తెగి పోతున్న తల్లి వేరు

నా నుంచి నా వరకు: 2 కవి, రచయిత జూకంటి జగన్నాథం జ్ఞాపకాలు;

Update: 2025-03-13 00:12 GMT

-జూకంటి జగన్నాథం


నేను సిరిసిల్ల పట్టణంలో స్థిర నివాసం ఏర్పరచుకొని మూడు దశాబ్దాల కాలం అప్పుడే అయిపోయింది. మా ఊరు తంగళ్ళపల్లి మానేరు అవతలి ఒడ్డుకు మా ఊరు తంగళ్ళపల్లి ఉంటే అవతలి తీరం ఒడ్డుకు సిరిసిల్ల పట్టణం ఉంది. మా ఊరుకి రోడ్డు మార్గంలో పోవాలంటే అంతా తిప్పి తిప్పి కొడితే రెండు కిలోమీటర్ల దూరం ఉండదు . అదే వాగులో నుంచి పిల్ల బాటన వెళ్తే కిలోమీటర్ దూరం వస్తుంది. బండ్ల బాటలో పోతే కిలోమీటర్ పావు వస్తుంది. కానీ రాను రానూ మా ఊరికి నా రాకపోకలు బాగా తగ్గిపోయాయి అనే బదులు ఒక విధంగా పోవడం లేదనే చెప్పాలి .

అందుకు అనేక నెపాలు చెప్పవచ్చు కానీ నిజంగా అవి అసలు కారణం కానేకాదు. మరి ఏమై ఉంటుందని నాకు నేను ప్రశ్నించుకుంటే అనేక విషయాలు మననం లోకి వస్తున్నాయి. మేము నలుగురు అన్నదమ్ములు ఇద్దరు చెల్లెండ్రు. మా బాపు 1981 లో చనిపోయాడు. అందరి పెళ్లిళ్లు అయిపోయాయి నేను సిరిసిల్లలో ఉంటే మా అన్న మరియు పెద్ద తమ్ముడు హైదరాబాద్లో ఇల్లు కట్టుకున్నారు. మ చిన్న తమ్ముడు హనుమకొండలో ఉంటున్నాడు. 1998 సంవత్సరంలో మా అమ్మ తన 87 వ ఏట గతించినది. మా అమ్మ ఉన్నప్పుడు ఆ ఊరిలో మా ఇల్లు గోడలు కూలి మూలవాసాలు విరిగి దూలాలకు చెదలు పట్టి శిధిలావస్థకు చేరింది. ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలు సర్కారు తుమ్మలు మొలిచాయని బాధపడేది.
మా అమ్మ చివరి రోజుల్లో ఇల్లు ఏం చేద్దామని అనేకసార్లు అడిగింది. మా అన్నని తమ్ముళ్ళను ఈ విషయమై సంప్రదిస్తే ఎవరి ఇండ్లు వారికి అయినాయి ఎక్కడి వాళ్ళు అక్కడ ఇల్లు కట్టుకొని ఉంటున్నప్పుడు ఇప్పుడు ఆ ఇంటి తో పని ఏమి ఉంది. అమ్మ అట్లానే అంటది. నువ్వు మరమ్మతులు చేస్తే మాత్రం మేము డబ్బులు ఇయ్యము అని కుండలు బద్దలు కొట్టినట్టు కరాకండిగా చెప్పారు. అటువంటి పరిస్థితులలో వేరే గత్యంతరం లేక మా అమ్మ మా ఊరిలోని ఇల్లును అమ్మివేసింది. అప్పుడు మా అమ్మ ఆ ఇంటితో ముడిపడి ఉన్న అనుభూతులను, బంధాలను తీపి చేదు జ్ఞాపకాలను నెమరు చేసుకుంటూ ముఖంమీద కొంగు కప్పుకొని గొంతెత్తి ఏడ్చిన ఎత ఇప్పటికీ నన్ను అతలాకుతలం చేసి వేస్తుంది. అప్పుడు మా ఊరి మట్టితో ఇంటితో ఉన్న పేగు బంధం తల్లి వేరు తెగిన వృక్షంలా విలవిల్లాడిపోయాను. ఒక్క నిమిషం నేను అదే ధరకు తీసుకుందామా అని ఆలోచించాను. కానీ అప్పటికే నాకు ఉన్న అప్పు నెత్తి మీద ఉండడం వల్ల అటువైపు ముందుకు అడుగు వేయ సాహసించలేదు .నాటి ఆర్థిక పరిస్థితులు అందుకోసం అనుమతించలేక పోయాయి .

ఇల్లు పోయిన తర్వాత ఊరి మీది నుంచి అనేక సార్లు హైదరాబాద్ పోయినప్పటికీ మా ఊరు దగ్గర ఆగబుద్ధి కాలేదు. అనేక గాయాల సలపరింతలు నన్ను చుట్టుముడుతుండేవి. మా ఊరిలో ఒకప్పుడు బాగా బతికిన కుటుంబం మాది. నువ్వులతో ఒక దశలో రోజూ నాలుగు గానుగలు కట్టి నూనె అమ్ముకొని జీవనం సాగించే కుల వృత్తి మాది. ఆధునికత లోహ చక్రాల కింద అన్ని కులవృత్తులు విధ్వంసమైనట్టుగానే ఆయిల్ మిల్లుల రాకతో మా వృత్తి క్రమక్రమంగా కనుమరుగైపోయింది. దానితో ఒకప్పుడు పాడి, పశువులు, రెండు ఎకరాల పొలం అన్నీ పోయి కడుపులో చల్ల కదలకుండా బతికిన మా తల్లీ ఆరుగురి పిల్లల జీవితాలు ఒక్కసారిగా తలకిందులైపోయి బజార్లో పడ్డాయి . ఏం చేయాలో ఇలా బతకాలో తెలియక మా బాపు అమ్మ పరి పరి విధాల మధనపడుతుండేవారు.

అటువంటి పరిస్థితులలో మమ్మల్ని చూడడానికి మా అమ్మమ్మ ఊరు నుంచి మేనమామ వచ్చాడు. పిల్లల భవిష్యత్తు ఎట్లా అనుకుంటుంటే నేను ఒకరిని తీసుకుపోతాను అన్నాడు. సరే అని నన్ను పంపించారు. అప్పుడు నేను పుట్టిన ఊరు సిరిసిల్ల తంగళ్ళపల్లి నుండి మా అమ్మమ్మ ఊరు అయిన కోహెడ తంగళ్ళపల్లి కి మారినారు. మళ్లీ అక్కడి నుంచి నేను మా ఊరికి ఎలా రావలసి రావలసి వచ్చిన ఆ విషయమూ అక్కడి నా బాల్యం, వీడని స్నేహాలు ,చదువు సంధ్యల గురించి ఈ క్రమంలో మరొకసారి వివరిస్తాను.

ప్రస్తుతం మా ఊరికి పోవడం పూర్తిగా తగ్గిపోయింది అని చెప్పవచ్చును. ఎందుకంటే ల్యాండ్ ఫోన్లు సెల్ ఫోన్లు టీవీలు వచ్చిన తర్వాత పక్కింటి వాళ్లతో కూడా ఫోన్లో ఎక్కువగా మాట్లాడుతున్నారు తప్ప నాలుగడుగులు వేసి వారితో నేరుగా మాట్లాడటం లేదు. అత్యాధునికత తీసుకువచ్చిన సాంకేతిక పురోభివృద్ధి అంతా సైబర్ మయం అయిపోయింది . మనుషుల మధ్యనే కాదు ఊర్ల మధ్య కూడా విపరీతమైన దూరం పెరిగిపోయింది. పుట్టిన ఊరు కుదురు మట్టి బంధం మెల్ల మెల్లగా తెగిపోతుంది. ఇంతెందుకు చిన్నప్పటి బాల్య మిత్రులను కూడా కలవడం లేదు కలిసి మంచి చెడ్డలు మాట్లాడుకోవడం లేదు. ఊరు క్రమక్రమంగా రోడ్డు వైపుకు వచ్చింది. రోడ్డు పక్కన ఉన్న పంట పొలాలు మెట్ట పంటలు పండే చెలకల భూములు ఇప్పుడు ప్లాట్లు కొట్టి అమ్మకానికి పెట్టబడ్డాయి. కొత్తగా రియల్ ఎస్టేట్ అనే మాట వ్యాపార ధనాత్మక సంభాషణ ఒకటి సమాజంలో చలామణిలోకి వచ్చింది. దళారీ వ్యవస్థ మరింత బలపడింది.

ప్రైవేటు బడిల ముందు ప్రభుత్వ పాఠశాలలు తగినంతమంది విద్యార్థులు లేక వెలవెల పోతున్నాయి. ఉపాధ్యాయులు పక్క పట్టణం నుంచి లేక జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని నుంచో రాకపోకలు సాగిస్తున్నారు ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. దీన్ని ఎవరు తప్పు పట్టడం లేదు కానీ తిరిగి ప్రభుత్వాలు ఒకవైపు ప్రైవేటు రంగా రంగాలను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విభాగాలైన విద్య వైద్యాలను నామమాత్రం చేస్తున్నారు. పైగా హాస్యాస్పదంగా బడిబాట కార్యక్రమం పెడుతున్నారు.

భూస్వామ్య వ్యవస్థ కొత్త వలస వాద విధానాలను అనుసరిస్తున్నది. ఉపాధ్యాయులకు విద్యార్థులకు ఉన్న సంబంధం తల్లిదండ్రులకు పిల్లలకు ఉన్న బంధం రైతుకు భూమికి ఉన్న అనుబంధాలను తెంచి వేస్తున్న అకాలం ఒకటి దాపురించింది . అక్కడక్కడ రెడ్ ఆక్సైడ్ పెచ్చులుగా ఊడిపోయిన అద్దంలో చూసుకున్న ముఖంలా ఊరు ఇప్పుడు ఉసురు పోతున్నట్టుగా దర్శనమిస్తున్నది. ప్రశ్నించే వ్యక్తులు లేరు . ప్రజా పోరాటాలు అనేకానేక కారణాల వలన మైదాన ప్రాంతాలను విడిచి లోతట్టు అటవీ ప్రాంతాలకు విస్తరించింది. ఊరు తేజాన్ని ఎవరో ఎత్తుకుపోయాక పల్లె వెలుగు బస్సు వస్తూపోతూ అవ్వ ఏడవంగా బిడ్డ ఏడ్చినట్టు పలుకరిస్తున్నది.

మనిషి ఇప్పుడు ఎవరితో అంటూ సొంటూ లేని కేవలం ఆన్లైన్లో షాపింగ్ చేసే ఒంటరి ద్వీపకల్పం అయిపోయాడు.
ఈ విష వలయానికి నేనేమి అతీతున్ని కాదు కదా! నాకు ప్రత్యేకమైన మినహాయింపులు ఎవరూ ఇవ్వలేరు. కల్పించలేరు. ఒక జంఝాటంలో పడి రొడ్డ కొట్టుడు గా బతికేస్తున్నాను. కాకుంటే అప్పుడప్పుడు గుండె కలుక్కుమన్నప్పుడు ఏవో నాకు తెలిసిన రాతపూతలు రాస్తుంటాను. అనేక జ్ఞాపకాలను బలవంతంగా నాలోంచి మెడలు పట్టి గెంటి వేస్తుంటాను. తప్ప మా ఊరి వైపు కన్నెత్తి చూడ ధైర్యం చేయలేకపోతున్నాను. ఇంత దగ్గర ఉన్నా మా ఊరుకు పోలేక పోతున్నాను.గాక ఏర్పడిన అననుకూల వాతావరణంతో పోరాడ లేకపోతున్న నిస్సహాయుణ్ణి. ఎవరో రెక్కలను కత్తిరించిన ఎగరలేని పావురాన్ని పావురాన్నై ఎగురలేక పట్టణంలో విలవిల్లాడి పోతున్నాను్



Tags:    

Similar News