ఆమె, ఎప్పుడైనా తల ఎత్తిందంటే సినిమాల్లో ఛాయాదేవే!

అపుడుపుడే కుటుంబ నియంత్రణ ప్రచారం మొదలయింది. చాలా మందిలో అదొక పాపపు పని అనే అభిప్రాయం. ఆపరేషన్ చేయించుకుంటే వచ్చే జన్మలో పిల్లలు పుట్టరనే ప్రచారం కూడాను...

Update: 2024-01-28 01:43 GMT



అమ్మ చెప్పిన ముచ్చట్లు - 9


-రాఘవ శర్మ

“మా మావగారు ముక్కోపి. నామాలు పెట్టుకున్న మొహంలోంచి కొరకొరా చూసేవారు.
మా అత్తగారు చాలా మంచిది.
ఎప్పుడూ ప్రేమగా ప్రశాంతంగా ఉండేది." అంటూ చెప్పుకొస్తోంది మా అమ్మ.
“ఒక రోజు మా మావ గారు వాళ్ళ అమ్మకో, నాన్నకో తద్దినం పెట్టారు.
మడి వంట అంతా మా అత్తగారే చేశారు.
తద్దినం బ్రాహ్మలు భోజనం చేసి వెళ్ళిపోయారు.
ఇంట్లో వాళ్ళు అంతా భోజనాలకు కూర్చున్నారు.
నేను, మా అత్తగారు ఒడ్డిస్తున్నాం. 'నెయ్యి పట్రా అమ్మాయ్' అని అరిచారు మా మావగారు.
బాగా ఆకలిపై ఉన్నారేమో పాపం.
పప్పు కలుపుకుని నేతికి అరచెయ్యిపట్టారు.
ఒక చెంచా నెయ్యి వేశాను.
తలెత్తి నా మొహం కేసి చూశారు. చాచిన చేతిలో నెయ్యి మరొకచెంచా వేశాను.
'నీ బాబు సొమ్మేమన్నా వేస్తున్నావా పొయ్యి' అని ఒక్క అరుపు అరిచారు.
అంతే నాకు భయ మేసి నేతి గిన్నె అక్కడ పడేసి వంటింట్లోకి పారిపోయాను.
మా అత్తగారొచ్చి నేతి గిన్నె తీసుకొచ్చింది.
మా మావగారు చాచిన చేతిలో మంచినీళ్ళలా నెయ్యి పోసింది !
ఆ రోజుల్లో కట్టెల పైన, బొగ్గుల పైనే వంట చేసేవారు.
మా అత్తగారింట్లో ఆచారాలెక్కువని చెప్పాగా!
వంట అయిపోయాక మా అత్తగారు వాడిన బొగ్గులను, కట్టెలను కూడా కడిగి ఎండ పెట్టేది!
వర్షాకాలమైతే అవి ఎండి చచ్చేవి కావు.
బజారు నుంచి ఏ సరుకులు తెచ్చినా కడిగి, ఎండ బెట్టి డబ్బాల్లో పోసుకునేది.
చివరికి ఉప్పుకూడా కడిగేది.
ఉప్పు కడిగినప్పుడు చాలా మటుకు కరిగిపోయేది.” అంటూ ఆనాటి పరిస్థితులను వివరిస్తోంది మా అమ్మ.
"ఇంత చాపీలా” అన్నా.
“అలా అనకురా బాబు. వాళ్ళు మన పెద్ధ వాళ్ళు పోయారు పాపం” అన్నది మా అమ్మ.
మా అమ్మకు సంబంధించిన కొన్ని సంఘటనలు గుర్తుకు వచ్చాయి.
మేం వనపర్తిలో ఉంటున్నాం. ప్యాలెస్ అవరణ నుంచి వనపర్తి నడిబొడ్డుకు ఇల్లు మారాం.
అది 1961-62 ప్రాంతం అనుకుంటా.
మేం అద్దెకు ఉంటున్న ఇంటి యజమాని పేరుపద్మావతమ్మ. వాళ్ళదొక వైష్ణవ కుటుంబం.
ఇంటి యజమానులు ఒక పోర్షన్ లో, మేమొక పోర్షన్లో పక్కపక్కనే ఉంటున్నాం.
మా అత్తయ్య పేరు బాపట్ల రామశేషమ్మ.
వరండాలో కూర్చుని దీపానికి ఒత్తులు తయారు చేస్తోంది. "అక్కయ్యా..ఈ రోజు అన్నంలోకి ఏం చేయించమంటావ్” అడిగాడు మానాన్న.
“ఈరోజు ఉల్లిపాయ శెనగ పప్పు వేసి గోంగూర పులుసు కూర చేయించురా. తినాలనిపిస్తోంది.” అంది మా మేనత్త.
“ఏమేవ్.. ఈ రోజు గోంగూర పులుసు కూర చెయ్యి.
ఉల్లిపాయలు, శెనగపప్పు బాగా వెయ్యి.
మీ పుట్టింట్లో వేసినట్టు వెల్లుల్లి పాయ వేయకు.
మాకు ఆ వాసనే గిట్టదు." అని మా అమ్మకు అర్డర్ జారీ చేశాడు మా నాన్న.
“అలాగేనండి" అంటూ మా అమ్మ తలూపింది.
గోంగూర పులుసు కూరంటే మాకు మొహం మొత్తింది.
మా నాన్న కాలేజీకి వెళుతూ వెళుతూ రోజూ వాళ్ళ అక్కను “అన్నంలోకి ఏం చేయించమంటావ్" అని అడగడం, ఆమె తన కిష్టమైన వంటకాన్ని చెప్పడం పరిపాటి.
ఈ తంతునంతా ఇంటి యజమాని పద్మావతమ్మ రోజూ గమనిస్తూనే ఉంది.
పద్మావతమ్మ తెల్లగా పొడవుగా ఉండేది.
కాస్త నోరున్న మనిషి, గట్టిపిండం.
ఒక సారి కడుపులో దాచుకోలేక అడిగేసింది.
“గోపాల రావుగారు, ఇంతకూ మీ ఆవిడ విమలమ్మా! శేషమ్మా!” అంది కాసేపు నవ్వుతూ.
“ఇంట్లో ప్రతిదీ మీ అక్కయ్య నడుగుతారు.
మీ ఆవిడ విమలమ్మ గారిని ఒక్కటీ అడగరే!?” అనే సింది.
మా నాన్న నోటంట మాట రాలేదు.
నోట్లో సిగరెట్టు పెట్టుకుని తలొంచుకుని వెళ్ళిపోయాడు.
అదేమీ విననట్టు మా అత్తయ్య తలొంచుకుని పత్తితో దీపపు ఒత్తులు చేసుకుంటోంది.
ఆ మాటలు విన్న మా అమ్మకు మనసు చివుక్కుమంది.
తలొంచుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది.
ఈ మాటలేవీ అర్థం కాక నేను, మా అక్క పలక, పుస్తకాలు తీసుకుని స్కూలుకు వెళ్ళిపోయాం.
వనపర్తి ప్యాలెస్ అవరణలోని క్వార్టర్లలోకి మళ్ళీ ఇల్లు మారాం.
నాలుగిళ్ళకు కలిపి ఒకే వరండా.
సాయంత్రమైతే పెద్ద వాళ్ళంతా ఆ వరండాలో కూర్చుని కబుర్లు చెప్పుకునే వారు.
అది 1964-65 ప్రాంతం.
నాకు పదేళ్ళ వయసుంటుంది.

అప్పుడే కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల గురించి ప్రచారం బాగా వ్యాప్తి లోకి వచ్చింది.

దానికి అనుకూల వ్యాఖ్యానాలం కంటే వ్యతిరేక వ్యాఖ్యానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి.
కొన్ని వ్యాఖ్యానాలు కాలేజీ కుర్రాళ్ళ నోళ్ళలో పడి మరింత వెకిలిగా తయారయ్యాయి.
ఇళ్ళలో కూడా కుటుంబ నియంత్రణ అంటే 'పాపపు పని' అన్న భావన వ్యాపించింది.
అది హైస్కూలు పిల్లల వరకు చేరింది.
" కుటుంబ నియంత్రణ పాపం " అన్నాడు ఒక విద్యార్థి .
" పుట్టిన అంత మందిని ఎవరు పోషించాలి?
పోషించ లేక పోతే పాపం కాదా!" అన్నాడు మరొక విద్యార్థి.
అప్పటికే నాకు అక్క, ముగ్గురు చెల్లెళ్ళు.
నాకు తెలిసీ తెలియని వయసు.
వరండాలో కూర్చున్న మా నాన్నతో "గోపాల్ రావ్ మనది ప్రైవేటు కాలేజి.
ఇప్పటికే నీకు అయిదుగురు పిల్లలు.
ఈ కాలేజీ ఎంతకాలం ఉంటుందో తెలియదు.
కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకోవడం మంచిది" అని పట్టాభిరామయ్య, ముత్యాలప్ప అనే తోటి ఉద్యోగులు హిత బోధ చేస్తున్నారు.
మా నాన్న సిగరెట్టు కాలుస్తూ కాదని కానీ, అవునని కానీ చెప్పలేకపోతున్నాడు. వాళ్ళసంభాషణ అయిపోయాక మా నాన్న ఇంట్లోకి వచ్చి మా అత్తయ్యతో "కుటుంబనియంత్రణ ఆపరేషన్ చేయించుకోమని ముత్యాలప్ప, పట్టాభిరామయ్య అడుగుతున్నారు.
ఏం చేయమంటావ్ అక్కయ్యా?" అడిగాడు.
“అట్లాంటి పాపపు పని మాత్రం చేయకురా, గోపీ!
ఈ జన్మలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసుకుంటే వచ్చే జన్మలో పియ్యి తిన్నాపిల్లలు పుట్టరు.
ఏ జన్మలో పాపం (కుటుంబ నియంత్రణ ఆపరేషన్) చేసుకున్నానో చూడు, ఈ జన్మలో నాకు పిల్లలు లేకుండా పోయారు” అనేసింది నిర్వేదం తో.
అర్జనుడికి శ్రీకృషుడిలా మానాన్నకు మా అత్తయ్య హితబోధ చేసింది.
కుటుంబ నియంత్రణ గురించి ఎవరితో చర్చించాలి!?
భార్యతో నా, అక్కతో నా!?
మా అత్తయ్య కంటే మా పెదనాన్న మూడేళ్ళు పెద్ద.
మా పెదనాన్న కూడా చెల్లెలు చెప్పినట్టు విన్నాడు.

మా పెద నాన్నకు ఏకంగా పద్నాలుగు మంది పిల్లలు.
వారిలో అరుగురినే నేను చూడగలిగాను.
ఏడాదికో, ఆరు నెలలకో ఆయన నుంచి ఒక కార్డు ముక్క వచ్చేది.
మా నాలుగో వాడు పోయాడు,
మారెండోది పోయింది, మా అయిదో వాడు పోయాడు అని.
ఉత్తరం రావడం ఆలస్యం, దాయాదులం కనుక మా నాన్న వెంటనే వేసుకున్న గుడ్డల్ని తడిపించేసి, స్నానం చేయమనేవాడు.
స్నానం చెయ్యకపోతే ఇంట్లోకి రానిచ్చే వాడు కాదు.
చలికాలమప్పుడు ఏ సమయంలో పడితే ఆ సమయంలో చన్నీళ్ళ స్నానం చేయలేక చచ్చే వాళ్ళం.
మా అత్తయ్య పేరు బాపట్ల రామశేషమ్మ.
మా నాన్న కంటే మూడేళ్ళు పెద్దది.
మా ఇంట్లోనే ఉండేది. అప్పుడప్పుడూ బాపట్లకు వెళ్ళి, కొన్ని రోజులు అక్కడుండి వచ్చేది.
భర్త ఉన్నా, అక్కడ వంటరి గానే ఉండేది.
మా శేషమ్మత్తయ్య లావు కాదు, సన్నమూ కాదు.
కోలముఖం.
ఎప్పుడూ తల దించుకునే పత్తితో దేవుడికి దీపపు ఒత్తులు చేసుకుంటోనో, దేవుడికి పూజలు చేసుకుంటోనో కనిపిస్తుంది.
ఎప్పుడైనా తల ఎత్తిందంటే సినిమాల్లో ఛాయాదేవే!
ఎప్పుడూ మడి, ఆచారాలు.
వంటింట్లోకి మమ్మల్ని వెళ్ళనిచ్చేది కాదు.
“నీళ్ళ బిందెలో ఎంగిలి గ్లాసులు ముంచుతారు పోండీ" అని కసురుకునేది.
వంటింటి గడప ముందే నేల పైన కట్టుకున్నచీర కొంగు పరుచుకుని పడుకునేది. వంటింట్లోకి పిల్లలెవరినీ రానిచ్చేది కాదు.
అందుకునే మా శేషమ్మత్తయ్య ఎప్పుడెప్పుడు బాపట్ల వెళ్ళి పోతుంతా అని ఎదురు చూసే వాళ్ళం.

మా అత్తయ్య మాటకు మా నాన్న ఎదురు చెప్పేవాడు కాదు.
కొరకొరా ఒక్క చూపు చూసిందంటే చాలు భయపడి చచ్చే వాళ్ళం.
చిన్న తేడా వచ్చినా అదిలించేది. ఆమె దగ్గరకు పిల్లలెవరూ వెళ్ళే వాళ్ళు కాదు.
“ఒరేయ్ గోపయ్యా.. ఆడపిల్లలకు చదువెందుకురా?” అనేది.
“ఒక్కొక్క దానికి పెళ్ళిచేసి పంపించేసేయ్" అని అరిచేది.
"మొగవాళ్ళకు కనపడకుండా తిరగాలి” అనేది.
“ఆడ పిల్లలు చెప్పులేసుకోవడమేమిటి!?” అంటూవిస్తుపోయేది.
మా అత్తయ్యకూడా తొలుత చెప్పులేసుకునేది కాదు.
బాపట్లలోనేకాదు, వనపర్తి వచ్చినా చెప్పులు లేకుండా తిరిగేది.
బాపట్లలో తారురోడ్లు వేశారు.
వేసవిలో తారురోడ్డుపైన నడుస్తుంటే కాళ్ళు కాలేవి.
ఎక్కడికో వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకుంటుంటే అరికాళ్ళు బొబ్బలెక్కేవి.
ఆ మంట భరించలేక తాను కూడా చెప్పులేసుకోవడం మొదలు పెట్టింది.
మా అమ్మ ఒత్తిడితోనే అడ పిల్లలకు చదువులు చెప్పించాడు మానాన్న.

మా అత్తయ్య నిరక్షరాస్యురాలు.
అలోచించడానికి అవకాశమే లేని వాతావరణంలో పెరిగింది.
అమెది బాల్య వివాహం.
అమె జీవితమంతా అడవిగాచిన వెన్నెలే!
అదొక విషాధగాధ.
వచ్చే భాగంలో వివరంగా చెపుతాను.
(ఇంకా ఉంది)


*( ఆలూరు రాఘవ శర్మ, జర్నలిస్టు, రచయిత, సాహితీ సౌగంధం ( ఉమ్మడి చిత్తూరు జిల్లా సాహితీ వేత్తల గురించి)కొత్త బంగారు లోకం ( చైనా పర్యటన అనుభవాలు) తిరుమల దృశ్య కావ్యం ( శేషాచలం కొండల లో ట్రెక్ అనుభవాలు) పుస్తకాలు అచ్చయ్యాయి. త్వరలో ‘వనపర్తి ఒడి లో’ విడుదల కానుంది.)


ఇలాంటి ఫీచర్ అర్టికిల్స్ మరిన్ని చదివేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.

Tags:    

Similar News