30 పద్యాల సిరినోములో తొలి కవిత

తిరుప్పావై పాశురాలకు ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ వివరణ.పాశురం :1

Update: 2024-12-16 12:15 GMT
source: devamrutam.blogspot. (Warli Art)

తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు ఉద‌యం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై (సిరినోము) నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా తిరుప్పావై గురించి ప్రొఫెపర్ మాడభూషి శ్రీధర్ వివరిస్తున్నారు. నేడు మొదటి పద్యం.



తిరుప్పావై సిరినోము (తిరుప్పావై కి తెలుగు మాట) గోదమ్మ తమిళ భాషలో రాసిన మొదటి పద్యం (పాశురానికి) నా కవిత ఇది


మార్గశీర్షపు వెన్నెలలోన తెల్లవారకమున్నె యముననీట

భక్తి భాగ్యాల మునిగితేల రారండు, వ్రేపల్లె పడుచులార

వేలాయుధమ్ముదాల్చి నందనందనుడదిగో నిలిచినాడు

వేయికన్నులార్పక కాచు వేలుపతడని తెలియరో కొమ్మలార

యశోద ఒడిలోని కొదమసింగము వాడు, కలువకన్నుల రేడు

కారుమబ్బుమేనివాడు, చంద్రసూర్య చలువకాంతుల జల్లువాడు

వరద వాత్సల్యగుణాభిరాముడు నారాయణుడు, నెల నోము పట్టి

కలిసి భజింతము రండు, పరై వరాల కలిమి కైవల్యమిచ్చునతడు

శ్రీ కృష్ణుడు బాల సింహము

నందగోపుని కుమారుడిగా మనలో ఒకడుగా ఉండడానికి మనదగ్గరికి వచ్చినాడు. ఎప్పుడే రాక్షసులు వస్తారో అని అనుక్షణం తాను కత్తి పట్టుకుని కాపలా కాసే నందగోపుడు మనవాడే. తన లీలలతో ఆశ్చర్యపరిచిపదేపదే యశోద కళ్లు విప్పార్చే గోపాల బాలుడు సింగపు పిల్ల వలె ఆమె ఒడిలో పెరుగుతున్నాడు. నల్లని మేఘం వంటి శరీర చ్ఛాయ. వాత్సల్యం వంటి అనంతమైన గుణాలు కలిగిన వాడు. మిత్రులకు చల్లదనం, శత్రువులకు వేడి కలిగించే సూర్యచంద్ర వదనుడు. గోదాదేవి మనందరకీ ఈ తొలిపాశురంలో నారాయణమంత్రోపదేశం చేస్తూ వ్రతానికి పురి కొల్పుతున్నది. ఆయనే మన వ్రతఫలం అని వివరిస్తున్నది.

బ్రహ్మముహూర్తం అంటే ఏమిటి? మార్గశిరమేనా?

మనకు యేడాది కాలం దేవతలకు ఒక రోజుతో సమానం. మన ఆరునెలల ఉత్తరాయణం వారికి ఒకదినంలో తొలి అర్థభాగం. ఉత్తరాయణానికి ముందు వచ్చే నెల మార్గశిర మాసం అంటే దేవతలకు తెల్లవారుఝాము. మార్గశిరం మొత్తం బ్రహ్మ ముహూర్తమని అర్థం. అందులో తొలి పక్షం (శుక్లపక్షం), వెన్నెల నిండిన రాత్రి గడిచి, వస్తున్న తెల్లవారుఝాము. దానికి కాస్త ముందటే లేచి నదీ స్నానంచేసి శ్రీకృష్ణుడిని చేరుకుంటే వ్రతసాధనాలన్నీ ఆయన సమకూర్చుతాడు. రండి రండి అంటూ తొలి పాశురంలో గోపికలు ఒకరినొకరు పిలుచుకుంటున్నారు. గోపికలు నారాయణుని కీర్తిస్తూ నిద్రలెమ్మని పాడే ఈ పాశురాలన్నీ సుప్రభాత ప్రబోధ గీతాలు. గోపకులంలో అంతా సంపన్నులే. శ్రీకృష్ణుడంటే ఆనంద స్వరూపుడైన నారాయణుడే. గోపకులానికి నాయకుడు, నారాయణుడి తండ్రి నందగోపుడు. అంటే అందరి ఆనందమైన నారాయణుడిని రక్షించే వాడు నందగోపుడు. యశోదా దేవి నోముల పట్టి ఈ నారాయణుడు. శ్రీ కృష్ణుడు బాల సింహము. నీలమేఘ శ్యాముడు. ఆయన నయనాలు అరుణ నయనాలు. సూర్యచంద్రులతో సమానమైన నయనాలతో భాసిల్లే వదనం ఆయనది. ఆ నారాయణుడే మన సాధనం, ఆ నారాయణుడే మనకు సాధనం (పరై అనే ఢక్కవంటి సంగీతపరికరం) ఇస్తాడు. ఆ నారాయణుడే మన సాధనకు లక్ష్యం. పదండి, త్వర పడండి. లేవండి వెళదాం...అని రారమ్మంటున్నది గోదమ్మఒక్కొక్క పాశురంలో.

శ్రీహరి నామాన్నే నిరంతరం కీర్తించడం, అతనే దిక్కని శరణాగతి చేయడం, తోటలో పూలు, తులసీదళాలు కోసి స్వామికి అర్పించడం గోదాదేవి నిత్యానుసంధాన విధులుగా మారిపోయాయి. గోపికలు శ్రీ కృష్ణుడినే భర్తగా భావించారని, ఆయనే భర్తగా పొందాలని పరితపించారని, అందుకు ఒక వ్రతం కూడా చేశారని తండ్రి సత్కథా కాలక్షేపం చేస్తూఉంటే విన్న గోదాదేవికి ఆమాటలు మనసులో నాటుకుని పోయాయి. మా శ్రీవిల్లిపుత్తూరు వ్రేపల్లె కాదా, మా వటపత్రశాయి క్రిష్ణయ్య కాదా, నేను గోపికను కాలేనా, ఆ వ్రతం చేయలేనా అని యుక్తవయస్క అయిన గోద లో ఈ భావాలు ప్రశ్నించాయి. ఆ వ్రతమే తిరుప్పావై. ముఫ్పయ్ పాశురాల గోదా గోవింద గీతం ఇది.

శ్రీకృష్ణుడే వ్రత విధానం, శ్రీకృష్ణుడే వ్రత సాధనం కూడా

మొదటి అయిదు పాశురాలు ఈ వ్రత నియమాలు విధివిధానాలు పరిచయం చేసేవి. తరువాత పది పాశురాల్లో గోదాదేవి పదిమంది గోపికలను (ఆళ్వారులను) ఏ విధంగా పలకరించారో, నిద్రలేచిరమ్మని పిలిచారో వివరిస్తారు. వారిని తీసుకుని నందగోపుని భవనానికి వెళ్లి అక్కడ భవన పాలకుడిని, ద్వార పాలకుడిని మేల్కొలిపి భవనంలోకి వెళ్తారు. అంతఃపురంలో నందుడిని, యశోదాదేవిని, బలరాముడిని నిద్రలేపుతారు. శ్రీ కృష్ణుని నిద్రలేపే పాశురం ఒకటి, నీలాదేవికి సుప్రభాతం మరొకటి. వచ్చి సింహాసనాన్ని అథిష్టించవయ్యా కిష్టయ్యా అని పాడే పాట ఇంకొకటి. ఆయన గంభీరంగా వేంచేయగానే మంగళాశాసనం పాడే పాట మరొకటి. వచ్చిన పని నివేదిస్తారు. నిన్నెప్పుడూ సేవించే మహాభాగ్యం ఇమ్మంటారు. 16 నుంచి 30 వ పాశురం దాకా ఈ అంశాలు ఉంటాయి. ఇదే తిరుప్పావై. ఇదే వ్రతం చేయడమంటే. శ్రీకృష్ణుడిని సన్నిధానం కన్న ఇంక కావలసేందేమిటి? ఆయన కోసమే ఈ వ్రతం. ఆయనే వ్రత విధానం ఆయనే వ్రత సాధనం కూడా.

అమలిన శృంగారం ఇది

ఇది మధురమైన భక్తి, భగవంతుడిని భర్తగా భావించే భక్తి. గోపికల భక్తిని రసమయ భక్తి అన్నారు. శృంగారం ఒక రసం. కాని పతిపత్నీభావం శృంగారరసం కాదు. అదీ భక్తి రసమే. నారాయణుడితో ప్రణయ భావం. అమలిన శృంగారం ఇది. మన మనసుకు తోచే కామం కాదు. నిరంతరం పతిధ్యానంలో ఉండే పతివ్రత వలె, అనురాగమయి అయిన భార్యను నిరంతరం పరిశుద్ధంగా ప్రేమించే భర్తవలె భగవంతుడి పట్ల అనురాగ రంజితంగా ఉండే ఈ ప్రేమలో కామం వాసన ఉండదు. భర్త భార్య ఏకాత్మభావనతో జీవాత్మ పరమాత్మలో కలిసిపోయే అద్భుత భావన ఇది. మగవారు ఆడవారు అని మన లెక్క. కాని భగవంతుని ముందు అందరూ స్త్రీలే అని, ఆయన పురుషోత్తముడైన పరమాత్ముడనీ, జీవాత్మ జగత్పతి అయిన పరమాత్ముడిలో కలవడానికి పత్నిభావపు గోపికలుగా మారి భక్తిమార్గాన్ని అనుసరించాలని బోధిస్తూ పత్నీభావాన్ని వివరిస్తున్నారు. భక్తులంతా గోపికలై వ్రతం ఆచరించి విష్ణువులో కలిసారని ఉదాహరణ గా చూపడం తిరుప్పావై అర్థం. తిరుప్పావైలోని పదంలో పాదంలో పాశురంలో ప్రవహించేది ఈ మధుర సమర్పణభావనా రసమే. ఈ జ్ఞాన బోధన చేసి వ్రత సాధన చెప్పింది గోదా దేవి. ఆ ముప్ఫయ్ పాశురాల అంతరార్థాలను ఎందరో పండితులు భక్తులు వివరించారు. 



నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యులు వరంగల్లు శివనగర్ లో ఇటీవలి కాలం వరకు ఆధ్యాత్మిక బోధనలు చేసిన ఉభయవేదాంత ప్రవక్త. గోదాదేవిని ప్రస్తుతిస్తూ రచించిన సంస్కృత శ్లోకం ఇది:

శ్రీభూమి ప్రముఖాః భవన్తి మహిళాః శ్రీరంగభర్తుః ప్రియాః

తాస్వర్వా అపి విష్ణుచిత్తతనయా సామ్యంకథం ప్రాప్నుయుః

సూక్తైరద్భుత భావబన్ధమధురైః శ్రవ్యైస్సుశ్శబ్దోజ్జ్వలైః

దేవం ప్రీణయతిస్మయా స్వకవితాశిల్పశ్రియా గుంభితైః

ఈ శ్లోకానికి అర్థం: శ్రీమన్నారాయణునికి దేవేరులుగా శ్రీదేవి భూదేవి నీళాదేవి మొదలగువారెందరో ఉన్నారు కాని వారెవరున్నూ శ్రీ గోదాదేవికి సాటి రాజాలరు ఎందులకనగా... భక్తాగ్రణి అగు ఈ మహిళామతల్లి అద్భుత భావ బన్ధురములై మృదు మధురములైన సుశబ్దములతో గుంభితములై కర్ణ పేయామృతప్రాయములైన రెండు దివ్య ప్రబన్ధాలను తన కవితా చాతురితో ప్రసాదించి, శ్రీరంగనాథునికి సమర్పించి ఆస్వామి హృదయాన్ని ఆకర్షించి విదుషీమణి, ఆయనచే అంతరంగ పరిగ్రహంగా స్వీకరింపబడి సకల జగన్మాతయైనది. కనుకనే తక్కిన దేవేరుల కంటె పరమ విలక్షణయైనది. తన శ్లోకానికి ఈ అర్థాన్ని రఘునాథాచార్యులవారే సమన్వియించి తిరుప్పావైకి ఒక పీఠికలో వివరించారు.

వీరి శిష్యరికం చేయడానికి మా మేనవదిన గారి భర్త శ్రీమాన్ మరింగంటి శేషాచార్యస్వామి వారు రిటైరయిన తరువాత వరంగల్లుకు వచ్చి శివనగర్లో ఇల్లు కట్టుకుని అనేకానేక ఆధ్యాత్మిక అంశాలను వారి దగ్గర శ్రద్ధాభక్తులతో నేర్చుకున్నారు. వారిచ్చిన సూచనలు వివరాలు, నామీద ప్రేమతో ఇచ్చిన ఆశీస్సులు చాలా గొప్పవి. రఘునాథాచార్యులవారు స్వహస్తాలతో వారు రచించిన శ్లోకాన్ని వారే ఇచ్చిన వివరణ ఉత్తరం చిత్రాన్నినాకు అందించారు. అదే పైన ఉంది. శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్ స్వామి వారి వ్యాఖ్యానాన్ని చాలా శ్రద్ధగా చదివి అందులోకీలక అంశాలను ప్రతి పాశురంపైన రాసిన తెలుగుభావార్థ వివరణలో చేర్చాను. జీయర్ స్వామి వారిది చాలాసులువుగా అందరికీ అర్థమయ్యే శైలి. లోతైన తత్వ వివేచన కూడా ఉంటుంది.

శ్రీ రామానుజులే ‘తిరుప్పావై జీయర్’

అందరికీ అందే అందమైన కావ్యం తిరుప్పావై. తిరునారాయణ మంత్ర సారాంశాన్ని తిరుప్పావైలో పాశురంలోని అక్షరక్షరంలో పొదిగిన గోదాదేవి అందరికీ అందించినట్టే, తిరుమంత్రాన్ని గోపురం ఎక్కి అందరికీ చెప్పినాడు రామానుజుడు. కులమతబేధాలు లేకుండా అందరికీ నారాయణుని చేరే జ్ఞాన వ్రత మంత్ర సాధనా సోపానాలు తెలియాలని తపించిన వారే ఇద్దరూ. అందుకని రామానుజుడిని ‘తిరుప్పావై జీయర్’ అంటారు.

గోదాదేవి పుట్టి శ్రీరంగనిలో లీనమైన రెండువందల సంవత్సరాల తరువాత జనించిన రామానుజుడిని గోదాగ్రజుడిగా కీర్తిస్తారు. దానికి కారణం రామానుజుడు తిరుప్పావైని అంతగా అభిమానించి అందరికీ బోధించడం, తరువాత తనకు రంగనితో వివాహమైతే మధురైకి దగ్గరలో ఉన్న తిరుమాలియుం శోరై ఆలయంలో సుందర బాహుస్వామికి వేయిబిందెల పాయసం చేయిస్తానని పెట్టుకున్న మొక్కును రామానుజుడు తీర్చడం మరో కారణం. భగవంతుడిలోలీనం కావడం వల్ల గోదా ఆ మొక్కు తీర్చలేకపోయారు.


Tags:    

Similar News