పనిగంటల పరిమితికి కష్టజీవులు చిందించిన రక్తమే- మే డే!
పని గంటల కోసం కార్మికులు పోరాడి చిందించిన రక్తమే ‘మే డే’. ఉద్యమం సాగిన తీరుతెన్నులు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, సాధించిన ఫలితాల చరిత్ర ఇది.
మే డే చరిత్ర పనిగంటల పరిమితికి కష్టజీవులు సాగించిన పోరాటాల చరిత్ర. ప్రాణ త్యాగాలతో ఎరుపెక్కిన చరిత్ర. ఆస్ట్రేలియాలో అంకురించి అమెరికాలో విస్ఫుటించిన మహోద్యమ చరిత్ర. "కార్మికులకు 8గంటలు పని, 8గంటలు వినోదం, 8గంటలు కుటుంబ అవసరాలు" నినాదంతో ప్రారంభమైన ఉద్యమం సాగిన తీరుతెన్నులు, ఎదుర్కొన్న ఆటుపోట్లు, సాధించిన ఫలితాల చరిత్ర ఇది.
ఆ చరిత్రను ప్రభావితం చేసిన వారు, ఆ చరిత్రకు ప్రభావితం అయినవారు మే డే గురించి ఆయా సందర్భాలలో చేసిన ప్రసంగాలు, రాసిన వ్యాసాల సమాహారమే ఈ 92 పేజీల పుస్తకం " మే డే చరిత్ర - ప్రముఖుల ప్రసంగ వ్యాసాలు". దేశంలోనే తొలి కార్మిక సంఘం- ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్- (ఎఐటియుసి) ఆంధ్రప్రదేశ్ శాఖ ఈ పుస్తకాన్ని తీసుకొస్తోంది. ఏప్రిల్ 28 ఆదివారం ఉదయం 10 గంటలకు విజయవాడ ప్రెస్ క్లబ్‌లో ఆవిష్కరణ సభ జరుగుతుంది.
మార్క్సిజం సిద్ధాంత కర్తలలో ఒకరైన ఫెడరిక్ ఏంగిల్స్, మొదటి కార్మిక వర్గ రాజ్య సాధకులు లెనిన్, పలు దేశాల ప్రముఖ కార్మికవర్గ, కమ్యూనిస్టు పార్టీల నాయకులు రోసా లక్సంబర్గ్, జార్జి దిమిత్రోవ్, జూలియస్ ఫ్యూజిక్, ఫైడల్ కాస్ట్రో ప్రసంగవ్యాసాలు ఇందులో ఉన్నాయి. స్థూలంగా మే డే ఉద్యమ చరిత్రను వివరించే వ్యాసం పీకాక్ ప్రచురణల సంపాదకులు, మార్క్సిస్టు మేధావి ఎ. గాంధీ రచన "మే డే గాథ". అమెరికా పర్యటన సందర్భంగా చికాగో నగరంలో మే డే కీలక పోరాట ఘట్టం జరిగిన "హే మార్కెట్" ను సందర్శించిన సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ అమరయ్య రాసిన వ్యాసం " నెత్తుటి జెండాలు ఎగిసిన రోజది". చికాగోలో జరిగిన మే డే ఉద్యమ ప్రదర్శనలు, కార్మికుల పోరాటాలకు సంబంధించి నాటి అమెరికా పత్రికలలో వచ్చిన వార్తా కథనాలు, విశ్లేషణల తీరు తెన్నులను వివరించే మరో వ్యాసం, భారత్ లో తొలి మే డే వ్యాసాల సమాహారమిది. కార్మిక వర్గం నేడు ఎదుర్కొంటున్న తీవ్ర ప్రతికూల పరిస్థితులు, ప్రభుత్వాల తీరుతెన్నుల నేపథ్యంలో వస్తున్న ఈ పుస్తకం ప్రాధాన్యతను వివరిస్తూ ఎఐటియుసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి. ఓబులేసు ముందు మాట రాశారు.
ఈ పుస్తకానికి సంపాదకుడు ఆకుల అమరయ్య. సభాధ్యక్షులు జి. ఓబులేసు. ఆవిష్కర్త దారిదీపం పత్రిక సంపాదకులు డి.వి.వి.ఎస్. వర్మ. విశాలాంధ్ర దినపత్రిక సంపాదకులు ఆర్వీ రామారావు పుస్తకాన్ని పరిచయం చేస్తారు. శతాబ్ద కాలంగా భారత కార్మికవర్గం పోరాడి సాధించుకున్న హక్కులు, ఉద్యమాలతో సంపాదించుకున్న చట్టాలు నిర్దాక్షణ్యంగా రద్దయి పోతున్న నేటి కాలాన, తిరిగి పరిమితులు లేని పనిగంటల విధానాలు చొరబడిన పరిస్థితుల్లో- శ్రమ దోపిడీ తిరిగి తీవ్రతరం అవుతున్న సందర్భంలో ఈ పుస్తకం రావడం ప్రాధాన్యతను సంతరించుకొంది.
- కె. శరచ్చంద్ర జ్యోతిశ్రీ
27 ఏప్రిల్ 2024.