శేషేంద్ర శర్మ సాహిత్య హక్కులు ఆయన కొడుక్కే.. కోర్టులో ఓడిన ఇందిర..

17 ఏళ్ల విరామం తర్వాత న్యాయవ్యవస్థ కాపీరైట్ల వెనకున్న గుట్టు విప్పింది. కవులు, రచయితల కాపీరైట్‌లు వారి పిల్లలకు దక్కిన సందర్భాలున్నా ఈ కేసుకు చాలా కాలం పట్టింది

Update: 2024-01-27 02:00 GMT
PHOTO curtesy Internet Archives

17 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మన న్యాయవ్యవస్థ కాపీరైట్ల వెనకున్న గుట్టు విప్పింది. ప్రముఖ కవి గుంటూరు శేషేంద్ర శర్మ గ్రంథ హక్కులు ఎవరికి వర్తిస్తాయనే వ్యవహారంలో కోర్టు స్పష్టత ఇచ్చింది. గ్రంథ హక్కులన్నీ శేషేంద్ర శర్మ సొంత కుమారుడు సాత్యకికే సంక్రమిస్తాయని, ఆయన భార్యగా చెబుతున్న ఇందిరా ధనరాజ్ గిరికి వర్తించవని తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తన కుమారుడైన సాత్యకికి పుస్తకాలపై హక్కుల్ని శేషేంద్ర శర్మ 1989లోనే రాసిచ్చినట్టు గుర్తించింది. ఇందిర సమర్పించిన పత్రాలు నకిలీవని తేల్చి చెప్పింది.

ప్రస్తుత వివాదం వివరాలేమిటంటే...


"2007లో తెలుగు యూనివర్శిటీకి ఇందిరా దేవి ధన్‌రాజ్‌గిర్‌ ఆరు లక్షలు ఇచ్చి నాన్న పుస్తకాలు అచ్చు వేయించే ప్రయత్నం చేసింది. కాపీ రైట్స్‌ నాన్న ఆమెకు రాసిచ్చినట్టు ఒక పత్రాన్ని కూడా కూడా తెలుగు యూనివర్శిటీకి సమర్పించింది. నేను లీగల్‌ నోటీసు ఇచ్చే సరికి తెలుగు విశ్వవిద్యాలయం ఆ డబ్బును, ఆ పత్రాన్నీ ఆమెకు తిరిగి ఇచ్చింది. దీంతో ఆమె ఆ పత్రాన్ని కోర్టుకు సమర్పించారు. కోర్టు ఆ పత్రాన్ని తెలంగాణ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కి పంపింది. అది నకిలీదని, నాన్న శేషేంద్ర శర్మ సంతకాన్ని ఫోర్జరీ చేశారని కోర్టు నిర్దారించింది" అన్నారు గుంటూరు శేషేంద్ర శర్మ కుమారుడు సాత్యకీ. ఇందిరా ధనరాజ్ గిరి రూపొందించిన పత్రం ప్యాలెస్ కుట్రని, ఫోరెన్సిక్ అనాలిసిస్, కోర్టు ద్వారా అది నిరూపితమైందని తెలుగు యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ గా ఉన్న ప్రొఫెసర్ సత్యనారాయణ చెబుతున్నారు. మొత్తం మీద శేషేంద్ర శర్మ నిర్దోషి అని రుజువైంది. ఆమె ఒత్తిడికి, చిత్రహింసలకు లొంగకుండా శేషేంద్ర శర్మ తన కుమారుని వైపే నిలిచారన్నది కూడా నిర్దారణ అయింది..

ఎవరీ శేషేంద్ర శర్మ

గుంటూరు శేషేంద్ర శర్మ ప్రముఖ భావకవుల్లో ఒకరు. నెల్లూరు జిల్లా నాగరాజుపాడులో 1927 అక్టోబర్ 20న పుట్టిన శేషేంద్ర శర్మ 18 ఏళ్ల వయసులోనే కవిగా పేరుగాంచారు. అనేక కవితలు, కథలు రాశారు. తొలి భార్య గుంటూరు జానకి (యద్దనపూడి జానకి)కి నలుగురు పిల్లలు. 1970లో ఆయన ఇందిరా దేవి ధన్‌రాజ్‌గిర్‌ అనే ఇండోఆగ్లికన్‌ రచయితను పెళ్లిచేసుకున్నారు. కవి సేన మ్యానిఫెస్టో అనడంతోనే గుర్తువచ్చే పేరు శేషేంద్ర శర్మది. ఆధునిక సాహిత్యం శేషేంద్ర ఒక సంచలనం. కవితా రంగంలో సుడిగాలి. ఆయన కన్ను మూసిన తరువాత కూడా సంచలనానికి మారుపేరుగా నిలిచారు.

ఏమిటీ వివాదం...

2007లో మరణించిన ప్రముఖ కవి, గుంటూరు శేషేంద్ర శర్మ పుస్తకాల కాపీరైట్ వివాదం ఇది. 1989 డిసెంబరు 2, 1989న శేషేంద్ర ఒక వీలునామాలో మొత్తం రచనల కాపీరైట్‌ను తన రెండవ, చిన్న కుమారుడు సాత్యకికి తన సొంత దస్తూరితో బదిలీ చేశారు. శేషేంద్ర జీవించి ఉన్నప్పుడు సాత్యకి తన తండ్రి రాసిన ఏడు పుస్తకాలు పునర్ముద్రించారు. ఆ తర్వాత వివాదం మొదలైంది. శేషేంద్ర శర్మ తన పుస్తకాలపై కాపీరైట్ ను తనకు ఇచ్చారంటూ ఆయన రెండో భార్య ఇందిరా ధనరాజ్ గిరి 2006న ఒక ప్రకటన ఇచ్చారు. ఆ విధంగా శేషేంద్ర పుస్తకాల కాపీరైట్‌ల వివాదం మొదలైంది.

నేను అవాక్కయ్యానన్న సాత్యకి...

‘ఈ ప్రకటన చూసి నేను అవాక్కయ్యా. మా నాన్నగారు తన పుస్తకాలన్నింటి కాపీరైట్లను తన స్వంత చేతివ్రాతతో నాకు ఇచ్చారని, దాని ఆధారంగా నేను కొన్ని పుస్తకాలను తిరిగి ముద్రించానని ఆమెకు బాగా తెలుసు. మా నాన్నగారు 2006 జనవరి 5న ఇందిరా ధనరాజ్‌గిర్‌కి కాపీరైట్‌ను బదిలీ చేసి ఉంటే, ఆమె క్లెయిమ్ చేసినట్లు ఆయన నాకు తెలియజేసి ఉండేవారు. నాకు కాపీరైట్ ఇచ్చినప్పుడు మాతండ్రి వయసు 62 ఏళ్లు. అప్పటికి ఆయన ఆరోగ్యంగా ఉన్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు నాకు ఇచ్చిన కాపీరైట్లను వృద్ధాప్యంలో మార్చాల్సిన అవసరం లేదు. ఇది ఇందిరా ధనరాజ్‌గీర్ కుట్ర, ద్రోహం. 82 ఏళ్ల వయసులో ఇందిరా ఇలాంటి విషయాలపై పోరాటానికి దిగడం ఆమె చిత్తశుద్ధిని, నైతిక స్థాయిని తెలియజేస్తుంది‘ అని సాత్యకి ఓ ఇంటర్వ్యూలో ఆక్షేపణ చెప్పారు.

న్యాయనిపుణలతో చర్చించే కోర్టుకు వెళ్లా...

'నేను ఈ విషయాన్ని కొంతమంది న్యాయ నిపుణులతో చర్చించాను. ఆమె వద్ద ఉన్న పేపర్‌కు విలువ లేదని, అది న్యాయస్థానంలో నిలబడదని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సమకాలీన సాహిత్య దృష్టాంతంలో కవులు, రచయితల కాపీరైట్‌లు వారి పిల్లలకు చెందిన సందర్భాలు ఉన్నాయి. చలం పుస్తకాల కాపీరైట్ ఆయన కుమార్తె సౌరీస్‌కి, శ్రీశ్రీ పుస్తకాల హక్కులు ఆయన కుమారుడు రమణకు వెళ్ళాయి. మక్దూమ్ కాపీరైట్‌లు ఆయన కుమారుడు సుస్రత్‌కు వెళ్లాయి. చాలా సందర్భాలలో కవులు వీలునామా రాయలేదు. కానీ నా విషయంలో, మా నాన్న రాసిన స్పష్టమైన వీలునామా ఉంది. ఆయన జీవితకాలంలోనే దాని అమలు కూడా ఉంది' అంటారు సాత్యకి. ఆ విధంగానే తన తండ్రి శేషేంద్ర శర్మ పుస్తకాలపై సాత్యకి హక్కు సంపాయించారు. అయితే దానికి ప్రామాణికత రావడానికి 17 ఏళ్లు పట్టింది.

ఇందిరా ధనరాజ్‌ అత్యంత సంపన్నురాలా?

ఇందిరా ధనరాజ్‌గీర్ అత్యంత సంపన్నురాలు. హైదరాబాద్‌లో ఆమెకు సొంత ప్యాలెస్‌ ఉంది. ధనరాజ్‌గిర్లు బొంబాయి, హైదరాబాద్ మరియు పూనాలో రాజభవనాలను కలిగి ఉన్నారు. హైదరాబాద్‌కు రెండుసార్లు ప్రధాన మంత్రిగా పనిచేసిన కిషన్ పెర్షాద్‌ కుటుంబంతో సన్నిహితంగా ఉండేవారు.

1940ల ప్రాంతంలో ఆమె కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ప్రోగ్రెసివ్ రైటర్స్ మూవ్‌మెంట్ సభ్యుడు మఖ్దూం మొహియుద్దీన్‌తో పరిచయాలుండేవి. మొహియుద్దీన్ జ్ఞాన్ బాగ్ ప్యాలెస్‌ను క్రమం తప్పకుండా సందర్శించగలిగాడు. ఉర్దూలో ద్విపదలు, ఫోటోగ్రఫీ పట్ల ఆసక్తి ఉండేది. 1964లో ఆమె మొదటి కవితా సంపుటి ది అపోస్టల్ పేరుతో ప్రచురించితమైంది. ఆ తర్వాత ఆమె అనేక కవితా సంపుటాలను తీసుకువచ్చారు. ప్రస్తుతం ఆమె వయసు 92 ఏళ్లు.

Tags:    

Similar News