పారడాక్స్

నేటి మేటి కవిత;

Update: 2025-01-12 04:38 GMT
Manyam (vizag4u : facebook)

మంచు పొగతో ధూపమేసినట్టుగా వుంది మన్యం

పైన తెరలు తెరలుగా మబ్బులు ఆకాశం అమ్మ గర్భంలా

గర్భస్త శిశువులా సూరీడు!

మంచుకు, వెలుతురుకు నడుమ ఎడతెగని సయ్యాటలో …

సౌందర్యానికొక ప్రతిమలా నిలిచింది వనం

కవిత్వానికొక నిర్వచనమయ్యింది తుషారం!

ఎక్కడో మిణుకు మిణుకు మంటున్న సూరీడు సంధిస్తున్న వెలుతురు బాణాలు

మంచు చలి బాహువుల్లో చిట్లి అదృశ్యమౌతున్నాయి

అదొక భీభత్స సౌందర్యం

అదొక వలపు పూల వాన!

తర్క రహితమైనదేదో పలుతావుల పరుచుకుంటుంది

కంటికి అందానిదేదో కలకి అందుతుంది

చల్లగా తగులుతాడు సూరీడు!

ఏదో వినిర్మలమైన వెచ్చదనాన్ని ఒలక బొస్తుంది మంచు!

ప్రకృతి ఎప్పుడూ ఒక అధివాస్తవిక చిత్రమే!

తుది మొదలూ లేని చలిత, జ్వలిత నైరూప్యమే!

అలజంగి మురళీధరరావు; 

Tags:    

Similar News

అవిటి నత్త