ఒక్కో సారి నీకో ఇల్లున్నా ఇంటికి తిరిగి రాలేకపోవచ్చు...
ప్రశ్నించడం నేరం. ఒక చిన్న ప్రశ్న నిన్ను ఇంటి నుంచి లాక్కెళుతుంది. నీకొక ఇల్లున్నా దాన్నొదులుకోవాల్సిన పరిస్థితులు చుట్టూర ఉన్నాయని చెప్పేదే నేటి కాంతి కవిత
నినాదమై నువ్వు మోగిన వెంటనే
నీ ఇల్లు నీకు దూరమైపోతుంది
విశ్వ మానవుడిగా రూపొందడానికి అడుగు కదిపితే చాలు
నీ ఇంటికి నిన్ను రాజ్యం దూరం చేసేస్తుంది.
భూమికోసం నినాదమైనందుకే కదా
వాకపల్లి మహిళలు ఇంటికి లేకుండా అయిపోయారు.
ఇల్లు వున్నా - అనేకసార్లు అందులో మనం ఉండం
అక్కడో పోలీసు క్యాంపు ఉంటుంది
రాజ్యాంగయంత్రం స్వైర విహారం చేస్తూ ఉంటుంది.
తీరా అన్ని దాటుకొని వెళ్లగలిగినా
ఆ మొండి గోడల మధ్యన నీ వాళ్లంటూ
అక్కడ ఎవరూ వుండరు.
'ఇల్లు' అనే మాటకు అర్థమేమిటి అసలు?
గూడాలకి గూడాలు తగలబెట్టినప్పుడు
ఏ బూడిద కుప్పలో -ఎవరి ఇంటిని వెదుక్కుందాం?
ఇల్లు వుండొచ్చు
అది వెలివాడలోని ఇల్లు అవ్వచ్చు
మాదిగ గూడానికి చెంది వుండొచ్చు
ఆ ఇల్లు చుండూరులోనో, కారంచేడు లోనో ఉండొచ్చు
వేంపేటలో దీటుగా సమాధానం చెప్పిన
ఇల్లెయి కూడా ఉండొచ్చు.
ఒకవేళ ఇల్లనేది అక్కడవున్నా
నువ్వు ఎప్పటికీ అక్కడికి చేరలేకపోవచ్చు
ఎందుకంటే టార్చర్ లో విరిగిన నీ కాళ్లు
నిన్ను అడుగు కదపనివ్వవు.
ఇంటికీ నీకూ మధ్య రాజ్యం కందకాలు తవ్వుతుంది
మొసళ్ళని నింపుతుంది
సీమాంతర సరిహద్దుల్ని గీస్తుంది.
ఇంటి గడప దాటి బయటకు అడుగుపెట్టిన మరుక్షణం
నీ ఇంటికి నీవు పరాయివి అయిపోతావు.
నీవు బజారుకు వెళ్ళొచ్చు, బడి కెళ్లొచ్చు
దుకాణానికి వెళ్ళి ఇంత మాంసం తెచ్చుకోవచ్చు
తిరిగి ఇంటికి పోతావని మాత్రం అనుకోకు
ఆ కాస్తంత మాంసం కోసమే
'అక్లాఖ్' రాళ్లతో కొట్టి చంపబడ్డాడు
మరెందరో కత్తులతో నరికివేయబడ్డారు.
మూకదాడుల్లో పీలికలై పోయారు.
పౌర హక్కుల జెండాని గుండెల కత్తు కున్నందుకే కదా
పురుషోత్తం, ఆజంఆలీ లు ఇంటికి ఇంటికెళ్ల లేకపోయారు
హక్కుల కోసం వాదించిన లాయర్ ప్రభాకర్ రెడ్డి
ఎప్పటికీ ఇంటికి లేకుండా పోయాడు.
ఇంటి నుంచి బయటకు వెళ్లడం ఎంత అసాధ్యమో
తిరిగి ఇంటికి చేరుకోవడం కూడా అంతే దుసాధ్యం!
అందుకే సుధా భరద్వాజ్ ఆ సాయంత్రం
ఇంటికి వెళ్ళలేక పోయింది
తల్లడిల్లుతున్న కూతుర్ని ఊరడించలేకపోయింది.
అందుకే సోమాసేన్ ఇంటికి చేరలేకపోయింది
వంగని కీళ్లతో కాళ్ళు యీడుస్తూ జైల్లోకి నడిచి వెళ్ళింది.
వున్నట్టుండి--
మన ఇంటిలో మనం ఉండగానే
ఇంటికి పరాయిలమైపోతాం.
చుట్టుముట్టిన కర్ఫ్యూ చీకటి
ఇంటితో పాటు నీ అస్తిత్వాన్ని తుడిచి పెట్టేస్తోoది.
హఠాత్తుగా తలుపులు విరగ్గొట్టుకొని
సైన్యం ఎప్పుడు ఇంట్లోకి దూసుకొస్తుందో తెలియదు.
కనిపిస్తే కాల్చివేతకి సిద్ధంగా వున్న తుఫాకులకు
నీవు ఏ క్షణమైనా బలి కావచ్చు
సైరన్లతో దూసుకొచ్చే మిలట్రీ శకటాలకు
నీవు ఎప్పుడైనా మానవ కవచంగా మారిపోవచ్చు.
ఇల్లే కాదు- ఊరే కాదు- దేశమే కాదు.
వున్నట్టుండి నీకాళ్ళ కింద నీవు పుట్టి పెరిగిన
నేల కూడా హఠాత్తుగా మాయమైపోవచ్చు
నీ దేశానికి నీవు పరాయి కావచ్చు.
కాందిశీక శిబిరాల్లో నీవు శాశ్వతంగా బందీవి కావచ్చు.
'భూగోళమంతా' అత్యంత ఘోర వివక్షకు గురి కావచ్చు.
సువిశాల ప్రపంచంలో ఇల్లంటు
ఎక్కడో ఓ చోట బ్రతకనివ్వండనే వెతలు పడొచ్చు.
గిరిజనులంతా ముస్లింలుగా మారి ఇబ్బడి ముబ్బడిగా
దేశం పట్టనంతమందిని కన్నారని
దేశాల నుండే వెళ్లగొట్టబడొచ్చు.
ఏ దేశం, ఏ నేల స్వంతం కాదు
ఏ నేల అక్కున చేర్చుకోదు.
పేరుకే బౌద్ధం- చేసేది మత దాడులు
పనిచేయని సన్యాసం-- మిలిటరీ, సైనిక దాడులు.
ఈ దేశం వాళ్లని ఆదేశం- ఆ దేశం వాళ్లని ఈ దేశం
దేశం ఏదైతేనేమి?
అక్కడ ఇక్కడ ఎక్కడైతే నేమి?
మతంరంగు పులమబడి మహిషాసుర మర్ధన
చేయబడినది
ఇల్లే కాదు దేశమే లేని జాతి వాళ్ళది.
శరణార్థులుగా బ్రతకటం చావుతో సమానం కదా?
ఇంటిని ఆస్తులను లాగేసుకుంటారు
ఇంటినే కాదు జాతిని అస్తిత్వాన్ని గుర్తించమంటారు
దేశం నీది కాదు పొమ్మంటారు.
ఇల్లు లేని పౌరసత్వం లేని రెక్కలు ఇరిగిన పక్షుల్లాగా గాలిలో నీ పయనం.
ఇంటినే కాదు, తల్లిని కోల్పోతున్న పిల్లలు
పిల్లలను కోల్పోతున్న తల్లులు
ఇల్లును, ఊరును, దేశాన్ని వదిలి
రిక్త హస్తాలతో పారదోలబడుతున్న జాతి.
గోడమీద దేవత బొమ్మ ఉన్నదని '' డ్రాగన్" అండదండలతో
పసిప్రాణాలను కబళించి ఇంటిని దేశాన్ని సృష్టి చేసుకున్నప్పుడూ...
ఇంటిని కోల్పోయిన బాధితుడివి నువ్వే కదా.
వందల, వేల సంవత్సరాల నాడు వచ్చిన నిన్ను
ఈ దేశం పౌరుడివే కాదంటారు
ఈ దేశం నీది కాదంటారు, పౌరసత్వం లేదంటారు
బుల్డోజర్లు వచ్చి 'ఇంటి' ఆనవాళ్ళతో సహా లేపేస్తాయి.
'కర్ర' సేవకులతో ఇల్లే కాదు
బాబ్రీలు కూలగొట్టబడతాయి.
గ్లోబంత మత రాజకీయం- ఇల్లు లేని ఆధునిక బానిసలు.
ఇల్లoటే ఓ రక్షణ కదా
ఇల్లoటే ఓ భరోసా కదా
ఇల్లoటే ఓ ఆత్మవిశ్వాసం కదా
ఇల్లoటే బంధాలు, బంధుత్వాలు కదా
ఇల్లoటే చిన్ననాటి జ్ఞాపకాలు,స్నేహితులు కదా
కానీ ఇంటికి నీవెప్పుడూ యజమానివి కాలేవు ఎందుకు?
ఇల్లoటే - గులాబీలు గుల్ మొహరాలు
ఇల్లంటే - పున్నాగులు, చామంతులు కదా
కానీ ఈ ఇల్లు నీ అస్థిత్వాన్నే ఎప్పుడూ మాయం చేస్తుందెందుకు?
ఇల్లoటే - ఓ పెళ్లి కోసం
ఇల్లంటే - ఓ చావు కోసo
ఇల్లoటే - ఒకింత నీడ కోసం
ఇల్లంటే - కుసింత భద్రత కోసం
కానీ ఈ ఇల్లు ఎప్పటికీ నీది కాదు ఎందుకు?
ఇల్లoటే - మగవాసన, మగ పెత్తనం
ఇలoటే - మొగుళ్ళ, మొసళ్ళ వాసన
ఇల్లంటే - నాన్న పెత్తనం, అన్నల దౌర్జన్యం
ఇల్లoటే - యక్తిత్వాన్ని గుర్తించని అమ్మలజ్ఞానం
ఇల్లoటే - అక్కల ఆధిపత్యం,బావల చొంగ చూపులు
ఇలంటే - చెల్లెళ్ళ లౌక్యం
ఇల్లు పదే పదే రాజ్యాంగ యంత్రమైపోయి
నిన్ను బయటకు గెంటేస్తుంది.
ప్రశ్నించే వాళ్లకి ఎప్పటికీ ఇల్లు ఉండదు
ప్రశ్నించడం మొదలు పెట్టినప్పటినుండీ
ఇల్లు పోలీసు ఠాణా అయిపోతుంది
ఇల్లు గంతలు కట్టుకున్న న్యాయస్థానం అయిపోతుంది.
ఇల్లు నిన్ను నిందితుడ్ని చేసి వెలేస్తుంది.
ఇల్లు నీవు బానిసవని పదేపదే గుర్తు చేస్తుంది.
ఇల్లoటే ఆమెకు ఎప్పటికీ చేరుకోలేని కలే.
పోద్దు పోతుంది, దీపాలు పెట్టే వేళవుతుంది.
పిల్లలు గుండెల్లో సుడులు తిరుగుతున్నారు.
అడుగులు వేగంగా పడుతున్నాయి.
అయినా ఎప్పటికీ ఆమె ఇల్లు చేరుకోలేదు.
ఎందుకంటే --
ఆమెకు ఏ చిరునామా లేదు.
ఇంటి గోడల్లో, వంటింటి శ్రమల్లో
పిల్లల పెంపకాల్లో, సంపాదన రెక్కల ముక్కల్లో
ఆమె అస్తిత్వం ఇంకిపోయింది.
ఆమె కంటూ ఓ పేరు లేదు
ఆమె కంటూ సొంతమైందేమీ లేదు.
ఆమెకు ఇల్లు ఉండడానికి కాదు
ఇల్లు నాదంటూ ఎవ్వరూ గెటకుండా ఉండటానికి.
ఆమె తన కోసం తాను
ఓ ఇంటిని కూర్చోలేకపోయింది.
ఓ చిరునామాని చెక్కుకోలేకపోయింది.
ఆమెకు ఇంటికి మధ్య
పితృస్వామ్యం బ్రహ్మజెముడై మొలిచింది
రాజ్యం రక్కసై ఎదిగింది.
ఇల్లుoటుంది, ఇల్లు ముంగిట ముగ్గు ఉంటుంది
ఇంట్లో కళకళలాడే ఓ కుటుంబం ఉంటుంది.
కానీ ఆ ఇంట్లో ఆమె మాత్రం ఉండదు.
వాళ్లకు, ఆమెకు సొంత ఇల్లు అంటూ ఎప్పుడూ ఉండదు
ఆమెకు తెలుసు, వారికి తెలుసు
దున్నేవాడికి భూమి దక్కనంతవరకు
వారికి, ఆమెకు సొంత ఇల్లoటూ ఏమి ఉండదని
సొంత చిరునామా అంటూ ఏమి ఉండదని.