జహీరాబాద్ జిల్లాలో తెలంగాణ ‘పాతపంటల జాతర’

తప్పకుండా చూడాల్సిన మిల్లెట్ సంబురాలు;

Update: 2025-01-19 12:03 GMT

 “పాతపంటల జాతర ఎప్పటి నుండి, ఎక్కడ? జరుగుతుందమ్మా?’’

“జహీరాబాద్‌ లో పస్తాపూర్‌ లో మొదలైంది. గత 25 ఏండ్లుగా చేస్తున్నం.”

“ఎందుకు చేస్తున్నరు?”

“మా పూర్వీకులు పండించిన కొన్ని పంటలను మేం కొనసాగించాలని పల్లె పల్లెకు చాటుతూ ఎడ్ల బళ్ల మీద విత్తనాలను తీసుక పోయి పంచుతున్నాం,” అని మాకు చెప్పింది డెక్కన్‌ డెవలప్‌ మెంట్‌ సొసైటీ (Deccan Development Society: DDS ) సంగం సభ్యురాలు సూర్యకళ.

సూర్యకళ,డిడిఎస్‌ బోర్డ్‌ మెంబర్‌

 

అసలీ పాతపంటల జాతర వెనుక ఎవరున్నారు? దీని వల్ల ఏం సాధించారు? వ్యవసాయంలో మార్పు కలిగిందా? కరువు నేలలో దిగుబడులు పెరిగాయా ? తెలుసుకుందాం పదండి.

గత పాతికేండ్లుగా ఉమ్మడి మెదక్‌ జిల్లా , జహీరాబాద్‌ లో జనవరి 14 వతేదీన మొదలై ఫిబ్రవరి 11 న పాతపంటల జాతర నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం సంగారెడ్డి జిల్లా, న్యాల్‌కల్‌ మండల్‌, వడ్డి గ్రామంలో డెక్కన్‌ డెవలప్‌ మెంట్‌ సొసైటీ మహిళా సంఘాలు జాతరను ప్రారంభించారు.

“25 ఏండ్లల్ల పాతపంటల జాతరయేనే చెల్లమ్మా,

ఊరు ఊరు తిరిగినాము చెల్లెమ్మా

ఒక్క ఊరు అనుకునేవు, రెండు ఊర్లు అనుకునేవు వంద ఊర్ల జాతర చెల్లమ్మా

ఎన్నెన్నో పనులాయెనే చెల్లెమ్మా,” అని జనరల్‌ నర్సమ్మ బృందం లయబద్ధంగా పాడుతుంటే పాతవిత్తనాలతో పేర్చిన ఎడ్లబండ్లు కదిలాయి.

దాదాపు 40 గ్రామాల్లో రోజుకో ఊరు చొప్పున 80 రకాల ధాన్యాలను 14 ఎడ్లబండ్ల మీద తిప్పుతారు. గ్రామస్తులతో సదస్సులు నిర్వహిస్తూ, పాతపంటల సాగు, సేంద్రియ విధానం పై అవగాహన కలిగిస్తారు. తమ పల్లెల్లో సంప్రదాయ వంటకాలు చేసుకొని సామూహికంగా భోజనాలు చేస్తారు. అది మా పూర్వీకుల ఆరోగ్యాన్ని కాపాడిన సంప్రదాయం. దీనిని పునరుద్ధరించాలనుకుంటున్నాం అంటున్నారు సంగం సభ్యులు.

ఈ క్యాంపెయిన్ పెద్ద జాతరలాగా సాగుతూ ఉంది. అందుకే ఇది పాతపంటల జాతరగా పాపులర్ అయింది.

జాతరలో ఏమిచేస్తారు?

ప్రకృతి పంటల్లో పౌష్టికాహార విలువలు గురించి వివరిస్తున్న పోషాకాహార నిపుణురాలు సలోమి యేసుదాస్‌.

 

“పురుగు మందుల వాడకుండా పంటలను పండించే ప్రకృతి సేద్యం ప్రాముఖ్యత ప్రజలకు చెప్పడమే ఈ జాతర ఉద్దేశం. ప్రతి గ్రామం నుండి డిడిఎస్‌ సంగం సభ్యులు జాతర సమయంలో ఇతర గ్రామ సభ్యులతో తమ అనుభవాలను పంచుకుంటారు. ఈ సంవత్సరం, డీడీఎస్‌ చిరుధాన్యాలు, నూనె గింజల మార్కెటింగ్‌ సామర్థ్యాలను పెంచడానికి ప్రాసెసింగ్‌ సామర్థ్యాన్ని పెంచుతున్నారు. పాత పంటల దిగుబడులు పెంచడానికి ప్రతి గ్రామంలోని రైతులకు సుస్థిర వ్యవసాయ పద్ధతులపై శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. ఈ జాతర వలన ఎక్కువమంది రైతులు తృణధాన్యాల (Cereals) సాగులోకి వస్తున్నారు. జాతర సందర్భంగా సేంద్రియ సాగులో కష్టసుఖాలను చర్చిస్తారు.” అంటారు డిడిఎస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ దివ్య వెలుగూరి.

దివ్య వెలుగూరి, ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ,డిడిఎస్‌

 

పాతపంటలు అంటే సాగుబడిలేని పంటలు. సాగు తగ్గిపోతున్న పంటలు. మరో రకంగా చెప్పాలంటే ఆరోగ్యం పేరుతో సిటీలలో కేజీ వందల రూపాయలు పెట్టి కొని తింటున్న చిరుధాన్యాలు. ఇపుడున్నజీవన శైలిలో ఆరోగ్యం భద్రంగా ఉండాలంటే చిరుధాన్యాలను ఆహారంలో చేర్చుకోవడం అవసరమని ఇపుడు డాక్టర్ చెబుతున్నారు.

పాతికేళ్ల కిందటే ఈ పరిస్థితిని ఊహించి, మెదక్‌ జిల్లా కేంద్రంగా డెక్కన్‌ డెవలప్మెంట్‌ సొసైటీ అనే స్వచ్చంద సంస్థ 1983లో ఏర్పడిరది. అప్పట్లో దూరదర్శన్‌లో కెమేరా మేన్‌గా పనిచేస్తున్న పెరియపట్న వెంకటసుబ్బయ్య సతీష్‌ ఉద్యోగం వదిలి కొందరు మిత్రులతో కలిసి జహీరాబాద్‌ ప్రాంతంలో దళిత, గిరిజన మహిళలతో కలిసి, స్వయం పోషణ, ఆరోగ్యం, జీవనోపాధిని బలోపేతం చేసే వ్యవసాయ పద్ధతులను అభివృద్ధి చేయడానికి కృషి చేయడం మొదలుపెట్టారు. పేద మహిళలు సంఘాలుగా మలచి స్వయం సమృద్ధి దిశగా నడిపించారు పర్యావరణ వ్యవసాయం ప్రాముఖ్యతను చాటి చెబుతూ పంటల సాగు ప్రక్రియలో వాడే ప్రతీదీ స్థానికమే అని సగౌరవంగా చాటి చెప్పిన పి.వి. సతీష్‌, 2023,మార్చి 19న ఆనారోగ్యం వల్ల మరణించారు.

జీవవైవిద్య వ్యవసాయమే ఆహార కొరతను నివారిస్తుంది అనే ఆయన ఆశయాన్ని మాత్రం సజీవంగా డిడిఎస్‌ మహిళలు ముందుకు తీసుకెళ్తున్నారు.

ఎల్గోయి,రేజింతల్‌,జీడిగడ్డ,పస్తాపూర్‌,గొడ్డిగార్‌ పల్లి, ఖాసింపూర్‌, పొట్‌పల్లి, చిలుకపల్లి తదితర 25 గ్రామాల్లో 12వందల ఎకరాల్లో చిరుధాన్యాలను ఒక ఉద్యమంగా సాగు చేస్తున్నారు

కరువు పంటల పునరుద్దరణ

ఒకప్పుడు తెలంగాణ వ్యవసాయం స్వయంపోషక వ్యవస్థగా ఉండేది రైతులు దేనికోసమూ ఎవరిమీదా ఆధారపడే వారుకాదు. విత్తనాలు, ఎరువులూ స్వయంగా తయారు చేసుకునేవారు. వానలు తగ్గడంతో, రానురానూ సాగు భారమైంది. సంగారెడ్డి జిల్లాలో మొత్తం సాగు విస్తీర్ణం 61,051 హెక్టార్లు. సాగునీటి వసతి లేక వర్షాదార పంటలు పండించే వారు. రాగులు, కొర్రలు, జొన్నలు వంటి కరువు పంటలు తరతరాలుగా పండిస్తున్నారు. సమీపంలోని జహీరాబాద్‌ సమీప తండాలలో నైతే దాదాపు అపరాలే సాగు చేస్తున్నారు. అయితే ఇంత చెమటోడ్చి మెట్ట పంటలు పండించినా పెద్దగా గిట్టుబాటు కాక రైతులు అప్పుల పాలవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడి భూమిని సారవంతంగా మార్చడానికి దళిత, గిరిజన మహిళా రైతులతో ప్రతీ ఏటా పాతపంటల జాతర నిర్వహిస్తున్నారు.

ఏమి సాధిస్తారు?

‘‘అంతగా సారం లేని మా ఎర్ర నేలల్లో, ఆరోగ్య వంతమైన పంటల ఎదుగుదలకి బీజామృతం, వేల లీటర్ల పంచగవ్య కషాయం లాంటివి మా ఊర్లో ఉత్పత్తి చేసి భూముల్లో వాడుతున్నాం. వర్మివాష్‌ లాంటి కషాయాలు పిచికారి చేసి సమృద్ధిగా పూత, కాత వచ్చేటట్లు ప్రయత్నిస్తున్నాం. మా సొంత విత్తనాలనే వాడి మా సొంత పంటలు పండిస్తున్నాం. మార్కెట్‌ కోసం కాదు, మా కోసం, మా సంప్రదాయ పద్ధతుల్లోనే పండిరచుకుంటాం..’’ అంటారు ప్రతీ సంవత్సరం ఈ జాతరలో పాల్గొనే రేచింతల్‌ గ్రామస్తురాలు కమలమ్మ.

కమలమ్మ , డిడిఎస్‌ సంగం సభ్యురాలు

 

విత్తనాలు, ఎరువుల సొంతంగా...

“చిరుధాన్య పంటలు ఏవైనా, వాటితో పాటు కచ్చితంగా అంతర పంటలు కూడా వేసుకోవాలి.ఆరికలో అంతర పంటలుగా కంది, జొన్న, అలసందలు సాగు చేసుకుంటే అదనపు ఆదాయం వస్తుంది. అంతర పంటలు వేసినా ఆరిక ధాన్యం ఎకరాకు 8 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.విత్తనం నుండి ఎరువుల వరకు మేమే తయారు చేసుకుంటాం” అన్నారు డిడిఎస్‌ సంగం సభ్యురాలు నర్సమ్మ

పాతపంటల జాతర ప్రారంభోత్సవంలో నర్సమ్మ (డిడిఎస్‌ కార్యకర్త)

 

భూసారం పెంచుతున్నాం

‘‘ ఒకే రకం పంటలు వేయడం వల్ల భూమి చవుడు బారుతుంది. చీడపీడలు ఎక్కువ ఆశిస్తాయి. అందుకే పంటల మార్పిడిని అనుసరిస్తున్నాం. దీనివల్ల ఎరువుల వినియోగం తగ్గుతుంది. పెట్టుబడి ఖర్చు తగ్గి, భూసారం పెరుగుతుంది.’’ అంటోంది అర్జున్‌ నాయక్‌ తండాలో రాగులు, సజ్జలు పండిస్తున్న చాందీ భాయి.

వీరికి ఏ సీజన్‌లో ఏ పంట వేస్తె ఎక్కువ దిగుబడి వస్తుంది? ఏ ఎరువు వల్ల దిగుబడి ఎలా పెరుగుతుంది. వంటి అంశాలు పట్ల అవగాహన ను డిడిఎస్‌ కార్యకర్తలు కల్గిస్తున్నారు.

సాగు చేయని ఆకు కూరలు

 

సాగుకాని ఆకు కూరలు

‘‘ సాగు కాని ఆకు కూరలను 20 నుండి 40 రకాలు గుర్తించి పోషకవిలువలను, వాటితో వంటల తయారీలో వీరికున్న నైపుణ్యాన్ని అవగాహనను ఇతరులతో పంచుకోవడానికి కూడా ఈ జాతర ఉపయోగపడుతుంది. సాగుచేయని ఆకుకూరలు పొలాల గట్ల మీద పెరుగుతాయి. దాదాపు నలభై రకాలను ఇటీవల సేకరించాం. పుస్తకాలుగా ప్రచురించి అందరికీ అందుబాటులోకి తెస్తున్నాం. ఈ ఆకు కూరలను తినడం వల్ల ఈ ప్రాంతంలో 80 ఏండ్ల వృద్ధులు కూడా దృఢంగా ఉండి పొలం పనులు చేసుకుంటున్నారు. దృష్టి దోషాలు కూడా తక్కువ. కళ్ల జోళ్లు పెట్టుకున్న వారు చాలా అరుదుగా ఉంటారు. ఎవరూ వాడరు. మనం పనిగట్టుకొని పండించుకొని తింటున్న పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలు కన్నా ఈ సాగు చేయని ఆకుకూరల్లో అనేక పోషకాలు ఎన్నో రెట్లు ఎక్కువ పాళ్లలో ఉన్నాయి,’’ అంటారు జహీరాబాద్‌లో కృషి విజ్ణాన కేంద్రం, పోషకాహార నిపుణురాలు హేమలత.

 

ఇతర రాష్ట్రాలకు స్ఫూర్తి

“పాత పంటల జాతర 1999 సంవత్సరం లో తొలిసారి పస్తాపూర్‌ గ్రామంలో ఒకే చోట 40 రకాల చిరుధాన్యాలతో ప్రారంభించాం. అప్పట్లో ఇది వారం రోజులు వుంది. తరువాత సంవత్సరం నుంచి సంచార జాతరగా ఎడ్ల బండ్ల ద్వారా ప్రతి గ్రామానికి వెళ్ళింది. అక్కడ ప్రతి ఊర్లల్లో రైతులతో చర్చలు జరిపి సాగు సమస్యలు తెలుసుకొని పరిష్కారం సూచించే వాళ్లం. కనుమరుగై పోతున్న పాత విత్తనాలు పంచేవాళ్లం. ఈ పంటలకు ఒక మార్కెట్‌ ఏర్పాటు చేస్తామనే భరోసా రైతులకు కల్పించాము. అలా ఒక చిరుధాన్యాల మార్కెట్‌ ను 2000 సంవత్సరం లో డిడిఎస్‌ ఏర్పాటు చేసింది. దీనిని జాతీయ జీవ వైవిధ్య కార్యాచరణ, ప్రణాళిక లో భాగంగా వ్యవసాయ మరియు సాంస్కృతిక పండుగలుగా జరపాలని భారత ప్రభుత్వానికి సిఫార్సు చేశాం.

 

పాతపంటల జాతర చూడడానికి తెలుగు రాష్ట్రాల నుండే కాక దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు వస్తున్నారు.ఇక్కడి సేద్య జ్ఞానాన్ని, వ్యవసాయ పద్ధతులు చూసి వెళ్తున్నారు. ఈ జాతర స్ఫూర్తి తోనే 11 రాష్ట్రాల్లో జీవ వైవిధ్య పండుగలను అక్కడి స్వచ్ఛంద సంస్థలు జరుపుతున్నాయి. అలాగే ఐక్య రాజ్య సమితి కూడా 2023 సంవత్సరాన్ని చిరుధాన్యాల సంవత్సరంగా గుర్తించింది,” అని పాతపంటల జాతర నేపధ్యం, స్ఫూర్తిని వివరించారు డిడిఎస్‌ జాయింట్‌ డైరెక్టర్‌ ఎ.గిరిధర్‌ బాబు.

మిల్లెట్స్‌తో చేసిన వంటలు రుచి చూస్తున్న రైతులు

 

సేద్యాన్ని పండుగలా మార్చిన జాతర

1. పాతపంటల జాతర వల్ల స్వయం పోషక వ్యవసాయం పెరిగింది.

గత 25 సంవత్సరాలుగా, డిడిఎస్‌ 5000 మంది మహిళలను చిరుధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించేలా తీర్చిదిద్దారు. బయట నుండి ఒక్క విత్తనం గానీ,ఎరువులు గానీ వీళ్ల గ్రామాలకు రావు. వంట నూనెలు,బెల్లం , చిరుధాన్యాలతో విలువ ఆధారిత ఉత్పత్తులను వీరు సొంతంగా చేసుకుంటారు.

2. విత్తన శుద్ధికి, పంట ఎదుగుదలకు, పంచగవ్య, బీజామృతం తయారు చేసుకొని వాడతారు.ఎకరానికి 40 టన్నులు చొప్పున 1200 ఎకరాలకు ప్రత్యేకమైన ‘సమృద్ధి ఎరువు’ వాడుతున్నారు.

3. జీవవైవిధ్య సాగు కోసం ఈ మహిళారైతులు ఇరవై రకాల 12,000 కిలోల సొంత విత్తనాలను తమ చేలల్లో నాటినట్టు డిడిఎస్‌ ప్రతినిధులు చెప్పారు. దీని కోసం పస్తాపూర్‌లో సీడ్‌ బ్యాంక్‌ని నిర్వహిస్తున్నారు.

4. స్వయం ఆధారిత సాగు ఎజెండాను మహిళలు అమలు చేస్తూ, తమదైన ప్రత్యేక పర్యావరణ వ్యవసాయం చేపడుతున్కారు. పొలంలో వేసే ఎరువు నుండి భిన్నరకాల విత్తనాలు, పర్యావరణానికి, మనుషులకి, పశువులు, పక్షులకు హాని చేయని తెగులు నివారణ ద్రావణాలు, కషాయాలు వాడుతారు.

5. సాగుబడికి అవసరం అయిన ప్రతీది వీరు స్ధానికంగా దొరికే వనరులతోనే వీరు స్వయంగా తయారు చేసుకుంటారు. పంట కోసం అప్పుతేవడం గానీ, ఇతరుల నుంచి ఒక్క రూపాయి తీసుకోవడం గానీ, సర్కారు ఎరువులు వాడడం గానీ చేయరు.

6. అడవి సోయ, దూసరి,గోరుమాడి, తగరించ, తడక దొబ్బుడు, ఎల్క చెవుల కూర, నల్లకాశ, తెల్లకాశ, తదితర 30 రకాల ఆకుకూరలు ఇక్కడ సాగుచేయకుండానే పండుతున్నాయి. విచ్చల విడిగా రసాయన మందులు వాడక పోవడం వల్ల కలుపు మొక్కలుగా ఇవి పెరుగుతున్నాయి. అయితే వాటిని పస్తాపూర్‌ రైతులు కలుపే కదా అంటూ చిన్న చూపు చూడరు. రసాయన ఎరువులు చల్ల కుండా పంటలతో పాటు గట్ల మీద సహజంగా పెరిగే ఆకు కూరలను ఆహారంగా తీసుకుంటారు. తొలకరి జీజన్‌లో ఇవి ఎక్కువగా పెరుగుతాయి. వీటి వల్ల మనం సాధారణంగా తినే పాలకూర,తోటకూర,గోంగూర ల్లాంటి వాటికంటే ఎక్కువ పోషకాలు శరీరానికి అందుతున్నాయంటున్నారు. ఇవి తిండికి, పౌష్టికాహానికి, ఆరోగ్యానికి, జీవనోపాధికి భద్రతనిస్తున్నాయి.

సొంత కాళ్లపై నిలబడి సొంత వనరులతో మట్టిని బంగారంలా మారుస్తున్న ఈ పర్యావరణ జీవవైవిధ్య వ్యవసాయానికి ఇతర ప్రాంత రైతులంతా జై కొడుతున్నారు.

Tags:    

Similar News