నేటి ఏడు మినీ కవితలు: ఏమంటున్నాయో తెలుసా?

నిత్యసత్యాలను గుర్తు చేసే పదునైన మినీ కవితలకు మారు పేరు మధు గోలి

Update: 2024-01-31 05:21 GMT




మధు గోలి మినీ కవితలు



ఓటు కత్తి


ఓటు పునాదుల మీద

నేరైతు వెన్ను పైన

చెమట చుక్కల నీడలో

నడయాడే పాలనలో

పుట్టుకొచ్చిన కొమ్ములు

సగటు మనిషిని చీల్చేస్తున్నాయి

ఓటు కత్తికి పని చెప్పండి


మనుషులమై

కదిలే దేహాలం

కదలని మనుషులం

రగిలే క్రోధాలం

తిరుగాడే భ్రమరాలం

ఆకర్షణ వీక్షణతో అంధులం

ఆరడుగుల గోతిలో శలభాలం

ఎందుకు ఆరాటం...

మనుషులమై మిగులుదాం


దెబ్బ

కుక్క కాటుకు

చెప్పు దెబ్బ

వంచన కాటుకు

ఓటు దెబ్బ

అయ్యో....రామ...!


నాడు రాముడు

సింహాసనం త్యజించి

అరణ్య వాసానికి

నేడు రామ భక్తులు

సింహాసనం కోసం

రామ మందిరానికి

గుంటలు


రోడ్ల పై

గుంటలు చూస్తే

అర్థమైంది

జనం కళ్లూ

గుంటలు పడుంటాయని

వాళ్ళకి తెలియడం లేదు

తాము కళ్ళు తెరిస్తే

ఏ గుంటలూ ఉండవని


సిరా చుక్క


ప్రజాస్వామ్యం

గూటిలో గుడ్ల కోసం

మత నాగులు

దేశం చెట్టెక్కుతున్నాయి

చూపుడు వేలిపై

సిరాచుక్క డేగను వదలండి


ఆయుధం


అసత్యాలు అర్ధ సత్యాల

పడగ పగలాలంటే

ఓటు ముంగిసే ఆయుధం




(గోలి మధు, మంగళగిరి, వృత్తి రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ లో వర్క్ ఇన్స్పెక్టర్, ప్రవృత్తి: చైతన్యాన్ని పంచుతూ సాహితీ సాగర తీరాన పయనం)


 




Tags:    

Similar News