రజాహుస్సేన్ పుస్తకం ‘స్ఫూర్తి ప్రదాతలు’ సమీక్ష

ఈ ఉత్తేజకరమయిన పుస్తకంలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 20 మంది స్ఫూర్తి ప్రదాతలు కనిపిస్తారు.

Update: 2024-04-26 11:19 GMT

-శ్రీమతి మీనా శాస్త్రి, ఇండోర్, మధ్య ప్రదేశ్

ఈ పుస్తకం లో వివిధ రంగాలకు చెందిన  మొత్తం 20 మంది స్ఫూర్తి ప్రదాతలు కనిపిస్తారు. పుస్తక రచయిత ఎ రజాహుస్సేన్. ఆయన పరిచయం లేని కవి, రచయిత, జర్నలిస్టు,సాహిత్య విమర్శకుడు. కుల, మత, భాష, ప్రాంత, జాతీయత మొదలైన వాటన్నింటికీ అతీతంగా ప్రతిభ, గొప్పతనానికి పరిమితులు, అవధులు లేవని, అవి శారీరక వైకల్యాన్ని కూడా జయిస్తాయని సందేశం పంచడమే ఈ పుస్తకం ఉద్దేశం.

ఈ పుస్తకంలో కొందరికి చూపు లేదు కాని మనోనేత్రాలతో వాళ్లు ప్రపంచాన్ని దర్శించడం చూడవచ్చు. మరి కొందరికి అంగవైకల్యం ఉంది. అయినా వాళ్ళు పట్టుదల తో,ఆత్మ విశ్వాసం తో కాలాన్ని శాసిస్తూ,సవాలు చేస్తూ,సమస్యలకి ఎదురేగి సమస్యలని నిలదీస్తూ జీవితం లో గెలిచి అందరికీ స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు.

ఆచార్య మన్నవ సత్య నారాయణ (చీకటి సూర్యుడు), లక్కోజు సంజీవరాయ శర్మ(అంకెల ఆకాశం లో అమావాస్య చంద్రుడు), చెట్టు తల్లి తిమ్మక్క, అడవి లో పూచిన మేలు రకం 'జాజి ' పువ్వు, ఇలా మొత్తం 20 మంది స్ఫూర్తి ప్రదాతల గురించి చాలా చక్కగా రాసారు రజా హుస్సేన్.

చూడ చక్కని ముఖ చిత్రం. పుస్తకం వెల 120 రు. కానీ దీనిలో వున్న అక్షర సుమాల వెల కట్టలేము. ముందుగా రజా హుస్సేన్ వారి తల్లి తండ్రులకు ఈ పుస్తకాన్ని అంకితం ఇస్తూ రాశారు. అది చాలా సంతోషం అనిపించింది.అలాగే మానవత్వానికి నిలువెత్తు అద్దం అలోక్ సాగర్. ఈయన గురించి చదివినప్పుడు చాలా ఆశ్చర్యం, ఆనందం కలిగాయి. ఒక ఐఐటి ప్రొఫెసర్ ఉద్యోగం వదిలి గిరిజన వాడలో గుడిసెలో వుంటూ గిరిజనుల కోసం ఎంతో చేస్తూ వున్నారని చదివి హృదయం ఆర్డ్రమైంది. అలాగే దేశంలో మొదటి మహిళా గైనిక్ డాక్టర్ భక్తి యాదవ్ గురించి కూడా కొంత రాశారు. సంతోషం కలిగింది. కానీ ఆవిడ గురించి మరింత సమాచారం ఇచ్చి వుంటే బావుండేది అనిపించింది. పైడి రాజు గురించి చదివినప్పుడు విధి మీద కోపం వచ్చింది. స్వప్న ఆగస్టీన్ ఎందరికో స్ఫూర్తి. ఆదర్శ ప్రాయులు విద్యాదాత చింత క్రింది కనకయ్య. దాకోజీ శివప్రసాద్ కళ ను సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. వెలుగుల రేడు, అంధుడు కాదు

అఖండుడు,ఎంత చెప్పినా తరగని గని,ఎంత పొగిడినా చాలని జీవన సత్యం మా మన్నవ సత్యనారాయణ. ఇలా రజా హుస్సేన్ గారి పద రచన,అందులో వున్న స్ఫూర్తి ప్రధాతల గురించిన సమాచారం ఎంతో ఆకట్టుకున్నాయి.

కథల్లో అందే వేసిన చేయి "అందే నారాయణ స్వామి"...మంగళ గిరిలో పానకాల స్వామి యే కాదు పానకం లాంటి తియ్యని కథలు రాసిన నారాయణ స్వామి వుండటం మంగళగిరి కే గర్వకారణం..ఇలా నారాయణ స్వామి గురించి ఆయన మధ్యలో చూపు కోల్పోవటం గురించి,అయినా ఆతరువాత ఆయన మనోధైర్యం తో నిలబడి ఎలా కథలు రాసారో ఖ్యాతి గడించారో తెలుసుకుని ఆయనకి నమస్కరించకుండా వుండలేక పోయాను.

రజా హుస్సేన్ నారాయణ స్వామి గురించి "కథల జ్యోతులే ఆయన కంటి వెలుగులు" అనే శీర్షిక రజా హుస్సేన్ ఈనాడు పత్రికలో రాయటం ద్వారా నారాయణ స్వామిని అందరికీ తెలిసేలా చెయ్యటమెంతో హర్ష దాయకం. ఇక లాక్కోజు సంజీవారాయ శర్మ అంకెలు తెలియకుండా గణిత బ్రహ్మ అయ్యారని తెలుసుకుని అబ్బురపడ్డాను చూపు లేకపోయినా,పెద్దగా చదువుకోకపోయినా ఆయన చేసిన గణితావదానాల గురించి చదివి ఆశ్చర్య మనిపించింది.నాలుగు వేల సంవత్సరాలకు సరిపడా క్యాలెండర్ సృష్టికర్త ఆయన అని తెలుసుకుని ఆయనకి మనసులోనే పాదాభివందనం చేశాను.

తిమ్మక్క...పిల్లలు లేరని చెట్లను పెంచడం మొదలు పెట్టిన ఈవిడ 110 సంవత్సరాల వయసులో కూడా ఇంకా మొక్కలు నాటుతూ చెట్టును చూస్తే చాలు ఆమే చిగురిస్తుంది..అని చదివి ఆ ఊహ ,ఆ భావన తో నా మనసులో పూలు పుచ్చాయి.ఆవిడ పెద్ద మనసుకు కృతజ్ఞతాభి వందనాలు.

తెలుగులో మేటి పూసపాటి.. మాష్టారు గురించి చదివి ఆయన శిష్యురాలిగా నేను ఎందుకు పుట్టలేదా అని భాధ కలిగింది.

పొట్లా బత్తుని లక్ష్మణ రావు గురించి చదివి..ఇన్నాళ్లు ఇక్కడే వుండి(మాది సొంత వూరు విజయవాడ) ఈయన గురించి తెలుసుకోలేక పోయామే అనిపించింది. అడవిలో పూసిన తంగేడు 'జాజి'ఆలోచింప చేసింది. ఇన్ని మంచి మొక్కలు మన ప్రకృతిలో వున్నాయా అని అనిపించింది. ఫిడేలు నాయుడు గురించి చదివి తన్మయత్వం పొందాను. గోలి పార్వతి దేవి గురించి చదివి ఆమె లోని ఉత్తమ ఉపాధ్యాయురాలికి,

కవయిత్రికి, తల్లి కి మనసులో పాదాభివందనం చేశాను .మన చుట్టూ ఇంత మంది స్ఫూర్తి ప్రదాతలు వున్నారా అని అనిపించింది.ఇంకా వెలుగులోకి రాకుండా ఎంత మంది ఉన్నారో కదా అనిపించింది. కృషి వుంటే ఏదైనా సాధించవచ్చని వీరందరినీ గురించి చదివినప్పుడు అర్థమైంది.

ఒక మంచి పుస్తకం చదివాననే అనుభూతి మిగిలింది.ఇక మా అమ్మాయి తో కూడా చదివించాలి. ఇది అందరి ఇండ్లలో వుండ వలసిన పుస్తకం. అందరూ చదవ వలసిన పుస్తకం. చిన్న చిన్న విషయాలకే జీవితం పై విరక్తి తో వుండే వారికి ఈ పుస్తకం ఒక కనువిప్పు.అలాగే అన్ని అవయవాలు సరిగా వుండి,అన్ని వసతులు వున్నా కూడా ఆత్మ విశ్వాసం లేక మనం ఏమీ చేయలేము అనుకునే వారు ఈ పుస్తకం చదివితే వారిలో ఎంతో మార్పు వస్తుంది.ముఖ్యం గా ఈ పుస్తకం గురించి మాకు తెలిపిన మంగళగిరి వాసులు,రచయిత,గాయకులు శ్రీ అల్లక తాతారావుకు ధన్యవాదములు.

పరిమళాలను మోసుకెళ్ళమని ప్రత్యేకంగా గాలికి చెప్పనవసరం లేదు అవి ఎలాగో తీసుకెళుతుంది వ్యాపింప జేస్తుంది మహానుభావులను గురించి కొంతమంది గురించి చిన్నప్పుడు చదువుకున్నాము ఆర్ధర్ కాటన్ వంటి ధవళేశ్వరం బ్రిడ్జి ని నిర్మించిన ఆయన గురించి చదువుకొనటం జరిగింది కానీ ఇంత మంది గురించి స్పూర్తి ప్రదాతలను గురించి చాలా బాగా తెలియజేశారు రచయిత రజా హుస్సేన్. ఇంకా ఇలాంటి పుస్తకాలు మరెన్నో రావాలి.

పుస్తకం: స్ఫూర్తి ప్రదాతలు

రచయిత : అబ్దుల్ రజా హుస్సేన్

ప్రచురణ : తిరంగా ముసల్మాన్ ప్రచురణలు, హైదరాబాద్.

Tags:    

Similar News