెళ్ళికి పిలవను కూడా పిలవలేదు. కనీసం పెళ్లి అని కూడా చెప్పలేదు. పిల్లలు చెప్తేనే మాకు తెలిసింది. నాకన్నా, మా కొలీగ్ మార్గరేట్ గారు ఆపరేషన్ చేయించి, వంట చేసి ఏ టీచర్ చేయనంతగా చేసినా, పిలవనందుకు, చెప్పనందుకు చాలా బాధపడ్డారు. విద్యార్థిగా టీచర్ గా కన్నా మనసున్న మనుషులం మనం. ఎవరికైనా చేస్తాం అంతే అన్నాను. ఓ రోజు బడి దగ్గరకు వచ్చిన అమ్మమ్మను మా టీచర్ గారు దులిపేశారు. పిలవకపోవడం పొరపాటమ్మ పొరపాటమ్మ అన్నదట.

దుర్గా, సుబ్బారావమ్మ లే కాదు అనూష, లక్ష్మి నరసమ్మ, శిరీష, కసేదుర్గాప్రసాద్, కసే శిరీష (ఇద్దరూ అన్నా చెల్లెళ్ళు) తండ్రులు లేని పిల్లలే. ఒక్కొక్కరిది ఒక్కొక్క గాధ.తల్లులు రెక్కల కష్టం మీద పెంచుతున్న పిల్లలే. దుర్గ, సుబ్బారావమ్మా , ఒంటరి తల్లుల పిల్లలున్న స్కూలు ప్రకాశం జిల్లా, చిన్నగంజాం మండలం, పూలవారిపాలెంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల. ఈ బడి 1999లో ప్రారంభించారు.

అప్పటివరకు ఈ పిల్లలందరూ ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ఉన్న చిన్నగంజాం స్కూల్ కి వెళ్లి చదువుకునేవాళ్ళు. ఊరి వారందరు ప్రధానంగా వ్యవసాయము, వ్యవసాయ కూలీలు, ఉప్పు పంట, ఉప్పు వ్యాపారం చేసేవాళ్లు. ఈ ఫోటోలో ఉన్న పిల్లలందరూ ఒకటి నుండి 5వ తరగతి వరకు ఉన్నారు. ఈ ఫోటో స్కూల్ ప్రారంభోత్సవం రోజు తీసినది. ఈ ఫోటోలో సుబ్బారావమ్మ, అనూష, లక్ష్మీనరసమ్మ ఉన్నారు. ఈ పిల్లలందర్నీ వచ్చే శివరాత్రికి కలుస్తానన్నా ఆనందంలో ఉన్నాను. ఈ పిల్లలందర్నీ చూడాలి అనిపిస్తుంది అని మా వెంకటేష్ తో అంటే శివరాత్రికి (ఆ ఊర్లో ఇది పెద్ద పండుగ.) గెట్ టు గెదర్ ఏర్పాటు చేద్దాం మేడం అన్నాడు. వెంకటేష్ అనుకుంటే చేస్తాడు. యదానిక ఎనిమిది వెంకటేష్ గురించే. (సశేషం)



Tags:    

Similar News