మా అమ్మమ్మ మాణిక్యమ్మ ఇంటి నుంచి జిద్దు పట్టుదలతో ఏదో అనుకున్నది సాధించాలని మా ఊరికి వచ్చినాను. కానీ తెలువని ఊరిలో మొరుగని కుక్కలా మా ఊరే అయినా పదేళ్ల తర్వాత కాబట్టి అంతా కొత్త కొత్తగా ఉంది. నాదైన ప్రత్యేకతను గుర్తింపును పొందాలని నిశ్చయించుకున్నాను. ఏ పని చేయాలి? ఎలా చేయాలి?? అనే ఖచ్చితమైన ఒక నిర్ణయం తీసుకోలేకపోయాను . అంత వడ్లూ పెరుగు కలిపినట్టుగా ఉంది.
నిజంగానే ఆ రోజుల్లో మా ఇంట్లో తినడానికే చాలా కష్టంగా ఉండేది. అందరూ ఇంట్లో వాళ్లు ఏదో ఒక పని చేసేవారు. మా అమ్మ నాట్లు వేయడానికి, కలుపు తీయడానికి, వరి పంట కోయడానికి రోజూ పోతుండేది .అదే పనికి మా బాపు కూడా అప్పుడప్పుడు పోయేవాడు. ఒకటి రెండు రోజుల తర్వాత నాకు గతంలో వచ్చిన పనే కాబట్టి నేను కూడా వరి పంట కోయడానికి వెళ్లుతుండేవాణ్ణి. ఎన్నడూ ఆ పని చేయడానికి అలవాటు లేని మా బాపు తొందరగా అలసిపోయేవాడు. నేను వరి కోయడానికి మా బాపుకు ఎదురు పోయే వాడిని. వరి కట్టలు మూడు నాలుగు నెత్తి మీద ఎత్తుకొని దగ్గరలోని కళ్లాల బండమీదికి మోసేవాళ్లం.
ఆ ఏడు వరి పంట కైకలి ఒకేసారి వడ్ల రూపంలో రెండు రెండు పల్లాల 40 కుంచాల వరకు మా ఇంటికి వచ్చినయ్. మా అమ్మ బాపు ఈ వానకాలం పిల్లల తిండికి రంధి లేదని సంబురపడ్డారు. కానీ ఆ సంతోషం మూడు నాళ్ల ముచ్చటగా అయిపోయింది. ఇంట్లోకి వడ్లు వచ్చినవని తెలిసి దగ్గర ఊరైన అంకుసాపురానికి చెందిన అన్నదమ్ములు మా బాపు గతంలో నువ్వులు తీసుకుని అప్పు పడ్డ బాకీ వాళ్లు ఇంటి మీదకు వచ్చారు . ఒక నెల రోజుల తర్వాత బాకీ పూర్తిగా చెల్లిస్తానని ప్రాధేయపడ్డాడు. అయినవాళ్లు దయ చూపక పోగా ఇంట్లో ఉన్న వడ్లను బండిలో వేసుకొని పోయారు. మేమంతా పిల్లలము ఎటూ పాలు పోక బీరిపోయి చూస్తున్నాం. మా బాపూ అమ్మ వడ్లు తీసుకు పోతున్న వారి కాళ్ళు మొక్కి బతిలాడిన కరుణించక అప్పులోల్ల అరాచకత్వాన్ని అడ్డుకునే శక్తి లేక నిస్సహాయంగా రెండు నెలల కష్టాన్ని బలవంతంగా తరలించుకపోతున్న వాళ్ల దిక్కు చూస్తూ కళ్ళ నీళ్లు నిశ్శబ్దంగా పెట్టుకున్నారు. ఆ విషాద సంఘటన ఇప్పటికీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నా కడుపులో ఎవరో చేయి పెట్టి దేవినట్టుగా ఉంటుంది.
ఆ రోజుల్లో కట్కూరు గ్రామం దగ్గర ఉన్న మానేరు వాగు లో తాడిచెట్టు లోతు పెద్ద ఇసుక పర్రెలను తీసి , రాళ్ల పేట, మండేపల్లి గ్రామాల పొలాల మధ్య నుంచి కాలువ ద్వారా మా ఊరి చెరువులోకి నీటిని తరలించేవారు. ఇందుకోసం ఎకరానికి ఒక మనిషి కాలువ తీసే పనికి రావాలి. కొందరు పెద్ద రైతులు రోజుకు పాంచ్ అణా కైకిలి కూలి ఇచ్చి పనికి తీసుకుపోయేవారు. అలా నేను మబ్బుల ఐదు గంటలకు ఇసుకను తీసే చెక్కపారతో పెద్దమ్మ బండకి వద్దకు పోయి కూర్చునేవాణ్ణి. కాల్వమీది రామయ్య పటేల్ అందరు లెక్క ప్రకారం వచ్చారో లేదో చూసి పనికిరాని వారికోసం కైకిల్ కి వచ్చిన వారిని పనికి పిలిచేవాడు.పని బాగా చేసే వారికి కూలీ కోసం ప్రాధాన్యత ఉండేది. అందులో నన్ను రోజూ పనికి పిలిచేవారు. మా ఊరు నుంచి దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో పని స్థలం ఉండేది. తెల్లారేసరికి అక్కడికి చేరపోయే వాళ్లం. ఇది వానకాలం ప్రారంభం ముందు దాదాపు నెలరోజుల పైగా కాలువ తీసే పని ఉండేది. పొద్దున పోతున్న దారిలో మధ్యన ఈత పుల్లనో వేప పుల్లనో వేసుకొని పండ్లు తోముకుంటూ పోయేవాళ్ళం. వాగు ఇసుక కాలువలో తేటగా పారుతున్న నీళ్లలో ముఖం కడుక్కునేది. ఎప్పుడో రాత్రి తిన్న ఆహారం అరిగి పోయి, వేస్తున్న రూపని దాహాన్ని నాలుగైదు దోసిల్ల చల్లని నీళ్ళతో కడుపు నింపుకొని ఆకలిని తీర్చుకునే వాళ్ళం.
లోతులో ఉన్న కాలువ మీద రామయ్య పటేలు గజానికి ఒక గీత గీసి వంతులు పెట్టేవాడు . ముందుగా రెండువైపులా ఇద్దరు నిలబడి, ఇసుక జారకుండా రెండు చేతులతో నీళ్లు చల్లి తడిసిన తర్వాత , చెక్కపార పట్టుకొని నీటిలోంచి ఇసుకను తీసి అంతెత్తు పైకి ఒడుపుగా విసిరేసే వాళ్లం. అలా కాలువ తీస్తుంటే నీళ్లు దుమ్ముతో మురికి అవుతుండేది. ఎండాకాలం ఉదయం ఎనిమిది తొమ్మిది
గంటల మధ్య విపరీతమైన దాహం వేసేది. నీళ్లు తాగడానికి అనువుగా ఉండేవి కాదు. మాకన్నా పెద్దవాళ్లు ఒకరు పైకి పోయి అక్కడక్కడ ఉన్న మోతు(దు)గ చెట్టు కాడలను తెంపుకొచ్చి ఒక్కొక్కరికి ఇచ్చేవారు . ఆ కాడలను మెల్లమెల్లగా నములుతుంటూ నోటిలో ఊరే లాలజలాన్ని మింగి దూప తీర్చుకునే వాళ్ళం.
అలా మెల్లమెల్లగా కాలువని వాగు ఒడ్ఢు మీంచి నీళ్లు రాళ్ల పేట, మండపల్లి గ్రామాల పొలాల మధ్య నుంచి మా ఊరి చెరువులోకి ప్రవహించేవి. ఆయా గ్రామాల కాలువను మేమే తీసే వాళ్ళం. అంటే పైన ఉన్న గ్రామాల రైతులు తమ పొలాలకు నీళ్లు పారిన పిమ్మట మిగిలిన
నీళ్లు మా చెరువులోకి వచ్చేవి. కానీ ఆ ఊరి పొలాలు ఉన్న రైతులు ఒక్కనాడు ఒక పారతో కాలువ మట్టి తీసింది లేదు. ఆయాచితంగా గ్రామం వారు చెమటోడ్చి తీసుకొచ్చిన నీళ్లను వాడుకునేవారన్నమాట. తరతరాలుగా సాగుతున్న ఈ విషయాన్ని మా ఊరి యువ రైతులను చాలామందిని ఆలోచింపసింది. ప్రశ్నింపచేసింది. కొందరు మంఎపల్లి రాళ్లపల్లి గ్రామాల పెద్ద రైతులను ఈ విషయమై అడిగారు కూడా. అయినా వారి నుంచి ఎలాంటి సరి అయిన సమాధానం రాలేదు. పైగా మీకు నీళ్లు అవసరానికి మా పొలాల మధ్య నుంచి తీసుకపోతున్నారు కదా ఆ మాత్రం నాకు అనుభవించే హక్కు ఉంటుందని కొందరు ఎదురు మాట్లాడినారు. మీ పొలాలకు నీళ్లు అవసరం ఉంటే మీరే తీ కాలువ తీసుకోవాలని చెప్పినారు.