సిరిసిల్ల చేనేత కార్మికుడి కళా నైపుణ్యం భళా
అగ్గిపెట్టెలో ఇమిడే చీర..బంగారం, వెండి పోగులతో నేసిన చీర..సుగంధాల సిరిచందన చీర..ఇలా పలు రకాల పట్టు చీరలను నేసిన చేనేత కళాకారుడు నల్లా విజయకుమార్ కథా కమామీషు.
By : Saleem Shaik
Update: 2024-08-05 15:27 GMT
జులై 29వతేదీ...వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి సిరిసిల్ల చేనేత కళాకారుడు నల్ల విజయకుమార్ అగ్గిపెట్టెలో ఇమిడిని చీరను, శాలువాను బహుమతిగా అందించారు. తమ ఇలవేల్పు అయిన దేవాలయానికి తాను నేసిన చీర, శాలువను కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఆలయ ఈఓ కె వినోద్ రెడ్డికి అందజేశానని విజయకుమార్ చెప్పారు. దక్షిణ కాశీగా పేరొందిన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకొని పూజలు చేసి అగ్గిపెట్టెలో ఇమిడే చీరను బహుమతిగా అందజేసిన వార్తతో సిరిసిల్లకు చెందిన చేనేత కళారత్న అవార్డు గ్రహీత నల్ల విజయకుమార్ పేరు మరోసారి తెరమీదకు వచ్చింది.
అగ్గిపెట్టెలో ఇమిడిన చీరను నేసి చేనేత కళా వైభవాన్ని చాటి చెప్పిన సిరిసిల్లకు చెందిన నల్లా పరంధాములు మహారాష్ట్రలో తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా మారారు. చేనేత మగ్గంపై ఎన్నెన్నో రకాల చీరలు నేసి చేనేత శిల్పిగా పేరొందిన నల్లా పరంధాములు కుమారుడు నల్ల విజయకుమార్ తండ్రి నుంచి చేనేత పనిని నేర్చుకొని, తండ్రిని మించిన తనయుడిగా పలు వినూత్న రకాల పట్టుచీరలను నేసి దేశ, విదేశాల్లో పేరు, ప్రఖ్యాతులు గాంచారు. చేనేత కళారత్న అవార్డు పొందిన విజయకుమార్ వినూత్న పట్టు చీరలను నేసిన చేనేత విజయప్రస్థానం గురించి ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.
మా నాన్న నుంచి చేనేత పనిని నేర్చుకున్నా...
‘‘నా స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం. నాన్న నల్ల పరంధాములు నుంచి చేనేత పనిని నేర్చుకొని వృత్తిగా స్వీకరించాను. తెలంగాణ రాష్ట్రంలో చేనేత రంగం సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో నేను వినూత్న పట్టుచీరలను నేస్తూ దేశంలోనే కాకుండా విదేశాల్లోనూ పేరు ప్రఖ్యాతులు సాధించాను. నేను నేసిన పట్టుచీరలను విదేశీయులకు సైతం విక్రయించి వారి మన్ననలు పొందాను.నిత్యం ప్రయోగాలు చేస్తూ వినూత్న చీరలు నేస్తూ ప్రజల ఆదరాభిమానాలు పొందాను.’’
తండ్రిబాటలో పయనం
‘‘నా తండ్రి పరంధాములు స్ఫూర్తితో ఆయన బాటలో పయనిస్తూ చేనేత మగ్గంపై అగ్గిపెట్టెలో ఇమిడే పట్టు చీరను నేశాను. 8 మీటర్ల పొడవున్న పట్టుచీరను కేవలం వంద గ్రాముల బరువుతో నేసి అందరినీ అబ్బుర పరచాను.చిన్న అగ్గిపెట్టెలో ఇమిడే శాలువను కూడా నేశాను. చేనేత మగ్గంపై కుట్టులేని జాతీయ జెండాను నేశాను. ఎలాంటి కుట్టు, అతుకు లేకుండా చేనేత మగ్గంపై మూడు రోజులపాటు శ్రమించి త్రివర్ణ పతాకాన్ని నేసి గుర్తింపు పొందాను. మగ్గంపై కుట్టులేని గౌనును నేశాను.’’
తిరుమలేశుడికి అగ్గిపెట్టెలో పట్టే చీర బహుమతి
‘‘బంగారం, వెండి పోగులు, పట్టుదారంతో నేసిన చీరను పద్మావతి అమ్మవారికి,వెండి పోగుల చీరను అలివేలు మంగమ్మకు బహుమతిగా అందించాను.పెద్దమ్మ తల్లికి వెండి, బంగారపు చీరను అందించారు. సీతమ్మకు మువ్వన్నెల చీరను కానుకగా అందించారు.రాజన్న దేవాలయానికి నేత చీరను బహుమతిగా అందించాను.’’
రంగులు మారే చీర
‘‘రంగులు మారే చీరను మగ్గంపై నేశాను. 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి పోగులతో వివిధ రంగులు మారే పట్టు పోగులను వినియోగించి నెలరోజుల పాటు నేసిన రంగులు మారే పట్టుచీరను నేశాను. ఈ చీరను మాజీ మంత్రి కేటీఆర్ చేత ఆవిష్కరించాను.’’
సుగంధాల సిరిచందన చీర
‘‘సుగంధాల సిరిచందన చీరను నేను నేశాను. 27 రకాల సుగంధ పరిమళాలు వెదజల్లే చీరను నేసి దీనికి సిరిచందన పట్టుచీరగా నామకరణం చేశాను. ఈ చీరను గతంలో మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు ఆవిష్కరించారు. శ్రీ గంథం,నాగకేసరాలు,బిల్వగుజ్జు,పాలసుగంధి,జాపత్రి,జాజికాయ,ఇలాచీ,జటామాంస,భావంచలు,పచ్చకర్పూరం,కుంకుమ పువ్వు,తుంగదుంపలు,గంధ కఠోరాలు,ఎర్రచందనం, కస్తూరి, పసుపు,వట్టివేర్లు,గులాబీరేకులు, సంపంగి,విరజాజి, కృష్ణతులసీ లాంటి సుగంధ ద్రవ్యాలతో కలిసి ద్రావణాన్ని తయారు చేసి,అది వేడి చేసి దానిలో పట్టుపోగులను రెండు రోజుల పాటు నానబెట్టాను.’’
అంతర్జాతీయ వేదికపై మెరిసిన చీర
‘‘అగ్గిపెట్టెలో ఇమిడిన చీరను నేసి దాన్ని ఆస్ట్రేలియాలోని ఎన్ఆర్ఐ రాధిక కొనుగోలు చేశారు. పట్టుచీరను ఆస్ట్రేలియా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ లో ప్రదర్శించాను. ఆస్ట్రేలియాలో అంతర్జాతీయ వేదికపై అగ్గిపెట్టెలో ఇమిడే చీర మెరిసింది.’’
ప్రముఖులకు అగ్గిపెట్టెలో ఇమిడిన చీరల బహుమతి
‘‘అగ్గిపెట్టెలో ఇమిడిన చీరను నేసి, దాన్ని పొన్నం ప్రభాకర్ ద్వారా రాహుల్ గాంధీకి అందజేశాను. ఇందిరాగాంధీ, చంద్రబాబు, ఎన్ టి రామారావు తదితర ప్రముఖులకు నేత చీరను అందజేశాను.’’
కుట్టులేని ప్యాంట్,షర్టు
‘‘చేనేత మగ్గంపై పట్టుదారాలతో ప్యాంటు, షర్టును నేశాను. ఈ ప్యాంటు, షర్టు నేయడానికి 45 రోజుల సమయం పట్టింది. 120 గ్రాముల బరువుతో నేశాను. అగ్గిపెట్టెలో ఇమిడిన పట్టుచీరనే కాకుండా, ఉంగరం, దబ్బనంలో దూరే చీరలు నేసి గుర్తింపు పొంది తెలంగాణలోనే రికార్డు నెలకొల్పాను.పట్టుచీరలో నెమలి పింఛాలు ఇమిడ్చి నేశాను.’’
బంగారం, వెండి పోగులతో పట్టుచీర
‘‘20 గ్రాముల బంగారం, 20 గ్రాముల వెండి పోగులతో పట్టుచీరను నేశాను. హైదరాబాద్ నగరానికి చెందిన ఓ వ్యాపారవేత్త అతని కుమార్తె పెళ్లి కోసం ఈ చీరను ఆర్డర్ ఇస్తే నేసి అందించాను. బంగారు, వెండి వర్ణంతో మెరిసి పోతున్న ఈ చీర 48 ఇంచుల వెడల్పు, ఐదున్నర మీటర్ల పొడవుతో 500 గ్రాముల బరువుతో నేశాను. బంగారం, వెండి పోగులను తయారు చేయించి, దాన్ని పట్టుదారం పోగులతో పాటు చీరలో ఒదిగిపోయేలా జకార్డు మగ్గంపై నేశాను. నెలరోజుల పాటు నేసిన ఈ చీర 1.8లక్షల రూపాయలకు విక్రయించాను. దీంతోపాటు 250 గ్రాముల బంగారం,500 గ్రాముల వెండితో చీర నేశాను.’’ అని నల్ల విజయకుమార్ వివరించారు.
త్రివేణిసంగమం చీర రేపు ఆవిష్కరణ
త్రివేణిసంగమం చీరను మంగళవారం ఆవిష్కరించనున్నట్లు చేనేత కార్మికుడు నల్ల విజయకుమార్ ‘ఫెడరల్ తెలంగాణ’కు చెప్పారు. గంగ,యమున,సరస్వతి నదుల సంగమం వద్ద ఉన్న నీటిని తీసుకువచ్చి ఆ నీటిలో నూలును డైయింగ్ చేసి నేసిన చేనేత చీర త్రివేణిసంగమం అని విజయకుమార్ చెప్పారు.