-డాక్టర్ గోపికృష్ణ, మదనపల్లె
నువ్వు పూలకుపట్టిన చీడను
వదిలించాలని ప్రయత్నిస్తూంటే
అతను చెట్టును మొదలంటా నరికేసి
కలపను అమ్మేయాలనుకొంటున్నాడు!
నువ్వు పాలివ్వని ముసలి ఆవును
ఎలా మేపాలని దిగులుపడుతూంటే
అతను అప్పుడే కబేళావాళ్ళతో
మంచి బేరం కుదిరించేసుకొన్నాడు!
నువ్వు తెగిపోతున్న సంబంధాలను
ఎలా నిలబెట్టుకోవాలి అనుకొంటూంటే
అతను అనవసరమైన బరువును
మోయడమెందుకని తీర్మానించాడు!
పెరిగే భూతాపాన్ని తగ్గించి పుడమిని
కాపాడుకోవాలని నువ్వు ప్రయత్నిస్తుంటే
అణుబాంబుల తయారీలో అణుక్షణం
అతను బిజీగా మారిపోయాడు!
ప్రపంచం రోజురోజుకీ
పతనమైపోతోంది.. పరవాలేదు..
ఇంత వేగంగానా అన్నదే నాదిగులు!
నైతికవిలువలు నానాటికి
దారుణంగా దిగజారిపోతున్నాయి..
మరీ ఇంత లోతుకా అనే నాకన్నీరు!