నేటి మేటి కవిత | గురి

POEM OF THE DAY;

Update: 2024-12-11 02:11 GMT

    -సూర్యచంద్ర


1.

నువ్వెప్పుడైనా నా కండ్లలోకి తొంగి చూసావా?

ఓ ఆకలి ఎడారి తెరిచి ఉంటుంది.

నన్ను కన్న దేశమే

కార్చిచ్చులా నా బహిరంతరాల్లో వ్యాపించి ఉంటుంది.

ఇప్పుడు నాకింత బువ్వ కావాలి

కుల,మతోన్మత్త విషం లేని ప్రేమ కావాలి

2.

నువ్వెప్పుడైనా నా శిరస్సును చూసావా?

నువ్వు విసిరిన రాతిపరాగం

యుగయుగాలుగా పదిలం.

స్మశానాల్ని మోసే నాకు

మహా వైశాల్యపు గుండెనీడ కావాలి

నీ మతం గత్తులేని పచ్చని శ్వాస కావాలి.

సుకుమారంగా నన్ను మేల్కొలిపే

మృదు ఉదయం కావాలి...

3.

ఔనూ...

నువ్వెప్పుడైనా నీ నిర్లజ్జ బుద్ధి దాటి

నా గుండెను తడిమావా?

బడి దగ్గరా,గుడి దగ్గరా, బావి దగ్గరా

నువ్వు గీసిన అడ్డుగీత సరిహద్దులా సలుపుతుంది..

నాకిప్పుడు మంచు పులుముకున్న

స్పర్శ కావాలి.

ఆంక్షల్లేని సమతల బంధుత్వం కావాలి.

4.

భక్తితెరలు దాటి నువ్వెప్పుడైనా

నా బతుకులోకి తొంగి చూసావా?

నా ఆడబిడ్డల ధ్వంస దేహాలు...

నా వాడ పిల్లల నెత్తురు గాయాలు...

వెలివేతల వ్యథాచిత్రాలు

హిమాలయ సానువులై కనిపిస్తాయి

నాకిప్పుడు జాలి మాటలొద్దు.

ప్రేమనదీ ప్రవాహపు స్నేహం కావాలి..

మన నెత్తురువాగుల సాంకర్యం

కావాలి. ఇస్తావా?

5.

దిక్కులేని గుడిసె మధ్యనే

మనకోసం రేపటి పొద్దుని దిద్దుతున్నా నువ్వెప్పుడైనా నా ఇంటికొస్తే కదా...

నాకిప్పుడు కరచాలనమెక్కటే కాదు

ఈ గోడలు బద్దలవ్వడం కావాలి..

కలిసి పిడికిలి బిగించడం ముఖ్యoగా కావాలి...

6.

నీకు దారితెరిచిన నా పాదాలను

నువ్వెప్పుడైనా స్పృశిoచావా?

నా పేగు మంటని రుచి చూసావా?

కనీసం, నా అనాథ బతుకు శోకాన్ని విన్నావా ?

నా కంఠరవాన్ని కప్పే ఈ కీర్తనలొద్దు నాకు.

ఎగుడు దిగుడులేని నీ కౌగిలి కావాలి

నిన్ను, నన్ను కలిపే ఉమ్మడి గురి కావాలి...

(డి జి సూర్య చంద్ర, నారాయణపేట జిల్లా, మక్తల్ మండలంలోని మంతన్ గోడ్ హైస్కూల్లో తెలుగు టీచర్.

ఇప్పటిదాకా రెండు కవిత సంకలనాలు అచ్చేశారు) 

Tags:    

Similar News