వల్లభాపురం జనార్దన ‘మండే’ కవిత : ‘కవితేంజేస్తది’

కవిత్వంలేనిదెక్కడ, కవిత్వానికి వశం కానిదేముంది. కవిత్వానికి విశ్వరూప సాక్షాత్కార గుణం ఉందని చెప్పే వల్లభాపురం జనార్దన ‘మండే ‘కవిత’

Update: 2024-02-05 07:48 GMT




కవితేంజేస్తది

***

-వల్లభాపురం జనార్దన

***
కవితేంజేస్తది
తెలంగాణా గాథా సప్త శతి అయితది
తెలంగాణ భాషా పతాకైతది
తెలంగాణా సాహిత్యచరిత్రకు కితాబైతది
కవితేమ్ జేస్తది
మూగకు మాటిస్తది
కుంటికి నడకిస్తది
సోమరికిచురకంటిస్తది

కవితేం జేస్తది
వివక్షను ప్రశ్నిస్తది
చట్టాన్ని నిలదీసే తెగువిస్తది
ఎడారిలో చెలిమె పుట్టించే
సైన్సయితది

కవితేం జేస్తది
చెమట చుక్కల ఆవిరులను
పద్య -కవితా పాదాలుగా ఉరికిస్తది
మెదళ్లను ప్ర వహించే
అక్షరాల నదులనుచేసి నడిపిస్తది

కవితేంజేస్తది
చేతులకు మట్టి అంటకుండా
మట్టినిగ్రానైటు వ్యావాగన్లుగా
డాలర్లభోషాణాలుగా మార్చుకుంటున్న మార్కెట్టు దొరలను నిలదీస్తది
మట్టిని దోస్తున్న మాయం చేస్తున్న చెయ్యిని మట్టిగరిపిస్తది

కవితేం జేస్తది
మనసును వీణగా పలికిస్తది
సరిగమల మెట్టు అయితది
పాటైతది
పద్యమైతది
గేయమైతది
వచన కవితైతది
నాటకమైతది
తిరుగుబాటుకావ్యమైతది
గుండెపిరికితనాన్ని చంపే గోలీ అయితది
కవితేంజేస్తది
గాలికి రాయబారంచేయడం నేర్పిస్తది
నేలకు గని అయితది
ఆకాశానికి విద్యుత్తయితది
చెట్టుకు హరిత రసాయన మైతది
నీటికి సునామీ పోటు నేర్పిస్టది

కవితేంజేస్తది
ప్రజలకు గొంతయితది
ప్రజా స్వామ్యానికి
ప్రాణవాయువయితది
ప్రజా సంస్కృతికి నాదమైతది
ఉద్యమశక్తికి ఇంధనమైతది




Tags:    

Similar News