కర్నాటక చిత్రకారుల సంత.. ఏటా ఒక్కరోజే నిర్వహణ!

బెంగళూర్ నగరంలోని శివానంద సర్కిల్.. జనవరి మొదటి వారం వస్తే చాలు ఆకాశపు హరివిల్లులన్నీ ఇక్కడే ఉన్నాయా అన్నట్లుంటుంది.

Update: 2024-01-06 07:15 GMT
చిత్ర సంతలో ఓ దృశ్యం

ఎటుచూసిన కోలాహాలం.. విద్యార్థులు, అమ్మానాన్నచేయి పట్టుకుని నడుస్తున్న చిన్నారులు.. పిల్లలు.. వారి వెంటే కొంతమంది ఔత్సాహికులు. అంతా రెప్పవాల్చకుండా అక్కడున్న గోడలు, ప్రత్యేకమైన పలుచని వస్త్రాలు, బోర్డులపై రంగుల రంగుల సీతాకోక చిలుకలు, పిచ్చుకలు, అందమైన ప్రకృతి, అనంత విశ్వం ఎలా ప్రాణం పోసుకుంటున్నాయో చూస్తూనే ఉంటారు.

సెకన్లు.. నిమిషాలు.. గంటల గడిచిపోతుంటాయి.. అయినా సరే పిలిస్తే పలకరు.. చూసే వారి కళ్లల్లో సంభ్రమం.. గీసే వారి కళ్లలో ఆనందం. పెయింటింగ్ లన్ని ప్రాణం పోసుకున్నట్లు నిజంగా తమ ముందు ఉన్నట్లే ఉంటాయి. ఇలా జరిగే ప్రాంతమే చిత్ర సంత( ఆర్ట్ ఫెయిర్).. గత 20 సంవత్సరాలుగా కన్నడ రాజధాని బెంగళూర్ కేంద్రంగా వర్ధిల్లుతూ.. 21వ ఎడిషన్ కు సిద్ధమైంది. ఈ ఆదివారమే.. చిత్రసంత..

ఈసారి ఆర్ట్ ఫెయిర్ లో దేశంలోని 22 రాష్ట్రాల నుంచి 15 వందల మంది పాల్గొనబోతున్నారు. ఇది కేవలం ఒక్కరోజే జరుగుతుంది. కేవలం జనవరి మొదటి వారంలోనే నిర్వహిస్తున్నారు. ఇక్కడున్న నాలుగు వీధులను కళాభిమానులు స్వాధీనం చేసుకుని తమ ప్రతిభను ‘గీసి’ చూపెడతారు. కనుచూపు మేర కళాకారులు, వారి స్టాల్లే కనిపిస్తాయి.

అందమైన పెయింటింగ్ లు, గ్రాఫిక్ ప్రింట్లు, సూక్ష్మచిత్రాలు(మినియేచర్), వాల్ పెయిట్లు ఇలా ఒకటేమిటీ.. ఆర్ట్ లో ఎన్నిరకాలు ఉంటయో అవన్నీ బెంగళూర్ లో దర్శనం ఇస్తాయి.. సంప్రదాయం నుంచి ఆధునికం వరకూ.. చారిత్రకం నుంచి ప్రస్తుతం వరకూ అన్ని లభిస్తాయి. అందుకే దీని నినాదం కూడా ‘ఆర్ట్ ఫర్ ఆల్’



 


మైసూర్ నుంచి తంజావూర్ వరకూ.. రాజస్తాన్ నుంచి మధుబన్ వరకూ అన్ని రకాల పెయింటింగ్స్ ఇక్కడ ఒకరోజు పాటు సందడి చేసి మురిపించి, మైమరపిస్తాయి. వాటర్ కలర్ పెయింటింగులు, ఆయిల్, యాక్రిలిక్, పెన్సిల్, ఇంక్ డ్రాయింగ్, ఫైబర్ గ్లాస్, ప్లాస్టర్ ఆకృతులు, ప్రింట్లు, గ్రాఫిక్ మీడియా వర్క్ లు.. ఒకటేమిటీ మనకు ఓపిక ఉండి చూడాలే కానీ.. ఎన్నిరకాలో... ఎన్ని వెరైటీలో.. మాటల్లో వర్ణించలేం.. అంకెల్లో లెక్కించలేం.

నచ్చిన కళాఖండాన్ని తీసుకోవచ్చు. జేబులు గుల్ల చేయడానికి మధ్యవర్తులు వారి కమిషన్లు ఏం ఉండవు. ఒక్కోదాని ధర రూ. 100 నుంచి మొదలు.. కొనే స్థోమత ఉండాలే గాని కొన్ని పెయింటింగ్ ల ధర రూ. లక్షకు పైమాటే. ఆకృతిని బట్టి, కష్టాన్ని బట్టి చిత్రాల ధరలు.

ఈసారి కాస్త డిఫరెంట్ గా.. చర్చలు.. ఉపన్యాసాలు

చిత్రసంత 2003లో కేసీపీ ఆధ్వర్యంలో ప్రారంభం అయింది. ప్రతి సంవత్సరం ఇది పెరుగుతూనే ఉంది. అలాగే అవసరాలు, అవకాశాలు సైతం విస్తరిస్తూనే ఉన్నాయి. ఈ సారి ఉత్సవంలో ప్రత్యేకంగా చర్చలు, ఉపన్యాసాలను నిర్వాహకులు ప్రవేశపెట్టారు. ‘కళలు అభివృద్ది చెంది భవిష్యత్ తరాలకు అందాలంటే చర్చలు, అభిప్రాయాలు పంచుకోవడం ఉత్తమ మార్గం’ అని చామరాజేంద్ర కాలేజ్ ఆఫ్ విజువల్ ఆర్ట్స్ బోధకుడు డీఏ ఉపాధ్యాయ్ చెబుతున్న మాట.

ఈ సారి ఈ చిత్రకళను కర్నాటక సీఎం సిద్దరామయ్య, ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఆదివారం(జనవరి 7న) ప్రారంభించనున్నారు. సమాజానికి కళలు ఎలా ఉపయోగపడతాయో అనే అంశంపై మాట్లాడతారని నిర్వాహకుడు కేపీసీ అధ్యక్షుడు బీఎల్ శంకర్ చెప్పారు.( ఈయన కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు కూడా) ఈ సంవత్సరం చిత్ర సంతను భారత శాస్త్రవేత్తలకు అంకితం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. అంతరిక్షంలో విశేష ప్రయోగాలు చేసి దేశ ఖ్యాతిని వినువీధిలో ఎగరేసిన వారి సేవకు గుర్తుగా ఈ చిన్న బహుమతి అంటూ ఆయన చెప్పారు.

ఐదు లక్షల మంది వస్తారని అంచనా

కేపీసీ నిర్వహించబోయే చిత్ర సంతకు దాదాపు ఐదు లక్షల మంది వస్తారని అంచనాలున్నాయి. అందుకు తగ్గ ఏర్పాట్లను ప్రభుత్వం వేగంగా చేస్తోంది. చిత్రసంతలో స్టాళ్లు తెరవడానికి కళాకారులు, విద్యార్థులు, వివిధ కళాసంస్థల నుంచి మొత్తం 2,726 దరఖాస్తులు వచ్చాయని నిర్వాహకులు వెల్లడించారు.

కేవలం కర్నాటక నుంచే 1,386 వచ్చాయని, ఇది మొత్తం దరఖాస్తుల వాటాలో 51 శాతం వరకూ ఉంటాయని తేలింది. అలాగే 7.6 శాతం ప్రత్యేక తరగతికి చెందిన కళాకారులకు, 6 శాతం సీనియర్ సిటీజెన్ లకు చెందినవి గా వెల్లడించారు. ప్రత్యేక తరగతి, సీనియర్ సిటిజెన్ లకు చెందిన వారి ఒక్క దరఖాస్తూ కూడా తిరస్కరించలేదని నిర్వాహకులు తెలిపారు.

ఎప్పుడు కళాపరిషత్ నిర్వహించే క్రీసెంట్ రోడ్డుతో పాటు, అదనంగా స్టాళ్ల కోసం పక్కనే ఉన్న సేవాదళ్ మైదానం కూడా కేటాయించారు. అలాగే శివానంద సర్కిల్ స్టీల్ ఫ్లైఓవర్ కింద ఉన్న సర్వీస్ రోడ్డుపై కూడా స్టాల్లు ఏర్పాటు చేయనున్నారు. పార్కింగ్ కోసం విధాన సౌధ, మెజెస్టిక్, మంత్రి స్క్వేర్ మాల్ నుంచి బీఎంటీసీ మెట్రో ఫీడర్ బస్సులను నడుపుతున్నట్లు కేపీసీ అధ్యక్షుడు బీల్ శంకర్ తెలిపారు. కళాభిమానులకు సేవ చేసేందుకు 30 మంది మహిళలు ఆటోరిక్షాలను నడపనున్నారని ఆయన చెప్పారు.

అదొక అమూల్య స్థలం

కర్నాటక చిత్ర పరిషత్ దృశ్య కళలకు పెట్టింది పేరు. జానపద, సాంప్రదాయం, ఆధునిక, సమకాలిక కళలకు నెలవైన కేంద్రం గా చెప్పవచ్చు. 14 మ్యూజియంలు, 19 గ్యాలరీలు, ఆర్కైవ్ ల నెట్ వర్క్ లను కలిగి ఉంది. అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందిన నికోలస్ రోరిచ్, స్వెటోస్లావ్ రోరిచ్, కృష్ణారెడ్డి, అబనీంద్రనాథ్ ఠాగూర్ వంటి గొప్పగొప్ప వారి కళాకృతులను ప్రదర్శిస్తుంది.

ఇప్పటికే 500 కంటే ఎక్కువ మైసూర్ సాంప్రదాయ చిత్రాలు, 2000 వేల కంటే ఎక్కువ తోలు బొమ్మలు సేకరించింది. ఇదీ కేసీపీ వ్యవస్థాపనకు సహకరించిన ఎం ఆర్యమూర్తి, వ్యవస్థాపక అధ్యక్షుడు నంజుండరావు వంటి వారి అభిరుచిని గత ఆరు దశాబ్దాలుగా ప్రతిబింబిస్తూనే ఉంది. కళాభిమానులను ఒక అమూల్యమైన అభ్యాసకేంద్రంగా కూడా పని చేస్తోంది.

Tags:    

Similar News