'రాజకీయాలు పెరిగి సామాజిక అంశాలను వెనక్కి నెట్టాయి'
ప్రముఖ చరిత్రకారులు ఆచార్య వకుళాభరణం రామకృష్ణ గారు తిరుపతి వచ్చిన సందర్భంగా ఆదివారం ఫెడరల్ న్యూస్ ప్రతినిధి రాఘవ శర్మ వారితో జరిపిన ఇంటర్వ్యూ ఇది.
By : The Federal
Update: 2024-03-18 07:38 GMT
ఆచార్య వకుళాభరణం రామకృష్ణ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చరిత్ర విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేసి రిటైర్డ్ అయ్యారు. వీరు చరిత్ర కారు లు, సాహితే వేత్త , బహు గ్రంథ రచయిత . ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ వ్యవస్థాపకుల్లో ముఖ్యులు. ఆ సంస్థ కు జాతీయ ప్రధాన కార్యదర్శి గా మూడేళ్ల పాటు సేవలు అందించారు. 'అంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర, సంస్కృతి' ఎనిమిది భాగాలను తేవడంలో దాదాపు 300 మంది చరిత్రకారులను కూడగట్టి, దానికి సంపాదకులుగా, ప్రధాన సంపాదకులుగా వీరు చేసిన కృషి ఎంతో ఉంది. ఈ ఇంటర్వ్యూలో వారు అనేక వర్తమాన సామాజిక సమస్యలపైన స్పందించారు.
ప్రశ్న : వర్తమాన సమాజం మీకు ఎలా కనిపిస్తున్నది? ఎలా అనిపిస్తున్నది?
వకుళాభరణం : వర్తమాన సమాజం సమతూకంగా లేదు. సంక్షోభంలో ఉంది.
ప్రశ్న : నేటి సమాజంలో కులం, మతం, జెండర్, ప్రాంతం, భాష వంటివి వైవిధ్యంగా కాకుండా, వైరుధ్యంగా ఎందుకు పరిణమించాయి?
వకుళాభరణం : ఇవి విభిన్న సామాజిక అంశాలు. వాటిని సమన్వయ పరచడం సులభం కాదు. వాటిని సమన్వయ పరిచే స్థితిలో నేడున్న రాజ్యం కృషి చేయడం లేదు.
ప్రశ్న : స్త్రీ, పురుష తేడాలు ప్రకృతి వైవిధ్యమే కదా! అవి పునరుత్పత్తికి దోహదపడేవే కదా! మాతృస్వామిక, పితృస్వామిక సమాజాలు ఏర్పడడం, స్త్రీలు ప్రశ్నించేసరికి పితృస్వామిక దుర్మార్గాలు బైటపడడం చూస్తున్నాం. ఇవి స్త్రీ, పురుషుల మధ్య తీవ్ర వైరుధ్యాన్ని తెచ్చిపెడుతున్నాయి. ఈ వైరుధ్యం సామాజిక సమస్యలకు పరిష్కారం కాదు కదా! మరి పరిష్కారం ఏమిటి?
వకుళాభరణం : వీటి పరిష్కారం అంత సులభం కాని మాట నిజం. అనాదిగా ఉన్న ఈ వైరుధ్యం క్రమేపీ పోవాలి. దానికి పురుషుల నుంచే చొరవ రావాలి.
ప్రశ్న : పురాణ కాల్పనిక సాహిత్యం స్త్రీల అంగాంగ వర్ణనల వరకు వెళ్ళిపోయింది. స్త్రీల సాహిత్యంలోకి కూడా ఇవి చొరబడ్డాయి. స్త్రీని ఆధారంగా చేసుకుని తిట్టు భాష తయారైంది. ఎంత నాగరిక సమాజం అనుకున్నా దీని నుంచి బైటపడలేకపోతోంది. దీన్నెలా అర్థం చేసుకోవాలి?
వకుళాభరణం : స్త్రీకి సమానత్వం, నిశ్చితార్థంలో, అన్ని రంగాల్లో రానంత మటుకు ఇలాగే ఉంటుంది. 'అభివృద్ధి' చెందిన సమాజంలోనూ ఇది ఉంది.
ప్రశ్న : ఒక కులంవారి ముందు మరొక కులం వారు, ఒక ప్రాంతం వారి ముందు మరొక ప్రాంతం వారు, ఒక మతం వారి ముందు మరొక మతం వారు నిలబడి ఎదుటి వారిని శత్రువులుగా చూస్తున్నారు. ఈ సంక్లిష్టత, ఈ సంక్షోభ పరిష్కారానికి ఏ మార్పులు తీసుకు రావాలి? ఈ మార్పునకు రాజ్యం ఏం దోహదం చేస్తుంది?
వకుళాభరణం : సమాజం సమగ్రంగా అన్ని కోణాల్లోనూ అభివృద్ధి సాధించేంత వరకు ఈ పరిస్థితి మారద. సమాజం మారడానికి సమానత్వం ప్రాతిపదికన ఏర్పడే వ్యవస్థలోనే ఇది సాధ్యం.
ప్రశ్న : గతంలో వేమన, పోతులూరి వీరబ్రహ్మం, గురజాడ, కందుకూరి, త్రిపురనేని రామస్వామి చౌదరి, గోరా వంటి వారు తమ కాలంలోని సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడి, ఎంతో కొంత సమాజానికి మేలు చేసే పాత్ర నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న సామాజిక సంక్లిష్టతలో తల దూర్చి సంఘ సంస్కరణకు పాటుపడేవారెవరైనా మీకు కనిపిస్తున్నారా? సమాజం కోసం పనిచేయాలంటే కందుకూరి లాగా ఒక సామాజిక ఎజెండా ఉండాలి కదా!?
వకుళాభరణం : అవును. ఎజెండాలు ఉన్నాయి. కానీ, కందుకూరు లాంటి వారు లేరు. 'సామాజిక ఎజెండా' ఇప్పుడున్న అసమాన వ్యవస్థలో సృష్టించబడుతున్న సమస్యలను నిర్మూలించే దిశలో
ఎజెండా ఉండాలి.
ప్రశ్న : పాలక పార్టీలు, కమ్యూనిస్టుల పేరుతో మరి కొన్ని పార్టీలు, విప్లవం పేరుతో ఇంకొన్ని పార్టీలు సామాజిక సమస్యలకు ఒక పరిష్కార ఎజెండాను తీసుకురాలేకపోతున్నాయి. సామాజిక పరిస్థితిలో ఒక స్తబ్దత, ఒక నిరాశ, ఒక పరాధీనత, ఒక సంక్షోభం ఎందుకు ఉత్పన్నమవుతున్నాయి? వీటిని మీరెలా అర్థం చేసుకుంటారు?
వకుళాభరణం : విభిన్న సామాజిక పరిస్థితులు ఉన్నప్పుడు ఇవి తప్పకుండా ఉండి తీరుతాయి. అవి ఉన్నా, వాటిని అధిగమించగలిగిన శక్తులు రావాలి. ఇది అంత సులభం కాదు.
ప్రశ్న : కళ్ళ ముందే సైన్స్ ఎదుగుదలను మన సాంస్కృతిక రంగం చూస్తోంది. కానీ, సైన్స్ కు భిన్నమైన మత రాజకీయాల వైపు మొగ్గు చూపుతోంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారానికి సైన్స్ ను కాకుండా మతాన్ని ఆశ్రయిస్తున్నారు. సమానత్వ భావన దెబ్బతింటోంది. రాజకీయ ఉద్యమాలు వీటిని ఎందుకు పట్టించుకోవడం లేదు?
వకుళాభరణం : పట్టించుకునే రాజకీయ ఉద్యమాలకు ప్రజాభిమానం లేదు. 'సైన్స్', శాస్త్రీయ అవగాహన ఈ రెండు వృద్ధి చెందనంతవరకు ఇది ఇలాగే కొనసాగుతుంది. వీటిని పట్టించుకునే రాజకీయ ఉద్యమాలున్నా, వాటికి ప్రజల్లో సరైన ఆదరణ లేదు. శాస్త్రీయ ఆలోచనా విధానం రావాలి. దానికి రాజకీయ, ఆర్థిక వ్యవస్థల్లో పెనుమార్పులు రావాల్సి ఉంది.
ప్రశ్న : అన్ని కులాల్లో చదువుకున్న వారున్నారు. ఏ కులానికి ఆ కులంవారే సంస్కరణలు తేవాలని చర్చ జరుగుతోంది. చదువుకున్న వారు తమ తమ కులాల్లో సంస్కరణలు ఎందుకు తీసుకురాకూడదు?
వకుళాభరణం : సంస్కరణలు కేవలం చదువుకున్న వారి వల్లనే రావు. వారికి శాస్త్రీ య అవగాహన, పట్టుదల, సంస్కరణాభిలాష ఉండాలి.
ప్రశ్న : మార్కెట్ ప్రయోజనాలే కులాన్ని కాపాడుతున్నాయా? కులాల మధ్య వైరుధ్యం పోవడానికి ఏం చేయాలి?
వకుళాభరణం : భారతీయ సమాజంలో వేళ్ళూనుకున్న కుల వ్యవస్థ అంత సులభంగా నిర్మూలింప బడదు. అసమ సమాజంలో కులాల మధ్య వైరుధ్యం పోదు.
ప్రశ్న : ఐరోపాలో సైన్స్ ముందుకు వచ్చి ఫ్యూడల్ సంస్కృతిని వెనక్కి నెట్టింది. మన దేశంలో ఎందుకలా జరగలేదు? మన దేశంలో సాంస్కృతికంగా మధ్యయుగాల లక్షణాలు కొనసాగుతున్నాయి. చదువుకున్న వారు కూడా కులం, మతం జాడ్యం నుంచి ఎందుకు బైటపడలేకపోతున్నారు? ఎందుకీ నైతిక పతనం?
వకుళాభరణం : మన దేశంలో, ఆధునిక యుగంలో ఆరంభమైన 'ఆధునికీకరణ'(మోడరనైజేషన్) ప్రక్రియ అర్థాంతరంగా ఆగిపోయింది. అందు వల్ల సమాజంలో మతానికి, కులానికి ప్రాధాన్యత ఉంది.
ప్రశ్న : సమాజంలోకి పెట్టుబడి ప్రవాహంలా వచ్చిపడుతోంది. ఆ పెట్టుబడి ఫ్యూడల్ పునాదిని ఎట్లా పట్టుకోగలిగింది?
వకుళాభరణం : చారిత్రకంగా, పెరుగుతూ వచ్చిన పెట్టుబడి క్షీణించిపోతున్న ఫ్యూడల్ పునాదిని తేలిగ్గా పట్టుకుంది.
ప్రశ్న : ఒకప్పుడు కొందరు జీవితాదర్శాలతో సమాజానికి ఆదర్శంగా ఉండేవారు. అలాంటి వ్యక్తులే ఈ రోజు నిలబడలేనప్పుడు సంస్థలెక్కడ నిలబడతాయి? ఈ లోపం వ్యక్తుల్లో వచ్చిందా? వ్యవస్థకే వచ్చిందా? ఈ జబ్బు ఎవరికొచ్చింది?
వకుళాభరణం : వ్యవస్థలో ఉన్న లోపాల వల్లనే వ్యక్తులు అలాతయారవుతున్నారు. అందుకే, ముందుగా సమాజం మారాలి.
ప్రశ్న : సంస్కరణలు ఎందుకు ఆగిపోయాయి?
వకులాభరణం : సంస్కరణలు మధ్యంతరంగా ఆగిపోవడానికి చారిత్రక, రాజకీయ కారణాలు ఉన్నాయి. చారిత్రకంగా, భారత దేశంలో ఆరంభమైన ఆధునికీకరణ 1850ల తరువాత అర్థాంతరంగా ఆగిపోయింది. దీనికి కారణాలు రెండు. ఒకటి అంతకుముందున్న వీటికి సమర్ధన పరాయి ప్రభుత్వం నిలిపివేసింది. రెండు 19 వశతాబ్దం ఉత్తరార్ధంలో రాజకీయం పెరిగి వృద్ధి చెంది సామాజిక అంశాలను వెనక్కి తోసింది.
ప్రశ్న : రాజ్యాంగ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కూడా రాజ్యానికి ఎందుకు ఎజెండా కావడం లేదు?
వకుళాభరణం : అది రాజ్యాంగాన్ని శాసించే శక్తుల వల్ల జరుగుతోంది.