అనుభూతి గీతమై విరబూసిన వెన్నెల

ఖదీర్‌బాబు ‘వాన కురిసినప్పుడు మా ఇంట్లో’ ఫేస్‌బుక్‌ వ్యాసాల సంకలనం మీద తాడి ప్రకాష్‌ కామెంట్

Update: 2024-11-01 03:00 GMT


పటాటోపం ఉండదు. ఆడంబరానికి తావే లేదు. పదవిన్యాసమూ, అంత్యప్రాసల లౌల్యమూ అసలే కానరాదు. చిరుగాలికి కదిలే నీటి కెరటాల మీద తూనీగలు తిరుగుతున్నట్టు, ఆకుపచ్చని గడ్డిపరకలు వూగుతున్నట్టు, చెరువు నీటి మీద సన్నని వాన చినుకుల సంగీతం వింటూ ‘సారంగా తెరీ యాద్‌ మే’ అంటూ కూనిరాగం తీస్తున్నట్టు... వాక్యం వెంట వాక్యం అలల్లా కదిలిపోతాయి.

ప్రశాంతంగా దేవుడి పటం ముందు అగరు ధూపం పెట్టి, భక్తితో దణ్ణం పెట్టుకుని శ్రద్ధగా కూర్చుని రాసిన రుచికరమైన శాకాహార వాక్యాలు. ఆవేశపడిపోవడమూ పూనకంతో వూగిపోవడమూ వుండనే వుండదు. కదిలే నీటి కెరటాల మీద రాలిపడుతున్న పున్నాగపూల పరిమళ ధ్వనిని రికార్డు చేసే కళాత్మక ప్రయత్నంలా వుంటుంది ఖదీర్‌బాబు వచనం. కళ్ళు మిరుమిట్లు గొలిపే క్షణికోద్రేకపు రాతలు రాయడం రాక కాదు. మెరుపు కళ్ళతో, మనోహరమైన చిరునవ్వుతో– ‘ఎచటి నుండి వీచెనో ఈ చల్లని గాలి’ అని పాడే సావిత్రిలాగా తన వాక్యం వుండాలనే స్వార్థం ఖదీర్‌ది.

కోసి కారం పెట్టినట్టు రాస్తాడు పతంజలి. తట్టుకోలేని విషాదాన్ని అయినా తేలికపాటి మాటల్లోనే పలికిస్తాడు నామిని. పేదరైతు వేదనని మన నరాల్లో ఇంజెక్ట్‌ చేసే టెక్నిక్‌ కేశవరెడ్డిది. మరి ఖదీర్‌? మహేంద్ర కపూర్‌లాగా గొంతు చించుకుని అరవడం ఇతని పద్ధతి కాదు. నక్షత్ర కాంతిని మనకి తెచ్చి యిచ్చే హేమంత్‌ కుమార్‌ లాగా మంద్రస్థాయిలో పాడడాన్నే యిష్టపడతాడు. రావు బాలసరస్వతి పాట వింటూ, కృష్ణశాస్త్రి కవిత్వం చదువుకుంటున్నట్టుగా రాసే ప్రయత్నం చేస్తాడు. వాక్యం ఉమర్‌ ముక్తార్‌ గుర్రపు డెక్కల చప్పుడులా కాకుండా ఎస్‌.వరలక్ష్మి విరజాజుల రాగాలాపనలా వుండాలని నియమం పెట్టుకున్నాడు. శ్రుతిపక్వమైన గొంతు ఖదీర్‌ది. నిరాడంబరమైన పదాలు, నిరలంకారమైన వాక్యాలు... అది ఖదీర్‌ మార్క్‌ ఒరిజినల్‌ ఎక్స్‌ప్రెషన్‌. కథ ఐనా, వ్యాసం ఐనా, ఒక మనిషిని తలుచుకోవడం ఐనా, అతి మామూలుగా మొదలవుతుంది. ఎలాంటి ఫెళఫెళార్బాటాల హంగామా లేకుండా అంతే మృదువుగా, సరళంగా ముగింపు వుంటుంది.

... And the otherside of the coin– రెండో ప్రపంచ యుద్ధకాలంలో దొరికిన రష్యన్‌ సైనికుల్ని జైళ్ళలో పెట్టి, వాళ్ళకి గుండు చేసి, కుర్చీలో కూర్చోబెట్టి, తాళ్ళతో కట్టేసి, పైన అమర్చిన ఐసు గడ్డ నుంచి ఒక్కొక్క చల్లటి నీటిచుక్క మాత్రమే ఖైదీ నెత్తిన పడేట్టు ఏర్పాటు చేసేవాళ్ళు జర్మన్లు. అలా చుక్కా చుక్కా పడి... కొన్ని గంటల తర్వాత ఒక్క నీటిబొట్టు పడినా నాలుగైదు కేజీల రాయి పడ్డంత ఘోరంగా వుంటుంది ఖైదీ పరిస్థితి. రాత్రంతా నీటి చుక్కల సమ్మెట దెబ్బలు తిని, చివరికతను చనిపోతాడు. కథ చెప్పడానికీ, పాఠకుణ్ణి పడగొట్టడానికీ ఖదీర్‌బాబు ఈ క్రూరమైన పద్ధతినే ఎంచుకున్నాడని నేను గాఢంగా అనుమానిస్తున్నాను. చల్లని నీటి చుక్కల్లాంటి పదాలతో వూరించి, ప్రేమగా పాఠకుణ్ణి అంతం చేసే వ్యూహం అతనిది.

ఓ యాభై ఏళ్ల క్రితం, మా ఏలూరులో కొందరు ముసలివాళ్లు తీరిగ్గా కూచుని, పంచె పైకి లాగా, తొడ మీద కొద్దిగా కచిక బూడిద చల్లి, సన్నటి దారప్పోగులను కలిపి, అరచేత్తో నెమ్మదిగా, బలంగా రుద్దేవాళ్ళు. అలా కొన్ని గంటల్లోనే ఒక పొడవాటి బలమైన తాడు తయారయ్యేది. తాడు పేనడం లాంటిదే ఖదీర్‌ వచన రచన. ఆ మోకు నమ్మిన పాఠకుణ్ణి నిలువునా ఉరి తీయడానికేనని ఖదీర్‌ మనకెప్పుడూ చెప్పడు. ఇలా– వాసన లేని పువ్వుల్లాంటి పదాలతో, కన్నీటిని కలిపి పేనిన వాక్యాలతో కథలు చెప్పే తలారి కేరళలో ఒకడున్నాడు. వాడి పేరు వైకం మహమ్మద్‌ బషీర్‌. మన మహమ్మద్‌ ఖదీర్‌బాబు అతనికి రక్తాక్షర బంధువు. వైకం రాతలు చదివినా, ఖదీర్‌ వాక్యం చదివినా, ఒక మైకం లాంటిదేదో కమ్ముతుంది. ఆనక, పాఠకుడనే పిచ్చి సన్నాసిని ఉరితీయడం తేలికవుతుంది. అబ్బా, ఏం చేస్తాడు ఇర్ఫాన్‌ఖాన్, చంపేస్తాడుగా– అంటాం కదా... అలా! ఖదీర్‌ రాసే Merciless cold blooded prose అంటే ఎందరికో మోజు. There are things much more important than happiness అని దర్శకుడు ఆండ్రీ తార్కోవ్‌స్కీ మాటల్ని రుజువు చేస్తాయి ఖదీర్‌ రాసిన కొన్ని మరపురాని కథలు. కావలి నుంచి హైదరాబాద్‌ వచ్చి పంజాగుట్టలో పూలమ్ముతున్న ‘కాబూలీవాలా’యే మన ఖదీర్‌బాబు.

‘వాన కురిసినప్పుడు మా ఇంట్లో’ ఇదీ యీ పుస్తకం పేరు. ప్రకృతి పలకరింపు, కొన్ని సమయాల్లో కొందరు మనుషులు, వాళ్ళకి ఇష్టంగా ఒక నమస్కారం పెట్టుకోవడం, బతుకు ఎడారిలో దాహంతీర్చిన కొన్ని ఒయాసిస్సులను తలుచుకోవడం – ఇలా దేని గురించి రాసినా, ఒక సున్నితమైన చేతనా సౌకుమార్యాన్ని (Fine Sensibility) సాధించగలిగాడు ఖదీర్‌. అది సులభం కాదు. కఠోరమైన అక్షర తపస్సు చేసిన ఒక జెన్‌ రుషి లాంటివాడు మాత్రమే కనుగొనగలిగిన కాలిబాట. దుర్గమారణ్యాల్లోనో, హిమాలయాల్లోని మానస సరోవరాల్లోనో మాత్రమే దొరికే ఒక అరుదైన కాంతి. అది ఖదీర్‌బాబు వచనం లాంటి కాంతి.


‘అసలు రాయడం అంటేనే అందంగా రాయడం కదా’ అంటాడు ఖదీర్, వూరుకోడు, ‘ఆ పట్టింపు అందరికీ వుండదు’ అని కంప్లైంట్‌ చేస్తాడు.



భోరున వాన కురుస్తున్నప్పుడు ‘భూమికి నింగి నీళ్ళు పట్టించే సమయంరా’ అని నానమ్మ చెప్పిన మాట గుర్తుచేసుకోవడం ఎంత బావుంటుందీ! ముసురు గురించి రాస్తూ... ‘ముసురు ఒక తళతళలాడే సూర్యోదయం. జత పొడిబట్టలు కూడా ఆస్తే అని హితవు చెబుతుంది. ముసురుది శోక సౌందర్యం’ అన్నాడు ఖదీర్‌. పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ముసురు’ కథ మనకి గుర్తొస్తుంది.

సిలోన్‌ రేడియో అనౌన్సర్‌ అమీన్‌ సయానీ మన హిందీ పాటల గొప్పదనాన్ని తెలియజెప్పడం గురించి రాస్తూ ‘కళ ఉత్కృష్టం ఎప్పుడు అవుతుందంటే అది ఉత్కృష్టమని చెప్పగలిగే ఆరాధ్యుడు వున్నపుడు’ అంటాడు ఖదీర్‌. ఎంత మంచి మాట!

‘కంబక్త్‌ ఇష్క్‌’తో కంపించిపోయిన షౌకత్, కైఫీ అజ్మీని పదేపదే చూసి, పదేపదే విని, పదేపదే ప్రేమించింది అని పదేపదే చెబుతాడు ఖదీర్‌. ఎంఫసిస్‌లో వుండే అందమూ, బలమూ తెలిసినవాడు. చిన్నప్పుడు చూసిన పిచ్చివాళ్ళూ, పేదరికం గురించి రాస్తూ , ‘ఎందుకనో ఇప్పుడు– నార్మల్‌గా వున్నవాళ్ళను చూస్తే, నార్మల్‌గా వున్నాం అనుకుంటున్న వాళ్ళను చూస్తే భయం వేస్తోంది’ అని లాగి కొట్టినట్టుగా ముగిస్తాడు ఖదీర్‌బాబు.

‘నిన్న మొన్నటి వేసవి’ అంటూ దూది పింజల్లాంటి పదాలు పేర్చి రాసిన వ్యాసం ఒక పూర్తిస్థాయి వచన కవిత! ‘ఆరోజుల్లో ఓ నాల్రోజులు కావాలి’ అంటూ కావలి గురించి రాసిన ఆర్టికల్‌ కూడా అచ్చమైన, కల్తీ లేని వచన కవిత్వమే! అది ఖదీర్‌కి మాత్రమే చేతనైన విద్య! హోటల్‌ ద్వారకలో శివారెడ్డి గారొక్కరే కూర్చుని వుండటం, ‘ఒక మనిషి పలకరింపు కోసం, ఒక జీవమున్న కవితా పంక్తి కోసం ఎదురుచూడడం, నీడకెదిగిన చెట్టు తన ఛాయ కొరకు వచ్చే మనిషి కోసం ఎదురుచూడడంతో సమానం’ అని అలవోకగా అంటాడు.


నెల్లూరు జిల్లా కావలికి చెందిన ప్రసిద్ధ కథా రచయిత మహమ్మద్ ఖదీర్ బాబు. పదేళ్లు ఆంధ్ర జ్యోతి డైలీలో ఉద్యోగం . 17 సంవత్సరాలుగా సాక్షి డైలీలో సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు . ఖదీర్ సొంతంగా రాసినవి, ఎడిట్ చేసినవీ కలిపి ఇప్పటికీ 17 పుస్తకాలు ప్రచురించారు . ప్రతి ఏడాదీ కథా ఉత్సవం జరిపి కొత్త రచయితలను ప్రోత్సహిస్తున్నారు .


25 ఏళ్ళ అక్షర ప్రయాణంలో ‘నాకు దారి చూపిన మనుషులు’ అని ఎంతో కృతజ్ఞతతో రాసుకున్నాడు. చేయి తిరిగిన రాతగాడూ, మా ఏలూరు జర్నలిస్టూ వల్లూరి రాఘవ, తన మొదటి కథ అచ్చువేసినవాడని, రాఘవకి ‘పుష్పగుచ్ఛం’ సమర్పించుకుంటూ తొలి నమస్కారం పెట్టుకున్నాడు ఖదీర్‌. తర్వాత, కాత్యాయని, ఓల్గా, వేమన వసంతలక్ష్మి, మృదుల, మృణాళినిలకు ‘ఆదాబ్, బహుత్‌ షుక్రియా, బడీ మెహర్బానీ’ అన్నాడు. ‘రచయిత్రి కాత్యాయని నా గురించి రాసిన మాటల్లో పొగడ్త లేదని అనుకోవద్దు. కాత్యాయని రాయడమే పొగడ్త’ అని మురిసిపోయాడు. మనకాలపు మహారచయిత కె.ఎన్‌.వై. పతంజలిని ఇష్టంగా తలుచుకుంటూ ‘ఏవి రాయాలి? ఏవి రాయకూడదు అందరికీ తెలుస్తాయి. ఏవి రాయనవసరం లేదో తెలియాలి రచయితకి’ అన్న పతంజలి చేసిన ఒక హెచ్చరికని గుర్తు చేశాడు. ఎంత విలువైన మాట!


కన్నీళ్లు వుండాలి మనిషికీ, కథకుడికీ అంటాడు స్మైల్‌. ఆయన మాట్లాడేటప్పుడు బాగా నవ్వుతాడు. బెజవాడకో, హైదరాబాద్‌కో ఆయన వస్తే దొరువుల్లో కలువలు పూస్తాయి అంటూ అక్షరాలకు పరిమళాలు అద్దుతాడు. తెలుగు కథను ఎరిగి భుజాన మోసే పల్లకీ జంపాల గారు అంటూ చౌదరి గారికి, వాసిరెడ్డి నవీన్‌ గారికీ వొంగి వినయంగా సలాం చేస్తున్నాడు. తనని ఉద్రేకపరిచి, ఉత్సాహంలో వూగించిన నామిని సుబ్రమణ్యం నాయుణ్ణి తలుచుకుంటూ, ‘ఆయనలా కథ చెప్పేవాడు హోల్‌ ఆంధ్రాలో లేరు’ అంటున్నాడు. ఆర్టిస్ట్‌ మోహన్‌దీ ఖదీర్‌బాబుదీ ఒన్‌ బై టూ చాయ్‌ లాంటి స్నేహానుబంధం. అది వాళ్ళిద్దరికీ మాత్రమే తెలిసిన బహిరంగ రహస్యం! పోలేరమ్మ బండ నుంచి ఫుప్పూజాన్‌ కథల దాకా మోహన్‌ శ్రద్ధగా వేసిన బొమ్మలు, వాటికోసం చేసిన ఇంట్రికేట్‌ వర్క్‌ ఎప్పటికీ మరపురానివి! మహమ్మద్‌ ఖదీర్‌బాబు అనే అక్షరాల్ని మోహన్‌ చెరిగిపోని సిగ్నేచర్‌లా రాస్తే... ‘నాకు సంతకం ఇచ్చినవాడు’ అన్నాడు ఖదీర్‌.

ఇండియా టుడే రాజేంద్ర, ఐఏఎస్‌ అధికారి మణివాస్, రచయితలు శ్రీరమణ, కేతు విశ్వనాధరెడ్డి, వెంకట్‌ శిధారెడ్డి, మహీ బెజవాడ... ఎందర్ని ఆదరంగా గుర్తు చేసుకున్నాడో. ఈ పుస్తకంలోని హిందీ, తెలుగు పాటలూ, వ్యక్తులూ, కొన్ని సందర్భాలూ, సంఘటనలూ... అన్నిటితో నాకు సన్నిహిత పరిచయం, స్నేహం వుండటం వల్ల ఇందులోని ప్రతి పేజీతో, ప్రతి పేరాతో నేను ఐడెంటిఫై అయ్యాను. మెరుపుల్లాంటి, చురకల్లాంటి, కపటం లేని కన్నీటి వేదన లాంటి ఇంత జీవితాన్ని చదివాక ఖదీర్‌బాబు అనే భావుకుడు బురఖా వేసుకుని మన మధ్యే తిరుగుతున్న రహస్య కవి అని తెలుసుకోగలిగాను.

కవిత్వం గురించి చెబుతూ...

‘వీధి చివర మలుపు తిరుగుతూ

చిరునవ్వు విసిరిన

ఆనాటి ఆ సీతాకోకని నీ అరచేతుల్లోకి

అపురూపంగా చేర్చిన నెచ్చెలి ఇదే కదా

చివరికి నీవు దుఃఖాశ్రువులుగా కురిసినపుడు

కాగితం పడవ మీద తీరానికి చేర్చిన

నీ ప్రియ స్నేహితుడు కూడా అదే కదా’

అని రాసిన మంచి కవి కోడూరి విజయకుమార్‌కి ఈ అపురూపమైన జ్ఞాపకాలను అంకితం యివ్వడం నాకెంతో నచ్చింది.

‘వాన కురిసినపుడు మా ఇంట్లో’ అని పాడిన ఖదీర్‌ గొంతు సుమ«ధురం, శ్రావ్యం. హృదయాన్ని పరవడం అంటే ఇది కదా అనిపించిన ఒక అనుభూతి కావ్యం!


 ... And finally the Magnificent five:

ఒక సాదత్‌ హసన్‌ మంటో

ఒక మగ్దూం మొహియుద్దీన్‌

ఒక ఇస్మాయిల్‌

ఒక వైకం మహమ్మద్‌ బషీర్‌

ఒకే ఒక్క మహమ్మద్‌ ఖదీర్‌.





Tags:    

Similar News