నకిలీ సిగరెట్లతోనే దేశానికి ’పొగ’
దొంగచాటుగా, పన్నుల పరిథిలోకిరాని పొగాకు వ్యాపారాన్ని అరికట్టకుండా చట్టబద్ధంగా సాగే వ్యాపారాన్ని నియంత్రించడం, ఎక్కువగా పన్నులు వేయడం వల్ల ఫలితం ఉండదంటున్నారు..
Producer : Amaraiah Akula
Update: 2023-11-30 10:30 GMT
(ది ఫెడరల్ ప్రతినిధి, హైదరాబాద్)
దేశీయ పొగాకు వ్యాపారాన్ని విదేశాల నుంచి ప్రత్యేకించి చైనా నుంచి దొంగచాటుగా వస్తున్న సిగరెట్లు దెబ్బతీస్తున్నాయా? వీటి మూలంగా రిటైల్వ్యాపారులు, వినియోగదారులు దెబ్బతింటున్నారా? సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల చట్టానికి (సీఓటీపీఏ) ప్రతిపాదించిన సవరణలు దేశీయ పొగాకు వ్యాపార రంగానికి మేలుచేసేవి కావా? అంటే అవుననే అంటున్నారు పలువురు నిపుణులు, పొగాకు పరిశోధక శాస్త్రవేత్తలు, ఆరోగ్యరంగ ప్రముఖులు, టుబాకో రంగంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు. దేశంలో దొంగచాటుగా, పన్నుల పరిథిలోకిరాని పొగాకు వ్యాపారాన్ని అరికట్టకుండా చట్టబద్ధంగా సాగే వ్యాపారాన్ని నియంత్రించడం, ఎక్కువగా పన్నులు వేయడం వల్ల ఫలితం ఉండదన్నది వీరందరి అభిప్రాయం.
పొగాకు సాగులో ఏపీటాప్..
రాష్ట్రంలో పొగాకును సుమారు 3.50లక్షల ఎకరాల్లో సాగుచేస్తుంటారు. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడైతే దేశంలోనే అగ్రస్థానంలో ఉంటే విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాలలో అంతో ఇంతో సాగవుతున్నా కర్నాటక, ఏపీ ముందు వరుసలో ఉంటాయి. 4.57 కోట్ల మంది ప్రజలు ఈ రంగంపై ఆధారపడి బతుకుతున్నారు. 75 కోట్ల కిలోల పొగాకు ఉత్పత్తితో ఇండియా ద్వితీయ స్థానంలోఉంటే చైనా 230 కోట్ల కిలోలతో ప్రధమ స్థానంలోఉంది. భారత్ లో మొత్తం వినియోగం 59.6 కోట్ల కిలోలని అంచనా. ఇందులో కేవలం 5.2 కోట్ల కిలోల సిగరెట్ల వ్యాపారం మాత్రమే పన్నుల పరిధిలో ఉంది. మిగతా అంటే దాదాపు 91 శాతం వ్యాపారం పన్నుల పరిథిలోకి రాకుండానే సాగిపోతోంది. గుట్కాలు, ఖైనీలు, నమిలే పొగాకు, స్మగుల్డ్సిగరెట్లు, జర్దా, నశ్యం, కొన్నిరకాల బీడీల వ్యాపారం చట్టపరిధిలోకి రాకుండానే పెద్దఎత్తున సాగిపోతోంది.
ఆరోగ్య ముప్పంతా ఈ నకిలీతోనే..
వాస్తవానికి ఆరోగ్య ముప్పంతా ఈ నకిలీ, నాణ్యతలేని పొగాకు వల్లేనని రైతు సంఘాల నేతల వాదన. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సీఓటీపీఏ చట్టానికి ప్రతిపాదించి సవరణలు దొంగ వ్యాపారాన్నిఅణచివేయడానికి బదులు చట్టబద్ధమైన వ్యాపారాన్నినియంత్రించేలా ఉన్నాయన్నది టుబాకో బోర్డు మాజీసభ్యుడు వై.వెంకటనర్సిరెడ్డి అభిప్రాయం. ఇలాంటి సవరణల వల్ల వినియోగదారులు అనివార్యంగానే స్మగుల్డ్ లేదా చట్టపరిథిలో లేని ఉత్పత్తుల వైపు మొగ్గుచూపుతారని సీఎంఐఇ సర్వేలో తేలింది. పొగాకును వాడాలా? వద్దా? అనేది అంతిమంగా ఆవినియోగదారునికుండే అవగాహన, చైతన్యం పైఆధారపడి ఉంటుందని, అప్పటి వరకు సక్రమ మార్గంలో నాణ్యమైన ఉత్పత్తులను అందించే వ్యవహారమై ప్రభుత్వాలు దృష్టి సారించాలని వినియోగదారుల హక్కులపై పోరాడే సంస్థ సీఓఎఫ్ అభిప్రాయపడింది. దొంగచాటు పొగాకు వ్యాపారాన్నినియంత్రించకుండా పదేపదే పన్నులు వేసి ఆరోగ్యాన్నికాపాడలేరని పలువురు నిపుణులు స్పష్టం చేశారు. కరోనా మహమ్మారి మధ్య నిరుద్యోగ సంక్షోభాన్నితీవ్రతరం చేయడానికి సీఓటీపీఏ సవరణలు ఉపయోగపడతాయేమోనని సామాజిక కార్యకర్త డాక్టర్ నరసింహారెడ్డి వ్యాఖ్యానించారు.
2022లోదేశంలోకి వచ్చిన స్మగుల్డ్ సిగరెట్లు 2901.56 కోట్లు..
సిగరెట్లపై వేస్తున్న అధిక పన్నుల వల్ల వ్యాపారులు అసలు పన్నులే ఎగేసే స్థితికి వస్తున్నారని టుబాకో ఇనిస్టిట్యూట్ఆఫ్ఇండియా ప్రతినిధి శారద్టాండన్అభిప్రాయపడ్డారు. గత ఒకటిన్నదశాబ్ద కాలంలో స్మగుల్సిగరెట్ల వ్యాపారం రెట్టింపు అయింది. 2006లో 1300.5 కోట్లుగా ఉన్నసిగరెట్లు (ఒక్కోక్క సిగరెట్టు చొప్పున) 2020 నాటికి 2800.56 కోట్లకు చేరింది. 2022 నాటికి ఆసంఖ్య 2901.56 కోట్లకు చేరింది. ఇదేకాలంలో దేశంలో చట్టబద్ధమైన సిగరెట్ల వ్యాపారం 22 శాతం తగ్గింది. ఇంతజరుగుతున్నా దేశంలో పొగాకు వ్యాపారంపై కఠిన వ్యవహరించాలనే అధికారవర్గం భావిస్తోందని, పొగాకు రైతుల వాస్తవ స్థితిగతులను చర్చించడానికి బదులు కఠిన చర్యలపైన్నేప్రభుత్వం మొగ్గుచూపడం అన్యాయమని అఖిలభారత రైతుసంఘాల సమాఖ్య అధ్యక్షుడు జే.గౌడ అభిప్రాయపడ్డారు.