“యశోధర” నవ్వింది…..!!
బుద్ధజీవితం కంట తడి పెట్టించే కరుణశ్రీ పద్యాలు;
-వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు
‘సిద్ధార్ధుడు’ ఇంటిని వదిలి వెళ్ళిన ఏడు సంవత్సరాల తర్వాత తండ్రి శుద్ధోధనుడికి కొడుకు జాడ తెలిసింది..! కొడుకు ‘సిద్ధార్ధుడు’ జ్ఞానోదయం పొంది ‘బుద్ధుని’ గా మారాడని వేగుల ద్వారా తెలుసుకున్నాడు. ‘కపిలవస్తు’ కు రమ్మని రాజదూతల చేత శుద్ధోధనుడు ఆహ్వానం పంపాడు. తండ్రి ఆహ్వానాన్ని మన్నించిన గౌతముడు, తనకు జ్ఞానోదయమయిన రెండు సంవత్సరాల తర్వాత ‘కపిలవస్తు’కు కాలినడకన ప్రయాణమయ్యాడు. కొడుకు వస్తున్నాడని తెలిసిన శుద్ధోధనుడు రాజప్రాసాదాన్నంతా అందంగా తీర్చిదిద్దాడు. బుద్ధుడి కోసం, అతని శిష్యుల కోసం విడిది కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరికీ ఏలోటు లేకుండా తనే దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు…!
ఏడు సంవత్సరాల ఎడబాటు తర్వాత.. తాను పెంచిన కొడుకును చూడబోతున్న ఆనందంలో పినతల్లి “మహామాయా ప్రజావతి గౌతమి” ఒకవైపు ఆతృత పడుతూనే బుద్దుడికి ఇష్టమైన అన్నీ రకాల పిండివంటలను సిద్దం చేసింది. అన్నీ పనుల్లో తనమునకలై ఉండి కూడా పదేపదే కోడలు ‘యశోధర’ ను అందంగా ముస్తాబు చేస్తూ, బుద్దుడు వచ్చాక ఎలాంటి సపర్యలు చేయాలో పదేపదే గుర్తుచేస్తూనే ఉంది…! బుద్ధుడి ఆగమనం తెలిసిన యశోధర ఆ రాత్రి నిద్రపోలేదు.
యశోధర తనలోతాను ఎలా కుమిలిపోతుందో చూద్దాం…
ఉత్పలమాల
అద్దమరేయి నిర్దయుడవై చనినాడవిదేమి స్వామి? నన్
నిద్దుర మేలుకొల్పు “తరుణీ! నవమానవ భాగ్యరేఖలన్
దిద్దు కేగుచుంటి” న్ని తెల్పిన వాకిలి కడ్డువచ్చి పో
వద్దని యందునా హృదయవల్లభ! అంతటి మూర్ఖురాలనా?
అంటూ లోలోన బాధపడుతూండగా… తెలవారబోతోంది. తనను తాను సింగారించుకోవడం ఇష్టం లేక సాదాసీదాగా ఉంది. కొడుకు రాహులుడి దగ్గరకు వెళ్ళి… అతనిని సిద్ధం చేయాలనుకుంటే మగత నిద్రలో ఉన్నాడు …
శార్దూలం
నాన్నా రాహుల! నాన్న వచ్చునది యీనాఁడేనురా! పూజకై
సన్నాహమ్ములు సేయుచుండి రపుడే శాక్యేశ్వరుల్! ప్రక్కపై
కన్నుల్ విప్పుచు మూయుచుంటి విదిగో కన్నయ్య! యీ నిద్రయే
నన్నున్ నిన్నును మోసపుచ్చినది యానాఁ డర్థరాత్రమ్మునన్!
ఉత్పలమాల
రాగములందుకొన్నది సరస్సలిలంబు: ప్రభాత గీతముల్
సాగెను; నాట్యమాడె నవజాగృతి దిక్కుల; పుల్కరించె పు
న్నాగము; పారిజాతములు నవ్వుల పువ్వులు జల్లె; స్వామి వా
రాగమనమ్ము సేయు సమయమ్ము: రయమ్మున లెమ్ము నాయనా!
అంటూ నిదురలేపి సంసిద్ధుణ్ణి చేసింది. రాహులునికి బుద్ధుడు తండ్రి అయినప్పటికీ ఎలా ప్రవర్తించాలో చెబుతోంది…
సీసపద్యం
దూరాన నిల్చి కేల్దోయి మోడ్తువు గాని,
పరువెత్తిపోయి పైబడెదు సుమ్ము!
వినయాన తలవంచి వీక్షించెదవు గాని,
చేలాంచలము స్పృశించెదవు సుమ్ము!
అమృత సందేశమ్ము నాలకింతువు గాని,
పెదవి కదల్చి పల్కెదవు సుమ్ము!
చివురాకు పూలదోసిళు లెత్తెదవు గాని,
పదసరోరుహము లంటెదవు సుమ్ము!
తొగరు మునివేళ్ళ చెక్కిళ్ళు తుడుచు కొనుచు
నిలచి నా ముందు చూచుచుండెదవు గాని,
“నాన్న మానాన్న” యని యమాంతముగ పరవ
శించి స్వామిని కౌగిలించెదవు సుమ్ము!_
అని జాగ్రత్తలు చెప్పింది. బుద్దుడు రానే వచ్చాడు. బుద్ధుని సోదరులైన ఆనందుడు. అనిరుద్ధుడు. నందుడు, బుద్దునికి, అతని శిష్యులకు (బౌద్ధ సంఘానికి) ఘనంగా స్వాగతం పలికారు….! రాజవీధి అంతా పూలతో నింపేశారు. అలా బుద్ధుడు నడచి వస్తుంటే… వీధికి ఇరువైపుల మేడలమీద నిల్చుని చూస్తున్న వందలమంది మహిళలు బుద్దుడిపై పూలు చల్లుతూ ఆశ్చర్యంతో తమతో తాము ఏమనుకుంటున్నారో చూడండి…
సీసపద్యం
“బింబోష్ఠి! ఇతఁడటే లుంబినీవనములో
మున్ను మాయాదేవి కన్నబిడ్డ ?
వనజాక్షి ! ఇతఁడ టే మన ప్రజావతి పెంచి
పెద్దచేసిన చిన్ని ముద్దులయ్య?
చంద్రాస్య ! ఇతఁడ టే శాక్యరాజ్యశ్రీని
వీడిపోయిన రాచ కోడెకాఁడు ?
పూఁబోణి ! ఇతఁడ టే బోధివృక్షము క్రింద
బుద్ధత్వమును గన్న సిద్ధ యోగి ?
ఇంతి ! ఇతఁడటె ! ఇతఁడే నటే! సుజాత
మంచి యాఁబాల వండి వడ్డించినట్టి
తీయ తీయని గోర్వెచ్చ పాయసంబు
కడుపునిండ భుజించిన కరుణమూర్తి !
అరుదెంచెనమ్మ ! గాయము మాన్పి రాయంచ
బ్రతుకు నిల్పిన దీనబాంధవుండు;
దయచేసెనమ్మ ! అందాలరాణిని వీడి
వనవాటికలకు సాగిన విరాగి;
చనుదెంచెనమ్మ ! యజ్ఞముల రక్తము నాపి
యమృతమ్ము జిందు దయాపయోధి!
అదె విజయం చేసెనమ్మ ! చోరుల మహో
దారుల గావించు ధర్మరాజు;
కలికి ! విచ్చే సెనమ్మ ! లోకులకు నెల్ల
మేలుకోలిచ్చు విశ్వవైతాళికుండు;
వెలఁది ! వేంచే సెనమ్మ ! పృథ్వీవిపన్ని
వర్తకుఁడు ధర్మచక్రప్రవర్తకుండు.”
అని వింతగా చెప్పుకుంటూ పూలజల్లులు కురిపించారు. బుద్దుడు రావడంతోనే… ఒక్కసారి తను 29 ఏండ్లపాటు కలియతిరిగిన ఆ రాజప్రాసాదాన్ని పరికించి చూశాడు. ఏదో మారిపోయిందని అర్థమవుతుంది కానీ, ఏదో తెలియడం లేదు. అంతలోనే మహామాయా ప్రజావతీ గౌతమి ‘యశోధర’ను, రాహులుడిని, తీసుకుని తోడుగా వందలాది మంది చెలికత్తెలతో వచ్చి ఎదురుగా నిలుచుంది. ఏడేళ్ళ ఎడబాటు తర్వాత గుర్తుపట్టలేనంతగా మారిపోయిన కొడుకును చూసి, పోల్చుకోలేక, అతన్ని దగ్గరకి తీసుకోలేక దు:ఖంతో నోట మాటరాక అలాగే నిలుచుంది ఆమె….! బుద్ధుడు మాత్రం తను ఒంటిమీద కప్పుకున్న వస్త్రాన్ని సరిచేసుకొని, సాష్టాంగపడి పినతల్లికి నమస్కరించాడు. విస్తు పోయిన గౌతమి తేరుకుని పక్కనే ఉన్న ‘యశోధర’ ను, కొడుకు రాహులుడిని గుర్తుచేసింది.
పాలిపోయిన చెక్కిళ్లు, కాంతివిహీనమైన కళ్లు, ముడతలు పడిన చర్మంతో వయసులో ఎంతో పెద్దదిగా కనిపించిన ‘యశోధర’ను చూసి పోల్చుకోలేకపోయాడు. తర్వాత ఆమెను గుర్తుపట్టి సాష్టాంగపడి ఆమెకు, రాహులుడికి కూడా నమస్కరించాడు. ఒకనాడు తన శరీరాన్నంతా కప్పేసిన దేహం, ఊపిరాడకుండా అధరాలను చుంబించిన పెదాలు, కురులతో ఆడుకున్న చేతులు ఒక్కసారిగా పాదాక్రాంతమై దాసోహమంటుంటే చూసి యశోధర విస్తుపోయింది….!
ఇంతలోనే శుద్ధోధనుడు సింహాసనాన్ని చూపించి ఆశీనుడవ్వమన్నాడు… బుద్ధుడు మృదువుగానే ‘నేను సన్యాసిని’ అధికారాలు, దర్పాలు నాకు తగవని’ తిరస్కరించాడు.
‘‘యువరాజువి నువ్వు తప్ప నాకింకెవ్వరున్నారు, ఇదంతా నువ్వు కాకుండా ఇంకెవరు ఏలుకుంటారని” తండ్రి ప్రాధేయపడ్డాడు. కానీ ఫలితం లేకుండా పోయింది…! ఇక చేసేదేమీలేక శుద్ధోధనుడు ‘అతిథ్యాన్ని స్వీకరించమని’ రకరకాల తినుబండారాలను బంగారం, వెండి పాత్రలతో నింపిన భోజనశాలవైపు చూపించాడు. కానీ బుద్ధుడు ‘నేను ‘సన్యాసి’ని ఇలాంటి విలాసవంతమైన ‘విందు భోజనాలు’ తగవని, శిష్యులతో పాటు తనూ నేలపైనే కూర్చున్నాడు….!
మరోసారి విస్తుపోవడం అందరివంతయ్యింది. చేసేదేమీ లేక ప్రేమతో పెంచిన పినతల్లి మాయా ప్రజావతి గౌతమి ఎంతో కష్టపడి, సిద్ధార్ధుడికి ఇష్టమని చేసిన రకరకాల పిండివంటలను వడ్డించబోయింది… ఒక్కసారిగా అవాక్కయిన బుద్ధుడు రెండు చేతులు జోడించి, మళ్లీ… ‘‘నేను సన్యాసిని’ ఇలాంటి ఆహారం తగదు… నాకు సాత్వికాహారం కావాలన్నాడు….!
భోజన కార్యక్రమం ముగిసింది…. రాజ దర్భారులోనే ఏర్పాటు చేసిన సభలో, ‘ధర్మం’, ‘సత్యం’ పై చర్చను ప్రారంభించారు. బుద్ధుడు తనకు కలిగిన జ్ఞానోదయ దర్శనాన్ని గురించి అందరికీ విశదీకరిస్తున్నాడు. సత్యానికి మించినదేమీ లేదని బోధిస్తున్నాడు. “అన్నింటికీ కారణం కోరికలే” అని హితబోధ చేస్తున్నాడు.! శుద్ధోధనుడితో సహా అక్కడున్న అందరూ తమతమ అనుమానాలను అడిగి నివృత్తి చేసుకుంటున్నారు. అతడి జ్ఞానానికి అబ్బురపడుతూ, అతడి ద్వారా ప్రసన్నమైన వారు తమని కూడా శిష్యులుగా చేర్చుకొమ్మని వేడుకొంటున్నారు….!
ఎప్పటినుంచో ఈ చర్చను, బుద్దుడి ఉపదేశాన్ని గమనిస్తున్న ‘యశోధర’ కు మాత్రం విచిత్రంగా తోచింది….! ఎందుకో ఉండబట్టలేక విరగబడి నవ్వడం మొదలెట్టింది…..! ఈ హఠాత్ పరిణామానికి బుద్దుడితో సహా అందరూ విస్తు పోయారు.
యశోధరను మునుపెన్నడూ ఇలా చూడని మాయా ప్రజావతీ గౌతమి కూడా ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోయింది….! నవ్వీ నవ్వీ కాసేపటి తర్వాత సభ మధ్యలో కొచ్చి నిల్చుంది. అందరినీ ఒకసారి తీక్షణంగా చూసి, బుద్ధుడివైపు తిరిగి…. ప్రభూ! తమరు ఏదో సత్యాన్ని కనుగొన్నారని అందరూ అంటూన్నారు… నేనొక అల్పురాలిని, లోక జ్ఞానం తెలియనిదానిని… నాకొక సందేహం ఉంది. అడగమంటారా ? అంటూ నిలుచుంది…
బుద్ధుడు, చిరుదరహాంతో, ఆమెవైపు తలెత్తి చూసి, ఆమెలోని తీక్షణమైన చూపుకు తట్టుకోలేక వెంటనే తలదించుకొని ‘అడగండీ’ అంటూ సెలవిచ్చాడు…
మహా ప్రభూ ‘‘మిమ్మల్ని అందరూ మహా జ్ఞాని అంటే, మీరేమో ‘నేను సన్యాసిని’ అంటున్నారు.. మీరు పరిత్యజించినది లౌకిక సౌఖ్యాన్ని, కానీ పొందబోతున్నది అలౌకికానందాన్ని….. పోగొట్టుకున్నది ఒక చిన్న రాజ్యాన్ని, కానీ స్వాధీనం చేసుకోబోయేది విశాల విశ్వాన్ని…..! విడిచిపెట్టినది స్వర్ణ కిరీటాన్ని, కానీ ధరించనున్నది దివ్యతేజస్సును…..! మీరు వదులుకున్న దానికంటే పొందేది ఎక్కువైనప్పుడు, దాన్ని ‘సన్యాసం’ అంటారా శుద్ధోధన కుమారా….?!
నీకోసం కన్నవాళ్లను, తోబుట్టువును కోల్పోయిన నేనూ, ఇవ్వాళ రాజ్యమున్నా…శరణార్థిలా, మంగళసూత్రమున్నా…వితంతువులా, సంతానమున్నా…. సన్యాసినిలా బ్రతుకుతున్నాను…! ఆలోచించారా నా పరిస్థితి ఏమిటో….!?
మీరు ‘నేను సన్యానిసి, సన్యాసిని’ అని పదే పదే అంటుంటే నాకు నవ్వు ఆగటం లేదు శుద్ధోధన కుమారా….! వాస్తవానికి సన్యాసి మీరు కాదు, నేను సన్యాసిని….! నేను మాత్రమే కాదు ఈ భూమిపై ఉన్న ప్రతి ఆడదీ సన్యాసియే…! భర్తకోసం కనిపెంచిన తల్లిదండ్రులను, రక్తం పంచుకున్న తోబుట్టువులను… పిల్లలకోసం, వారి ఎదుగుదలకోసం ప్రతిరోజు మా సర్వసుఖాలను త్యాగం చేస్తున్న మేము… మేము అసలైన సన్యాసులం….! బహుశా ఇదంతా నీకు లౌకికమైనదిగానే కనిపిస్తుందేమో…! కానీ ఒక్కసారి మీ గతాన్ని గురించి ఆలోచించండి… మీరు పుట్టినవెంటనే, మీ తల్లి చనిపోతే మీ ఆలనా పాలన కోసం ‘మహామాయా గౌతమి’ తన సర్వాస్వాన్ని త్యాగం చేయకపోయి ఉంటే… మీరు ఉండేవారా? మీ సత్యం ఉండేదా….!?
ఇన్నాళ్ళూ యశోధర ముఖంలో ఇంతటి వెలుగును చూసి ఎరుగని వాళ్లు నిశ్చేష్టులై అలాగే చూస్తుండి పోయారు…!
ఇలాంటి ప్రశ్నలను ఎన్నడూ ఎదుర్కోని బుద్ధుడు ఒక్కసారి తలెత్తి ఆమెవైపు చూశాడు.
ఇంతకుముందు పాలిపోయిన ఆమె చెక్కిళ్లు ఇప్పుడు కాంతివంతంగా కనిపిస్తున్నాయి. కాంతివిహీనమైన కళ్ళు ప్రకాశిస్తున్నాయి. శతకోటి సూరీళ్ళు ఒకేసారి ప్రభవించినంతటి వెలుగు ఆమె ముఖంలో తాండవిస్తోంది.
అంతే.. తీక్షణమైన ఆమె చూపులవైపు ఎక్కువసేపు చూడలేక తలదించుకొన్నాడు..!
ఇంతసేపు నిశ్శబ్దంగా ఉన్న అతడి శిష్యుల్లో సందేహం మొదలైంది… ఒకరినొకరు చూసుకోవడం మొదలెట్టారు. అందరూ బుద్ధుడు ఏం చెబుతాడో చూద్దామన్నట్లు బుద్దుడివైపు ప్రశ్నార్థకంగా చూస్తుంటే…. బుద్దుడు కాసేపు కళ్లుమూసుకొని ధ్యానంలో నిమగ్నమై… ఒక్కసారిగా ఏదో కనుగొన్నట్లు కళ్లుతెరచి దిగ్గున లేచి నిల్చున్నాడు. శిష్యులందరూ ఏమైందటూ ఆయన్ని ప్రశ్నిస్తుంటే…..
యశోధర మళ్లీ నవ్వడం మొదలెట్టింది…..!!
యశోధర నవ్వును భరించలేక ‘‘ఇంకా తెలుసుకోవాల్సిన సత్యమేదో మిగిలే ఉంది’’ అంటూ బుద్దుడు అక్కడినుంచి కదిలాడు….!
{తమిళ కవి వైరముత్తు రాసిన ఒక కవితకు అనువాదం చదివిన స్పూర్తితో… దీనికి జంధ్యాల పాపయ్యశాస్త్రి గారి "కరుణశ్రీ" కావ్యం లోన పద్యాలనూ జతచేసి మీకు అందించాను..: --వెలిశెట్టి నారాయణరావు, విశ్రాంత సాంఘీకశాస్త్ర ఉపాధ్యాయుడు)
[ఇప్పుడు మరో కోణంలో] __
బుద్ధుడిలా బతికేయడం సులభం. కానీ, బుద్ధుడి భార్యలా బతకగలరా...???
**
జ్ఞానం సంపాదించిన బుద్ధుడు తన భార్య బిడ్డను చూడడానికి వచ్చాడు.
భార్య ఇలా ప్రశ్నించింది.. "నన్ను వదిలి వెళ్లారు పర్వాలేదు. కానీ నాతో ఒక్క మాట చెప్పి వెళ్ళుండొచ్చు. నేను మీ ఆలోచనకు అడ్డు చెప్పి ఉండను కదా! కానీ మీరు నన్ను నమ్మలేదు అన్నదే ఎక్కువ బాధ కలిగించింది. ఎందుకు నన్ను ఇలా బాధ పెట్టారు" అని అడిగింది.
బుద్దుడు తన భార్య దగ్గర క్షమాపణ కోరి, "నేను చెప్పకుండా వెళ్ళింది నీకు భయపడి కాదు నాకు భయపడి నిన్ను, బిడ్డను చూస్తే ఎక్కడ నా మనసు మారిపోతుందో" అని చెప్పాడు.
భార్య మళ్ళీ ఒక ప్రశ్న అడిగింది ఈ రాజ్యాన్ని వదిలి వెళ్లకుండా ఇక్కడే మీరు ఆ జ్ఞానాన్ని సంపాదించ ఉండలేరా?" అని.
" నిజమే నేను కొండలు అడవులు ఆశ్రమాలు వెతుక్కుని వెళ్లాల్సిన పని లేదు కానీ ఇక్కడ నుండి వెళ్లేప్పుడు నాకు అది అర్థం కాలేదు" అన్నాడు.
అందరూ బుద్ధుడి గురించే మాట్లాడుతారు కానీ ఆయన భార్య యశోధర గురించి ఆలోచించరు.
బుద్ధుడు వెళ్ళినట్టే తన భార్య అర్దరాత్రి గడప దాటి ఉంటే, ఈ లోకం ఆమెను మంచిది అని చెప్పేదా??
లేచిపోయింది అని చెప్పి ఉండేవాళ్ళు, ఇప్పుడు కూడా అక్కడ వారు అనని మాటలు లేవు.
'పెద్ద వయసేమి కాలేదు.. అందంగా ఉంది.. ఇంత రాజ్యము ఆవిడ సొంతమే.. తనకు నచ్చినట్టు ఉండొచ్చులే...!' అని నిందలేసింది.
పసి పిల్లాడు నాన్న కోసం అడుగుతుంటే అర్థం కాని ఆ పసిపిల్లాడికి ఏమని చెప్పి సముదాయించిందో! ఎంత పోరాడిందో...!
ఇవన్నీ వదిలేసి ఎటువంటి సమస్య లేకుండా సన్యాసం పుచ్చుకున్నాడు బుద్ధుడు.
*అన్నీ ఉన్నా సన్యాసిలానే బతికింది యశోధర.
ఏది కఠినం? ఏది కష్టం?? ఎవరు సన్యాసం పుచ్చుకున్నది.???