ఇథనాల్ ప్లాంట్స్: రేవంత్ నడుస్తున్నదీ పాత సర్కార్ అడుగు జాడల్లోనే...

విత్తనాల కంపెనీలు కావవి, విష పూరిత ఇథనాల్ కంపెనీలు

Update: 2024-08-31 07:08 GMT

“మీ గ్రామంలో విత్తనాల కంపెనీ పెడతారట, నాణ్యమైన విత్తనాలు రైతులకు ఇస్తారట, వాటితో పండించిన పంటలను మళ్ళీ ఆ కంపెనీలే కొంటాయట” అని ఎవరయినా అంటే మీకేమనిపిస్తుంది. సూపర్ ఐడియా అనిపిస్తుంది కదా ? గ్రామాలలో కొందరు పెద్దలు ఇలాగే చెబితే , మంచి విషయమే కదా, ఆ కంపెనీలకు భూములు ఇస్తే లాభమే కదా ? అని ఆ గ్రామ రైతులు అనుకున్నారు. ఆ కంపెనీలకు తమ పంట భూములు అమ్మారు. గ్రామాలు, పొలాల మధ్యలో ఈ కంపెనీలు నిర్మాణాలు కూడా ప్రారంభించేశాయి. తీరా చూస్తే, అవి ఇథనాల్ కంపెనీలుగా తేలాయి.

2013 భూసేకరణ చట్టంతో, ప్రజాభిప్రాయ సేకరణతో సంబంధం లేకుండా, తెలంగాణ లో ప్రైవేట్ పెట్టుబడి దారులు పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు చేసి ఇథనాల్ కంపెనీలు పెట్టడమనేది ప్రస్తుతం పొడ చూపుతున్న కొత్త ధోరణి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఇథనాల్ కంపెనీలకు ఆ చట్టం అమలు నుండీ మినహాయింపు ఇచ్చింది.

ఈ కంపెనీలు ప్రజలకు , పర్యావరణానికి హాని చేసే ద్రవ వ్యర్ధాలను ఉత్పత్తి చేయబోవని (జీరో లిక్విడ్ డిశ్చార్జ్ - ZLD ), ఎఫ్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ETP) ఏర్పాటు చేస్తాయని, కార్బన్ డై యాక్సైడ్ (CO2) ను గాలిలోకి వదలకుండా రివర్స్ ఆస్మోసీస్ ( RO) లాంటి వ్యవస్థ కూడా ఉంటుందని, అందువల్ల ప్లాంట్ కు సమీపంలో నివసించే ప్రజలకు ఎటువంటి ఆందోళనా అవసరం లేదని, దీనికి కారణంగా చూపాయి. ఈ కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వాలు వడ్డీ లేని రుణాలను బ్యాంకుల నుండీ ఇప్పిస్తున్నాయి. అనేక పన్ను రాయితీలు కూడా ఇస్తున్నాయి. ఇథనాల్ పై గతంలో ఉన్న 18 శాతం జిఎస్టి ని కూడా ప్రస్తుతం ఐదు శాతానికి తగ్గించారు.

కేంద్ర ప్రభుత్వమయితే ఏకంగా తాము ఆహార భధ్రతా సంస్థ (FCI) నుండీ ఇథనాల్ తయారీ కోసం రేషన్ బియ్యం, నూకలు సరఫరా చేస్తామని హామీ ఇచ్చింది. ముందుగా నూకలు, పాడయిపోయిన బియ్యం కంపెనీలకు ఇస్తాం అని మొదలు పెట్టి, ఆ తరువాత, అదనపు, మిగులు బియ్యం పేరుతో మంచి బియ్యాన్నే సరఫరా చేశాయి. దుర్మార్గం ఏమిటంటే పేద ప్రజలకు ఆహారంగా కిలో 29 రూపాయలకు భారత్ రైస్ పేరుతో ఈ సంస్థ నుండీ బియ్యం అమ్మిన భారత ప్రభుత్వం, అదనపు బియ్యం కావాలన్న కర్ణాటక ప్రభుత్వానికి కిలో 31 రూపాయలకు బియ్యం అమ్మిన మోడీ ప్రభుత్వం, 2021-2022 ఇథనాల్ సరఫరా సంవత్సరంలో, ఈ ఇథనాల్ కంపెనీలకు మాత్రం 14 లక్షల టన్నుల బియ్యం కిలో 20 రూపాయలకు సబ్సిడీ ధరపై సరఫరా చేసింది.

పేదలకు ఇచ్చే పథకాలను దుయ్యబట్టే పాలకులు, బడా బాబులకు మాత్రం ఎన్ని వేల కోట్లు క్రాస్ సబ్సిడీ పేరుతో దోచి పెడతారో, ఇథనాల్ కంపెనీల వ్యవహారం మనకో చక్కని ఉదాహరణ.

శిలాజ ఇంధనాల వల్ల ( పెట్రోల్,డీజిల్ ) దేశంలో గాలి కాలుష్యం విపరీతంగా పెరిగి పోతున్నది. ఈ ఉద్గార వాయువుల వల్ల ఉష్ణోగ్రత్తలు కూడా పెరిగి పోతున్నాయి. అవి వాతావరణ మార్పులకు ప్రధాన కారణంగా ఉంటున్నాయి. ఉద్గార వాయువులను తగ్గించడానికి, వాతావరణ మార్పులను నీయంత్రించడానికి, శిలాజ ఇంధనాల వినియోగం బాగా తగ్గించాలని పర్యావరణ కార్యకర్తల నుండీ బలమైన వాదనలు ముందుకు వస్తున్నాయి. అనివార్యంగా పాలకులపై ఒత్తిడి పెరిగి, అంతర్జాతీయ ఒప్పందాలు పురుడు పోసుకుంటున్నాయి. వాతావరణ మార్పులపై, ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలపై పారిస్ ఒప్పందం లాంటివి, అనేక దేశాలు ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై దృష్టి పెట్టేలా చేస్తున్నాయి.

కానీ అంతర్జాతీయంగా వస్తున్న వాదనలను, పరిశోధనలను దృష్టిలో ఉంచుకుని ,సుస్థిర ప్రత్యామ్నాయాలపై పని చేయాల్సిన మన ప్రభుత్వాలకు నిజమైన సుస్థిర ప్రత్యామ్నాయాలను అన్వేషించే, విధానాల అమలు గురించి చర్చించే చిత్తశుద్ధి లేకుండా పోయింది. అందుకే తప్పుడు పరిష్కారాలతో ముందుకు వస్తున్నాయి. అందులో భాగమే 2018 లో మోడీ ప్రభుత్వం తెచ్చిన జీవ ఇంధనాల జాతీయ విధానం. 2021 జూన్ లో నీతి ఆయోగ్, పెట్రోలియం మంత్రిత్వ శాఖ సంయుక్తంగా 2020-2025 మధ్య భారత దేశంలో పెట్రోల్ లో ఇథనాల్ కలిపి వాహనాలలో వినియోగించే విధాన పత్రం తయారు చేశాయి. 2021 ఏప్రిల్ 1 నుండీ అమలులోకి వచ్చే విధంగా E20 పేరుతో ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. అంటే 2025 మార్చ్ 31 నాటికి దేశ వ్యాపితంగా వాహనాలలో వినియోగించే ప్రతి లీటర్ పెట్రోల్ లో 20 శాతం ఇథనాల్ కలపడం ఈ విధాన లక్ష్యం.

ఇందుకోసం ఇథనాల్ తయారీని ఇబ్బడి ముబ్బడిగా పెంచేయాలని కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. 2022 లో కొన్ని సవరణలు చేసిన ఈ విధానం ఆధారంగా పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వాల అండ దండలతో రైతుల సాగు భూముల లోకి చొచ్చుకు వస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ సహా అనేక రాష్ట్రాలను ఇథనాల్ ఉత్పత్తి పేరుతో కాలుష్య మయం చేయడానికి సిద్దమవుతున్నారు.

2010 దశకం లోనే ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ లో ఈ ఇథనాల్ కంపెనీలు పెట్టే ధోరణి ప్రారంభమైనా ఇప్పుడు మరింత ఊపందుకుంది. మొదటి దశలో వచ్చిన కొన్ని ఇథనాల్ కంపెనీలు చెరకు నుండీ చెక్కర తయారీ క్రమంలో వచ్చే మొలాసిస్ ఆధారంగా చేసుకుని ప్రారంభమయ్యాయి. కొన్ని ఇథనాల్ కంపెనీలు అక్రమంగా రేషన్ బియ్యం, రైస్ మిల్లుల నుండీ నూకలు సేకరించి ఇథనాల్ ఉత్పత్తిని ప్రారంభించాయి. ప్రధానంగా ఈ ఇథనాల్ లిక్కర్ తయారీకే వెళ్ళేది.

ఫలితంగా 2013-2014 నాటికి దేశంలో ఇథనాల్ తయారు చేసే డిస్టిలరీలు 157 ఉంటే, 2021-2022 నాటికి అవి 262 కు పెరిగాయి. 2013-2014 నాటికి వాటి ఉత్పత్తి సామర్ధ్యం సంవత్సరానికి 215 కోట్ల లీటర్లు కాగా అది, 2021-2022 నాటికి అది సంవత్సరానికి 619 కోట్ల లీటర్లకు చేరింది.

ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలలో వస్తున్న ఇథనాల్ కంపెనీలు చెరుకు ఆధారంగా రాబోవడం లేదు. ప్రధానంగా బియ్యం, నూకలు, మొక్కజొన్న, వీలైతే తియ్య జొన్న, ఉపయోగించి ఇథనాల్ తయారు చేయాలని ఈ కంపెనీల ఉద్దేశ్యం.

రాష్ట్ర పర్యావరణ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ పాలసీని అడ్డుకోవాల్సిన తొలి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విచక్షణా రహితంగా రాష్ట్రంలో వాటి ఏర్పాటుకు సహకరించింది. కేంద్రంతో సమానంగా అత్యంత దూకుడుగా వ్యవహరించి, పరిశ్రమ యాజమానుల పక్షాన నిలబడి ప్రజలకు అబద్ధాలు చెప్పింది.

కొత్త ప్రభుత్వం కొన్ని విషయాలలో ప్రజల డిమాండ్లను విని, చర్చలు జరుపుతున్నట్లు కనిపిస్తున్నప్పటికీ, ఇథనాల్ కంపెనీల విషయంలో ఈ ప్రభుత్వ వైఖరి కూడా పాత ప్రభుత్వ అడుగు జాడలలోనే ఉంది. రెండు ప్రభుత్వాలూ కలసి ఇప్పటికే 29 ఇథనాల్ పరిశ్రమలకు రాష్ట్రంలో అనుమతి ఇచ్చాయి. అనేక సందర్భాలలో మంత్రులు, మాజీ మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన సభ్యులు, వివిధ పార్టీల నాయకులు ఈ కంపనీలకు వెన్నుదన్నుగా ఉంటున్నారు. కొన్ని చోట్ల వాళ్ళ కుటుంబ సభ్యులే వాటిని ఏర్పాటు చేస్తున్నారు.

చాలా సందర్భాలలో ఇథనాల్ అనే పదాన్ని, రైతులు విత్తనాలుగా అర్థం చేసుకోవడం ఒక సమస్య అయితే, ప్రభుత్వం ఒక్క రోజు కూడా ఇథనాల్ కంపెనీలు నిర్మాణం అవుతున్న జిల్లాలలో ఆయా గ్రామాల ప్రజలతో చర్చించి, ఇథనాల్ గురించి అవగాహన కల్పించేందుకు ప్రయత్నం చేయలేదు . ఆయా కంపెనీల ప్రతినిధులు బాధ్యుల పేరు లేకుండా, ఎటువంటి బాధ్యత లేకుండా తమ కంపెనీ వస్తే కలిగే లాభాల గురించీ, రైతులకు జరిగే మేలు గురించీ, తప్పుడు హామీలతో గ్రామాలలో కరపత్రాల ప్రచారం చేస్తుంటే, ప్రభుత్వ అధికారులు అడ్డుకోవడం లేదు.

నారాయణ పేట జిల్లా, మరికల్ మండలం చిత్తనూరు గ్రామ సమీపంలో 2022 లో ఇథనాల్ ఉత్పత్తి ప్రారంభించిన కంపెనీ చరిత్ర కూడా ఇదే. మొదట అక్కడ నిర్మాణం జరుగుతున్నది విత్తనాల కంపెనీ అనుకుని మౌనంగా చూస్తుండి పోయిన స్థానిక ప్రజలకు కంపెనీలో ఉత్పత్తి ప్రారంభమయిన కొద్ది రోజులకే వాటి దుష్ఫలితాలు కనిపించడం ప్రారంభమయింది. విష వాయువుల ఆధారిత దుర్వాసన, పక్కనే ఉన్న నదీ జలాలు కలుషితం కావడం, వాటిని తాగిన పక్షులు, మేకలు, జింకలు చనిపోవడం, ఆ నీళ్ళలో దిగిన పిల్లలకు చర్మ సమస్యలు రావడం, కంపెనీ నుండీ ట్యాంకర్ లతో వ్యర్ధాలను బయటకు తెచ్చి, రోడ్ల పక్క, పంట పొలాలలో పడవేయడం, లాంటి ఘటనలతో రైతులు, గ్రామాల ప్రజలు ఉలిక్కి పడ్డారు. చిత్తనూరు ఇథనాల్ కంపెనీ వ్యతిరేక పోరాట కమిటీ పేరుతో సంఘటితమయ్యి, ఉద్యమం ప్రారంభించారు.

తొలుత కాలుష్యాన్ని మాత్రమే సమస్య అనుకున్న అక్కడి రైతులు ,క్రమంగా తమ పంట పొలాల సాగుకు హక్కుగా దక్కాల్సిన కోయిల సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 4 టీ ఎం సీ ల నీళ్ళను కంపెనీ కొల్ల గొడుతున్న విషయం కూడా గుర్తించారు. అందుకే ఇథనాల్ కంపెనీ రద్ధు కోసమే గొంతెత్తారు. వివిధ గ్రామాలకు చెందిన వేల మంది ప్రజలు రెండు సంవత్సరాల పాటు వివిధ రూపాలలో నిరసనలు, పోరాటాలు సాగించారు. మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో అధికారులను, ప్రజా ప్రతినిధులను, రాజకీయ పార్టీలను కలసి తమ గోడు వినిపించారు. ఈ సందర్భంగా ఇథనాల్ కంపెనీ యాజమాన్యం ప్రజలకు అనేక అబద్ధాలు చెప్పింది. ఇబ్బందులు ఉండబోవని అనేక వాగ్ధానాలు చేసింది.

అప్పటి రాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిన, చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యం పై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా, నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజలపై తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగించింది. అక్రమ కేసులు పెట్టింది. నాయకులను పోలీస్ స్టేషన్ లో హింసించి జైలుకు పంపింది.

2023 డిసెంబర్ లో రాష్ట్రంలో అధికారం మారింది. పాత అధికార పార్టీ వాళ్ళు ఓడిపోయి కొత్త అధికార పార్టీ వాళ్ళు స్థానికంగా గెలిచారు. కానీ , కంపెనీ యాజమాన్యం మాత్రం అప్పటి నుండీ ఇప్పటి వరకూ నిరాటంకంగా విష కాలుష్యాన్ని వెదజల్లే తన ఫ్యాక్టరీని నడిపిస్తూనే ఉంది. ఇప్పుడు ఫ్యాక్టరీ వెదజల్లే దుర్వాసన 35 కిలో మీటర్లకు విస్తరించింది. మూడు గ్రామాల నుండీ 54 గ్రామాలకు విష వాయువులు వ్యాపిస్తున్నాయి. గాలిలో కర్బన శాతం పెరుగుతున్నది. వ్యర్ధాలను శుద్ధి చేయడం లేదు. కాలుష్యం , దుర్వాసన భయంతో ఈ గ్రామాల పరిధిలో వ్యవసాయ పని చేయడానికి కూలీలు రావడం లేదు. కంపెనీలో విడుదలయ్యే కార్బన్ డై యాక్సైడ్ ను బంధించి, సోడా కంపెనీలకు సరఫరా చేస్తామన్న యాజమాన్య హామీ అమలు కావడం లేదు. దానిని బయటకే వదులుతున్నారు.

కంపెనీలో వ్యర్ధాలను ఎలా శుద్ధి చేస్తున్నారో, ఎప్పటికప్పుడు కంపెనీ రిజిస్టర్ లో నమోదు చేయాలి. కానీ చేయడం లేదు. ఎప్పటికప్పుడు ఆన్ లైన్ లో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కు పంపాలి. కానీ పంపడం లేదు. రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ బృందం రెండు సార్లు కంపనీని సందర్శించినా, అంతా సవ్యంగానే ఉందని అబద్ధపు రిపోర్టులను విడుదల చేస్తున్నది. కొత్త రాష్ట్ర ప్రభుత్వం కూడా గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసు;లను ఎత్తేయకపోగా, ఉద్యమ నాయకత్వంపై 2024 జనవరిలో రౌడీ షీట్ ఓపెన్ చేసింది.

ఈ అనుభవాన్ని చూస్తే, రాష్ట్రంలో ఏర్పడుతున్న ఇథనాల్ కంపెనీలు ఎలాంటి విధ్వంసాన్ని సృష్టించనున్నాయో అర్థం చేసుకోవచ్చు. కేవలం ఆయా కంపెనీల యాజమాన్యాలే కాదు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రధాన రాజకీయ పార్టీలు కూడా , ఈ విషయంలో ఎలా యాజమాన్యాల పక్షం తీసుకుంటున్నాయో మనకు అర్థం చేయించడానికి నిర్మల్ జిల్లా దిలావర్ పూర్ ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా సాగుతున్న ప్రజా ఉద్యమం తాజా ఉదాహరణ.

Tags:    

Similar News