సరస్వతి పుష్కరాలకు వెళ్తున్నారా, ఇది మీ కోసమే...

పుష్కరాలు ప్రారంభించి వసతులను గాలికి వదిలేశారు;

Update: 2025-05-21 06:06 GMT

-పుష్యమీ సాగర్



ప్రతి నది పుష్కరాలకు వెళ్లడం ఆనవాయితీ గా వస్తుంది. అలాగే ఈ సారి సరస్వతి నది పుష్కరాలకు వెళ్దాము అని అనుకున్నాము. ఎక్కడ, ఎక్కడ జరుగుతున్నాయి అని ఆరా తీస్తే ఒకటి హరిద్వార్ లో, మరొకటి కేదార్నాద్, మరియు బద్రీనాధ్ లో .మూడో ప్రదేశం వచ్చి మన తెలంగాణ రాష్ట్రం లోని కాళేశ్వరం..పై రెండు వెళ్ళడానికి సమయం మరియు ఖర్చు కూడా అవుతుంది కదా ..అందుకని కాళేశ్వరం కి వెళ్తే సరి పోతుంది అనుకున్నాం. హైదరాబాద్ నుంచి కాళేశ్వరం కి డైరెక్ట్ గా బస్సు ఉంది కానీ మాకు మిస్ అయ్యింది. దానివలన వేరే రూట్ నుంచి వెళ్లాల్సి వచ్చింది . ఉప్పల్ నుంచి హన్మకొండ కి వెళ్ళాం, అక్కడికి వెళ్లేసరికి సాయంత్రం ఆరు దాటింది. ఆరు గంటలకి కాళేశ్వరం కి వెళ్లే బస్సు ఎక్కి రాత్రి పది గంటలకి దిగాం... నా అనుభవాలు చెప్ప బోయే ముందు ఈ గుడి విశిష్టత మరియు సరస్వతి నది యొక్క చరిత్ర ఏమిటో తెలుసుకుందాం ..

సరస్వతీ నది హిందూ పురాణములలో చెప్పబడిన ఓ పురాతనమైన నది. ఋగ్వేదము లోని నదీస్తుతిలో చెప్పబడిన సరస్వతీ నదికి, తూర్పున యమునా నది పశ్చిమాన శతద్రూ (సట్లేజ్) నది ఉన్నాయి. ఆ తరువాత మహాభారతములో ఈ నది ఎండిపోయినట్లు చెప్పబడింది.

హిందువులు సరస్వతీ నదిని అంతర్వాహినిగానూ, గంగా-యమునల సంగమంలో త్రివేణి సంగమం వద్ద ప్రవహిస్తోందనీ భావిస్తారు. స్వర్గం వద్ద ఉండే క్షీరవాహిని, వైదిక సరస్వతీ నది ఒకటేనని, మరణానంతరం అమరత్వానికి ఇది మార్గంగా భావించేవారనీ హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో సంస్కృత ఆచార్యుడు, హార్వర్డ్ ఓరియంటల్ సీరీస్‌కి సంపాదకుడు అయిన మైఖేల్ విజెల్ భావించాడు..

ఋగ్వేదపు నాలుగవ భాగంలో తప్ప మిగతా అన్ని భాగాల్లోనూ సరస్వతీ నదీ ప్రస్తావన, ప్రశంస కనిపిస్తాయి. సరస్వతీ నదికి సంబంధించిన అతి ముఖ్యమైన శ్లోకాలు ఋగ్వేదం 6.61, ఋగ్వేదం 7.95, ఋగ్వేదం 7.96 లలో ఉన్నాయి.
ఋగ్వేదంలోని నదీస్తుతి మంత్ర భాగం సరస్వతీ నదిని తూర్పున యమున, పశ్చిమాన సట్లెజ్ (శతధృ) నడుమ ఉన్నట్టు వర్ణించింది. తర్వాతి వేద పాఠ్యాలైన తాంద్య, జైమినీయ బ్రాహ్మణాలు, మహాభారతం సరస్వతీ నది ఎడారిలో ఇంకిపోయినట్టు ప్రస్తావించాయి.
త్రివేణి సంగమం, ప్రయాగరాజ వద్ద గంగా మరియు యమునా నదుల సంగమం (సంగం) లేదా కలయిక, కనిపించని సరస్వతి నదితో కూడా కలుస్తుందని నమ్ముతారు, ఇది భూగర్భంలో ప్రవహిస్తుందని నమ్ముతారు , సరస్వతి నదిని నదీతర్ణ లేదా ఋగ్వేదంలోని ఉత్తమ నదులు అని కూడా పిలుస్తారు.

ఈ నది 1500 కి.మీ పొడవు, 5 మీటర్ల లోతు మరియు 3 - 15 కి.మీ వెడల్పు ఉండేదని నమ్ముతారు. సరస్వతి నది క్రీస్తుపూర్వం 6000 మరియు 4000 మధ్య ప్రవహించింది, తరువాత భూమి యొక్క టెక్టోనిక్ మార్పుల కారణంగా అది ఎండిపోయింది.
ఇక మన యాత్ర విషయానికి వద్దాం...

కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం తెలంగాణ రాష్ట్రం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మహదేవ్ పూర్ మండలం కాళేశ్వరం గ్రామంలో వెలసిన ఆలయం. దట్టమైన అడవి మధ్యలో, చుట్టూ రమ్యమైన ప్రకృతి రమణీయతల మధ్యన, పవిత్ర గోదావరి నది ఒడ్డున వెలసిన ఈ క్షేత్రం చాలా ప్రాచీనమైనది. శివుడు, యముడి దేవాలయాలు ఇక్కడి ప్రత్యేకత. ఇక్కడ గోదావరి, దాని ఉపనది అయిన ప్రాణహిత నదులతో పాటు అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహించడం వలన త్రివేణి సంగమ తీరమైన దక్షిణకాశీగా ప్రసిద్ధిచెంది, శ్రీశైల, ద్రాక్షారామ, కాళేశ్వరం అనే త్రిలింగక్షేత్రాలలో ఒకటిగా ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. అంతర్వాహినిగా సరస్వతీ నది ప్రవహిస్తుంది అని ప్రజల విశ్వాసం మూలాన ప్రతి నిత్యం ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ స్నానం ఆచరిస్తారు .

సాధారణంగా గర్భగుడి లో ఎన్ని శివలింగాలు ఉంటాయి. ఒక్కటే కదా ! కానీ కాళేశ్వర ఆలయంలో రెండు శివలింగాలు గర్భగుడిలో పూజలందుకుంటాయి. అందులో ఒకటేమో ముక్తేశ్వరునిది (శివుడు), మరొకటేమో కాళేశ్వరునిది (యముడు). ఇటువంటి ప్రత్యేకత కలిగిన ఆలయం బహుశా ఇండియాలో ఎక్కడా కనిపించదేమో.

స్థల పురాణం - విశిష్టత

గర్భగుడిలో రెండు శివలింగాలు ఉండటం ఈ దేవాలయ ప్రత్యేకత. ఈ ఆలయాన్ని దర్శించిన భక్తులందరికీ ముక్తేశ్వరస్వామి ముక్తిని ఇస్తుండడంతో యముడికి పనిలేకుండా పోయిందట. అప్పుడు యమధర్మరాజు స్వామిని వేడుకోగా, యమున్ని కూడా తన పక్కనే లింగాకారంలో నిల్చోమన్నాడట. ముక్తేశ్వరున్ని చూచి యమున్ని దర్శించకుండా వెళితే మోక్షప్రాప్తి దొరకదని వాళ్ళని నరకానికి తీసుకుపోవచ్చని శివుడు చెప్పాడట. అందుకే భక్తులు స్వామిని దర్శించుకొని, కాళేశ్వర స్వామిని కూడా దర్శించుకుంటారు.

ముక్తేశ్వరస్వామి లింగంలో మరో ప్రత్యేకత కూడా ఉంది. లింగంలో రెండు రంధ్రాలు ఉన్నాయి. ఈ రంధ్రంలో నీరు పోసి అభిషేకిస్తే ఆ నీరు అక్కడికి సమీపంలో ఉన్న గోదావరి, ప్రాణహిత సంగమ స్థలంలో కలుస్తుందని భక్తుల నమ్మకం. 

కాళేశ్వరం పెద్ద టౌన్ కాదు, చిన్న గ్రామం. దీనికి దక్షణ కాశి గ పిలవబడుతుంది. అందుకని అపర కర్మలు (పిండ ప్రధానం, దిన కర్మ లు ) జరుపుతారు కాబట్టి రోజుకి కనీసం వెయ్యి మంది అయినా వస్తుంటారు. అక్కడ వసతి కూడా పరిమితం . కొన్ని రూమ్స్ మాత్రమే దొరుకుతాయి. ఇక దిగాక మా అసలు కష్టాలు మొదలు అయ్యాయి. రూములు తక్కువ కాబట్టి డిమాండ్ ని బట్టి సప్లై అన్న సూత్రాన్ని అక్కడి వారు బాగా వంట బట్టించుకున్నారు కాబోలు ఒక్క రూమ్ కి (చిన్న రేకుల రూమ్, కేవలం ఫ్యాన్ ) కి మూడు నుంచి నాలుగు వేలు చెప్పారు. ఇక ఏ సి కి అయితే ఆరు నుంచి ఏడూ వేలు ...ఇది ఇరవై నాలుగు గంటలు అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్టే. కేవలం ఒక్క రాత్రి కోసమే ....మాకు కళ్ళు బైర్లు కమ్మాయి .ఏమి చేద్దాం అని అలోచించి అలోచించి తిరుగుతున్నాము . ఒక షాప్ ముందు కూర్చున్నాం .ఆ ఇంట్లో వాళ్ళు కూడా నాలుగు రూమ్ లు కట్టి కిరాయి కి ఇస్తున్నారు. ఎమ్మా ఏమైనా రూములు ఉన్నాయా అని అడిగాము లేవు అన్నారు .. సరే అని మళ్ళీ ఇంకొకసారి ఒక రౌండ్ కొట్టి మళ్ళీ అక్కడికే వచ్చి అడిగాము ...

నిజానికి అదొక గిఫ్ట్ షాప్, అంత రాత్రి ఎటు వెళ్ళాలి అని ఆవిడ ని అడిగాము మీకు అభ్యంతరం లేకపోతే షాప్ ముందు రూమ్ లో పడుకోవచ్చు అన్నారు. దానికి కూడా వెయ్యి ఛార్జ్ అవుతుంది అన్నది. (భగవంతుడి సాక్షి గా దోపిడీ) అప్పటికే పది దాటింది. సరే అని ఆ రూమ్ లో నే అడ్జస్ట్ అయ్యాం...వేసవి కాలం . అన్ని తలుపు లు మూసేసారు. నిద్ర ఎలా పడుతుంది . .తెల్ల వారుజామున నాలుగు గంటలకే లేపేశారు. సరే అని మొహం అవి కడుక్కొని నది తీరానికి బయలుదేరాం .. అమ్మ, సామాన్లు పెట్టుకుంటాం స్నానం చేసాక వచ్చి తీసుకు వెళ్తాము అంటే ససేమీరా కుదరదు ..తీసుకు పో అని దాదాపు గెంటేసినట్టు చెప్పారు ..బాధేసింది ఇంత డబ్బులు ఇచ్చినా కూడా ఇలా ఛీత్కారం గా మాట్లాడతారా ?

ఇక ఆటో కట్టుకొని నదీ తీరానికి బయలుదేరాం. ఒక పది నిమిషాల్లో తీరానికి వెళ్ళాం ..అక్కడ ఇంకా జనం జాతర మొదలు కాలేదు ... ఒక వెయ్యి మంది మాత్రమే ఉన్నారు (ఉదయం ఐదు కి కదా..). ఇక తర్పణం వదలాలి అని అమ్మగారు ముందే చెప్పి ఉన్నారు కాబట్టి .. పంతులు గారి కోసం ఎదురు చూస్తున్నాం ...ఎలాగో ఒక పంతులు గారు చేస్తాం అని చెప్పారు . ఎక్కడైనా దోచుకుంటారు కానీ ఇక్కడ పంతులు (వాళ్ళది ఖమ్మం అట ) గారు మాత్రం చాలా రీసన్ బుల్ గా చెప్పారు పిండ ప్రధానానికి ఐదు వందలు, తర్పణానికి వెయ్యి రూపాయలు అని ... సరే అని మేము స్నానం చేసి తర్పణం వదిలి, మరల స్నానం చేసి బయటకు వచ్చి వారికి దక్షిణం ఇచ్చి అక్కడే టిఫిన్ చేసి మల్ల గుడికి వచ్చాము... ..

గుడి లో దేవర దర్శనం ఒక అరగంట లో అయిపోయింది. మొత్తానికి ఉదయం తొమ్మిది కల్లా మొత్తం అయిపోయింది. ఎందుకంటే మేము నాలుగు గంటలకే లేచి వెళ్ళాం కదా...అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ..మా కారక్యమం అంతా అయిపోయినా కూడా మేము బుక్ చేసిన బస్స్సు రాత్రి పదకొండు గంటలకి ఉంది .,.ఏమి చెయ్యాలి అక్కడ రూమ్ లేదు , రోడ్ మీద ఉండలేము ..మా అర్ధాంగి చెప్పింది వద్దు వెళ్ళిపోదాం ఆ టికెట్ రద్దు చెయ్యండి అని .సరే అని మా ట్రావెల్ ఏజెంట్ కి ఫోన్ చేసి మేము వెళ్ళిపోతాం అది రద్దు చెయ్యమని చెప్పాము. అలాగే ఆండీ మీరు వచ్చేయండి అని చెప్పారు .,.

ఇక అక్కడ నుంచి మరల హన్మకొండ కి వచ్చి అక్కడ నుంచి ఉప్పల్ కి సాయంత్రం నాలుగు గంటలకి వచ్చాము .. అక్కడ నుంచి ఇంటికి వచ్చేసరికి ఆరు దాటింది ...ఇది అండి మా యాత్ర అనుభవం.

ఇక్కడ దోపిడీ అనేది సర్వ సాధారణం అయిపోయింది. ప్రభుత్వ ద్వారా నడిచే ఆర్ టి సి అయితే స్పెషల్ బస్సు పేరు తో దోపిడీ మూడు వందల టికెట్ ని ఎనిమిది వందలకి పెంచి దోచుకుంది. ఎప్పుడైనా ఇంతే కదా....కాళేశ్వరం లో అయితే చెప్పనవసరం లేదు ..భక్తి ని అడ్డుపెట్టుకొని బహిరంగం గానే దోచేశారు. ...ప్రభుత్వ అజమాయిషీ లేకపోతే
ఎంత కు తెగిస్తారో ఇదొక నిదర్శనం. ప్రభుత్వం ఏర్పాట్లు చాలా చాలా నాసిరకం గా ఉన్నాయి. శుచి, శుభ్రత అస్సలు లేదు ...సత్య సాయి సేవ సమితి వారు ఉచిత మంచి నీళ్ల ని ఏర్పాటు చేసారు కాబట్టి కాస్త నయం. మీరు కనుక వెళ్తే చూసుకొని వెళ్ళండి ...


ప్రయాణ వివరాలు


రైలు మార్గం: కాళేశ్వరంలో రైల్వే స్టేషన్ లేదుకనుక సమీప రైల్వే స్టేషనైన రామగుండం (98 కిలోమీటర్లు) లో దిగి ఆర్టీసీ బస్సులో ప్రయాణించి కాళేశ్వరం చేరుకోవచ్చు. రాముగుండం నుండి కాళేశ్వరానికి అధిక సంఖ్యలో బస్సులు అందుబాటులో ఉంటాయి.

వరంగల్, కాజీపేట్ రైల్వే స్టేషన్ లు 110 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.

బస్సు మార్గం: తెలంగాణ ఆర్టీసీ హైదరాబాద్ నుండి కాళేశ్వరంకి నేరుగా బస్సులను నడుపుతుంది. మహాత్మా గాంధీ బస్ స్టేషన్ లేదా జూబ్లీ బస్టాండ్ నుండి ఈ బస్సులు ప్రతి రోజు అందుబాటులో ఉంటాయి. ఎక్కువగా ఎక్స్‌ప్రెస్ సర్వీసులను ఆర్టీసీ నడుపుతుంది. ప్రయాణ సమయం 4 - 5 గంటలు పట్టవచ్చు.

కారు మార్గం లేదా బైక్ మార్గం: హైదరాబాద్ - సిద్దిపేట - పెద్దపల్లి - కాళేశ్వరం ( 300 కిలోమీటర్లు, 5 గంటల సమయం), హైదరాబాద్ - బొంగిర్ - వరంగల్ - పర్కాల్ - కాళేశ్వరం ( 260 కిలోమీటర్లు, 4 గంటల 15 నిమిషాలు)




Tags:    

Similar News

మా అమ్మ