అమ్మమ్మ ఊరు నుంచి మా గ్రామానికి తిరుగు ప్రయాణం-7
నా నుంచి నా వరకు: 7 (కవి, రచయిత జూకంటి జగన్నాథం 'జ్ఞాపకాలు');
నేను బాల్యంలో అమ్మమ్మ ఊరికి పోయి , పై చదువులకు మా మామ పంపించనంటే మళ్లీ మా గ్రామానికి తిరుగు ప్రయాణం చేయడం జరిగింది . దానికి అననుకూల కారణాలు, పరిస్థితులు ఎలా ఏర్పడ్డాయో వివరంగా ఇక్కడ చెప్పాల్సిన అవసరం బాధ్యత వుఃదని భావిస్తున్నాను .
అది 1971 -72 సంవత్సరాలలో వర్షాలు లేక పంటలు సరిగ్గా పండలేదు. చేన్లు అన్ని ఎండిపోయాయి. పశువులకు ఎండిన పంట పొలాలే మేతగా ఉపయోగపడింది. పశుగ్రాసం దొరకడమే కష్టంగా ఉండేది. అదే సంవత్సరం నా 10వ తరగతి పూర్తయినది. నాతోటి మిత్రులందరూ కరీంనగర్ సిద్దిపేటల పోయి చదువుకుంటున్నారు. నన్ను పంపించమని మా అమ్మమ్మ ను అన్నక్కను అడిగాను. మా మామతో వారు ఈ విషయం చెప్పారు. ఆయన కోపంగా ఈ ఏడు పంటలు పండలేదు. నేను పంపించనని ఈ సంవత్సరం వ్యవసాయం చేస్తే ,పై చదువు గురించి వచ్చే సంవత్సరం చూద్దామని చెప్పాడు. నాకు మొదటి నుండి మంకు గుణం ఉండేది. అడిగింది ఇవ్వాలి. అన్నది కావాలి. లేకుంటే నిరసనను ఏదో రూపంలో తెలియజేయడం అలవాటు అయింది. నేను అలిగి రెండు రోజులు ఇంటికి పోకుండా అన్నం మానివేశాను. మా అమ్మమ్మ నా దగ్గరికి వచ్చి బతిలాడుతూ వాడు చూస్తే అట్లా నువ్వు చూస్తే ఇట్లా అని ఏడ్చింది. చివరికి ఈ ఒక్క సంవత్సరం వ్యవసాయం చేయమని, అయన పంపించకుంటే నేను పంపిస్తాను అని ధైర్యంగా చెప్పింది. చివరికి ఎటూ పాలు పోక నేను అయిష్టంగానే తలూపాను.
అంతకు ముందు మాకు రెండు నాగండ్ల వ్యవసాయం ఇద్దరు పాలేర్లు ఉండేవారు్ అందులో ఒకతను పశువుల పోశయ్య మరొకతను రొడ్డబోయిన నరసయ్య ఉండేవారు. నేను మెల్లమెల్లగా కాని కిందికి ఎడ్లను నుచ్చగొట్టి తోలి, నాగలి కట్టడం నేర్చుకున్నాను. రాను రాను ముందు నాగలి వెంట వెనుక నాగలి పట్టుకోవడం కోండ్ర వేయడం ఒడ్లు చెక్కడం, గొర్రు కొట్టడం నారు పంచడం వంటి పనులను పూర్తిస్థాయిలో నేర్చుకున్నాను. ఇది చూసి మా మామ వానకాలం ఒక పాలేరుని బంద్ చేయించాడు .సరే అని ఆ దఫా వ్యవసాయం నేను ఒక పాలేరుతో కలిసి నడిపించాళు. పంట కోతలు అయిపోయి మంచిగానే ధాన్యం ఇంటికి వచ్చింది. ఈసారి నన్ను పై చదువులకు మామ పంపిస్తాడని సంబురంతో ఉత్సాహంగా ఉన్నాను.
ఆ ఏడు జూనియర్ కాలేజీ తెరిచే సమయం వచ్చింది. నేను మా అమ్మమ్మ మేనత్త అన్నక్కలతో చదువు విషయం ప్రస్తావించాను. వారు ఒక రోజు సాయంత్రం మా మామని అడిగారు. దానికి ఆయన మనకు 8 ఎకరాల తరి భూమి, నాలుగు ఎకరాల రేగడి, ఆరెకరాల తోట ఉంది కదా! వ్యవసాయం చేసుకొని బతుకమను చదువులేదు గిదువూ లేదు. చదువుకొని ఏం చేస్తాడు నా అశల మీద నీళ్లు చల్లాడు.
నాకు కోపం , రేషం బాగా ఉండేది. కోపంతో నేలకేసి కాళ్ళను తన్నుకుంటూ ఏడ్చుకుంటూ బయటకు నడిచాను నాలుగు రోజుల వరకు ఇంటికి రాలేదు. ఉపవాసం ఉన్నాను. ముఖమంతా వెలవెల పోవడం చూసి నన్ను పోచయ్య హెల్పర్ అసలు తిన్నవా లేదా అని అడిగాడు. .తిన్నాను అని అబద్ధం చెప్పాను. ఇంటికి రాక వీడు ఎటుపోయాడని మా అమ్మమ్మ ఒక దిక్కు మా అన్నక్క మరో దిక్కు ఊరంతా వెతుకసాగారు. నేను దొరకలేదు ఎక్కడున్నానో నా ఆచూకీ తెలియనివ్వ లేదు. మా అమ్మమ్మ బాగా దయగల్లది. బిడ్డ కొడుకు ఎటుపోయాడని ఒకరోజు కోపంగా మా మామను ఎట్లైనా చేసి చదివించమని అడిగింది. మీ దగ్గర ఏమైనా ఉంటే అమ్ముకొని చదివిపించుకోండ్రి. అంతే నిష్ఠురంగా చెప్పాడు. అయ్యో వీడు ఎటుపోయాడు అని బాధపడుతూ ఏడుస్తూ ఒక రాత్రి లేచి ఎవ్వరికి చెప్పక చేయక మబ్బుల నాలుగు కిలోమీటర్ల దూరంలోని శనిగరం బస్టాండ్ వరకు పోయి అక్కడి దుకాణాల వారిని. హోటళ్ల వారిని నా వివరాలు చెప్పి మీకేమైనా కనిపించడా అడిగిందట. ఎవరూ రాలేదు అని చెప్పగానే బాధపడుతూ, మళ్లీ తెల్లారే వరకు తన కొడుకుకు తెలవనీయకుండా ఇంటికి చేర వచ్చింది. మా అమ్మమ్మ మాణిక్యమ్మ పేరుకు తగ్గట్టే ఆమె సౌశీల్యం అందర్నీ ఆకట్టుకునేది.
మా అమ్మమ్మ పోశెట్టి హెల్పర్ దగ్గరికి వచ్చి దుఃఖిస్తూ మా వాడి గురించి భయంగా ఉంది. మీకు కనబడితే నేను ఇంటికి రమ్మన్నానని చెప్పుమని దండం పెట్టి ప్రాధేయపడిందట .
నేను బయటకు పోయి పోశెట్టి సార్ ఇంటికి వచ్చేసరికి ఈ విషయం చెప్పాడు. నేనే బాధనిపించి ఇంటికి పోయాను .నాలుగు రోజుల నుంచి ఏడ ఉన్నావు ఏడ తిన్నావు ఏడ పడుకున్నావు అని మా అత్త అమ్మమ్మ ప్రశ్నించి బాధపడ్డారు. ఆ సమయానికి మామ ఇంట్లో లేడు. మా అమ్మమ్మ ముందు తినమని పళ్లెంలో అన్నం పెట్టింది. నాలుగు రోజుల నుండి తినలేదు కాబట్టి నాకు అన్నం గొంతులోకి అతి కష్టం మీద పోతుంది. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. .ఏడుస్తూ తింటున్నాను. ఊకో ఊకో అంటూ ఆ ఇద్దరు స్త్రీమూర్తులు వాళ్ల కళ్ల నీళ్లు తీసుకున్నారు .
సాయంత్రం మా మామ వచ్చి నన్ను చూసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. వాళ్ళ తల్లిని భార్యను తిట్టాడు. కోపంగా ఇంట్లో నుంచి దగ్గర్లో ఉన్న గాంధీ విగ్రహం దగ్గర వున్నాను. కరెంటు ఆరోజుల్లో లేదు. కోపంగా మా మామ కట్టె పట్టుకొని కొట్టడానికి నా మీదకు వచ్చాడు. నేను కోపంతో అంతే వేగంగా ఆ దెబ్బలకు తట్టుకొని, వెను తిరిగి కర్రను ఆయన చేతుల్లోంచి గుంజుకున్నాను. ఆయన అహం దెబ్బతిని తిట్టుకుంటూ కొట్ట సాగింది నేను కూడా ఎందుకు నన్ను ఇక్కడి తీసుకొచ్చావని చదివిపించకుంటే మా ఇంటికి పంపించమని కోపంగా ఏడుస్తూ అరిచాను. చుట్టుపక్కల వాళ్లు వచ్చి మా మామని ఇంట్లోకి తీసుకుపోయారు. నా దగ్గర కొందరు విషయం ఏమిటని అడిగారు. నేను అసలు విషయం చెప్పాను. అందులో కొందరు పెద్దమనిషి అలా ఎందుకు చేస్తున్నాడు మేము చెప్పు చూస్తామని పోయారు. వాళ్లు కూడా నచ్చ చెప్పినా మా మామ వినకపోగా చదివిపించుకోండి చెప్పవచ్చిన వాళ్లతో వెటకారంగా మీరే చదివిపించుకోండి అన్నాడు. వాళ్లు బస్సు చార్జీలు రేపు పొద్దున ఇచ్చి వాళ్ల ఊరికి పంపించమని సలహా ఇచ్చారు. మీరే ఇవ్వండి అని ఇంకా అలాగే మాట్లాడితే అందులోంచి కొందరు పెద్ద మనుషులు మంచి పద్ధతి కాదు ఆ పిల్లగాడిని పంపించు లేకుంటే చదివిపించమని చెప్పారు. ఆయన ససే మిరా అన్నాడు. చివరికి ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు అందరూ అనేసరికి రేపు ఉదయం బస్సు కిరాయిలు ఇచ్చి పంపిస్తానని చెప్పాడు.
నేను కూడా తెల్లారి మా ఇంటికి పోవడానికి చేయించుకున్నాను. ఆడికి పోయి కైకలి చేసుకుంటూ గటుక తిని పొమ్మని, ఇక్కడ అన్నం తినమంటే బాగా పొగరు ఎక్కిందని వంకరగా మాట్లాడాడు. అయినప్పటికీ నేను పోవడానికి నిర్ణయించుకున్నాను.
నేను మా ఇంటి నుంచి రాగా తీసుకొని వచ్చిన ఒక సందూక ట్రంక్ పెట్టె లో ఇనుప పెట్టెలో నా పదవ తరగతి సర్టిఫికెట్లను సర్దుకున్నాను. మా అమ్మమ్మ, మా అన్నక్క బాధపడుతూ ఇచ్చిన ఐదు రూపాయలతో శనిగరం బస్టాండులో కరీంనగర్ ఎర్ర బస్సు ఎక్కాను.1.25 పైసలు కరీంనగర్ కి బస్సు కిరాయ ఉండగా, అక్కడి నుండి సిరిసిల్లకు అంతే బస్సు చార్జీ ఉండేది. సిరిసిల్లలో దిగి సిరిసిల్ల బస్టాండ్ లోది పెట్టెను పట్టుకొని మానేరు వాగు దాటి మా ఇంటికి పోయాను. నిక్కరు వెనకకు పిల్లల మీద పిర్రల మీద అరచేయి వెడల్పు చినిగిపోయిన నా హాలత్ నా పరిస్థితి కాళ్లకు చెప్పులు లేని నా పరిస్థితి చూసి మా అమ్మ వాళ్లు పనికి పోగా, ఇంట్లో ఉన్న మా బాపు నన్ను పట్టుకొని బోరున విలపించాడు .